• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకింగ్‌

హెలికాప్టర్‌ మనీ, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌
కొవిడ్‌19 నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన సమయంలో హెలికాప్టర్‌ మనీ, క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (Q.E) లాంటి విధానాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. ఈ రెండు విధానాల్లోనూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారీగా నగదును ముద్రించి, వ్యవస్థలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ‘హెలికాప్టర్‌ మనీ’లో నగదును నేరుగా ప్రజలకు అందిస్తారు. ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’లో నిర్ణీత విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ నిధులు ఇస్తుంది. నగదు కొరత ఏర్పడినప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా నశిస్తుంది. ఈ సందర్భంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పెద్ద మొత్తంలో నగదును అందుబాటులోకి తీసుకువస్తారు. ‘నోట్లను హెలికాప్టర్‌తో జారవిడిచినట్లు’ అనే అర్థం వచ్చేలా ఈ విధానానికి ‘హెలికాప్టర్‌ మనీ’ అని పేరు పెట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఆర్‌బీఐ అదనంగా నోట్లు ముద్రించడం, లేక ఇతర పద్ధతుల్లో పెద్ద ఎత్తున నగదును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం తప్ప వేరే మార్గం లేదా? ఇలా ఇష్టానుసారం కరెన్సీ నోట్లు ముద్రించే అవకాశం ఉంటుందా? లాంటి అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - కరెన్సీ ముద్రణ
    1934 మార్చి 5 నాటి ఆర్‌బీఐ చట్టంలోని 22వ సెక్షన్‌ ప్రకారం రూపాయి నోట్లు, నాణేలు మినహా అన్ని కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ముద్రిస్తుంది. రూపాయి నోటును భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ ముద్రిస్తుంది. కరెన్సీ నోట్ల జారీ విషయంలో ఆర్‌బీఐ ‘కనిష్ఠ రిజర్వ్‌ నిష్పత్తి పద్ధతిని అనుసరిస్తుంది. 1957కు ముందు దామాషా పద్ధతిలో మొత్తం ఆస్తుల్లో 40% బంగారం నిల్వల ఆధారంగా కరెన్సీని జారీ చేసేవారు. మిగిలిన 60% రూపాయి నాణేలు, భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, వినిమయ బిల్లులు, ప్రామిసరీ నోట్ల రూపాల్లో ఉండేవి. ఈ పద్ధతిని అనుపాత రిజర్వ్‌ పద్ధతి అంటారు. 1957 నుంచి కనిష్ఠ రిజర్వ్‌ పద్ధతిలో రూ.200 కోట్ల మేర బంగారం నిల్వలు, విదేశీ మారక నిల్వలను ఆస్తులుగా ఉంచుతున్నారు. అందులో రూ.115 కోట్లు కచ్చితంగా బంగారం రూపంలో ఉండాలి. మిగిలిన రూ.85 కోట్లు విదేశీ మారక ద్రవ్య నిల్వలు. దేశంలో ద్రవ్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ కరెన్సీని ముద్రిస్తుంది. ఆర్‌బీఐ ‘జారీ విభాగం" ఈ విధిని నిర్వహిస్తుంది. ఆర్‌బీఐ ప్రస్తుతం రూ.5, 10, 20, 50, 100, 200, 500, 2,000 విలువైన కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది.రూపాయి నోటు, నాణేలను ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసినప్పటికీ వాటి పంపిణీ బాధ్యత ఆర్‌బీఐదే. కరెన్సీ నోట్ల మీద ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకం, రూపాయి నోటు మీద ఆర్థికశాఖ కార్యదర్శి సంతకం ఉంటాయి. భారతదేశ ద్రవ్య వ్యవస్థ మూలాధార యూనిట్‌ రూపాయి. ఇది కాగితాలు, నాణేల రూపంలో ఉంటుంది. రూపాయి నోటు సాంకేతికంగా కరెన్సీ నోటు కాదు. దీన్ని నాణెంగానే పరిగణిస్తారు.


* భారత రిజర్వ్‌ బ్యాంక్‌ ముద్రించిన కరెన్సీలో అత్యంత విలువైంది రూ.10,000 నోటు. 1938 నుంచి 1946 వరకు రూ.1,000, రూ.10,000 నోట్లు విస్తృతంగా చలామణిలో ఉండేవి. ఆ తర్వాత వీటిని క్రమంగా ఉపసంహరించారు. 1954లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టినా 1978లో వాటిని మళ్లీ రద్దు చేశారు.


* కరెన్సీ ముద్రణ అంశాన్ని ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధిరేటు ఎంత ఉంటుందో లెక్క తేల్చి నగదు నిష్పత్తి (జీడీపీలో)ని లెక్కిస్తారు. దీని ప్రకారం ఎంత కరెన్సీని ముద్రించాలో నిర్ణయిస్తారు. 2019 - 20 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు రూ.24.39 లక్షల కోట్లు. ఈ మొత్తం ఆ ఏడాది జీడీపీలో దాదాపు 12 శాతానికి సమానం. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో ‘నామినల్‌ జీడీపీ’లో 10% వృద్ధి నమోదవుతుందని, జీడీపీ రూ.22.5 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020 డిసెంబరులో విడుదల చేసిన ఆర్‌బీఐ బులిటెన్‌ ప్రకారం 2020, అక్టోబరు 23 నాటికి దేశంలో కరెన్సీ సర్క్యులేషన్‌ రూ.27.14 లక్షల కోట్లు. 
* ఎంత కరెన్సీని చలామణిలోకి తీసుకురావాలనే అంశాన్ని నిర్ధారించే ముందు ఆర్‌బీఐ అధికార వర్గాలు కొన్ని అంశాలను పరిశీలిస్తాయి. అవి:
1. డిజిటల్‌ చెల్లింపుల తీరుతెన్నులు 
2. నగదు వినియోగంలో పెరుగుదల
3. ప్రభుత్వ విధానాలు 
4. నగదు సరఫరాపై ప్రభావం చూపే ఇతర అంశాలు 

 మన దేశంలో గత మూడేళ్ల ఆర్థిక ధోరణులను పరిశీలిస్తే జీడీపీలో నగదు నిష్పత్తి పెరుగుతున్న విషయం స్పష్టమవుతుంది. 2018 మార్చి నాటికి నగదు నిష్పత్తి 10.7%ఉండగా 2019 మార్చి నాటికి ఇది 11.23 శాతానికి, 2020 మార్చికి నాటికి 12.2 శాతానికి పెరిగింది.


గమనిక: దేశంలో సరఫరా అయ్యే డబ్బు (ద్రవ్యం) దేశంలోని మొత్తం వస్తు, సేవల ఉత్పత్తి విలువకు సమానంగా ఉండేలా ఆర్‌బీఐ కరెన్సీని ముద్రించి ఆర్థిక వ్యవస్థలోకి సప్లయ్‌ చేస్తుంది. అంటే డిమాండ్, సప్లయ్‌ సమానంగా ఉండాలి. ఉదా: మన దగ్గర రూ.100 ఉన్నప్పుడు వస్తు, సేవల ఉత్పత్తి విలువ కూడా రూ.100 ఉండాలి. అప్పుడే రూపాయిలో స్థిరత్వం ఉంటుంది. లేకుంటే ఆర్థిక వ్యవస్థలో అధిక డబ్బు సరఫరా వల్ల ద్రవ్యం (డబ్బు) విలువ పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థలో వస్తు, సేవల సరఫరా తక్కువగా ఉండటం వల్ల వస్తు, సేవలకు విలువ పెరుగుతుంది. ద్రవ్య సరఫరా - వస్తు, సేవల సరఫరా సమానంగా లేకపోతే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం అంటే సాధారణ ధరల స్థాయిలో నిరంతర వస్తు, సేవల ధరలు పెరగడం. అధిక కరెన్సీ ముద్రణ, సరఫరా వల్ల వస్తు, సేవల కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్‌ పెరుగుతుంది. దీంతో వస్తు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. 


క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (Q.E)
    దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు సరఫరాను పెంచడానికి కేంద్ర బ్యాంక్‌ పెద్ద ఎత్తున ఆస్తులు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది. ఈ విధానాన్నే క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అంటారు. ఇందులో నిర్ణీత విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ నిధులు ఇస్తుంది. (ఆర్‌బీఐ కరెన్సీని ముద్రించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, వాణిజ్య బ్యాంకులకు జీరో వడ్డీ రేట్లకు లేదా తక్కువ వడ్డీ రేట్లకు నిధులు అందిస్తుంది.) దేశ జీడీపీలో నిర్దేశించిన (స్థూల దేశీయోత్పత్తి) శాతం మేరకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ద్వారా నిధుల లభ్యతను పెంచుతారు. ఈ నిధులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్దిష్ట విధానం ఉంటుంది. ఆర్‌బీఐ ఈ విధానాన్ని అవలంబించాలంటే అనేక పద్ధతులు ఉంటాయి. కేవలం నోట్లు ముద్రించడమే కాకుండా ఎంత సొమ్మును వ్యవస్థలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారో అందులో ‘6’వ వంతు నోట్లు ముద్రిస్తారు. మిగిలిన మొత్తాన్ని ‘బుక్‌ ఎంట్రీ’ పద్ధతిలో ఖాతాల్లో జమ చేస్తారు. ఆర్‌బీఐ అయినా ఇతర దేశాల్లోని కేంద్ర బ్యాంక్‌ అయినా కరెన్సీని ముద్రించి నిల్వ చేస్తాయి. నగదును విడుదల చేయాలనుకున్నప్పుడు ఆ నిల్వలను చలామణిలోకి తీసుకొస్తారు.


* కొవిడ్‌ - 19 నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరించాయి. 2020, మార్చిలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ 750 మిలియన్‌ డాలర్లను అందుబాటులోకి తెచ్చి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చేసింది. 
* అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 700 బిలియన్‌ డాలర్లను అందుబాటులోకి తెచ్చింది. 
* 2001 నుంచి 2006 వరకు జపాన్‌ ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ విధానం ద్వారా భారీగా నిధులను అందుబాటులోకి తెచ్చి, సునామీ వల్ల ఎదుర్కొన్న నష్టాన్ని భర్తీ చేసేందుకు ఖర్చు చేసింది. 
* 2019 -20 ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీ విలువ రూ.203 లక్షల కోట్లు. ఇందులో 5% క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చినా ఆ మొత్తం దాదాపు రూ.10 లక్షల కోట్లు అవుతుంది. కేంద్రం రాష్ట్రాల నుంచి బాండ్లు తీసుకుని ఈ విధానం ద్వారా నిధులు అందించే అవకాశం ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణం పెరగకుండా చూడాలి.


హెలికాప్టర్‌ మనీ (Helicoptor Money) 
‘హెలికాప్టర్‌ మనీ’ అనే పదాన్ని మొదటిసారిగా 1969లో అమెరికన్‌ ఆర్థికవేత్త మిల్టన్‌ ఫ్రీడ్‌మ్యాన్‌ వాడుకలోకి తెచ్చారు. ఈయన 1976లో అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందారు. ‘ప్రతిద్రవ్యోల్బణం’ (వస్తు, సేవల ధరలు తగ్గడం) చోటుచేసుకున్న ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అనుసరించడమే చివరి మార్గం అని మిల్టన్‌ పేర్కొన్నారు. 
* నగదు (నిల్వలు) లభ్యత లేక వస్తు, సేవల ధరలు అనూహ్యంగా పతనం కావడాన్ని ప్రతిద్రవ్యోల్బణ స్థితిగా పేర్కొంటారు. 2002లో ‘ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ బెన్‌ బెర్నాంకో ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.  
* 2016లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ఆ దేశం హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమలు చేసింది. 
* దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి కేటాయించే నగదును ‘హెలికాప్టర్‌ మనీ’ అంటారు. ఈ విధానంలో అన్ని రంగాలకు పెద్ద ఎత్తున నగదు అందిస్తారు.
* యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ ‘బెన్‌ బెర్నాంకో’ ఈ విధానానికి మద్దతుదారుడు. అందుకే ఈయనను హెలికాప్టర్‌ బెన్‌ అని పిలుస్తారు.
* హెలికాప్టర్‌ మనీ అనేది సాధారణంగా కేంద్ర బ్యాంక్‌లకు సంబంధించింది కాదు.


క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానాన్ని అనుసరించిన దేశాలు
    2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశాయి. తద్వారా వ్యవస్థలో నగదు సరఫరా పెంచి, ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితులను కల్పించాయి. యూఎస్‌ ఫెడ్‌ (మన దేశంలో ఆర్‌బీఐ తరహా అమెరికా కేంద్ర బ్యాంక్‌) దాదాపు రెండు ట్రిలియన్‌ డాలర్ల విలువైన సెక్యూరిటీలు కొనుగోలు చేసింది. ఫలితంగా 2014 అక్టోబరు నాటికి యూఎస్‌ ఫెడ్‌ ఆస్తి - అప్పుల పట్టీ 4.4 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ విధానంపై ఆర్థికవేత్తలు, సంస్థల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF), కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ విధానం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగింది. 2012లో యూఎస్‌ ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ ‘అలన్‌ గ్రీన్‌స్పాన్‌’ మాత్రం ఈ విధానంతో లబ్ధి నామమాత్రమేనని పేర్కొన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ దాదాపు రెండు దశాబ్దాలు ప్రతిద్రవ్యోల్బణం (వస్తు సేవలకు ఎలాంటి గిరాకీ లేని పరిస్థితి)లో చిక్కుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ (జపాన్‌ కేంద్ర బ్యాంక్‌) ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ను అమలు చేసి, వడ్డీరేట్లను సున్నాకు తీసుకొచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.


కేంద్ర బ్యాంక్‌ - పరిణామ క్రమం
    బ్యాంకింగ్‌ వ్యవస్థలో అత్యున్నత సంస్థ కేంద్ర బ్యాంక్‌. ఇది ఆధునిక ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల పాత్రను పోషిస్తుంది. బ్యాంకింగ్‌ వ్యవస్థను నియంత్రిస్తూ, మార్గదర్శిగా పనిచేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ఆర్థికాభివృద్ధికి దోహదపడటం దీని విధి. అందుకు వీలుగా కేంద్ర బ్యాంక్‌ ఉపయోగించే సాధనం ‘ద్రవ్య విధానం’. కేంద్ర బ్యాంక్‌  స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. 
* ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్‌ రిక్స్‌ బ్యాంక్‌. దీన్ని 1656లో స్వీడన్‌లో స్థాపించారు. 1668 నుంచి పని చేయడం ప్రారంభించింది. 1913లో అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ వ్యవస్థ ప్రారంభమైంది. భారతదేశంలో 1921 జనవరి 27న ఇంపీరియల్‌ బ్యాంక్‌ను జె.ఎం. కిమ్స్‌ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 1955 జులై 1న దీని పేరును ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)గా మార్చారు.
* 1926లో ‘హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌’ అనే రాయల్‌ కమిషన్‌ దేశంలో ప్రత్యేకంగా ఒక కేంద్ర బ్యాంక్‌ను నెలకొల్పాలని సూచించింది. 1931లో కేంద్ర బ్యాంక్‌ విచారణ సంఘం కేంద్ర బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. 1934, మార్చి 5న ఆర్‌బీఐ చట్టం ఆమోదం పొందింది. ఈ చట్ట నిబంధనల ప్రకారం భారతదేశ కేంద్ర బ్యాంక్‌గా 1935 ఏప్రిల్‌ 1న ఆర్‌బీఐని నెలకొల్పారు. ఆర్‌బీఐ ఒక వాటాదారు బ్యాంక్‌గా రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైంది. నాడు రూ.100 విలువైన 5 లక్షల వాటాలు కలిగి ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949 జనవరి 1న భారత ప్రభుత్వం ఆర్‌బీఐని జాతీయం చేసింది. దేశంలోని ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వ యాజమాన్య పరిధిలోకి తీసుకొచ్చి, నిర్వహించే విధానాన్ని జాతీయీకరణ అంటారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ముంబయిలో (ప్రారంభంలో కోల్‌కతాలో ఉండేది. 1937లో దీన్ని శాశ్వతంగా ముంబయికి మార్చారు.) ఉంది. దీనికి 20 ప్రాంతీయ కార్యాలయాలు, 11 ఉప కార్యాలయాలు; ముంబయి, కోల్‌కతా, చెన్నై, దిల్లీలో ప్రాంతీయ బోర్డు కార్యాలయాలు ఉన్నాయి. 
* రిజర్వ్‌ బ్యాంక్‌కి ప్రధాన అధికారి గవర్నర్‌. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు నలుగురు ఉంటారు. కేంద్ర బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆర్‌బీఐ వ్యవహారాలను నిర్వహిస్తుంది. ఈ బోర్డును ఆర్‌బీఐ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. స్వాతంత్య్రానికి ముందు మొట్టమొదటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఆస్‌బార్న్‌ స్మిత్‌ (1935 - 37). స్వాతంత్య్రానంతరం ఆర్‌బీఐ గవర్నర్‌ అయిన మొదటి భారతీయుడు సి.డి.దేశ్‌ముఖ్‌ (1943-49). ప్రస్తుతం శక్తికాంతదాస్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఆర్‌బీఐ 25వ గవర్నర్‌.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌