• facebook
  • whatsapp
  • telegram

ఇతర వెనుకబడిన తరగతులు

ఇతర వెనుకబడిన తరగతులు (OBCs) అనే పదం పాలనాపరమైంది. స్వాతంత్య్రానంతరం జనాభాలోని అగ్రకులాలు, షెడ్యూల్డ్‌ కులాల మధ్య తేడాలను గుర్తించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. భారత రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులను ఆర్టికల్‌ 366(24), 366(25) ద్వారా ఇతర వెనుకబడిన తరగతులను తొలగించి నిర్వచించారు. భారత రాజ్యాంగంలో మాత్రం ‘ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ)’ పదాన్ని గురించి ప్రస్తావించలేదు. మొదటి పంచవర్ష ప్రణాళికలో ‘ఓబీసీ’ పదాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఓబీసీ జాబితాను కులం, ఆదాయం ఆధారంగా రూపొందించారు. భారత రాజ్యాంగం కేవలం ఎస్సీ, ఎస్టీలను మాత్రమే కాకుండా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను కూడా ఆదరించింది. మైసూరు రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను సాంకేతికపరంగా మొదట రూపొందించారు. మైసూరు ప్రభుత్వం 1918లో ప్రభుత్వ సర్వీసుల్లో ‘వెనుకబడిన ప్రజల’ భాగస్వామ్యం పెంచడానికి అప్పటి మైసూరు ప్రధాన న్యాయమూర్తి ఎల్‌.సి. మిల్లర్‌ అధ్యక్షతన విచారణ కమిటీని నియమించింది. 1921లో వీరి కోసం ప్రాధాన్య నియమాలను నిర్వచించింది. అందులో బ్రాహ్మణేతరులు అయిన ఇతర కులాలను, ప్రభుత్వ సర్వీసులో సరైన ప్రాతినిధ్యం లేనివారుగా పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం అధికరణలు 15(4), 16(4), 340(1) ద్వారా వెనుకబడిన తరగతులను నిర్వచించింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన తరగతుల వారికి ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వానికి 15(4), 16(4) అధికరణల ద్వారా అధికారాన్ని కల్పించారు. వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించి వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు చేయడానికి ఒక జాతీయ కమిషన్‌ను రాష్ట్రపతి ఆదేశంతో ఏర్పాటు చేయవచ్చని ఆర్టికల్‌ 340లో పేర్కొన్నారు.

కాకా సాహెబ్‌ కాలేల్కర్‌ కమిషన్‌
1953 జనవరి 29న రాజ్యాంగంలోని అధికరణ 340(1) ద్వారా భారతదేశ ప్రజల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను కనుక్కునేందుకు తీసుకోవాల్సిన ప్రమాణాలను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం కాకా సాహెబ్‌ కాలేల్కర్‌ అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. దేశవ్యాప్తంగా ఆయా ప్రమాణాల ఆధారంగా గుర్తించిన వివిధ తరగతుల జాబితాను రూపొందించడం, వెనుకబడిన తరగతుల సమస్యలను పరిశీలించడం, వాటిని పరిష్కరించేందుకు తగిన సూచనలు అందించడం దీని విధులు. ఈ కమిషన్‌ 1955 మార్చి 30న నివేదికను సమర్పించింది. దీనిలో 2,399 కులాలను వెనుకబడినవిగా, వాటిలో 837 కులాలు మరింత వెనుకబడినవిగా పేర్కొన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, 1961 జనాభా లెక్కలను కులాల వారీగా లెక్కించాలని సూచించింది. నివేదికలోని అనేక లోపాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కాకా సాహెబ్‌ కాలేల్కర్‌ కమిషన్‌ను తోసిపుచ్చింది. ఇది అఖిల భారత స్థాయిలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్‌.

మండల్‌ కమిషన్‌
అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని భారత ప్రభుత్వం 1978 డిసెంబరు 20న మాజీ పార్లమెంట్‌ సభ్యులు బి.పి.మండల్‌ అధ్యక్షతన అఖిల భారత స్థాయిలో రెండో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియమించింది. దీన్ని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని గుర్తించడం కోసం నియమించారు. ఈ కమిషన్‌లో ఛైర్మన్‌తో కలిపి అయిదుగురు సభ్యులు ఉన్నారు. ఇది తన నివేదికను 1980 డిసెంబరు 31న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి సమర్పించింది. ఈ కమిషన్‌ ‘ఇతర వెనుకబడిన తరగతుల‘ను గుర్తించడానికి 11 సూచికలను సామాజిక, విద్యా, ఆర్థిక రంగాల్లో రూపొందించింది. అలాగే భారత ప్రభుత్వ చట్టాల ద్వారా నిమ్నకుల సభ్యులైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్‌ల కోటాను 27 నుంచి 50 శాతానికి పెంచాలని సూచించింది. ఇది తన నివేదిక ద్వారా 3,473 కులాలను వెనుకబడినవిగా గుర్తించింది. అయితే ఈ నివేదికను 1990 ఆగస్టు 13న వి.పి.సింగ్‌ (నేషనల్‌ ఫ్రంట్‌) ప్రభుత్వం ఆమోదించింది. దీన్ని సవాలుచేస్తూ ఇందిరా సహానీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీన్నే ఇందిరా సహానీ Vs భారత ప్రభుత్వం కేసు అంటారు. ఈ కేసులో కొన్ని షరతులతో సుప్రీంకోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల రాజ్యాంగ బద్ధతను ఆమోదించింది. 
                                            వెనుకబడిన తరగతుల్లో ఉన్నత వర్గాలను (క్రిమీలేయర్‌) రిజర్వేషన్ల సదుపాయాల నుంచి తొలగించాలని, ఓబీసీలకు ఒక శాశ్వత చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓబీసీల్లో క్రిమీలేయర్‌ను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం రామ్‌నందన్‌ కమిటీని నియమించింది. 1993లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించగా, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. ప్రస్తుతం క్రిమీలేయర్‌ రూ.8 లక్షలు. అంటే ఓబీసీల్లో 2017 సెప్టెంబరు 1 నుంచి వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించితే వారికి రిజర్వేషన్‌లు వర్తించవు. అఖిల భారత స్థాయిలో ఏర్పాటుచేసిన పై రెండు కమిటీలతోపాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 1961 ఆగస్టు 14న రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆయా రాష్ట్రాలు వెనుకబడిన తరగతులను గుర్తించడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది.
* నాగన్‌గౌడ కమిటీ (1961, కర్ణాటక)
* ఎల్‌.జి.హవనూరు కమిషన్‌ (1972, కర్ణాటక)
* కుమార పిళ్లై కమిషన్‌ (1964, కేరళ)
* దామోదరన్‌ కమిషన్‌ (1967, కేరళ)
* సత్తనాదన్‌ కమిషన్‌ (1969, తమిళనాడు)
* కె.ఎన్‌.అనంత రామన్‌ కమిషన్‌ (1970, ఆంధ్రప్రదేశ్‌)
* మురళీధరరావు కమిషన్‌ (1982, ఆంధ్రప్రదేశ్‌)
* టి.వెంకటస్వామి కమిషన్‌ (1983, కర్ణాటక)

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌
ఇందిరా సహానీ కేసు (1992)లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు రాజ్యాంగంలోని అధికరణ 340 ఆధారంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ చట్టాన్ని (1993) చేశారు. ఇది 1993 ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 1993 నుంచి 2016 వరకు మొత్తం 7 సార్లు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను పునర్నిర్మించారు. ఈ కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.ఎన్‌.ప్రసాద్‌. ప్రస్తుతం 8వ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ విధులు నిర్వర్తిస్తోంది. గతంలోని ఎన్‌సీబీసీ చట్టం - 1993ని రద్దుచేసి ‘భారత రాజ్యాంగ (102వ రాజ్యాంగ సవరణ) చట్టం - 2018 (2018 ఆగస్టు 11) ప్రకారం రాజ్యాంగంలో అధికరణ 338(తీ)ని చేర్చి తద్వారా ప్రస్తుత కమిషన్‌ను ఏర్పాటు చేశారు. గత కమిషన్లు చట్టబద్ధ కమిషన్లు కాగా రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుత కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. ఈ కమిషన్‌ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కోసం పనిచేస్తుంది. ఎన్‌సీబీసీ కమిషన్‌లో ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, ముగ్గురు సభ్యులు, ఒక కార్యదర్శి ఉంటారు. సభ్యుల్లో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలి. వీరి పదవీకాలం మూడు సంవత్సరాలు. 

మైనారిటీలు (అల్ప సంఖ్యాక వర్గాలు)
భారత రాజ్యాంగం అల్ప సంఖ్యాక వర్గం అనే పదాన్ని నిర్దిష్టంగా నిర్వచించినప్పటికీ మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల గురించి ప్రస్తావించింది. భారత ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల కోసం జాతీయ మైనారిటీ కమిషన్‌ చట్టాన్ని (1992) రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 2(C) కింద ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు (పార్శీలు), జైనులను మైనారిటీలుగా గుర్తించారు. 2014 జనవరి 17న కేంద్ర ప్రభుత్వం చివరిగా నోటిఫికేషన్‌ ద్వారా జైనులను మైనారిటీలుగా గుర్తించింది. 2006 జనవరి 29న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి మైనారిటీలను వేరుచేసి వారికి ప్రభుత్వ విధానాలు మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా మైనారిటీ ఎఫైర్స్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.

మైనారిటీలకు రాజ్యాంగ రక్షణలు
భారత రాజ్యాంగం మైనారిటీలకు అనేక రక్షణలు కల్పించింది. ఆర్టికల్‌ 29(1) ప్రకారం భారత దేశంలో నివసిస్తున్న పౌరుల్లో ఏ వర్గం వారైనా తమ విశిష్ట భాష, సంస్కృతి, లిపిని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు. ఆర్టికల్‌ 29(2) ప్రకారం రాజ్యం నిర్వహిస్తున్న లేదా రాజ్య ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో ప్రవేశాలను మత, జాతి, కుల, భాష ప్రాతిపదికన ఏ పౌరుడికి నిరాకరించకూడదు. ఆర్టికల్‌ 30(2) ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాల నిర్వహణలోని విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం మంజూరు చేసే విషయంలో రాజ్యం ఎలాంటి వివక్ష చూపకూడదు. ఆర్టికల్‌ 347 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న జనాభా తాము మాట్లాడే భాషను ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. రాష్ట్రపతి ఈ సమయంలో తగు చర్యలు తీసుకోవచ్చు. ఆర్టికల్‌ 350 ప్రకారం ఏ వ్యక్తి అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించే ఏ భాషలోనైనా తన సమస్యను సంబంధిత అధికారికి విన్నవించుకోవచ్చు. ఆర్టికల్‌ 350(A) ప్రకారం భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలోనే విద్యా బోధన చేసేందుకు సదుపాయాలు కల్పించాలి. ఆర్టికల్‌ 350A(1) ప్రకారం భాషాపరమైన మైనారిటీల కోసం రాష్ట్రపతి ప్రత్యేకాధికారిని నియమించాలి.

జాతీయ మైనారిటీల కమిషన్‌
జాతీయ మైనారీటీల కమిషన్‌ చట్టం (1992) ప్రకారం జాతీయ మైనారిటీల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 1993 మే 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, ఒక వైస్‌ ఛైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. వారి పదవీకాలం మూడు సంవత్సరాలు. ఛైర్మన్‌తో పాటు అందరూ మైనారిటీలకు చెందినవారై ఉండాలి. మైనారిటీల అభివృద్ధికి కృషిచేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల కోసం అమలు చేస్తున్న పథకాలను సమీక్షించడం ఈ కమిషన్‌ ప్రధాన విధి.

మైనారిటీల స్థితిగతులపై కమిటీలు
భారతదేశంలో సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ముస్లింల స్థితికి సంబంధించి నివేదికను సమర్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో 2005 మార్చి 9న ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2006 నవంబరు 17న ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. మైనారిటీల మత, భాషాపరమైన స్థితిగతులపై సిఫార్సులు చేయడం కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ వనరుల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా అధ్యక్షతన నలుగురు సభ్యులతో 2004 అక్టోబరు 29న ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ దేశవ్యాప్తంగా పర్యటించి మైనారిటీ మతాల స్థితిగతులు, వారి వాస్తవ పరిస్థితిపై 2007 మే 21న కేంద్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. మైనారిటీల సంక్షేమానికి ‘ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమం’, యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ, ఎస్సెస్సీ లాంటి పరీక్షల శిక్షణకు ‘నై ఉడాన్‌’; అల్ప సంఖ్యాక మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ‘నైరోష్ని’, మైనార్టీ యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ‘సీఖో ఔర్‌ కమావో’; మైనార్టీల సంప్రదాయక వృత్తుల పరిరక్షణ, శిక్షణ, అభివృద్ధికి ‘ఉస్తాద్‌’, భారతీయ సంస్థల్లో భాగంగా గొప్ప వారసత్వం కలిగిన మైనారిటీల సంస్కృతి పరిరక్షణకు ‘హమారీ థరోహర్‌’ లాంటి పథకాలను అమలుచేశారు.

మహిళలు
భారత రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు తదితర భాగాల్లో లింగపర సమానత్వ సూత్రానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ చట్రంలోని భారతదేశ చట్టాలు, అభివృద్ధి విధానాలు, ప్రణాళికలు, సంక్షేమ పథకాలు వివిధ రంగాల్లో మహిళలు పురోగతిని సాధించడానికి ఉద్దేశించినవి. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అలాగే వీరి రక్షణ కోసం అనేక చట్టాలు చేశారు.

రాజ్యాంగంలో మహిళలకు ఉన్న రక్షణలు 
కులం, మతం, వర్గం, లింగం, జన్మస్థలం, రంగు లాంటి కారణాలతో ఏ పౌరుడిపైనా రాజ్యం వివక్ష చూపకూడదని ఆర్టికల్‌ 15(1) పేర్కొంటుంది. రాజ్యం మహిళలు, బాలలకు అనుకూలంగా ప్రత్యేక నిబంధనలు చట్టాలను రూపొందిచవచ్చని ఆర్టికల్‌ 15(3) తెలుపుతుంది. ఆర్టికల్‌ 39(A) ప్రకారం స్త్రీ, పురుషులకు తగిన జీవనోపాధిని పొందడానికి సమాన హక్కులు ఉంటాయి. వీటిని కల్పించడం ప్రభుత్వం బాధ్యత. పురుషులకు, స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆర్టికల్‌ 39(A) తెలుపుతుంది. పని విషయంలో న్యాయపరంగా మానవీయ పరిస్థితులు, ప్రసూతి ఉపశమన సౌకర్యాలు కల్పించడం గురించి ఆర్టికల్‌ 42లో పేర్కొన్నారు. భారత ప్రజల మధ్య సోదరిభావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం, స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాన్ని త్యజించడం గురించి ఆర్టికల్‌ 51A(e)లో పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్‌ 243D(3)లో గ్రామ పంచాయతీల్లో, ఆర్టికల్‌ 243T(3)లో పట్ణణ స్థానిక సంస్థల్లో 1/3 వ వంతుకు తగ్గకుండా సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేయాలని పేర్కొన్నారు.

జాతీయ మహిళా కమిషన్‌
రాజ్యాంగపరంగా, చట్టపరంగా మహిళలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడానికి 1992 జనవరి 31న జాతీయ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికోసం జాతీయ మహిళా కమిషన్‌ చట్టాన్ని 1990 ఆగస్టు 30న రూపొందించారు. ఈ కమిషన్‌లో ఒక ఛైర్‌పర్సన్, అయిదుగురు సభ్యులు, ఒక మెంబర్‌ సెక్రటరీ ఉంటారు. ఇది సివిల్‌ కోర్టులా పనిచేస్తుంది. కమిషన్‌ పదవీకాలం మూడు సంవత్సరాలు. మహిళలకు సంబంధించిన రక్షణలను పర్యవేక్షించడానికి, మహిళా సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలకు తగిన సలహాలివ్వడం కమిషన్‌ ప్రధాన విధులు. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ. ఈమె ఎనిమిదో ఛైర్‌పర్సన్‌. కమలేష్‌ గౌతమ్, షోషో షైజా, చంద్రముఖి దేవి, శ్యామలా ఎస్‌. కందార్, రాజుల్టెన్‌ ఎల్‌. దేశాయ్‌ ఇతర సభ్యులు. మీనాక్షి గుప్తా సభ్య కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, గృహహింస, అత్యాచారం, అక్రమ రవాణా, వరకట్నం మొదలైనవి మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు.

మహిళల రక్షణ చట్టాలు
* వరకట్న నిషేధ చట్టం - 1961
* సమాన వేతన చట్టం - 1976
* మహిళల అసభ్య చిత్రీకరణ (నిరోధ) చట్టం - 1986
* సతీ సహగమన (నిరోధక) చట్టం - 1987
* లింగ ఎంపిక నిషేధ (పీసీపీ, ఎన్‌డీటీ) చట్టం - 1994
* గృహహింస నిరోధక చట్టం - 2005 (2006 అక్టోబరు 26 నుంచి అమలు).
* హిందూ వివాహ చట్టం - 1955
* జాతీయ మహిళా కమిషన్‌ చట్టం - 1990
* బాల్య విహహ నిరోధక చట్టం - 2006
* ఆంధ్రప్రదేశ్‌ దేవదాసీల నిషేధ చట్టం - 1988
* ప్రసూతి ప్రయోజన చట్టం - 1961
* న్యాయస్థానాల చట్టం - 1984
* పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధ చర్యలు, నష్ట పరిహారం) చట్టం - 2013
* నిర్భయ చట్టం - 2013
* ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం - 1989

* మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం సబల, సుకన్యా సమృద్ధి యోజన, బేటీ బచావో - బేటీ పఢావో, స్వదార్, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాలను అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లు, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, చేతివృత్తుల కమ్యూనిటీలు, సహకార సమాఖ్యలు లాంటి కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, స్వయం సహాయక సంఘాల ద్వారా స్త్రీ నిధి రుణాలు (వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ కళ్యాణ కానుక, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ రుణాలు) మొదలైన పథకాలను అమలు చేస్తుంది.

బాలల రక్షణ చట్టాలు
* బాల్య వివాహ నిరోధక చట్టం - 2006
* బాల కార్మిక (నిషేధ - క్రమబద్దీకరణ) చట్టం - 1986
* బాల నేరస్థుల న్యాయ (బాలల పట్ల శ్రద్ధ - సంరక్షణ) చట్టం - 2000 (జువైనల్‌ జస్టిస్‌ చట్టం)
* గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పూర్వ భావన (లింగ నిర్ధారిత శిశు ఎంపిక నిషేధ) చట్టం - 1994
* అక్రమ రవాణా (నివారక) చట్టం - 1956
* బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ చట్టం - 2005

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌