• facebook
  • whatsapp
  • telegram

ఆదేశ సూత్రాలు, విధులు

ఆదేశ సూత్రాలు లేదా నిర్దేశక నియమాలను రాజ్యాంగంలోని IV వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న 16 నిబంధనల్లో వివరించారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసననిర్మాణ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థలకు విధి నిర్వహణలో మార్గదర్శకాలుగా ఇవి ఉపయోగపడతాయి. ప్రవేశికలో పేర్కొన్న ఆశయాల సాధనకు అవసరమైన అంశాలను వీటిలో పొందుపరిచారు. ఇవి సంక్షేమ రాజ్య స్థాపన, ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం ఉద్దేశించినవి. అయితే ప్రాథమిక హక్కుల లాగానే వీటిని న్యాయస్థానాల ద్వారా కాపాడుకునే అవకాశం లేదు. ప్రభుత్వాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని వీటిని అమలు చేస్తాయి.
ఆదేశ సూత్రాల రూపకల్పనలో రాజ్యాంగ నిర్మాతలపై ఐరిష్ రాజ్యాంగం, ఫ్రెంచ్ విప్లవ ప్రకటన ఆదర్శాలు, అమెరికా స్వాతంత్య్ర ప్రకటన, ఐక్యరాజ్యసమితి చార్టర్, ఫెబియన్ సోషలిజం, గాంధీజీ లాంటి స్వాతంత్రోద్యమ నాయకుల సిద్ధాంతాలు ప్రభావం చూపాయి.
ఆదేశ సూత్రాలను కింది విధంగా విభజించవచ్చు.

1. సంక్షేమ రాజ్య నియమాలు
i) 38 (1)వ నిబంధన ప్రకారం రాజ్యం ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించాలి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలి.
ii) 39వ నిబంధన ప్రభుత్వం తమ విధానాల రూపకల్పనలో కింది అంశాల సాధనకు కృషి చేయాలని సూచించింది. 
  a) ప్రజలందరికీ తగిన జీవనోపాధి కల్పించాలి.
  b) భౌతిక వనరులను ప్రజలందరి సమష్టి ప్రయోజనాల కోసం పంపిణీ చేయాలి.
  c) సంపద, ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి.
  d) స్త్రీ, పురుషులకు సమాన పనికి, సమాన వేతనం కల్పించాలి.
  e) కార్మికులు, స్త్రీలు, పురుషులు, బాల బాలికలు నిర్బంధ దోపిడీకి గురికాకుండా చూడాలి.
iii) 41వ నిబంధన ప్రకారం రాజ్యం ఆర్థిక వనరుల లభ్యత ఆధారంగా పని హక్కు, విద్య కల్పించాలి. నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగులు, నిస్సహాయులకు తగిన సహాయం అందించాలి.
iv) 42వ నిబంధన పనిచేయడానికి హేతుబద్ధమైన పని పరిస్థితులను కల్పించాలని, ప్రసూతి సౌకర్యాలు కల్పించాలని, మాతా-శిశు సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది.
v) 43వ నిబంధన ప్రకారం కార్మికులు కనీస జీవన వేతనం పొందడానికి రాజ్యం లేదా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మంచి జీవనప్రమాణాలతో కూడిన జీవనాన్ని సాగించేలా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత, సమష్టి ప్రాతిపదికపై కుటీర పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి.
vi) 46వ నిబంధన ప్రకారం బలహీన వర్గాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజల విద్య, ఆర్థిక ప్రయోజనాలపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారిని సాంఘిక అన్యాయాలు, దోపిడీ నుంచి రక్షించాలి.
vii) 47వ నిబంధన ప్రజల పోషకాహారస్థాయిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి రాజ్యం కృషి చేయాలని తెలియజేస్తుంది.

2. విద్య, సాంస్కృతిక నియమాలు

i) 45వ నిబంధన ప్రకారం రాజ్యం 0 నుంచి 6 సంవత్సరాల్లోపు వయసున్న బాల, బాలికల శిశుసంరక్షణ, విద్యా సదుపాయాలను కల్పించాలి. (86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002)
ii) 49వ నిబంధన ప్రకారం చారిత్రక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు, స్థలాలు, వస్తువులను కాపాడాలి.

3. గాంధేయవాద నియమాలు

i) రాజ్యాంగంలోని 40వ నిబంధన గ్రామపంచాయతీ వ్యవస్థను ఏర్పరచి, వాటిని స్వయంపాలనా సంస్థలుగా తీర్చిదిద్దాలని తెలియజేస్తుంది.
ii) రాజ్యం గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలి (43వ నిబంధన).
iii) షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాలవారి విద్య, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాజ్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలి, వారిని సాంఘిక అన్యాయం, దోపిడీ నుంచి కాపాడాలి (46వ నిబంధన).
iv) మేలైన పశుసంపదను కాపాడాలి, అభివృద్ధి చేయాలి. గోవులు, దూడలు, ఇతర పాలిచ్చే జంతువులు, వ్యవసాయంలో ఉపయోగపడే జంతువుల వధను నిషేధించాలి (48వ నిబంధన).
v) ప్రజల ఆరోగ్యాన్ని హరించే మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని నిషేధించాలి (47వ నిబంధన).

4. అంతర్జాతీయ శాంతి, భద్రత

  a) 51a నిబంధన ప్రకారం అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించాలి.
  b) ఇతర దేశాలతో న్యాయ, గౌరవప్రదమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి.
  c) అంతర్జాతీయ ఒప్పందాలు, న్యాయసూత్రాలను గౌరవించి, పాటించాలి.
  d) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి కృషి చేయాలి.

ఇతర అంశాలు

i) దేశప్రజలందరికీ 'ఉమ్మడి పౌరస్మృతి'ని రూపొందించి, అమలుచేయాలి (44వ నిబంధన).
ii) 50వ నిబంధన ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయాలి.
iii) వ్యవసాయం, పాడి పరిశ్రమలను ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి (48వ నిబంధన).

రాజ్యాంగ సవరణ చట్టాలు

రాజ్యాంగానికి చేసిన 42, 44, 86, 97 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా కొన్ని అంశాలను ఆదేశ సూత్రాల్లో చేర్చారు. అవి
i) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా చేర్చిన అంశాలు:
* 39(f) ప్రకారం బాల, బాలికల వికాసం కోసం రాజ్యం కృషి చేయాలి. వారి బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా చూడాలి.
* 39A నిబంధన ప్రకారం ప్రజలందరికీ సమన్యాయం దక్కడానికి, ప్రభుత్వం పేదలకు ఉచిత న్యాయసహాయాన్ని అందించాలి.
* 43A నిబంధన పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని తెలియజేస్తుంది.
* 48A నిబంధన ప్రకారం రాజ్యం పర్యావరణాన్ని పరిరక్షించాలి, అడవులను, వన్యమృగాలను కాపాడాలి.
ii) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా 38(2) నిబంధన చేర్చారు. దీని ప్రకారం వివిధ ప్రాంతాలు, వృత్తులు, వ్యక్తుల మధ్య ఆదాయం, హోదా, సౌకర్యాలు, అవకాశాల్లో అసమానతలను తగ్గించడానికి రాజ్యం కృషి చేయాలి.
iii) 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 45వ నిబంధనలోని అంశాన్ని 21A నిబంధనగా చేర్చారు. దాని స్థానంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనను చేర్చారు.
iv) 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా 43B నిబంధన చేర్చారు. దీని ప్రకారం సహకార సంఘాల స్థాపనకు, అవి ప్రజాస్వామ్య పద్ధతిలో, స్వతంత్రంగా పనిచేయడానికి రాజ్యం తగిన కృషిచేయాలి.
పైన తెలిపిన విధంగా ఆదేశ సూత్రాల పరిధి, ప్రాధాన్యత విస్తృతమవుతోంది. ఇవి న్యాయార్హమైనవి కాకపోయినప్పటికీ వాటి వెనుక ప్రజల బలమైన ఆకాంక్ష ఉండటం వల్ల వీటిని అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తమ శక్తి మేరకు కృషి చేస్తున్నాయి.

Posted Date : 21-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌