• facebook
  • whatsapp
  • telegram

సమానత్వం - సాధికారత

సమాజంలో రకరకాల వివక్షల కారణంగా కొన్ని వర్గాలు సాంఘిక బహిష్కరణకు గురవుతున్నాయి. వారికి అదనపు హక్కులు, అవకాశాలు, సౌకర్యాలను అందించి సమానత్వం, సాధికారత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగ పరమైన రక్షణలను ఏర్పాటు చేసింది. ఈ అంశాలన్నింటి గురించి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

                     సాంఘిక బహిష్కరణ (Social Exclusion) సాంఘిక చేర్పు (Social Inclusion) అనేవి ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు. సమాజంలో సాంఘిక బహిష్కరణ ఒక నిరంతర సమస్య. కులం, వర్ణం, జాతితత్వ గుర్తింపు, లింగ, మత విశ్వాసాలు లాంటి కారణాల ఆధారంగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు; ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధుల మనుగడ, జీవనోపాధికి కావాల్సిన అవకాశాలు, వనరులను వారికి చేరకుండా చేసినప్పుడు సాంఘిక బహిష్కరణ ఏర్పడుతుంది. సామాజిక చేర్పు సమానత్వంతో కూడిన సాధికారతను కల్పిస్తుంది. ఈ రెండు వ్యూహాలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి మినహాయించే వ్యూహం. మరొకటి చేర్చే వ్యూహం. మినహాయించడం అంటే పైన పేర్కొన్న వర్గాల ప్రజలకు ప్రజోపయోగ పరిస్థితులతో సమానత్వం లేకుండా చేసి వారికి ఉపయోగపడే వస్తువులు, సేవలు అందుబాటులోకి రాకుండా చేయడం. సామాజిక చేర్పు అంటే సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరంగా బహిష్కరణకు గురైనవారిని చేర్చుకోవడం. దీన్నే సామాజిక న్యాయం దిశగా అభివృద్ధిని సాధించడం అని పేర్కొంటారు. సామాజిక న్యాయం అందించే ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, బాలలు, మహిళల కోసం భారత రాజ్యాంగంలో కొన్ని నిబంధనలను పొందుపరిచారు. దీనిలో భాగంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చట్టాలను రూపొందించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఆయా వర్గాల ప్రగతి కోసం కమిటీలు, కమిషన్‌లను నియమిస్తారు.

షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు
2011 జనగణన ప్రకారం భారతదేశ జనాభాలో షెడ్యూల్డ్‌ కులాలు 16.6%, షెడ్యూల్డ్‌ తెగలు 8.6% ఉన్నారు. బ్రిటిష్‌ పాలనా కాలంలో భారత ప్రభుత్వ చట్టం - 1935లో షెడ్యూల్డ్‌ కులాలు అనే పదాన్ని నిర్వచించారు. ఈ చట్టంలో అణగారిన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్‌లను కల్పించారు. భారత ప్రభుత్వ (షెడ్యూల్డ్‌ కులాలు) ఉత్తర్వు - 1936లో బ్రిటిష్‌ ఇండియాలోని షెడ్యూల్డ్‌ కులాల జాబితాను పేర్కొన్నారు. రాష్ట్రాల గవర్నర్‌లను సంప్రదించి ఆర్టికల్‌ 341 ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలు, ఆర్టికల్‌ 342 ప్రకారం షెడ్యూల్డ్‌ తెగల జాబితాను తయారుచేసే అధికారాన్ని రాజ్యాంగం భారత రాష్ట్రపతికి కల్పించింది. దీనిలో భాగంగా భారత రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ కులాలు) ఉత్తర్వు - 1950, భారత రాజ్యాంగ (షెడ్యూల్డ్‌ తెగల) ఉత్తర్వు - 1950 ద్వారా ఎస్సీ, ఎస్టీల జాబితాను రూపొందించి విడుదల చేశారు. అంటరానితనం, వివక్ష, వెట్టిచాకిరీ, మహిళలపై అకృత్యాలు, భూముల బదలాయింపు, భూముల అన్యాక్రాంతం, జోగినీ/దేవదాసీ ఆచారాలు మొదలైనవి ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. వీటి నుంచి ఈ వర్గాలను రక్షించడానికి రాజ్యాంగంలో అనేక రక్షణలను కల్పించి చట్టాలు చేశారు. వారి సంక్షేమాన్ని సమీక్షించడానికి జాతీయ కమిషన్‌లను ఏర్పాటుచేశారు.

ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ రక్షణలు
చట్టం ముందు అందరూ సమానులే అని ఆర్టికల్‌ - 14 పేర్కొంటే, పౌరుల పట్ల వారి కులం ఆధారంగా వివక్ష ప్రదర్శించకూడదని ఆర్టికల్‌ 15(1) తెలియజేస్తుంది. ప్రజోపయోగ ప్రదేశాల్లో (షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లు, పార్కులు, వినోద ప్రాంతాలు) ఎలాంటి వివక్ష చూపకుండా అందరికీ సమానంగా ప్రవేశం కల్పించాలని ఆర్టికల్‌ 15(2) పేర్కొంటుంది. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ఆర్టికల్‌ 15(4) అవకాశం కల్పిస్తోంది. ఈ ఆర్టికల్‌ను అనుసరించే ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు అన్ని రకాల విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి రిజర్వేషన్‌ కల్పించే అధికారాన్ని ఆర్టికల్‌ 16(4) ప్రభుత్వానికి ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, విముక్త జాతులను ఉద్దేశించి వెనుకబడిన వర్గాలు అనే పదాన్ని ఆర్టికల్‌ 15(4), ఆర్టికల్‌ 16(4)లో సాధారణ పదంగా ఉపయోగించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్‌ల గురించి ఆర్టికల్‌ 16(4A), 16(4B)లలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 ద్వారా అంటరానితనాన్ని (అస్పృశ్యత) నిషేధించారు. ఈ ఆర్టికల్‌ను అమలు చేయడానికి భారత పార్లమెంటు ‘అంటరానితనం (నేరాలు) చట్టం - 1955’ని రూపొందించింది. ఈ చట్టంలోని చర్యలను మరింత కఠినతరం చేయడానికి 1976లో సవరణలు చేసి ‘పౌర హక్కుల రక్షణ చట్టం - 1955’గా మార్చింది.
                  ఈ చట్టంలో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై అకృత్యాలకు సరైన నిబంధనలు లేవని భావించి పార్లమెంటు 1989లో ‘, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం - 1989’ని తీసుకువచ్చింది. ఈ చట్టం 1990 జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్టికల్‌ 164(1) ప్రకారం చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో తప్పనిసరిగా ట్రైబల్‌ వెల్ఫేర్‌ మంత్రిని నియమించాలి. ఆర్టికల్‌ 243(D) గ్రామ పంచాయతీల్లో, ఆర్టికల్‌ 243(T) పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ల గురించి పేర్కొంటున్నాయి. ఆర్టికల్‌ 330 ఎస్సీ, ఎస్టీలకు లోక్‌సభలో కల్పించే రిజర్వేషన్‌లు; ఆర్టికల్‌ 332 రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్‌ల గురించి పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఎస్సీ, ఎస్టీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం గురించి ఆర్టికల్‌ 335లో; షెడ్యూల్డ్‌ ఏరియాల (5వ షెడ్యూల్‌ ఏరియాలు) పరిపాలన గురించి ఆర్టికల్‌ 244(1)లో పేర్కొన్నారు. 5వ షెడ్యూల్‌ ప్రాంతాలు ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌) విస్తరించి ఉన్నాయి. జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ఏర్పాటు గురించి ఆర్టికల్‌ 338లో, జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ ఏర్పాటు గురించి ఆర్టికల్‌ 338(A)లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని వివిధ రక్షణలను అనుసరించి షెడ్యూల్డ్‌ కులాలు, తెగల ప్రయోజనాల కోసం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు పౌరహక్కుల రక్షణ చట్టం - 1955, జోగినీ/దేవదాసీ వ్యవస్థ నిషేధ చట్టం - 1988, వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం - 1976; షెడ్యూల్డ్‌ కులాలు, తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం - 1989, పంచాయతీల (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు విస్తరణ) చట్టం - 1996, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం - 2006 మొదలైన చట్టాలను చేశాయి.

జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 338 షెడ్యూల్డ్‌ కులాలు, తెగల రాజ్యాంగ రక్షణను విచారించి, వాటికి సంబంధించిన విషయాలను రాష్ట్రపతికి నివేదించడానికి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అధికారిని నియమించాలని పేర్కొంది. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం 1978లో ఒక తీర్మానం ద్వారా బహుళ సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని 1987లో ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌గా మార్చింది. దీనికి 65వ రాజ్యాంగ సవరణ చట్టం - 1990 ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించింది. ఇది 1992 మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది.

జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌
భౌగోళిక, సంస్కృతి పరంగా షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాల సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. దీనికి అనుగుణంగా 1999లో ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ‘మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ ఎఫైర్స్‌’ను ఏర్పాటు చేశారు. ఇది ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌లో భాగంగా ఉండేది. ఎస్టీల ప్రయోజనాలను కాపాడటానికి ఉమ్మడిగా ఉన్న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా విభజించి ఆర్టికల్‌ 338(A) ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 2004 ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్‌ ఏర్పాటు, విధులు, అధికారాలు, సభ్యుల కాలపరిమితి జాతీయ ఎస్సీ కమిషన్‌లాగానే ఉంటాయి. ప్రస్తుత జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ నందకుమార్‌ సాయి.

జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌
2003లో 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సంయుక్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్‌ను ఆర్టికల్‌ 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్‌గా, ఆర్టికల్‌ 338(A) ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్‌గా విభజించారు. ఈ విభజన 2004 ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. నియమానుసారం వారు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామ్‌శంకర్‌ కథేరియా, వైస్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌, ఇతర సభ్యులుగా కేశపాగుల రాములు, డాక్టర్‌ యోగేంద్ర పాశ్వాన్‌, డాక్టర్‌ స్వరాజ్‌ విద్వాన్‌ వ్యవహరిస్తున్నారు.

ప్రధాన విధులు
* రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, రక్షణలను పరిరక్షించి, వాటిపై పరిశీలన జరపడం.
* ఎస్సీ కులాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో పాల్గొని, తగిన సూచనలు ఇవ్వడం.
* ఎస్సీ కులాల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి, పురోగతికి సంబంధించి రాష్ట్రపతి సూచించిన ఇతర చర్యలను చేపట్టడం.
* ప్రతి ఏడాది వార్షిక నివేదికలు రూపొందించి రాష్ట్రపతికి సమర్పిస్తే, రాష్ట్రపతి వాటిని పార్లమెంటుకు అందజేస్తారు.

అధికారాలు
* జాతీయ ఎస్సీ కమిషన్‌ ఏ ఫిర్యాదునైనా దర్యాప్తు చేసే విషయంలో సివిల్‌ కోర్టులా వ్యవహరించి అదే పద్ధతిలో విచారణ జరుపుతుంది. సాక్షులు, పత్రాలను విచారిస్తుంది. ఏదైనా ఆఫీసు లేదా న్యాయస్థానం నుంచి పబ్లిక్‌ రికార్డులను తెప్పించుకొని సాక్షులు/డాక్యుమెంట్లను విచారించేందుకు సమన్‌లను జారీ చేస్తుంది.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌