• facebook
  • whatsapp
  • telegram

బీమా రంగం(Insurance Sector)

బీమా ఒక సాంఘిక భద్రతా సౌకర్యం. మానవ జీవితంలో కొన్ని విపత్తుల వల్ల ప్రాణ నష్టం, అనారోగ్యం, ఆస్తి నష్టం లాంటివి సంభవించవచ్చు. అలాంటి క్లిష్ట సమయాల్లో సంబంధిత వ్యక్తికి లేదా కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదే బీమా. నష్ట భయాన్ని బీమా చేయడానికి ఆయా సంస్థలకు ఒకేసారి లేదా వాయిదా పద్ధతిలో కొంత రుసుం చెల్లించాలి. దీన్నే ప్రీమియం అంటారు. బీమా చేయించుకున్న వ్యక్తికి, బీమా చేసిన వ్యాపార సంస్థకు మధ్య ఒప్పందాన్ని తెలిపే పత్రమే బీమా పాలసీ (Insurance Policy)

బీమా రకాలు

బీమాను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

1) జీవిత బీమా (Life Insurance)

2) సాధారణ బీమా (General Insurance) లేదా జీవితేతర బీమా (Non-Life Insurance)

జీవిత బీమా: ఇది ప్రాణ నష్టానికి సంబంధించింది. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి తన పాలసీ కాలం పూర్తయ్యే లోపు మరణిస్తే, బీమా మొత్తాన్ని (Assured Sum) వారి కుటుంబానికి బీమా సంస్థ చెల్లిస్తుంది. వ్యక్తి చనిపోక ముందే పాలసీ కాలం పూర్తయితే, చెల్లించిన ప్రీమియం మొత్తానికి కొంత బోనస్‌ సొమ్మును కలిపి సంబంధిత వ్యక్తికి చెల్లిస్తుంది.

సాధారణ బీమా: ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు శరీరంలో ఒక భాగం కోల్పోవచ్చు లేదా కొన్ని అవయవాలు పనిచేయని పరిస్థితి తలెత్తవచ్చు లేదా అనారోగ్యానికి గురై వైద్య సహాయం పొందాల్సి రావచ్చు. ప్రమాదం కారణంగా అతడి/ ఆమె వాహనం దెబ్బతినొచ్చు. అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వల్ల ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో నష్టభయాలకు సంబంధించిన బీమా సౌకర్యాన్ని సాధారణ బీమా అంటారు. వీటన్నింటికీ బీమా సౌకర్యం కల్పించే వ్యాపారమే జీవితేతర బీమా (Non-Life Insurance Business) వ్యాపారం. కింది బీమా పథకాలన్నీ ఈ రకానికి చెందుతాయి.

1) అగ్ని ప్రమాద బీమా     2) నౌక బీమా  

3) మోటారు బీమా     4) ఆరోగ్య బీమా

భారతదేశంలో బీమా వ్యాపారం పరిణామ క్రమం

మనదేశంలో ప్రాచీన కాలం నుంచే బీమా వాడుకలో ఉంది. మనుస్మృతిలో దీని ప్రస్తావన ఉంది. యజ్ఞవల్క్యుడి ‘ధర్మశాస్త్రం’లో, కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’లోనూ దీన్ని పేర్కొన్నారు. ద్రవ్య వనరులను సమీకరించి అగ్ని ప్రమాదం, వరదలు, అంటు వ్యాధుల వ్యాప్తి, కరవు మొదలైనవి సంభవించినప్పుడు, వాటిని ప్రజలకు పంచిపెట్టడం గురించి ఈ గ్రంథాల్లో ప్రస్తావించారు. 

నౌకావ్యాపార రుణాలు, రవాణా నౌకల ఒప్పందాలు మొదలైనవి ఆధునిక బీమాకు సంబంధించిన తొలి రూపాలుగా పేర్కొనవచ్చు. భారత్‌ ఆధునిక బీమా విధానాన్ని ఇంగ్లండ్‌ నుంచి స్వీకరించింది.

భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి బీమా సంస్థ ఓరియంటల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ. దీన్ని 1818లో కొంత మంది ఐరోపా దేశస్థులు కలకత్తాలో ఏర్పాటు చేశారు.  

1829లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో మద్రాస్‌ ఈక్విటబుల్‌ అనే సంస్థ జీవిత బీమా వ్యాపారాన్ని ప్రారంభించింది. 

మన మొదటి స్వదేశీ బీమా సంస్థ ‘బాంబే మ్యూచువల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ సొసైటీ’. దీన్ని 1870లో  నెలకొల్పారు.

1870లో బ్రిటిష్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని చేశారు.

బాంబే ప్రెసిడెన్సీలో 1871లో బాంబే మ్యూచువల్, 1874లో ఓరియంటల్, 1897లో ఎంపైర్‌ ఆఫ్‌ ఇండియా అనే బీమా సంస్థలను స్థాపించారు.

1896లో భారత్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని నెలకొల్పారు.

స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో 1905-07 మధ్య కాలంలో దేశంలో అనేక ప్రాంతాల్లో బీమా సంస్థలు స్థాపించారు.

1906లో మద్రాస్‌లో యునైటెడ్‌ ఇండియా, కలకత్తాలో నేషనల్‌ ఇన్సూరెన్స్, లాహోర్‌లో కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఏర్పాటు చేశారు.

1907లో కలకత్తాలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుటుంబానికి చెందిన ‘జొరసంకో’ గృహంలో హిందుస్థాన్‌ కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రారంభమైంది. అదే కాలంలో ఇండియన్‌ మర్కంటైల్, జనరల్‌ అస్యూరెన్స్‌ అండ్‌ స్వదేశీ లైఫ్‌ సంస్థలను నెలకొల్పారు. 

బీమా వ్యాపారం క్రమబద్ధీకరణ

భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం బీమారంగం కేంద్ర జాబితాలో ఉంది.

1912 వరకు మనదేశంలో బీమా వ్యాపారంపై ప్రభుత్వ నియంత్రణ లేదు.

దేశంలో బీమా వ్యాపారాన్ని క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో 1912లో భారత ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అదే ఏడాది ప్రావిడెంట్‌ఫండ్‌ చట్టం కూడా చేసింది.

1914లో భారత ప్రభుత్వం దేశంలోని బీమా సంస్థల రిటర్న్‌లను ప్రచురించడం ప్రారంభించింది.

1938లో ప్రభుత్వం సమగ్ర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడం దీని ఉద్దేశం. 

1999లో ప్రభుత్వం బీమా క్రమబద్ధీకరణ, డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాలను చేసింది. అప్పటివరకు   సమగ్ర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టం అమల్లో ఉంది.

1950లో ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ అమెండ్‌మెంట్‌ చట్టం ద్వారా ప్రధాన ఏజెన్సీలను రద్దు చేసింది.

ఎల్‌ఐసీ అనుబంధ సంస్థలు 

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌

ఎల్‌ఐసీ కార్డ్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ లిమిటెడ్‌

ఎల్‌ఐసీ పెన్షన్‌ ఫండ్‌ లిమిటెడ్‌

ఐడీబీఐ బ్యాంక్‌ 

2020 నాటికి ఎల్‌ఐసీలోని ఉద్యోగుల సంఖ్య 1,14,000

2021 నాటికి ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ రూ.38,04,610 కోట్లు (510 బిలియన్‌ డాలర్లు)

1956లో ఎల్‌ఐసీకి 5 జోన్లు, 33 డివిజన్లు, 240 బ్రాంచి కార్యాలయాలు ఉండేవి. ఆ సమయంలో ఇందులో 89,000 మంది ఏజెంట్లు పనిచేసేవారు.

2017 నాటికి 8 జోన్లు, 113 డివిజన్లు, 2048 బ్రాంచి కార్యాలయాలకు వృద్ధి చెందింది. 

200012 మధ్య కాలంలో బీమా రంగంలో 23 ప్రైవేట్‌ సంస్థలను నెలకొల్పారు. 

ప్రస్తుతం ఎల్‌ఐసీలో 15,37,064 మంది స్వతంత్ర ఏజెంట్లు,  342 మంది కార్పొరేట్‌ ఏజెంట్లు, 109 మంది రెగ్యులర్‌ ఏజెంట్లు, 114 మంది బ్రోకర్లు పనిచేస్తున్నారు.

జోనల్‌ కార్యాలయాలు

ఎల్‌ఐసీకి దేశవ్యాప్తంగా ఎనిమిది జోనల్‌ కార్యాలయాలు ఉన్నాయి. అవి:

 నార్త్‌ జోన్‌ - న్యూదిల్లీ 

సెంట్రల్‌ జోన్‌ - భోపాల్‌

ఈస్ట్‌ జోన్‌ - కోల్‌కతా

వెస్ట్‌ జోన్‌ - ముంబయి

సౌత్‌ జోన్‌ - చెన్నై 

ఈస్ట్‌-సెంట్రల్‌ జోన్‌ - పట్నా

నార్త్‌-సెంట్రల్‌ జోన్‌ - కాన్పూర్‌

సౌత్‌-సెంట్రల్‌ జోన్‌ - హైదరాబాద్‌

ఉత్పత్తులు 

జీవిత బీమా 

ఆరోగ్య బీమా

పెట్టుబడి 

నిర్వహణ 

మ్యూచువల్‌ ఫండ్‌

సాధారణ బీమా (జనరల్‌ ఇన్సూరెన్స్‌) జాతీయం

భారతదేశంలో మొట్టమొదటి సాధారణ బీమా సంస్థను 1850లో కలకత్తాలో ట్రియోటాన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనే పేరుతో ఏర్పాటు చేశారు.

1906లో ఏర్పడిన యునైటెడ్‌ ఇండియా (మద్రాస్‌), నేషనల్‌ ఇన్సూరెన్స్‌ (కలకత్తా), కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ (లాహోర్‌) సాధారణ బీమా సంస్థలే. 

1907 లో ఏర్పడిన ఇండియన్‌ మర్కంటైల్‌ కంపెనీ అన్ని రకాల బీమా వ్యాపారాలు నిర్వహించేది.

నాలుగో పంచవర్ష ప్రణాళికా సమయంలో ్బ1969-74్శ జీఐసీ  ఏర్పాటుకు పునాదులు వేశారు. 

1972 నవంబరు 22 న జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) చట్టాన్ని ఆమోదించారు.

1973 జనవరి 1న జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను నెలకొల్పారు. అంతవరకు దేశంలో పని చేస్తున్న 107 సాధారణ బీమా సంస్థలను జాతీయం చేయగా, నాలుగు సంస్థలను విలీనం చేశారు. అవి:

 1. యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (మద్రాస్‌)

 2. న్యూ ఇన్సూరెన్స్‌ కంపెనీ (బొంబాయి)

 3. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (కలకత్తా)

 4. ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (న్యూదిల్లీ)

2000 నవంబరు నుంచి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (జీఐసీ) రీఅస్యూరర్‌గా పని చేస్తోంది. 

పై సంస్థలు బీమా చేసిన మొత్తంలో 120% శాతానికి ఇది పునఃబీమా సౌకర్యం కల్పిస్తుంది.

సాధారణ బీమా సంస్థ (జీఐసీ) ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 

2020 నాటికి జీఐసీ మొత్తం ఆస్తులు రూ.116,19,620;  రెవెన్యూ రూ.52,63,805

2020 నాటికి జీఐసీ ఉద్యోగుల సంఖ్య 567

జీఐసీ నినాదం: ఆపద సమయంలో నేను నిన్ను రక్షిస్తాను (I Shall protect in times of distress). 

జీఐసీ ప్రస్తుత చైర్‌పర్సన్‌ దేవేష్‌ శ్రీవాస్తవ.

జీఐసీ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. జీఐసీ లొకేషన్స్‌: దుబాయ్, కౌలాలంపూర్, లండన్, మాస్కో.

భారత పంచవర్ష ప్రణాళికలు - జీవిత బీమా జాతీయం

 1956, జనవరి 19న దేశంలో పనిచేస్తున్న జీవిత బీమా కంపెనీలన్నింటినీ జాతీయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

రెండో పంచవర్ష ప్రణాళిక (195661్శలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ప్రవేశపెట్టారు.

1956, జూన్‌ 19న పార్లమెంట్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) చట్టాన్ని ఆమోదించారు.

1956, సెప్టెంబరు 1 నుంచి ఎల్‌ఐసీ ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. జాతీయం చేసిన అన్ని జీవిత బీమా సంస్థలను ఇందులో విలీనం చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న ఏకైక జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌. ఇది చట్టబద్దమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లు (ఎండీలు) ఉంటారు. ఎల్‌ఐసీ ప్రస్తుత ఛైర్మన్‌ - ఎంఆర్‌ కుమార్‌.  రాజ్‌కుమార్, ఐపే మిని, సిద్ధార్థ మొహంతి, బి.సి. పట్నాయక్‌ ఎండీలుగా ఉన్నారు.

ఇది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తుంది.

1956లో 154 భారతీయ సంస్థలు, 16 విదేశీ సంస్థలు, 75 ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థలను జాతీయం చేశారు.

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (Pradhan Mantri Fasal Bima Yojana - PMFBY)

దీన్ని 2016 జనవరి 13న ప్రారంభించారు.

లక్ష్యాలు: 

 ఊహించని సంఘటనల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించడం.

 రైతులు వ్యవసాయంలో కొనసాగేలా వారి ఆదాయాన్ని స్థిరీకరించడం.

 వ్యవసాయంలో నవ కల్పనలు, ఆధునిక పద్ధతులు అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం.

 వ్యవసాయ రంగానికి పరపతి లభ్యత కొనసాగేలా భరోసా ఇవ్వడం. ఉత్పత్తికి సంబంధించిన నష్టభయాల నుంచి రైతులను రక్షిస్తూ, వ్యవసాయ రంగంలో పోటీని, వృద్ధిని పెంచటం.

అర్హతలు: 

ప్రకటిత ప్రాంతాల్లో సంబంధిత పంటలను పండించే రైతులు, కౌలుదారులు.

విత్త సంస్థల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇది తప్పనిసరి.

కిసాన్‌ పరపతి కార్డు వాడే, రుణాలు తీసుకోని రైతులకు ఇది స్వచ్ఛందం.

పంటలు: తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, వార్షిక వాణిజ్య, ఉద్యానవన పంటలు.

నష్టభయాలు: నాట్లు వేసే ముందు నుంచి కోతల తర్వాత వరకు వివిధ సమయాల్లో నిరోధించలేని కింది నష్ట భయాలకు ఈ పథకం వర్తిస్తుంది.

వర్షాభావం, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటలు వేయలేకపోవటం.

నిరోధించలేని కరవు, వరదలు, విస్తృతమైన తెగుళ్లు, సహజ పరిస్థితుల వల్ల ఏర్పడిన అగ్నిప్రమాదాలు.

కోతల తర్వాత సంభవించిన వర్షాలు, వడగండ్ల వాన.

అడవి జంతువుల వల్ల కలిగే నష్టాలు.

విధానం, బీమా యూనిట్‌: ప్రకటిత ప్రాంతం ప్రాతిపదికన బీమా యూనిట్‌ను తీసుకుంటారు. ప్రధాన పంటలకు బీమా యూనిట్‌ గ్రామం/ గ్రామ పంచాయితీ. స్వల్పకాల పంటలకు అంతకన్నా ఎక్కువ ప్రాంతం (తాలూకా, జిల్లా).

నష్టపరిహారం: అత్యధిక నష్టభయం ఉన్న పంటలకు 70%, మధ్యతరహా నష్టభయం కలిగిన పంటలకు 80%, అల్ప నష్టభయం ఉన్న పంటలకు 90%.

గరిష్ఠ పరిమిత దిగుబడి: గడచిన ఏడేళ్ల సగటు దిగుబడి ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు (రెండు కరవు సంవత్సరాలు మినహాయించి).

బీమా మొత్తం: జిల్లా స్థాయి సాంకేతిక సంఘం నిర్ణయించిన విత్త తరహాకు సమానం (సేద్యపు వ్యయానికి సమానం).

ప్రీమియం, సబ్సిడీ: హామీ ఇచ్చిన మొత్తం  లేదా వాస్తవిక అంచనా మొత్తాల్లో ఏది తక్కువగా ఉంటే అందులో ఒక శాతం కింది విధంగా ఉంటుంది. దీన్ని రైతులు చెల్లిస్తారు.

ఖరీఫ్‌ పంటలు (ఆహార ధాన్యాలు, నూనెగింజలు): 2%

రబీ పంటలు (ఆహార ధాన్యాలు, నూనె గింజలు): 1.5%

ఖరీఫ్, రబీ పంటలు (వార్షిక ఉద్యాన, వాణిజ్య పంటలు): 5%

ప్రీమియంలో రైతులు చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇది 90 : 10 నిష్పత్తిగా ఉంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ: ఇందులో రైతులకు చెల్లించే నష్టపరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. రైతులు తప్పనిసరిగా బీమా పాలసీలో ఆధార్‌ సంఖ్య నమోదు చేయించాలి.

ఈ పథకానికి 2018లో కొన్ని సవరణలు చేశారు. వాటి ప్రకారం, రైతులు క్లెయిమ్‌ సమర్పించిన 10 రోజుల్లో పరిష్కారించాలి. లేకపోతే జాప్యం చేసిన కాలానికి బీమా కంపెనీలు 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలి. ఈ మొత్తాన్ని అందించడంలో రాష్ట్రాలు విఫలమైతే అవి కూడా సంబంధిత పాలసీదారుకు 12% వడ్డీ చెల్లించాలి. 

పంట నష్టం గురించిన సమాచారాన్ని రైతులు 48 గంటలకు బదులు 72 గంటల్లోగా సమర్పించాలి.

2020లో చేసిన మరికొన్ని సవరణల ప్రకారం ప్రీమియంలో సబ్సిడీకి గరిష్ఠ పరిమితి విధించారు. అది నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో 25%, ఇతర ప్రాంతాల్లో 30 శాతంగా నిర్ణయించారు. రైతులందరికీ ఈ పథకాన్ని స్వచ్ఛందం చేశారు.

వ్యవసాయంలో ప్రత్యక్ష ప్రయోజన  బదిలీ పథకాలు - సబ్సిడీ 

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి.

 2013 నుంచి అనేక రంగాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం అమల్లోకి వచ్చింది. వ్యవసాయరంగంలోనూ దీన్ని పాటిస్తున్నారు.

 ఈ ప్రయోజనం నగదు రూపంలో లేదా వస్తు, సేవల రూపంలో ఉండొచ్చు. ప్రస్తుతం మనదేశంలో కింది ప్రత్యక్ష ప్రయోజన పథకాలు అమల్లో ఉన్నాయి.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PMkisan).

రైతుబంధు            వైఎస్సార్‌ రైతుభరోసా

రైతుబంధు పథకం 

దీన్ని తెలంగాణ ప్రభుత్వం 2018 మేలో కరీంనగర్‌ జిల్లా ధర్మరాజపల్లిలో ప్రారంభించింది. రైతులు పంటవేసేందుకు పెట్టుబడి సాయం అందించి, వారు అప్పులపాలు కాకుండా చూడాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

దేశంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన మొదటి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ఇదే. సొంత భూమి కలిగిన సన్నకారు, ఉపాంత రైతులు మాత్రమే దీనికి అర్హులు. కౌలుదార్లకు ఇది వర్తించదు. 

వానాకాలం (ఖరీఫ్‌), యాసంగి (రబీ) పంట కాలంలో ఏడాదికి రెండుసార్లు ఎకరాకు రూ.5000 చొప్పున సహాయంగా ఇస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.

వైఎస్సార్‌ రైతు భరోసా

ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019, అక్టోబరు 15న ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, కౌలు రైతులకు పంటకాలంలో పెట్టుబడి అవసరాలకు నగదు సాయాన్ని అందించడం దీని లక్ష్యం.

కమతం పరిమాణంతో సంబంధం లేకుండా సాగుభూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. 

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా కేంద్రం అందించే రూ.6000కు వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్రం చెల్లించే రూ.7,500ను కలిపి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. భూమిలేని కౌలు  రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500  అందిస్తోంది.

ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో నేరుగా సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు

మొదటి వాయిదా రూ.7500 మేలో (పీఎం కిసాన్‌ కింద రూ.2000).

రెండో వాయిదా రూ.4000 అక్టోబరులో (పీఎం కిసాన్‌ కింద రూ.2000).

మూడో వాయిదా రూ.2000 జనవరిలో (పీఎం కిసాన్‌ ద్వారా రూ.2000) చెల్లిస్తారు.

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి

ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని 2018 డిసెంబరు 1న ప్రవేశపెట్టారు. 

ఈ పథకం ద్వారా సాగుకు యోగ్యమైన భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. భర్త, భార్య, మైనర్‌ పిల్లలను కుటుంబంగా తీసుకుంటారు. ఈ డబ్బంతా నేరుగా సంబంధిత రైతు ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. 

మొత్తం వ్యయంలో 100 శాతం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. వీరి ఎంపిక షరతులకు లోబడి ఉంటుంది.

సవరించిన వాతావరణ ఆధారిత  పంటల బీమా పథకం  

* దీన్ని 2016లో ప్రవేశపెట్టారు.

అర్హులు: ప్రకటించిన ప్రాంతాల్లో సంబంధిత పంటలు పండించే రైతులు, కౌలుదార్లు, విత్తసంస్థల్లో పంట రుణాలు తీసుకున్న - తీసుకోని వారు అర్హులు. 

రుణాలు తీసుకున్న, తీసుకోని వారికి, కిసాన్‌ కార్డు ద్వారా రుణాలు తీసుకున్న వారికి స్వచ్ఛందం.

పంటలు: ఆహారపంటలు, నూనెగింజలు, వార్షిక వాణిజ్య, ఉద్యానపంటలు.

నష్టభయాలు: నష్టభయకాలం నాట్లు వేసినప్పటి నుంచి కోతల వరకు ఉంటుంది. ట్రిగ్గర్‌ వాతావరణం, వాస్తవ వాతావరణం మధ్య తేడాను మాత్రమే ప్రతికూల వాతావరణం అంటారు. దీని కారణంగా నాట్లు వెయ్యలేకపోవడం, నిరోధించలేని ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రమైన చీడ - తెగుళ్లు, కొండచరియలు విరిగి పడటం, సహజమైన అగ్నిప్రమాదాలు, తుపాన్లు, వరదలు మొదలైన వాటివల్ల పంటకు కలిగే నష్టాలకు; కోతల తర్వాత పొలంలో ఉంచిన పంట గాలి  వాన-తుపాన్లకు గురవ్వడం, స్థానికంగా ఏర్పడిన ప్రకృతి విపత్తు వల్ల కలిగే నష్టాలకు బీమా మొత్తం లభిస్తుంది.్జ

ప్రీమియం: బీమా మొత్తంలో లేదా వాస్తవికరేటులో ఏది తక్కువ అయితే దాన్ని చెల్లిస్తారు. ఇది ఖరీఫ్‌ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, ఉద్యాన వాణిజ్య పంటలకు 5 శాతంగా ఉంటుంది.

దేశంలో రైతుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు

నగదు రూపంలో (in cash)

Interest Subsidy for Short Term Credit to Farmers (CREDIT)

Mission for Integrated Development of Horticulture (MIDH)

Submission on Agriculture Mechanization (M&T)

Award to the best farmer - Agricultural Technology Management Agency (ATMA)

Salary ATMA manpower - ATMA

Pradhan Mantri Krishi Sinchali Yojana (PMKSY)

Submission on Seeds and planting material

National Food Security Mission (NFSM)

Agri Clinics and Agri Business Centres Scheme ACABC - Loan Subsidy

Agri Clinics and Agri Business Centres Scheme ACABC - Incentives

వస్తు సేవల రూపంలో (in kind)

Demonstration

Exposure visit of Extension Functionaries - ATMA

 Exposure Visit of Farmers

  Training for Extension functionaries - ATMA

Agri Clinics and Agri Business Centres Scheme ACABC - Training

ఆరోగ్య సంబంధిత పథకాలు

ఆరోగ్య బీమా (Health Insurance)

2020, మార్చి 31 నాటికి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డిఎ) ఏడు ఆరోగ్య బీమా సంస్థలకు లైసెన్స్‌ మంజూరు చేసింది. వీటిని standalone ఆరోగ్య బీమా సంస్థలు అంటారు. అవి:

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

నివా బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

రిలయన్స్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌

ఈ ఏడు సంస్థలు ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రయాణ బీమా వ్యాపారాలను నిర్వహిస్తాయి. ఇవి కాకుండా ఇతర జీవితేతర బీమా సంస్థలు కూడా ఆరోగ్య/ వైద్య బీమా సేవలను అందిస్తున్నాయి.

ప్రమాద బీమా

ఇందులో ప్రమాదాల వల్ల జరిగే నష్ట భయానికి బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రయాణాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు శరీర అవయవాలు చచ్చుబడటం,  అంగవైకల్యానికి గురికావడం జరగొచ్చు. ఇలాంటివి సంభవించినప్పుడు బీమా తీసుకున్న వ్యక్తికి బీమా పథకం ద్వారా పరిహారం చెల్లిస్తారు. 

ఆమ్‌ ఆద్మీ బీమా యోజన

దీన్ని 2007, అక్టోబరు 2న ప్రారంభించారు. తక్కువ ఆదాయం కలిగిన వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 

1859 మధ్య వయసు ఉన్నవారు దీనికి అర్హులు. 

సాధారణ మరణానికి రూ.30,000; ప్రమాద మరణం లేదా శాశ్వత అంగవైకల్యానికి రూ.75,000; పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500 బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. 

వార్షిక ప్రీమియం రూ.200 ఉంటుంది. ఈ పథకంలో చేరిన సభ్యుల పిల్లలకు (ఇద్దరికి మించకుండా) ఉపకారవేతనం లభిస్తుంది. 9 నుంచి 12 తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.100 చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారు.

ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి  బీమా యోజన (పీఎంజేజేబీవై)

 ఇది జీవిత బీమా పథకం. దీన్ని 2015లో ప్రారంభించారు. 

 1850 సంవత్సరాల మధ్య వయసువారు ఈ పాలసీకి అర్హులు. ఏదైనా బ్యాంకులో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉండాలి. పాలసీదారుకు 55 ఏళ్లు వచ్చే వరకు బీమా వర్తిస్తుంది. 

 ప్రీమియం ఏడాదికి రూ.330. ఈ మొత్తాన్ని సంబంధిత బ్యాంకు ఖాతా నుంచి బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. పీఎంజేజేబీవైను ఏటా రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఏదైనా కారణంతో పాలసీదారు మరణిస్తే, బీమా మొత్తం రూ.రెండు లక్షలు చెల్లిస్తారు.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన

ఇది ప్రమాద బీమా పథకం. దీన్ని 2015లో ప్రారంభించారు.

1870 సంవత్సరాల మధ్య వయసుండి, బ్యాంకులో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. 

ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. ఏదైనా ప్రమాదం వల్ల సంబంధిత పాలసీదారు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.రెండు లక్షల బీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యానికి రూ.లక్ష అందిస్తారు.


ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)

ఇది ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో ఒక విభాగం. జాతీయ ఆరోగ్య విధానం (National Health Policy) సిఫార్సుల మేరకు దీన్ని ప్రారంభించారు. 2008లో ప్రారంభించిన ‘రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన’ పథకాన్ని పీఎంజేఏవైలో విలీనం చేశారు.

పీఎంజేఏవైను 2018, సెప్టెంబరు 23న ఝార్ఖండ్‌లోని రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

2011నాటి సాంఘిక - ఆర్థిక, కుల జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పేద కుటుంబాలన్నింటికీ దీన్ని వర్తింపజేశారు. 

దేశంలోని 10.74 కోట్ల కుటుంబాల్లోని 50 కోట్ల మందికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించడం దీని ప్రధాన ఉద్దేశం. 

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ABDM)

దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2020, ఆగస్టు 15న ప్రారంభించారు. మొదటిదశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలుపెట్టగా, 2021 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేశారు. 

దేశ ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడం, వ్యాధులను నిరోధించడం దీని లక్ష్యాలు. 

ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి ఒక డిజిటల్‌ ఆరోగ్య గుర్తింపు కార్డు అందిస్తారు. ఇది అతడు/ ఆమె ఆరోగ్య ఖాతా లాంటిది. వారి ఆరోగ్య సమాచారమంతా డిజిటల్‌ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది.

ఏబీడీఎం ద్వారా సాంకేతికతను ఉపయోగించి సామాన్య మానవుడికి ఆరోగ్య సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వ్యక్తుల కోసం అన్ని రకాల వైద్య సేవల సమాచారాన్ని, వ్యవస్థలను ప్రభుత్వం ఒకే వేదికపైకి తెచ్చింది.ఇతర బీమా కార్యక్రమాలువాహన బీమా

సాధారణంగా వాహనాలకు రెండు రకాల బీమా సౌకర్యాలు ఉంటాయి. అవి: 

1. సమగ్ర బీమా

2. Comprehensive Third Party Insurance

సమగ్ర బీమా: ఇందులో వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారికి కలిగిన నష్టంతోపాటు, వాహనానికి కూడా నష్టపరిహారం పొందొచ్చు. 

సంబంధిత పట్టాదారు వల్ల ప్రమాదం సంభవించినా లేదా మరెవరివల్ల జరిగినా బీమా వర్తిస్తుంది. 

అగ్ని ప్రమాదం, దొంగతనం వల్ల నష్టం కలిగినా బీమా మొత్తం చెల్లిస్తారు.

Comprehensive Third Party Insurance:

ఈ పాలసీ వల్ల వాహనదారుడికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు మూడో వ్యక్తికి (బీమా కంపెనీ పాలసీదారు కాకుండా) జరిగిన నష్టానికి మాత్రమే పరిహారం చెల్లిస్తారు. ప్రతి వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండాలి. 

సూక్ష్మబీమా (Microinsurance)

తక్కువ ఆదాయం పొందే ప్రజలకు బీమా సౌకర్యాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంతో ఐఆర్‌డీఏ 2005లో సూక్ష్మబీమా మార్గదర్శకాలను విడుదల చేసింది. 

వీటి ప్రకారం ప్రభుత్వేతర సంస్థలు (NGO,s), స్వయం సహాయక బృందాలు (SHG,s) సూక్ష్మబీమా సౌకర్యం అందించే బీమా సంస్థలకు ఏజెంట్లుగా పని చేస్తాయి.

జీవిత బీమా సంస్థలు, సాధారణ బీమ సంస్థలు కొన్ని రకాల సూక్ష్మ విత్త పాలసీలను విక్రయించవచ్చు. 

2020 మార్చి నాటికి 16 జీవిత బీమా సంస్థలు, 32 రకాల సూక్ష్మబీమా పాలసీలను విక్రయిస్తున్నాయి.

ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష నిధి (పీఎంఎస్‌ఎస్‌ఎన్‌)

దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు కేంద్రం స్వస్థ్య సురక్ష నిధిని ప్రవేశ పెట్టింది. 

దీని ప్రకారం 2007 ఆర్థిక చట్టం ద్వారా ఆరోగ్యం, విద్యలపై వసూలు చేసే సెస్‌ నిధులను పీఎంఎస్‌ఎస్‌ఎన్‌కు మళ్లించి, ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఆ నిధులను ఖర్చు చేస్తారు. 

పీఎంఎస్‌ఎస్‌ఎన్‌ను రిజర్వ్‌ నిధిగా పరిగణిస్తారు. దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. వివిధ ఆర్థిక సంవత్సరాల్లో ఆయుష్మాన్‌ భారత్, జాతీయ ఆరోగ్య కార్యక్రమం తదితర పథకాలకు నిధులను దీని ద్వారానే వెచ్చిస్తారు. ఆ తర్వాతే స్థూల బడ్జెటరీ మద్దతు నుంచి ఖర్చు చేస్తారు.

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (Insurance Regulatory Development Authority - IRDA)

 మనదేశంలో 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల్లో ప్రైవేటీకరణ ఒకటి.

 ఆర్థిక సంస్కరణల రెండో దశలో బీమా వ్యాపారంలోకి ప్రైవేట్, విదేశీ సంస్థలను అనుమతించాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. దీని వల్ల ఈ రంగంలో పోటీ ఏర్పడి, సామర్థ్యం పెరుగుతుందని భావించింది. 

 ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97) కాలంలో బీమారంగంలో పెట్టుబడులపై అధ్యయనం కోసం కేంద్రం 1993లో ఆర్‌.ఎన్‌.మల్హోత్రా అధ్యక్షతన ఒక బృందాన్ని నియమించింది. ఈ కమిటీ 1994లో తన నివేదికను సమర్పించింది.

​​​​​​​ బీమా రంగంలోకి భారతదేశంలోని కార్పొరేట్‌ సంస్థలను అనుమతించాలని, అవి విదేశీ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకోవచ్చని ఈ కమిటీ సిఫార్సు చేసింది. అయితే విదేశీ సంస్థల వాటాను 26 శాతానికి పరిమితం చేయాలని సూచించింది.

​​​​​​​ భారత ప్రభుత్వం తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1997-2002) సమయంలో 1999లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం 2000, ఏప్రిల్‌లో ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ - ఐఆర్‌డీఏ సంస్థను నెలకొల్పింది.

​​​​​​​ ఐఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

​​​​​​​ బీమా పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటం, దేశంలో బీమా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడం, ప్రోత్సహించడం, సక్రమమైన పద్ధతిలో వృద్ధి చెందేలా చర్యలు తీసుకోవడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.

బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

 బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) వాటాను 49% నుంచి 74 శాతానికి పెంచుతామని 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగా బీమా చట్టం-1938ని సవరించి, ఇన్సూరెన్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ 2021ను ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

 బీమా కంపెనీల్లోని బోర్డు సభ్యులు, కీలక ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉండాలని నిర్దేశించారు. 

 బీమా కంపెనీల లాభాల్లో నిర్దేశించిన శాతాన్ని జనరల్‌ రిజర్వ్‌కు మళ్లించాలని స్పష్టంచేశారు.

 మనదేశంలో బీమా విస్తృతి 3.6 శాతంగా ఉంది. ప్రపంచ సగటు 7.13 శాతం. 

 సాధారణ బీమాలో బీమా విస్తృతి ప్రపంచ సగటు 2.88 శాతం కాగా, మనదేశ జీడీపీలో 0.94 శాతంగా ఉంది.

 ప్రభుత్వ రంగంలో ఉన్న ఏకైక జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ). ఇది 2021-22లో తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వెళ్లనుంది. ఎల్‌ఐసీలో 100 శాతం వాటా కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంది. ఐపీఓ ద్వారా ప్రభుత్వం 10 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది.

భారతదేశంలో బీమా సంస్థలు

 మనదేశంలో జీవిత బీమా, సాధారణ బీమా/ జీవితేతర బీమా, పునఃబీమా, ప్రత్యేక బీమా సంస్థలు ఉన్నాయి.  

 ఐఆర్‌డీఏ నివేదిక, 2019-20 ప్రకారం భారత్‌లో 24 జీవిత బీమా సంస్థలు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వానికి చెందింది ఒకటి (ఎల్‌ఐసీ). సాధారణ బీమా సంస్థలు 25 ఉండగా, వాటిలో ప్రభుత్వానికి చెందినవి నాలుగు. 

 దేశంలో జీవితేతర (సాధారణ, ఆరోగ్య) బీమా సంస్థలు 34 ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ రంగంలో 6, ప్రైవేట్‌ రంగంలో 28 ఉన్నాయి. పునఃబీమా  (Reinsurance) సంస్థలు 11 ఉండగా, ప్రభుత్వ రంగంలో ఒకటి, ప్రైవేట్‌ రంగంలో 10 ఉన్నాయి.

అభివృద్ధి- ప్రమాణాలు

 ప్రపంచంలోని అతిపెద్ద పునఃబీమా సంస్థ అయిన స్విస్‌ రి (Swiss Re) 2019లో బీమా రంగంపై ఒక నివేదికను ప్రచురించింది. దీని ప్రకారం ప్రపంచ బీమా వ్యాపార విపణిలో భారతదేశం వాటా 1.69 శాతంగా ఉంది. 

 జీవిత బీమా వ్యాపారం గణాంక వివరాలు ఉన్న 88 దేశాల్లో భారత్‌ పదో స్థానంలో ఉంది. 

 ప్రపంచ జీవిత బీమా విపణిలో భారతదేశం వాటా 2.73%. 

 ప్రపంచవ్యాప్తంగా మొత్తం బీమా ప్రీమియం పరిమాణంలో జీవిత బీమా వాటా 46.34% ఉండగా, జీవితేతర బీమా వాటా 53.66 శాతంగా ఉంది.

 భారతదేశంలో మొత్తం బీమా ప్రీమియం పరిమాణంలో జీవిత బీమా వాటా 35% కాగా, జీవితేతర బీమా వాటా 25 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దానితో పోలిస్తే, మనదేశంలో బీమా వ్యాపారంలో జీవితేతర బీమా కంటే జీవిత బీమా వాటా అధికంగా ఉంది.

 జీవిత బీమా వ్యాపార వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా 1.18% ఉంటే, భారతదేశంలో 9.63 శాతంగా ఉంది. జీవితేతర బీమా వ్యాపారం వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా 3.35% ఉంటే, మనదేశంలో 7.98 శాతంగా ఉంది. దీనిబట్టి బీమా వ్యాపారం వృద్ధిరేటు ప్రపంచం కంటే భారతదేశంలోనే అధికం అని తెలుస్తోంది. 

 బీమా రంగం సంభావ్యతను, పనితీరును మదింపు చేయటానికి ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రమాణాలను ఉపయోగిస్తారు. అవి: 1) బీమా చొరబాటు     2) బీమా సాంద్రత

 ఈ రెండూ ఒక దేశంలో బీమా రంగ అభివృద్ధి స్థాయిని తెలుపుతాయి.

బీమా చొరబాటు (Insurance penetration): ఒక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తికి, పూచీకత్తు ఇచ్చిన ప్రీమియం నిష్పత్తిని బీమా చొరబాటు అంటారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో బీమా చొరబాటు స్థాయి తక్కువ

​​​​

 ఐఆర్‌డీఏ వార్షిక నివేదిక 2019-20 ప్రకారం 2001లో జీవిత బీమా చొరబాటు 2.15% ఉండగా 2009 నాటికి 4.6 శాతానికి పెరిగింది. 2019లో ఈ విలువ 2.82 శాతానికి తగ్గింది. జీవితేతర బీమా చొరబాటు 2001లో 0.56% ఉండగా, 2019 నాటికి 0.94 శాతానికి పెరిగింది. 

 మొత్తం బీమా చొరబాటు 2001లో 2.71% ఉండగా, 2019 నాటికి 3.76 శాతానికి పెరిగింది.

బీమా సాంద్రత (Insurance Density): దేశ జనాభాను మొత్తం ప్రీమియంతో విభజిస్తే వచ్చే విలువను (తలసరి ప్రీమియం విలువ) బీమా సాంద్రత అంటారు. ఒక సంవత్సరంలోని మొత్తం ప్రీమియం, దేశ జనాభా మధ్య ఉన్న నిష్పత్తే తలసరి ప్రీమియం. దీన్ని అమెరికన్‌ డాలర్లలో సూచిస్తారు.

 ఐఆర్‌డీఏ వార్షిక నివేదిక 2019-20 ప్రకారం, జీవిత బీమా సాంద్రత 2001లో 9.10 డాలర్లు ఉండగా, 2019 నాటికి 58 డాలర్లకు చేరింది. జీవితేతర బీమా సాంద్రత 2.40 డాలర్ల నుంచి 19 డాలర్లకు పెరిగింది. 

 మొత్తం బీమా సాంద్రత 2001లో 11.50 డాలర్లు ఉండగా, 2019 నాటికి 78 డాలర్లకు చేరింది.

బీమా పెట్టుడులు

 బీమా సంస్థలు తమ నిధులను గృహ నిర్మాణం, అవస్థాపన రంగాల్లో పెట్టుబడుల కోసం ఉపయోగిస్తాయి. 

 2020 మార్చి నాటికి భారతదేశంలోని బీమా పరిశ్రమ పెట్టుబడుల మొత్తం రూ.4,253 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల వాటా 40 శాతం. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సెక్యూరిటీల వాటా 27 శాతం. గృహ నిర్మాణాల అవస్థాపన ప్రాజెక్టుల వాటా 8 శాతం.

భారతదేశంలో ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న బీమా సంస్థలు

జీవిత బీమా సంస్థలు (Life Insurance): 

 లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 

సాధారణ బీమా సంస్థలు (General Insurance)

 నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

 ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

 ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

 యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

ప్రత్యేక బీమా సంస్థలు:

 అగ్రికల్చరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌

 ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ 

పునఃబీమా సంస్థలు:

 జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా

ఉద్యోగిత

 ​​​బీమా రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగం విస్తరించే కొద్దీ ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి. 

 2019-20లో దేశంలోని అన్ని జీవిత బీమా సంస్థల్లో 22,78,465 మంది వ్యక్తిగత ఏజెంట్లు పని చేస్తున్నారు. సాధారణ బీమా సంస్థల ద్వారా 5,15,497 మంది, స్టాండ్‌ అలోన్‌ ఆరోగ్య బీమా సంస్థల ద్వారా 6,81,145 మంది ఉపాధి పొందుతున్నారు. వీరుకాక మరో 658 మంది కార్పొరేట్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరిలో 265 మంది బ్యాంకుల్లో, 393 మంది బ్యాంకేతర విత్త సంస్థ/ సహకార సంఘాలు/ ఇతర సంస్థల్లో పని చేస్తున్నారు.

జీవిత బీమా పాలసీలు- రకాలు

 జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, తన మీద ఆధారపడిన వారికి ఈ పాలసీ ఆర్థిక భద్రత కల్పిస్తుంది. జీవిత బీమా పాలసీలు ఆరు రకాలు. అవి:

మనీ బ్యాక్‌ పాలసీ (Money Back Policy): జీవిత బీమా చేయించుకున్న వ్యక్తికి తన పాలసీ పరిపక్వత చెందే సమయానికి ప్రత్యేకంగా వివిధ దశల్లో కొంత మొత్తం చొప్పున బీమా సంస్థ చెల్లిస్తుంది. పాలసీ కాలం పూర్తయ్యేలోపు మరణిస్తే, బీమా మొత్తాన్ని (Assured Sum) పాలసీదారుడి నామినీకి ఇస్తుంది.

​​​​​​​

టర్మ్‌ పాలసీ (Term Policy) ఇందులో ఒక నిర్ణీత సమయానికి మాత్రమే బీమా వర్తిస్తుంది. దాన్నే టర్మ్‌ అంటారు. ఇది 5, 10, 15, 20, 30 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ కాల వ్యవధి తర్వాత పాలసీ గడువు ముగుస్తుంది. ఆలోపు పాలసీదారుడు మరణిస్తే, సంస్థ వారి కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తుంది. బతికి ఉంటే ఏమీ చెల్లించదు. ఈ పాలసీలో ప్రీమియం చాలా తక్కువ. బీమా మొత్తం చాలా ఎక్కువ. 

పూర్తి జీవితకాల పాలసీ (Whole life Policy) : ఇందులో పట్టాదారుకు పూర్తి జీవిత కాలానికి బీమా వర్తిస్తుంది. మరణించాక పాలసీదారుడి నామినీకి బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రీమియంను విడతలవారీగా లేదా ఏడాదికి ఒకేసారి చెల్లించొచ్చు.

ఎండోమెంట్‌ పాలసీ (Endowment Policy): ఇందులో బీమా మొత్తంతో పాటు పొదుపు ప్రయోజనాన్ని పొందొచ్చు. దీనికి కాల పరిమితి ఉంటుంది. 

 పాలసీ పూర్తయ్యే సమయానికి పట్టాదారు జీవించి ఉంటే, సంబంధిత బీమా సంస్థ వారికి బీమా మొత్తాన్ని, బోనస్‌ను చెల్లిస్తుంది. మధ్యలో మరణిస్తే బీమా సొమ్మును నామినీకి చెల్లిస్తుంది.

యూనిట్‌ అనుసంధానం చేసిన పాలసీ (Unit linked Policy): ఈ పాలసీలో పెట్టుబడి, జీవిత బీమా రెండూ అనుసంధానమై ఉంటాయి. ప్రీమియం మొత్తంలో కొంత భాగం పెట్టుబడిలా పెట్టి ప్రయోజనాలు పొందొచ్చు.

బృంద బీమా (Group Insurance): సాధారణ బీమా వ్యక్తిగతమైంది. ఇది ఒక పట్టాదారుకే పరిమితం. కొంత మంది వ్యక్తులు ఒక సమూహంగా బీమా పొందొచ్చు. దీన్నే బృంద బీమా అంటారు. 

 విద్యార్థులు, ఉద్యోగులు, ఒక సంఘం ఇలా ఎవరైనా ఈ విధమైన బీమా పొందొచ్చు. 

 జీవిత బీమా, ఆరోగ్య బీమా, కొన్ని ఇతర రకాల బీమా పాలసీలను ఈ పద్ధతిలో తీసుకోవచ్చు.

 

Posted Date : 18-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌