• facebook
  • whatsapp
  • telegram

 క్రీ.పూ.6వ శతాబ్దం పరిస్థితులు

          భారతదేశ చరిత్రలో క్రీ.పూ.6వ శతాబ్దం మౌలికమైన మార్పులకు కారణమైంది. ఈ కాలంలో షోడశ మహాజనపథాలు ఆవిర్భవించి రెండో పట్టణీకరణకు దోహదం చేయగా అనేక నూతన మత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంపై పారశీక, గ్రీకు దండయాత్రలు జరిగాయి. వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని అభివృద్ధి చేశారు. మలివేద కాలం చివరినాటికి (క్రీ.పూ.6వ శతాబ్దం) ఉత్తర భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో కొత్తమార్పులు సంభవించాయి. 16 మహాజనపథాలు ఆవిర్భవించి మగధ తొలి సామ్రాజ్యంగా ఏర్పడింది.

షోడశ మహాజనపథాలు

               క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి భారతదేశంలో 16 మహాజనపథాలు ఏర్పడ్డాయి. వీటినే షోడశ మహాజనపథాలు అంటారు. సంస్కృతంలో ‘జన’ అంటే ప్రజలు, ‘పథం’ అంటే నివాసప్రాంతం అని అర్థం. 16 జనపథాల్లో 15 జనపథాలు ఉత్తర భారతదేశంలో ఏర్పడగా ఒకే ఒక జనపథం ‘అస్మక’ దక్షిణ భారతదేశంలో ఏర్పడింది. వీటిలో 14 జనపథాలు రాచరిక వ్యవస్థను కలిగి ఉంటే వజ్జి, మల్ల అనే రెండు జనపథాల్లో గణరాజ్య వ్యవస్థ లేదా గణపాన ఉండేది.

తొలి సామ్రాజ్యం

              భారతదేశంలో మగధ తొలి సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. షోడశ మహాజనపథాల్లో ఒకటైన మగధ మిగిలిన జనపథాలను జయించి విశాల సామ్రాజ్యంగా విస్తరించింది. దీని రాజధానులు రాజగృహం (గిరివ్రజం), వైశాలి, పాటలీపుత్ర. మగధను హర్యంక, నందవంశం లాంటి పటిష్ఠమైన రాజవంశాలు; బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు, ధననందుడు వంటి బలమైన రాజులు పరిపాలించారు. విస్తారమైన ఇనుపగనులు మగధ దక్షిణ భాగంలో ఉండటం, సారవంతమైన గంగ, సోన్, గండక్‌ నదులు ప్రవహించడం; అటవీసంపద, ఏనుగులను వినియోగించుకోవడం; నిత్యం విదేశీ దండయాత్రలు జరిగే ఈశాన్య భారతదేశానికి దూరంగా ఉండటం వల్ల ఇది బలమైన సామ్రాజ్యంగా ఏర్పడింది.
                  పురాణకాలంలో మగధను రిపుంజయుడు అనే రాజు పరిపాలించేవాడు. హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు అతడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. బింబిసారుడి కుమారుడైన అజాతశత్రువు వైవాహిక సంబంధాలు, యుద్ధ విజయాల ద్వారా మిగిలిన మహాజనపథాలను మగధలో విలీనం చేశాడు. బింబిసారుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు. గంగా - సోన్‌ నదుల మధ్య పాటలీపుత్ర దుర్గాన్ని అజాతశత్రువు నిర్మించాడు. మొదటి బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో మహాకస్యపుడి అధ్యక్షతన నిర్వహించాడు. తన మంత్రి వసకార సహాయంతో లిచ్ఛవుల రాజ్యాన్ని ఆక్రమించాడు.

          అజాతశత్రువు తర్వాత ఉదయనుడు రాజ్యానికి వచ్చాడు. హర్యంక వంశస్థులు పితృహంతకులుగా పేరొందారు. ఈ వంశం అనంతరం మగధను శైశునాగ వంశస్థులు పరిపాలించారు. శిశునాగుడు, అతడి కుమారుడు కాలాశోకుడు మగధను పాలించారు. కాలాశోకుడి కాలంలోనే రెండో బౌద్ధ సంగీతిని సబకామి అధ్యక్షతన వైశాలి నగరంలో నిర్వహించారు. 
          మహాపద్మనందుడు మగధలో శైశునాగ వంశాన్ని నిర్మూలించి నందవంశపాలనను ప్రారంభించాడు. ఇతడి బిరుదులు ఉగ్రసేన, ఏకరాట్‌. చివరి నందవంశ పాలకుడైన ధననందుడిని ఓడించి మగధను ఆక్రమించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు.

 

 సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు

             షోడశ మహాజనపథాల కాలాన్ని భారతదేశ చరిత్రలో రెండో పట్టణీకరణగా పేర్కొంటారు. (భారతదేశంలో తొలి నగరీకరణ సింధు నాగరికత కాలం). ఈ కాలంలో అయోధ్య, కౌశాంబి, తక్షశిల, కాశీ పట్టణాలు అభివృద్ధి చెందాయి. వైశాలి, బరుకచ్చం, తక్షశిల, ఉజ్జయిని లాంటి రేవు పట్టణాలు విదేశీ వ్యాపారంలో కీలకపాత్రను పోషించాయి. దీంతో అనేక నూతన వ్యాపార రహదారులు ఏర్పడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా నాణేల చలామణీ అమల్లోకి వచ్చింది. నాటి నాణేలను విద్దాంక నాణేలు అనేవారు. వేదకాలంలో నాణేలు వాడినట్లు సాహిత్యంలో పేర్కొన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదు. సమాజంలో రాజు, సైనికులు, వ్యవసాయదారులు, వృత్తిపనివారు, బానిసలు లాంటి అనేక వర్గాలు ఉండేవి. కుటుంబ పెద్దను/వ్యవసాయ అధిపతిని ‘గాహపతి’ (గృహపతి), వ్యవసాయ కూలీలను ‘భర్తుకా’ అనేవారు. వృత్తిపనివారు ఏడాదిలో ఒకరోజు రాజు పొలంలో ఉచితంగా పనిచేయడం ద్వారా పన్ను చెల్లించేవారు.

             బానిసలు, స్త్రీలు, పిల్లలకు రాజకీయ సభలు, సమావేశాల్లో ప్రవేశం ఉండేది కాదు. ప్రజలు ప్రకృతి శక్తులు, స్త్రీ దేవతలను, వేదకాలం నాటి దేవతలను ఆరాధించేవారు. నేటి హిందూ సమాజంలో అనుసరిస్తున్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, సాంఘిక దురాచారాలు ఆ కాలంలోనే ఉన్నాయి. సమాజంలో ధనవంతులకు గ్రామ పెద్దగా ఉండే అవకాశాన్ని కల్పించేవారు.
             వ్యవసాయ ఉత్పత్తులు అధికమవడం, చేతివృత్తులు అభివృద్ధి చెందడం; విదేశీ, దేశీయ వాణిజ్యాలు పెరగడం వల్ల నాటి సమాజం ఆర్థికంగా మంచిస్థితిలో ఉండేది.

 విదేశీ దండయాత్రలు (పారశీక, గ్రీకు)

            భారతదేశంపై దండెత్తిన తొలి విదేశీయులుగా ఆర్యులను పేర్కొంటారు. వీరు మధ్య ఆసియా నుంచి వచ్చి సింధు నాగరికత పతనానికి కారణమయ్యారని అధ్యయనం చేశాం కానీ భారతదేశంపైకి దండెత్తిన తొలి విదేశీ పాలకుడు/రాజుగా సైరస్‌ ది గ్రేట్‌ను పేర్కొంటారు (ఆర్యులు సమూహంగా వచ్చారు, వారి నాయకుడు ఎవరో తెలియదు). పారశీక (పర్షియన్‌/ఇరాన్) చక్రవర్తి అయిన సైరస్‌ ది గ్రేట్‌ క్రీ.పూ.553లో, అతడి వారసుడైన మొదటి డేరియస్‌ క్రీ.పూ.516లో భారతదేశంపై దండెత్తారు. వీటినే పారశీక దండయాత్రలుగా పేర్కొంటారు. ఈ దండయాత్రల వల్ల భారతదేశం, ఇరాన్‌ మధ్య వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. పారశీకుల నమూనా నాణేలను భారతీయులు వాడుకలోకి తెచ్చారు.

అలెగ్జాండర్‌ దండయాత్ర

         భారతదేశ చరిత్రలో కాల నిర్ణయానికి తోడ్పడింది అలెగ్జాండర్‌ దండయాత్ర. అరెల్‌స్టైన్‌ అనే చరిత్రకారుడి ప్రకారం క్రీ.పూ.327 - 324 మధ్య అలెగ్జాండర్‌ భారతదేశంపైకి దండెత్తాడు. ఈయన గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజ్యానికి చెందిన ఫిలిప్‌ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్న వయసులోనే చక్రవర్తి అయిన అలెగ్జాండర్‌ ప్రపంచ విజేత కావాలనే ఆశయంతో విదేశీ దండయాత్రలు చేశాడు. మొదట పారశీకులపైకి దండెత్తి, అర్భేలా యుద్ధంలో పారశీక చక్రవర్తి అయిన మూడో డేరియస్‌ను ఓడించాడు. తర్వాత భారతదేశానికి వచ్చాడు. జీలం, చీనాబ్‌ నదుల మధ్య గల విశాల సామ్రాజ్యానికి రాజైన పురుషోత్తముడిని (పోరస్) ఓడించలేక తక్షశిల రాజైన అంబి భారతదేశ దండయాత్రకు అలెగ్జాండర్‌ను ఆహ్వానించి తొలి దేశ ద్రోహిగా పేరొందాడు. అయితే అలెగ్జాండర్‌ మొదట అంబినే ఓడించి అతడి సహాయంతో భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలపై దండెత్తాడు.
           అలెగ్జాండర్‌ దండయాత్రలో అతి ప్రధానమైంది జీలం నది యుద్ధం లేదా హైడాస్ఫస్‌ యుద్ధం. గ్రీకులు తమ గ్రంథాల్లో జీలం నదిని హైడాస్ఫస్‌ నదిగా, పురుషోత్తముడిని పోరస్‌గా పేర్కొన్నారు. క్రీ.పూ.326లో పురుషోత్తముడు, అలెగ్జాండర్‌ మధ్య హైడాస్ఫస్‌ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరస్‌ ఓడిపోయినప్పటికీ అలెగ్జాండర్‌ అతడి ధైర్య సాహసాలకు మెచ్చి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. అనంతరం నాటి మగధ రాజ్యంపై దండెత్తడానికి సమాయత్తమయ్యాడు. కానీ తన సైనికుల అనాసక్తి వల్ల ధననందుడిపై దండెత్తకుండానే వెనుదిరిగాడని చరిత్రకారులు పేర్కొంటారు. భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలకు సెల్యూకస్‌ నికేటర్‌ను ప్రతినిధిగా నియమించిన అలెగ్జాండర్‌ తిరుగు ప్రయాణంలో క్రీ.పూ.323లో బాబిలోనియాలో మరణించాడు.

Posted Date : 16-03-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు