• facebook
  • whatsapp
  • telegram

ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టులు

ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాలనలో అధునాతన విధానాలను అమలు చేస్తున్నారు. సంక్షేమ నిబంధనల రీ-ఇంజినీరింగ్‌ ద్వారా వేగంగా, బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. వీటికి సంబంధించిన ప్రాజెక్టులపై గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి.
ప్రజలకు సంతృప్తికరమైన పాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టులను అమలు చేస్తోంది.

మీ సేవ
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో 1999లో ‘ట్విన్స్‌’ పేరుతో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ఇతర పట్టణాలకు విస్తరించి ‘ఈ-సేవ’గా పేరు మార్చారు. పౌరులకు వివిధ ప్రభుత్వ సేవలను ఒకేచోట అందించడం దీని లక్ష్యం. దీని ద్వారా ధ్రువపత్రాల జారీ, అనుమతులు, లైసెన్సులు పొందడం, టెలిఫోన్‌, విద్యుత్తు బిల్లుల చెల్లింపు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ లాంటి సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని ‘సులభంగా, వేగంగా’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘మీ సేవ’ పేరుతో నిర్వహిస్తున్నారు.

ఏపీనెట్‌ - శాప్‌నెట్‌ (సొసైటీ ఫర్‌ ఏపీ నెట్‌వర్క్‌)
శాప్‌నెట్‌ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దీన్ని 2002లో ప్రారంభించారు. ఇది ఇన్‌శాట్‌ 3బీ సేవలను ఉపయోగించుకుంటుంది. దీనిలో అయిదు ఛానల్స్‌ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు.
1) పాఠశాల, కళాశాల, సాంకేతిక, వైద్య విద్య
2) హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ (మానవ వనరుల అభివృద్ధి)
3) ఇంటరాక్టివ్‌ టెక్నాలజీ
4) ఐకేసీ
5) పాఠశాల వినూత్న కార్యక్రమాలు

భూభారతి
రాష్ట్రంలో అన్ని రకాల భూములు, వాటికి సంబంధించిన యజమానుల సమగ్ర సమాచార సేకరణకు ‘ఇంటిగ్రేటెడ్‌ లాండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌’ (భూభారతి)ని తీసుకొచ్చారు. దీని ద్వారా సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరించడం వల్ల భూసంబంధిత సేవల నిర్వహణ సులభమవుతుంది.

జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్స్‌
దేశంలోనే తొలిసారిగా మానవ వనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2004లో జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవి సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ గవర్నెన్స్‌ సొసైటీ కింద పని చేస్తాయి. ఇంజినీరింగ్‌, ఎంసీఏ, డిగ్రీ విద్యార్థులకు లర్నింగ్‌ బై విజనింగ్‌ ద్వారా కాకుండా లర్నింగ్‌ బై డూయింగ్‌తో ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాయి.

రాజీవ్‌ ఇంటర్నెట్‌ విలేజ్‌
దీన్ని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో 2004, ఆగస్టు 20న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని నిర్దేశించారు.

ఏపీ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బ్రాడ్‌బాండ్‌ సేవలందించడానికి ఏపీ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. దీనివల్ల ఈ-సేవ కేంద్రాలు, రాజీవ్‌ ఇంటర్నెట్‌ విలేజ్‌ కియోస్క్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల సేవలు పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల, రాష్ట్రంలోని మానవ వనరుల వివరాలను కంప్యూటరీకరిస్తున్నారు.

భూధార్‌
ఈ పథకాన్ని 2018, నవంబరు 20న భూ వివాదాల పరిష్కారం కోసం ప్రారంభించారు. దీని ద్వారా భూ లావాదేవీల ప్రక్రియ మరింత సులభతరమై, భూములకు సంబంధించిన అక్రమాలను నివారించవచ్ఛు భూధార్‌ విశిష్ట సంఖ్య ఉన్న భూముల లావాదేవీలకు ధ్రువపత్రాలు, ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.

ఈ-స్పందన
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నేరుగా తమకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు ఈ-స్పందన అనే డిజిటల్‌ పంచాయతీ పోర్టల్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటీ సమస్యలు ఏర్పడినప్పుడు ఈ పోర్టల్‌లో లాగిన్‌ అయి ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తారు. డిజిటల్‌ పంచాయతీ వెబ్‌సైట్‌ ద్వారా వివాహ ధ్రువీకరణ పత్రం, ఆస్తి విలువ పత్రం, మంచినీటి కుళాయి, నిరభ్యంతర పత్రం, భవన నిర్మాణాలకు లే-అవుట్‌ అనుమతులు, జనన మరణాల నమోదు, ఇంటిపన్ను చెల్లింపు, వృత్తి లైసెన్స్‌, ఉపాధిహామీ పనులు, జాబ్‌ ఛార్ట్‌ లాంటి సేవలు ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు.

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌
ఈ-గవర్నెన్స్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ సాధనాలను గరిష్ఠంగా వినియోగించుకుని ప్రభుత్వ పాలన, నిర్వహణలో గణనీయమైన సానుకూల మార్పులను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన సంస్థాగత చట్రం ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’ (తక్షణ పరిపాలన). పౌరులకు ప్రభుత్వ సేవలను అందించడంలో వేగవంతమైన మార్పులను తీసుకురావడం, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం 80% ప్రజలను సంతృప్తి పరిచేలా సంక్షేమ నిబంధనల రీఇంజినీరింగ్‌ ద్వారా వేగంగా, బాధ్యతాయుతంగా సేవలను అందించడం. సుపరిపాలన పద్ధతులను అభివృద్ధి చేయడం, ప్రభుత్వ సేవలను సమర్థంగా నిర్వహించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ-గవర్నెన్స్‌ సాధనాలను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ వినియోగించుకుంటోంది.

ప్రధానాంశాలు
* గ్రీవెన్స్‌ మేనేజ్‌మెంట్‌ - 1100 కాల్‌సెంటర్‌ ద్వారా ‘ప్రజలే ముందు’ నినాదంతో రాష్ట్రంలోని ప్రజలందరికీ సేవలను అందిస్తారు.
* సాంఘిక సంక్షేమ ప్రయోజనాలు, పెన్షన్లు, ప్రజాపంపిణీ వ్యవస్థ, స్కాలర్‌షిప్స్‌, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుని సమీక్షించడం.
* వాతావరణ పరిస్థితుల అంచనా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు.
* ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌ - ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా మార్చడం.
* సోషల్‌ మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం.
* డ్రోన్స్‌, పీటీజడ్‌ కెమెరాలు, వర్చువల్‌ రియాలిటీ, బయోమెట్రిక్‌ టెక్నాలజీ, మెషీన్‌ లర్నింగ్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కాల్‌సెంటర్‌ లాంటి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సుపరిపాలనకు తోడ్పడింది.
* ఇది డేటా మైనింగ్‌, డేటా అనలిటిక్స్‌, విజువలైజేషన్‌ కోసం వివిధ రకాల ఆధునిక టెక్నాలజీలను వినియోగిస్తోంది.

ఈ-ప్రగతి
దీన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కంప్యూటరీకరించాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 హెచ్‌వోడీలు, 745 ఈ-సేవలను ‘ఈ-ప్రగతి’ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకువస్తారు. విప్రో, సింగపూర్‌ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు. దక్షిణాసియాలోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది.

పురసేవ
పురపాలక సంఘాల్లో పౌర సమస్యలను పరిష్కరించేందుకు, పౌర సేవలను మరింత సులభంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ ‘పురసేవ’ అనే ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. పట్టణాలు, నగరాల్లోని పౌరులు తమ సమస్యలపై ఈ యాప్‌ ద్వారా ఆయా పురపాలక సంఘాలకు ఫిర్యాదు చేస్తే అధికారులు తక్షణం స్పందించి పరిష్కరిస్తారు. దీంతోపాటు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారుడికి చరవాణి ద్వారా సందేశం పంపుతారు.

ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా ఫైబర్‌ డిజిటల్‌ సేవలైన ట్రిపుల్‌ ప్లే సర్వీసులు
1) వాయిస్‌ - టెలిఫోన్‌
2) వీడియో - టీవీ ఛానళ్లు
3) డేటా - ఇంటర్నెట్‌ సేవలను అందిస్తారు.
దీని ద్వారా సినిమాలు, వీడియో కాన్ఫరెన్స్‌, ఈ-కామర్స్‌, చదువు, వైద్యం, వ్యవసాయ సంబంధిత సమాచారం లాంటి సేవలు అందుతాయి.

మాదిరి ప్రశ్నలు
 

1. ఆంధ్రప్రదేశ్‌లో పౌరుల సేవకు ఉద్దేశించిన ‘మీ సేవ’ నినాదం?
1) సులభంగా, వేగంగా
2) సమర్థంగా, వేగంగా
3) వేగంగా, నాణ్యతగా
4) నాణ్యతగా, సమర్థంగా

2. రాష్ట్రంలోని అన్ని రకాల భూములు, వాటికి సంబంధించిన యజమానుల సమగ్ర సమాచార సేకరణకు ఉద్దేశించిన పథకం?
1) భూ దీపిక   2) భూ జ్యోతి   3) భూ భారతి   4) నేల తల్లి

3. మానవ వనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌లను విద్యా సంస్థల్లో ఎప్పుడు ప్రారంభించారు?
1) 2002   2) 2004   3) 2006   4) 2008

4. భూ వివాదాల పరిష్కారం కోసం భూమి యజమానులకు విశిష్ట సంఖ్యను కంప్యూటరీకరించే ఏ ప్రక్రియను 2018 నవంబర్‌ 20న ప్రారంభించారు?
1) భూధార్‌   2) భూక్యూ   3) భూత్యాగ్‌   4) భూనామ్‌

5. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు నేరుగా తమకు అవసరమైన ధ్రువపత్రాలను పొందేందుకు ప్రవేశపెట్టిన డిజిటల్‌ పంచాయతీ పోర్టల్‌?
1) ఈ - జాగృతి   2) ఈ - స్పందన   3) ఈ - కోడ్‌   4) ఈ - పత్ర

6. ఆంధ్రప్రదేశ్‌లోని 33 ప్రభుత్వ శాఖలు, 315 హెచ్‌వోడీలు, 745 ఈ-సేవలను కంప్యూటరీకరించి ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే కార్యక్రమం?
1) ఈ-కోర్‌   2) ఈ-నివేదన   3) ఈ-రికార్డ్‌   4) ఈ-ప్రగతి

7. పురపాలక సంఘాల్లో పౌర సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక మొబైల్‌ యాప్‌?
1) పుర పరిష్కార్‌    2) పురసేవ     3) దృష్టి     4) నిశాంత్‌

8. ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా ఫైబర్‌ డిజిటల్‌ సేవలకు సంబంధించిన బేసిక్‌ ప్యాకేజీ ధర?
1) రూ.149   2) రూ.99   3) రూ.49   4) రూ.29

9. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’ సేవల ఉద్దేశం?
1) ప్రజలే ప్రభువుల   2) ప్రజలే పాలకులు   3) ప్రజలే ముందు   4) పైవన్నీ

10. ఇస్రో సహకారంతో ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’ కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు హెచ్చరిక పరిశోధనా ప్రక్రియ?
1) AWARE    2) ARISE    3) ALERT   4) ADON

సమాధానాలు
1-1; 2-3; 3-2; 4-1; 5-2; 6-4; 7-2; 8-1; 9-3; 10-1.

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌