• facebook
  • whatsapp
  • telegram

ద్ర‌వ్యోల్బ‌ణం ర‌కాలు-కార‌ణాలు-ప్ర‌భావాలు

వస్తు, సేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్య నిల్వ తగ్గి, ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ప్రాచీనకాలం నుంచే అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం ఉన్నట్టు ఆధారాలున్నాయి. ఇది వివిధ కాలాల్లో, విభిన్న స్థాయుల్లో, అనేక రంగాలు, ప్రజలపై ప్రభావం చూపింది. ప్రపంచ దేశాలన్నింటికీ తీవ్రమైన సమస్యగా మారింది. ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది ఆర్థిక వ్యవస్థ దశ, స్థాయులను ప్రభావితం చేస్తుంది.

* ప్రపంచంలో మొదటిసారి 16వ శతాబ్దంలో సంభవించిన ధరల తిరుగుబాటును ద్రవ్యోల్బణ పరిస్థితిగా ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.


రకాలు 

పాకుతున్న ద్రవ్యోల్బణం (Creeping Inflation): సంవత్సరంలో ధరల పెరుగుదల 3 శాతానికి మించకుండా ఉంటే దాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. దీన్ని అర్థశాస్త్ర నిపుణుడు ఆర్‌పీ కెంట్‌ పేర్కొన్నారు.

నడుస్తున్న ద్రవ్యోల్బణం (Walking Inflation): సంవత్సరంలో ధరల పెరుగుదల 3 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు.

పరిగెత్తే ద్రవ్యోల్బణం (Running Inflation): సంవత్సరంలో ధరల పెరుగుదల 10 శాతం కంటే ఎక్కువ ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణంగా పేర్కొంటారు.

దూకుతున్న ద్రవ్యోల్బణం (Galloping Inflation): ధరల పెరుగుదల చాలా ఎక్కువస్థాయిలో ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ఈ స్థితిలో పెరుగుదల స్థాయి 100 శాతం కూడా ఉండొచ్చు. దీన్ని అతి తీవ్రమైన ద్రవ్యోల్బణం (Hyper Inflation) అంటారు. 

రాబర్ట్‌.జె.గార్డన్‌ ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా వివరించారు. దీన్ని ‘త్రికోణ నమూనా’ (Triangle Model) అంటారు. అవి.

డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం (Demand pull Inflation): ఇది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఖర్చు; సమష్టి డిమాండ్‌లో కలిగే పెరుగుదల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. అధిక డిమాండ్‌తో మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. దీంతో పెట్టుబడులు పెరిగి ఆర్థిక వృద్ధికి సహాయపడతాయి. అయితే ద్రవ్యవిలువ తగ్గి పొదుపు కంటే ఖర్చుకి ప్రాధాన్యం ఏర్పడి పెట్టుబడులను క్షీణింపజేస్తాయి.

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం (Cost push Inflation): ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల సమష్టి సప్లయ్‌ తగ్గి Supply shock Inflation ఏర్పడుతుంది. దీంతో ఉత్పత్తికారకాల ధరలు పెరిగి, ఉత్పత్తి ఖర్చు అధికమౌతుంది. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుంది.

అంతర్లీన ద్రవ్యోల్బణం (Built in inflation): వేతనాలు పెరగాలనే కార్మికులు, ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్బణానికి ప్రేరణ కల్పిస్తాయి. దీన్ని ‘ధర/ వేతన విస్ఫోటనం’ అంటారు. ఈవిధమైన ధర/ వేతన పెరుగుదల ఖర్చు వినియోగదారుడిపై పడుతుంది. దీన్నే Hangover Inflation అంటారు.


 

కారణాలు

* పెట్టుబడిదారీ వ్యవస్థలు, భారతదేశం లాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థల్లో మార్కెట్‌ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ధరల విధానం ద్వారా లావాదేవీలు జరగడాన్ని మార్కెట్‌ వ్యవస్థ అంటారు. డిమాండ్, సప్లయ్‌ శక్తులను మార్కెట్‌ శక్తులు అంటారు. వస్తు/ సేవలకు సరైన ధర నిర్ణయించాలంటే వీటిమధ్య సమతౌల్యం ఉండాలి.

* ద్రవ్యోల్బణానికి డిమాండ్‌ ప్రేరిత, వ్యయ ప్రేరిత అంశాలను ప్రధాన కారణాలుగా పేర్కొంటారు.

* అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల మాదిరే భారత్‌లోనూ డిమాండ్‌ ప్రేరిత సిద్ధాంతం ప్రకారం ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


డిమాండ్‌ ప్రేరిత అంశాలు: 

* జనాభా పెరుగుదల వల్ల వస్తు, సేవల డిమాండ్‌ పెరుగుతుంది. 

* దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడంవల్ల ప్రజల ఆదాయాలు పెరిగి వస్తు, సేవల డిమాండ్‌ పెరుగుతుంది.

* సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన పథకాలపై బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువచేసి ఉపాధి కల్పించటంవల్ల వస్తు, సేవల డిమాండ్‌ పెరుగుతుంది.

* ఉత్పాదక ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడి రేటు తక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువై డిమాండ్‌ పెరుగుతుంది.

* ద్రవ్య సప్లయ్‌ పెరిగి ద్రవ్య చలామణి ఎక్కువై వస్తు, సేవలకు డిమాండ్‌ ఏర్పడుతుంది.

* ఏకస్వామ్య అక్రమ వ్యాపార నియంత్రణ చట్టాన్ని Monopolies Restrictive Trade Practices-MRTP Act, 1969) పాటించకపోతే వస్తు, సేవలకు కృత్రిమ కొరత ఏర్పడి డిమాండ్‌ పెరుగుతుంది.

* ప్రభుత్వ రుణ సేకరణ పెరిగి అనుత్పాదక అంశాలపై ఖర్చు చేయడంవల్ల దేశంలో కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్‌ ఎక్కువౌతుంది.

* బడ్జెట్‌లో కోశలోటును నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైతే వస్తు, సేవలకు డిమాండ్‌ అధికమౌతుంది.

* ప్రభుత్వ ఖర్చుకి, రాబడికి మధ్య అంతరం పెరుగుతూ లోటు బడ్జెట్‌ ప్రభావంవల్ల వస్తు, సేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.

* విచక్షణా రహిత, హేతుబద్ధం కాని సబ్సిడీలవల్ల కూడా వస్తు, సేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.


వ్యయ ప్రేరిత అంశాలు: 

* ఉత్పత్తి కారకాల (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం) ఖర్చు పెరుగుతుంది.

* శ్రామికుల వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చు ఎక్కువవుతుంది.

* పాతవైన పెద్ద పరిశ్రమల్లో ఆధునికీకరణరేటు తక్కువగా ఉండి ఖర్చు పెరుగుతుంది.

* పరిశ్రమల ఆధునికీకరణకు అవసరమైన యంత్ర భాగాలు దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడింది. కాబట్టి ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది.


ద్రవ్యసంబంధ అంశాలు:

* ద్రవ్యసప్లయ్‌ పెరుగుదల లేదా ద్రవ్య మిగులుకు (Balance of Money) ఉన్న డిమాండ్‌ తగ్గుదలను ద్రవ్యోల్బణ పరిస్థితిగా పేర్కొంటారు. దీన్ని సప్లయ్‌వైపు ఆర్థిక అంశాలు  (Supply side Economics) వివరిస్తాయి. 

* అదనపు ఆదాయం కలిగిఉన్న వారి కొనుగోలుశక్తి పెరుగుతుంది. దీంతో వారి కొనుగోలు అలవాట్లు మారి, వస్తు, సేవల డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

* విధాన నిర్ణాయక అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.


ఇతర కారణాలు: 

    భారతదేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ కింది అంశాలు కారణమని చెప్పొచ్చు.

* మూలధన సమస్య

* వ్యవస్థాపక నైపుణ్యం లేకపోవడం

* శ్రామిక నైపుణ్య సమస్య

* శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన లభ్యత లేకపోవడం

* అవస్థాపన సౌకర్యాల సమస్య (ఉదా: రవాణా)

* విదేశీ మారకద్రవ్య కొరత

* ఆహారభద్రతలేమి

* ప్రభుత్వ యంత్రాంగానికి, పాలకులకు ఆర్థికాభివృద్ధి సాధించాలనే చిత్తశుద్ధి లేకపోవడం

ఆర్థిక వ్యవస్థపై ప్రభావాలు

వివిధ వర్గాల ప్రజలు: దేశంలోని వివిధ వర్గాల ప్రజలపై ధరల పెరుగుదల వల్ల అనేక రకాల ప్రభావాలుంటాయి. అవి:

* గతంలో రుణాలు స్వీకరించిన వారు (రుణగ్రహీతలు) ద్రవ్యోల్బణకాలంలో అప్పులు తీర్చడం వల్ల కొంత ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే వారు అప్పు తీసుకున్నప్పుడు దాని ద్రవ్య విలువ ఎక్కువ, తీర్చేటప్పడు దాని ద్రవ్య విలువ తక్కువ.

* రుణదాతలు నష్టపోతారు. ఎందుకంటే వారు అప్పు ఇచ్చే సమయంలో ఉన్న ద్రవ్య విలువ  కంటే వసూలయ్యేటప్పుడు తక్కువ ఉంటుంది.

* స్థిరమైన ఆదాయవర్గాల ప్రజలు నష్టపోతారు. వారి ఆదాయం స్థిరంగా ఉండి వస్తు, సేవల ధరలు పెరిగితే గతంలోలాగా అదే పరిమాణంలో వస్తు, సేవలను కొని వినియోగించలేరు. దీంతో జీవన ప్రమాణస్థాయి తగ్గుతుంది.

* వేతన కార్మికులు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోతారు. కానీ ధరల పెరుగుదల రేటుకు సమానంగా వేతనాల పెరుగుదలను వేగంగా సాధించే శ్రామిక సంఘాలపై ఈ ప్రభావం ఉండదు.

* నిర్ణీత వడ్డీరేటు ఉన్న డిబెంచర్లను కలిగి ఉన్నవారు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు.

* వ్యవసాయరంగంలో భూములను నిర్ణీత మొత్తానికి కౌలుకిచ్చిన వారు నష్టపోతారు. ఉత్పత్తి ఖర్చు పెరగకుండా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే కౌలుదారులు లాభపడతారు.

* వ్యవసాయ కార్మికులు నష్టపోతారు.

ఉత్పత్తి ప్రక్రియ:

* పెరుగుతున్న ధరలు మార్కెట్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి; డిమాండ్, సరఫరాల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

* ఉత్పత్తి క్షీణిస్తుంది.

* పొదుపురేటు తగ్గుతుంది

* మూలధన సమస్య, పెట్టుబడిలోటు ఏర్పడి ఉత్పత్తి తగ్గుతుంది.

* ధరల పెరుగుదల వల్ల ‘అంచనా వ్యాపారం’ వృద్ధి చెంది వాస్తవిక ఉత్పత్తి క్షీణిస్తుంది.

* వస్తువులను నిల్వచేసి, కృత్రిమ కొరత సృష్టించడం వల్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరుగుతుంది.


పంపిణీ ప్రక్రియ:

* ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తిదారుల లాభాలు, ఆదాయాలు పెరుగుతాయి.

* ఉత్పత్తి కారకాలైన భూమికి బాటకం, శ్రామికులకు వేతనాలు పెరగకుండా ధరలు పెరిగితే సాపేక్షంగా వారి ఆదాయాలు తగ్గిపోయి డిమాండ్‌ పడిపోతుంది.

* ఆదాయ అసమానతలు పెరుగుతాయి.


ప్రభుత్వ కార్యక్రమాలు:

* ధరలు పెరిగితే ఉత్పాదక ప్రాజెక్టులపై ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు పెరుగుతుంది.

* పరిపాలనా ఖర్చు పెరుగుతుంది.

* ప్రభుత్వం చేసిన రుణ వనరుల వాస్తవిక ఉత్పాదకత క్షీణించి, రుణ వినియోగం ఉండదు.

* ధరల పెరుగుదల వల్ల ద్రవ్య విలువ తగ్గి, ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ వాస్తవిక విలువ క్షీణించి, ప్రయోజనం చేకూరుతుంది.


విదేశీ చెల్లింపుల శేషం:

* దేశీయంగా వస్తువుల ధరలు పెరిగితే, అంతర్జాతీయ మార్కెట్‌లో మనదేశ ఉత్పాదకాలు ఇతర దేశాల వాటితో పోటీపడలేవు. దీంతో మన ఎగుమతులు తగ్గుతాయి.

* విదేశీ వస్తువులు తక్కువ ధరకు లభించి, దిగుమతులు పెరుగుతాయి.

* కరెంట్‌ ఖాతాలో లోటు ఏర్పడుతుంది.

* విదేశీ మారక చెల్లింపుల శేషం లోటుగా ఉంటే మన దేశ అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతిని అనేక సమస్యలకు దారి తీస్తుంది.


ప్రముఖుల వ్యాఖ్యలు

* ‘‘శ్రామిక శక్తిలో కొలిచిన ఉత్పత్తి ఖర్చే వాస్తవిక ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణం’’ - కార్ల్‌మార్క్స్‌

* ‘‘ఆర్థిక వ్యవస్థలోని వాస్తవిక అంశాలను ద్రవ్యం పారదర్శకత తెలుపుతుంది. ధరల పెరుగుదల రూపంలో ఆర్థికవ్యవస్థలోని ఒత్తిడి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.’’ - జేఎం కీన్స్‌

రచయిత: బండారి ధనుంజయ

Posted Date : 15-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌