• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ - రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

 బ్యాంకింగ్‌ నిర్వచనం

భారత బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం - 1949లోని సెక్షన్‌ 5 బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని నిర్వచిస్తుంది. దీని ప్రకారం, బ్యాంకులు డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి సొమ్మును సేకరిస్తాయి. వాటిని సంబంధిత వ్యక్తులు కోరిన వెంనే లేదా మరొక సమయంలో చెక్కు, డ్రాఫ్ట్, ఆర్డర్‌ ద్వారా తిరిగి చెల్లించాలి. తీసుకున్న డబ్బును బ్యాంకులు రుణాలు లేదా పెట్టుబడి కోసం వినియోగించాలి.

బ్యాంకులు - రకాలు

విధులను ఆధారంగా చేసుకుని బ్యాంకులను కింది రకాలుగా వర్గీకరించారు. అవి:

1. కేంద్ర బ్యాంకు/ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

2. వాణిజ్య బ్యాంకులు (Commercial Banks)

3. సహకార బ్యాంకులు  (Co-Operative Banks)

4. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (Regional Rural Banks - RRB’s)

5. ప్రత్యేక బ్యాంకులు (Specialized Banks)

6. షెడ్యూల్డ్‌ చిన్న విత్త బ్యాంకులు

7. షెడ్యూల్డ్‌ పేమెంట్స్‌ బ్యాంకులు

8. షెడ్యూల్డ్‌ ప్రైవేట్‌ రంగ బ్యాంకులు

9. షెడ్యూల్డ్‌ విదేశీ బ్యాంకులు (భారత్‌లోనివి)

10. డిజిటల్‌ బ్యాంకులు (ఇ-బ్యాంక్స్‌) 

కేంద్ర బ్యాంకు

* ఏ దేశంలోనైనా కేంద్ర బ్యాంక్‌ ఒక అత్యున్నత ఆర్థిక సంస్థగా పనిచేస్తుంది. ఇది దేశంలోని బ్యాంకింగ్, విత్తవ్యవస్థలను నియంత్రించేదిగా ఉంటుంది.

*  ఇది పరపతి నియంత్రణ సంస్థగా, బ్యాంకులకు బ్యాంకుగా, ప్రభుత్వం తరఫున కరెన్సీని జారీ చేసేదిగా తన విధులను నిర్వహిస్తుంది. 

*  కేంద్ర బ్యాంకులు సాధారణంగా స్వతంత్రంగా వ్యవహరిస్తూనే ఆయా దేశ ప్రభుత్వ నియంత్రణ కింద పనిచేస్తూ ఉంటాయి.

 ఆర్థికవేత్తల నిర్వచనాలు

‘‘కేంద్ర బ్యాంక్‌ ద్రవ్య, బ్యాంకింగ్‌ నిర్మాణానికి శిఖరాగ్రంగా ఉండే బ్యాంకు. ఇది చిట్టచివరి రుణదాతగా, కరెన్సీ నోట్లను జారీ చేసే గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది.’’ 

    - గెర్హర్డస్‌ పెట్రస్‌ క్రిస్టియన్‌ డి కాక్‌

*   ‘‘సాధారణ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యపరిమాణం, విస్తరణ, కుదింపును నిర్వహించే బాధ్యతను కలిగిన సంస్థ కేంద్ర బ్యాంక్‌’’     - ఆర్‌.పి.కెంట్‌ 

* ‘‘ఏ బ్యాంకింగ్‌ వ్యవస్థలో అయితే కరెన్సీ నోట్లను జారీ చేసే పూర్తి నియంత్రణ లేదా గుత్తాధిపత్యం ఒక బ్యాంకుకు మాత్రమే ఉంటుందో అదే కేంద్ర బ్యాంకు’’   - వెరా స్మిత్‌

* ‘‘కేంద్ర బ్యాంకు బ్యాంకులకు బ్యాంక్‌. దీని విధి ద్రవ్య మూలాన్ని నియంత్రించి, సమాజంలో ద్రవ్య సరఫరాను నియంత్రించడం.’’   - శామ్యూల్సన్‌

కేంద్ర బ్యాంకు పరిణామక్రమం

ప్రపంచంలో తొలిసారిగా కేంద్ర బ్యాంకును 1656లో స్వీడన్‌లో ఏర్పాటు చేశారు. దీని పేరు ‘రిక్స్‌ బ్యాంక్‌’. ఇది 1668 నుంచి విధులు నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్‌ 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందిస్తోంది. అర్థశాస్త్రంలో నోబెల్‌ పొందిన మొదటి వ్యక్తి రాగ్నర్‌ ఫ్రిష్‌.

* బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను 1694లో నెలకొల్పారు. ఇది 1844 నుంచి కేంద్ర బ్యాంకు విధులను నిర్వర్తిస్తోంది. ఈ బ్యాంకు కరెన్సీ నోట్లను జారీచేసే ఏకస్వామ్యాధికారాన్ని కలిగి, ప్రభుత్వ బ్యాంకుగా పనిచేస్తోంది.

1814లో బ్యాంక్‌ ఆఫ్‌ నెదర్లాండ్స్‌ను స్థాపించారు. 1856లో బ్యాంక్‌ ఆఫ్‌ స్పెయిన్‌ను ఏర్పాటు చేశారు. 1913లో అమెరికాలో ఫెడరల్‌ బ్యాంకు ఏర్పడింది.

* 1920లో బ్రస్సెల్స్‌ (బెల్జియం)లో జరిగిన అంతర్జాతీయ విత్త సమావేశంలో కేంద్ర బ్యాంకు అనే భావనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అప్పటినుంచి వివిధ దేశాల్లో కేంద్ర బ్యాంకులను ఏర్పాటు చేశారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చరిత్ర                                                              

1770లో అలెగ్జాండర్‌ అండ్‌ కో ఆంగ్ల ఏజెన్సీ బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ను స్థాపించింది. ఇది 1832 వరకు పనిచేసింది. దీని ప్రధాన కార్యాలయం  కలకత్తాలో ఉంది. ఇది భారతదేశంలో నెలకొల్పిన మొదటి బ్యాంకు.

* 1786లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ జనరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేసింది. ఇది 1791, మార్చి 31 వరకు పని చేసింది. దీని ప్రధాన కార్యాలయం కలకత్తా.

* తర్వాత ఏజెన్సీలతో సంబంధం లేకుండా మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను నెలకొల్పారు. అవి:

1. బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా (1806, జూన్‌ 2 - 1921, జనవరి 27)

2. బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే (1840, ఏప్రిల్‌ 15 - 1921, జనవరి 27)

3. బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1843, జులై 1 - 1921, జనవరి 27)

* 1921, జనవరి 27న బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా, బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే, బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌లను కలిపి ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇది మనదేశ కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. దీని స్థాపకుడు జేఎం.కీన్స్‌. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉండేది. దీని ప్రధాన ఉద్దేశం ‘బ్యాంకింగ్, విత్త సేవలు అందించడం’.

ఆర్‌బీఐ ఏర్పాటు

*  ఆర్‌బీఐ చట్టం 1934లోని వివిధ అంశాలను అనుసరించి, రూ.5 కోట్ల మూలధనంతో 1935, ఏప్రిల్‌ 1న ఆర్‌బీఐని నెలకొల్పారు. దీన్ని 1949, జనవరి 1న జాతీయం చేశారు.

*  ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయాన్ని కలకత్తా కేంద్రంగా స్థాపించినప్పటికీ, 1937లో దాని కేంద్ర కార్యాలయాన్ని శాశ్వతంగా ముంబయికి మార్చారు.

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 ప్రదేశాల్లో ఆర్‌బీఐకి కార్యాలయాలు ఉన్నాయి. ముంబయి, కలకత్తా, చెనై, దిల్లీల్లో ఆర్‌బీఐ ప్రాంతీయ బోర్డు కార్యాలయాలు ఉన్నాయి.

ఆర్‌బీఐ వ్యవస్థ స్వరూపం 

ఆర్‌బీఐ వ్యవహారాలను సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్వహిస్తుంది. ఆర్‌బీఐ చట్టం - 1934 ప్రకారం, భారత ప్రభుత్వం ఈ బోర్డును నియమిస్తుంది. 

* ఆర్‌బీఐలో మొత్తం 21 సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఉంటారు. వారు: గవర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లు, ఇద్దరు ఆర్థికశాఖ ప్రతినిధులు (ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ, విత్తసేవల సెక్రటరీ), 10 మంది ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు, ప్రాంతీయ బోర్డులకు ప్రాతినిధ్యంవహించే నలుగురు డైరెక్టర్లు ఉంటారు.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన అధికారి - గవర్నర్‌.

* ఆర్‌బీఐ మొదటి గవర్నర్‌ - సర్‌ ఆస్‌బోర్న్‌ స్మిత్‌ (1935 - 37).

* ఆర్‌బీఐకి గవర్నర్‌గా పనిచేసిన మొదటి భారతీయుడు - సర్‌ చింతామన్‌ ద్వారకానాథ్‌ దేశ్‌ముఖ్‌ (1943 - 49)

* ఆర్‌బీఐకి గరవ్నర్‌గా పనిచేసిన తెలుగువారు:

1. వై.వి.రెడ్డి (2003 - 08)

2. దువ్వూరి సుబ్బారావు (2008 - 13)

* ప్రస్తుత (25వ) ఆర్‌బీఐ గవర్నర్‌ - శక్తికాంత దాస్‌ (2018 డిసెంబరు నుంచి కొనసాగుతున్నారు).

అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన కమిటీ (1951-54)

గ్రామీణ ప్రాంతాల్లో పరపతి అవసరాలు అంచనావేసి, పరపతి సదుపాయం కల్పించే మార్గాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం 1951లో ఎ.డి.గోర్వాలా అధ్యక్షతన అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన కమిటీని ఏర్పాటు చేసింది. 

* ఈ కమిటీ దేశంలోని 75 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 8 గ్రామాల చొప్పున సుమారు 600 గ్రామాల్లో సర్వే నిర్వహించింది. 

* ఈ కమిటీ 1954లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీని సిఫార్సు మేరకు ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరును 1955, జులై 1న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు.

 హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌

1926లో హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌ (రాయల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కరెన్సీ అండ్‌ ఫైనాన్స్‌) ఆర్‌బీఐను మనదేశ కేంద్ర బ్యాంకుగా నెలకొల్పాలని సిఫార్సు చేసింది. దీన్ని ఆమోదిస్తూ భారత ప్రభుత్వం 1927లో ఒక బిల్లును కేంద్ర లెజిస్లేచర్‌లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందలేదు. 

1931లో భారత కేంద్రబ్యాంకింగ్‌ విచారణ కమిటీ ఈ బిల్లుకు సంబంధించిన విషయాన్ని మళ్లీ చర్చించి, దీన్ని తప్పకుండా అమలు చేయాలని సూచించింది. ఫలితంగా 1934, మార్చి 5న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చట్టాన్ని అమలు చేశారు.


ప్రముఖుల అభిప్రాయాలు

ఆధునిక బ్యాంకింగ్‌ వ్యవస్థ, దాని ఏర్పాటు గురించి ప్రముఖ ఆర్థికవేత్తలు వారి అభిప్రాయాలను కింది విధంగా విశ్లేషించారు.

ఆచార్య క్రౌథర్‌: ఆచార్య క్రౌథర్‌ అభిప్రాయం ప్రకారం, బ్యాంక్‌ ద్రవ్యం, పరపతితో వ్యవహరించే సంస్థ. ఇది డిపాజిట్లను అంగీకరిస్తుంది, అవసరమైన వారికి నిధులను అందుబాటులో ఉంచుతుంది. ద్రవ్యాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేర్చడంలో సహాయపడుతుంది. బ్యాంకింగ్‌ వ్యవస్థ ఆర్థిక రంగానికి ప్రధానమైంది. ఇది దేశ ఆర్థికాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆధునిక బ్యాంకింగ్‌ వ్యవస్థను స్థాపించడానికి కిందివారు మూలమని  క్రౌథర్‌ పేర్కొన్నారు.

వర్తక వ్యాపారి: ప్రజల వద్ద నుంచి స్వీకరించిన డిపాజిట్లతో వస్తు, సేవల వ్యాపారం చేస్తాడు.

వడ్డీ వ్యాపారి: ప్రజల వద్ద నుంచి తీసుకున్న డిపాజిట్లకు తక్కువ వడ్డీ చెల్లిస్తూ, అవసరమైన వారికి అధిక వడ్డీకి రుణాలను ఇస్తాడు.

స్వర్ణకారుడు: వెండి, బంగారం లాంటి విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తూ, తగిన ఛార్జీలు వసూలు చేస్తాడు.

డేవిడ్‌ కిన్లే: ప్రజలు తమ వద్ద ఉన్న ధనాన్ని డిపాజిట్ల రూపంలో దాచుకునేందుకు వీలు కల్పిస్తూ, ఆ సేకరించిన మొత్తాన్ని అవసరమైనవారికి సురక్షితంగా అందించడానికి ఏర్పాటు చేసిన సంస్థే బ్యాంక్‌.

జీన్‌ పిగెట్‌( jean piaget) : ‘‘నగదు డిపాజిట్‌ చేసేవారికి బ్యాంక్‌ అకౌంట్, చెక్కులను జారీచేయటం, వినియోగదారుల నుంచి క్రాస్‌ చేసిన లేదా చేయని చెక్కులను స్వీకరించడం లాంటి వ్యవహారాలను బ్యాంకులు నిర్వహిస్తాయి. అలా చేయని వాటిని బ్యాంక్‌ అనరు.’’

రిచర్డ్‌ సిడ్నీ సేయర్స్‌: ‘‘బ్యాంకు అనేది ఒకరి అప్పులను, మరొకరి అప్పులతో పరిష్కరించుకోవడంలో, పరస్పరం అప్పులను విస్తృతంగా అంగీకరించడానికి ఏర్పడిన సంస్థ’’.

Posted Date : 19-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌