• facebook
  • whatsapp
  • telegram

సముద్ర జల వనరులు - ఉపయోగం

సముద్రాల్లో సుమారు 97% ఉప్పు నీరే ఉంటుంది. భూమి ఉద్భవించే సమయంలో లోపలి పలకలు కదిలి, భూగర్భంలో అనేక రసాయనిక పదార్థాలు నీటిలో కలిసి ఉప్పు నీరుగా మారాయి. 

 వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఉపరితలంపై ఉన్న అనేక శిలలు, జంతువులు, వృక్షాలు మొదలైనవాటి నుంచి అనేక రసాయనాలు క్రమక్షయం ద్వారా సముద్ర నీటిలో కలిసి ఉప్పు నీటిగా మారాయి. 

సముద్రం - లవణీయత

సముద్ర నీటిలో అనేక రసాయనాల సమ్మేళనాలతో కూడిన పదార్థాన్ని లవణీయత అంటారు. ఇందులో అత్యధికంగా 78%పైగా సోడియం క్లోరైడ్‌ ఉంటుంది. మనం తినే ఉప్పు శాస్త్రీయ నామమే సోడియం క్లోరైడ్‌. 

 సోడియం క్లోరైడ్‌తో పాటు మెగ్నీషియం, కాల్షియం, మెగ్నీషియం బ్రోమైడ్, కాల్షియం సల్ఫేట్‌ మొదలైనవి ఉంటాయి. 

లవణీయత ద్వారా సముద్ర తీరప్రాంత దేశాలు, రాష్ట్రాలు ఉప్పును తయారు చేస్తున్నాయి. ఉదా: గుజరాత్, ఒడిశా.

ప్రతి వెయ్యి గ్రాముల నీటిలో 35 గ్రాముల లవణీయత లభిస్తే, దాన్ని సామాన్య లేదా సగటు లవణీయత అంటారు.

వివిధ జలాల్లో సాధారణ లవణీయత:

 ఎర్ర సముద్రం - 40 గ్రా.

 మధ్యదరా సముద్రం - 35 గ్రా.

 నల్ల సముద్రం - 15 గ్రా.

 వ్యవసాయ నీటిపారుదల - 3 గ్రా.

 తాగునీటిలో - 1 గ్రా.

నదులు, సరస్సులు, చెరువులు - 0.5 గ్రా.

భూమిపై అత్యధిక లవణీయత ఉన్న జలాలు:

 డాన్‌ జువాన్‌ పాండ్‌ (అంటార్కిటికా) - 440%

 రెట్‌బా సరస్సు (సనేగల్‌) - 400% 

 వండా సరస్సు (అంటార్కిటికా) - 350%

 మృతసముద్రం (ఇజ్రాయెల్‌) - 245%

భూమిపై అత్యల్ప లవణీయత ఉన్న జలాలు:

 బాల్టిక్‌ సముద్రం (యూరప్‌): 8 గ్రా.

 హడ్సన్‌ అఖాతం (అమెరికా): 3 - 15 గ్రా.

 సమాన లవణీయత కలిగిన ప్రాంతాలను కలిపే రేఖలను ‘ఐసోహలైన్స్‌’ అంటారు.

సముద్ర తీరప్రాంతం - తరంగాలు

సముద్ర తీరం నుంచి దూరం వెళ్లే కొద్దీ ఖండతీరపు అంచు-వాలు, అంతర్గత రిడ్జులు, పీఠభూములు, కాన్‌యాన్స్‌ (అగాధాలు) మొదలైన భాగాలుంటాయి.

ప్రపంచంలోనే అత్యంత లోతైన అగాధాలు:

 మేరియానా/ ఛాలెంజర్‌ ట్రెంచ్‌ - పసిఫిక్‌ మహాసముద్రం (11,022 మీ. లోతు)

ప్యుర్టోరికో/ నావెస్‌ ట్రెంచ్‌ - అట్లాంటిక్‌ మహాసముద్రం (10,475 మీ.)

 జావా ట్రెంచ్‌ - హిందూ మహసముద్రం (7450 మీ.)

సముద్ర అంతర్భాగాలు - పలక చలనాలు

భూమి మూడు పొరలతో ఉంటుంది. ఉపరితలంపై ఆవరించి ఉన్న దాన్ని భూపటలం అని, మధ్య పొరను భూప్రవాహం అని, అంతర్గత పొరను కేంద్రకం అని వ్యవహరిస్తారు. 

 భూమిలోపల కేంద్రం, మాంటెల్‌ పొరలు, మాగ్మా వల్ల ఆకస్మిక చలనాలు సంభవించి అగ్ని పర్వతాలు, భూకంపాలు, సునామి, చక్రవాతాలు ఏర్పడతాయి.

అగ్నిపర్వతాలు:

 భూఅంతర్భాగంలో ఉండే మాగ్మాకు 6000ాది ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది పైకి వచ్చి లావాలా మారి, విస్పోటనం చెంది ఘనీభవించి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. ఈ రకమైన అగ్ని పర్వతాలు 3/4 వంతు కంటే ఎక్కువగా పసిఫిక్‌ మహాసముద్ర అగ్ని వలయ (The Pacific Ring Of Fire) ప్రాంతంలో ఏర్పడుతున్నాయి.

ఉదా: ఫ్యూజియామా - జపాన్‌

కొటొపాక్సి - ఈక్వెడార్‌

మాయోడ్‌ - ఫిలిప్పీన్స్‌

బారేన్, నార్కొండం - భారత్‌

కిలిమంజారో - టాంజానియా

స్ట్రంబోలి - సిసిలి

 స్ట్రంబోలి ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతం. ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకైనది. దీన్ని మధ్యదరా సముద్ర ద్వీపస్తంభం అంటారు. 

 భూఅంతర్భాగంలోకి అత్యధిక శక్తి విడుదలైనప్పుడు కంపనాలు సంభవించే  మూల స్థానాన్ని భూకంప నాభి అంటారు. దీని వల్ల ప్రకంపనాలు ఏర్పడతాయి. సుమారు 68% పైగా భూకంపాలు పసిఫిక్‌ మహా సముద్రంలోనే సంభవిస్తున్నాయి. 

సముద్రాలు - తుపాన్లు:

 సముద్ర ఉపరితలంపై 260C నుంచి 290C ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తుపాన్లు అభివృద్ధి చెందుతాయి. 

 ఈ రకమైన ఉష్ణోగ్రతల వల్ల ఉపరితల నీరు వేడెక్కి వ్యాకోచం చెంది, ఆవిరిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఏర్పడే వాటినే తుపాన్లు లేదా చక్రవాతాలు, వాయుగుండాలుగా పిలుస్తారు.

 సైక్లోన్‌ అనే పదం కైక్లోన్‌ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని అర్థం తిరుగుతున్న నీరు లేదా చుట్టుకున్న పాము. 

 చక్రవాతాల్లో ఆయాన రేఖ, సమశీతోష్ణ మండల చక్రవాతాలు అని రెండు రకాలు ఉటాయి. 

 ఒక ఆయన రేఖా ప్రాంతం నుంచి అల్పపీడనం వైపునకు అన్ని మూలల నుంచి అధిక పీడనాలు కేంద్రీకృతం కావడాన్ని చక్రవాతం అంటారు. ఇవి 98% సముద్రాల మీద నుంచి తీర ప్రాంత దేశాల వైపు ప్రయాణిస్తూ వర్షాన్ని ఇస్తాయి. వాటిని ఆయా దేశాల్లో వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. వాటిలో ముఖ్యమైనవి:

ఎ) మెక్సికో, వెస్టిండీస్, కరేబియన్‌ దీవులు: హరికేన్స్‌

బి) చైనా, జపాన్, ఫిలిప్పీన్స్‌ దీవులు: టైపూన్స్‌

సి) ఆస్ట్రేలియా దాని దీవులు: విల్లివిల్లీలు

డి) ఇండోనేసియా దాని దీవులు: బాగ్నాస్‌

ఇ) హిందూ మహాసముద్రతీర దేశాలు, ఇండియా: తుపాన్లు/ స్ట్రోమ్స్‌ ఎఫ్‌) అమెరికా, అట్లాంటిక్‌ మహాసముద్రం: టోర్నడోలు

 ప్రపంచంలో అత్యంత భయంకరమైనవి టోర్నడోలు. ఇవి భూ ఉపరితలంపై నుంచి ప్రయాణిస్తాయి. వీటి వేగాన్ని పూజితాస్క్‌ల ద్వారా కొలుస్తారు.

ఖండతీరపు అంచు - ఉపయోగాలు

    ఖండతీరపు అంచులో మత్స్య సంపద అత్యధికంగా ఉంటుంది. చమురు, సహజ వాయువు లభిస్తుంది. ఓడరేవుల నిర్మాణం ఈ ప్రాంతాల్లోనే జరుగుతుంది.

 మనదేశ పశ్చిమ తీరాన ఉన్న అరేబియా సముద్రంలో అతిపెద్ద చమురు బావి, శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. దీన్నే బాంబే హై లేదా సాగర్‌ సామ్రాట్‌ అంటారు.

 సముద్రంలో సమాన ఉపరితల ఊర్ధ్వ ప్రాంతాలను ‘ఐసోబాత్‌’ అంటారు.

 సముద్ర తరంగాలు, అలల ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తారు.

 మనదేశంలో 1983 నుంచి సముద్ర తరంగాలు, పోటుపాటుల ద్వారా టర్బైన్లను ఉపయోగించి విద్యుత్‌ను తయారు చేస్తున్నారు. దీన్ని ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తోంది.

 భారత్‌లో మొదటి తరంగ శక్తి కేంద్రాన్ని విజింజం (కేరళ)లో, మొదటి టైడల్‌ శక్తి కేంద్రాన్ని కచ్‌ (గుజరాత్‌) వద్ద ఏర్పాటు చేశారు.

 సముద్రాల్లో అంతర్భాగ భూతలం లోపల అంతర్జనిత శక్తి వల్ల వేడి ఏర్పడుతుంది. దాన్ని గ్రహించి తయారు చేసే శక్తినే ‘సముద్ర గర్భోష్ణశక్తి బదలీ’ లేదా Ocean Thermal Energy Conversion (OTEC) అంటారు.  ఈ విధానాన్ని 1930లో క్యూబాలో కనుక్కున్నారు. 

 మనదేశంలో 1980లో తమిళనాడులోని ట్యూటికొరిన్‌ వద్ద OTEC కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

 లక్షద్వీప్‌ రాజధాని కరవత్తి  వద్ద OTEC ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు.

సముద్రాలు - ఉష్ణోగ్రత

 భూభాగానికి, సముద్ర ఉపరితలానికి ఉష్ణోగ్రతలో కొంత వ్యత్యాసం ఉంటుంది. 

 ఘనరూపంలో ఉన్న భూభాగం కంటే, ద్రవ రూపంలో ఉన్న సముద్ర ఉపరితలం ఉష్ణ శక్తిని 2.5 రెట్లు ఎక్కువగా తనలో నిల్వ ఉంచుకుంటుంది. అందుకే భూమి తొందరగా వేడెక్కి, వేగంగా చల్లారుతుంది. సముద్ర ఉపరితలం నిదానంగా వేడెక్కి, నెమ్మదిగా చల్లారుతుంది.

 సాధారణంగా సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రత 2ాది - 29ాది వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎర్రసముద్రంలో అత్యధికంగా 38ాది ఉష్ణోగ్రత ఉంటే బాలిస్టిక్‌ సముద్రంలో అత్యల్పంగా 1.7ాదిఉంటుంది.

 భారతదేశంలో ఉష్ణోగ్రతలు నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. వీటిపై  ఎల్‌నినో, లానినోల క్రియాశీలత ప్రభావం ఉంటుంది. పసిఫిక్‌ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల మార్పుల ప్రభావం వల్ల ఎల్‌నినో, లానినో ఏర్పడతాయి. ఎల్‌నినో కారణంగా అధిక కరవులు, లానినో వల్ల అధిక వర్షపాతం సంభవిస్తాయి. స్పానిష్‌ భాషలో ఎల్‌నినో అంటే బాలక్రీస్తు అని, లానినో అంటే ఆడశిశువు అని అర్థం. 

 దక్షిణ అమెరికా ఖండం, పసిఫిక్‌ మహా సముద్రం దగ్గర్లో ఉండే పెరూ దేశ తీర ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు, హాంబోల్డ్‌ శీతల ప్రవాహం వల్ల ఎల్‌నినో, లానినోలు సంభవిస్తాయి.

మాదిరి ప్రశ్నలు

1. ఓడరేవుల నిర్మాణానికి, చమురును వెలికి తీయడానికి అనువైన ప్రాంతాలు?

1) అగాధాలు      2) మైదానాలు 

3) ఖండతీరపు వాలు 

4) ఖండతీరపు అంచు

2. భూ ఉపరితలంపై అత్యధిక లవణీయత కలిగిన ప్రాంతం.....

1) డాన్‌ జువాన్‌ పాండ్‌  

2) వండా సరస్సు

3) మృత సముద్రం            4) రెట్‌బా సరస్సు

3. సముద్రాల్లో అత్యధిక లవణీయత కలిగిన రసాయనం.....

1) మెగ్నీషియం              2) కాల్షియం సల్ఫేట్‌ 

3) సోడియం క్లోరైడ్‌ 

4) మెగ్నీషియం బ్రోమైడ్‌

4. ప్రతి వెయ్యి గ్రాముల నీటిలో సామాన్య లేదా సగటున ఉండాల్సిన లవణీయత ఎంత?

1) 40 గ్రా.           2) 35 గ్రా. 

3) 50 గ్రా.            4) 30 గ్రా.

సమాధానాలు: 1-4   2-1   3-3   4-2

రచయిత

కొత్త గోవర్ధన్‌ రెడ్డి 

విషయ నిపుణులు 

విషయ నిపుణులు 

Posted Date : 18-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌