• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం - నియంత్రణ

దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న నగదుకు సమానంగా కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా విదేశీ సెక్యూరిటీలు ఉండాలి. ముందుగా కేంద్రం సెక్యూరిటీలను (బాండ్ల రూపంలో) బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తుంది. వీటిని వాణిజ్య బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఇతర ఆర్థిక సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఆర్‌బీఐ వాటి నుంచి బాండ్లను అధిక వడ్డీ రేటుకు కొని, సెక్యూరిటీల విలువకు సమానంగా కరెన్సీని ముద్రిస్తుంది.

* సాధారణ ధరల స్థాయిలో నిరంతర వస్తు సేవల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. వస్తు సేవల ధరలు తగ్గడం ప్రతిద్రవ్యోల్బణం.

ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కానీ కేంద్రబ్యాంక్‌లు మాత్రం అంత సులువుగా అదనంగా నోట్లను ముద్రించవు.

గమనిక: ఆర్థిక వ్యవస్థలో వస్తు, సేవల లభ్యతకు అనుగుణంగా నగదు చలామణి ఉండాలి. అవి ఎక్కువ కాకుండా కరెన్సీ ముద్రణ పెంచితే, ధరలు పెరిగి అధిక ద్రవ్యోల్బణం సమస్య తలెత్తుతుంది. నగదు లభ్యత ఎంత మేరకు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది? ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? లాంటి అంశాలను ఆర్‌బీఐ పరిశీలించి అంచనా వేస్తుంది. ఆ మేరకు నగదును ముద్రించి చలామణిలోకి తెస్తుంది.

ఒక దేశ కరెన్సీ విలువ స్థిరంగా ఉండాలంటే పారదర్శకమైన ద్రవ్య పరపతి విధానం ఎంతో ముఖ్యం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానంపై పాలనా వ్యవస్థల నుంచి ఒత్తిడి రాకుండా అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆయా దేశాల్లో కేంద్ర బ్యాంక్‌ల వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండదు. అయితే సత్వర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కొన్ని ప్రభుత్వాలు వడ్డీ రేట్లు, రిజర్వు మనీ తగ్గించి నగదు సరఫరా పెంచాలని కేంద్రబ్యాంకులపై ఒత్తిడి తెస్తాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను సున్నాకు తీసుకొచ్చి ఎక్కువ వృద్ధిరేటు సాధించేలా పరిస్థితులు కల్పించాలని కోరారు.

ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు

దేశంలో ద్రవ్యోల్బణం అధికమైనప్పుడు ఆర్‌బీఐ ద్రవ్యవిధానాన్ని అనుసరించి దాన్ని నియంత్రిస్తుంది. 

ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయిలను ద్రవ్య సరఫరా ప్రభావితం చేసే స్థితిని ద్రవ్య విధానం (Monetary policy) అంటారు. వాటిలో మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థలో అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు ద్రవ్య సరఫరాలో మార్పు చేసి ఆ పరిస్థితులను సరిచేసేదే ద్రవ్య విధానం.

ద్రవ్య విధానం కేంద్ర బ్యాంకుకు సంబంధించింది. కోశ విధానాన్ని  (Monetary policy) కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది.

ద్రవ్య విధానం లక్ష్యాలు

ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం.

ధరల స్థాయిని స్థిరీకరించి రేట్లలో హెచ్చుతగ్గులను నివారించడం.

మారకం రేటు స్థిరత్వాన్ని కాపాడి చెల్లింపుల శేషంలో సమతౌల్యత సాధించడం.

సంపూర్ణ ఉద్యోగిత సాధించడం.

పై లక్ష్యాల సాధనకోసం 1951 నుంచి ఆర్‌బీఐ ద్రవ్యవిధానాన్ని అనుసరిస్తూ, పరపతి నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్య సరఫరాలో పరపతి ఒక ప్రధాన భాగం. పరపతి పరిమాణం పెరిగితే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. పరపతి తగ్గిపోతే ‘ప్రతిద్రవ్యోల్బణం’ (Deflation) వస్తుంది. పరపతి పరిమాణాన్ని పెంచడం లేదా తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని, ప్రతిద్రవ్యోల్బణాన్ని అదుపు చేయొచ్చు.

1972 తర్వాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా ద్రవ్య విధానాన్ని అమలు చేశారు.

సాధనాలు: పరపతి నియంత్రణ సాధనాలే ద్రవ్య విధాన సాధనాలు. అవి

పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు

గుణాత్మక నియంత్రణ సాధనాలు

పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు

1)  బ్యాంకు రేటు: వాణిజ్య బ్యాంకులు ఇదివరకు డిస్కౌంటు చేసి తమ వద్ద ఉంచుకున్న వాణిజ్య బిల్లులను ఆర్‌బీఐ వద్ద రీడిస్కౌంటు చేసి రుణాలు పొందొచ్చు. ఈ సందర్భాల్లో ఆర్‌బీఐ వసూలు చేసే రీడిస్కౌంటు రేటునే ‘బ్యాంకురేటు’ అంటారు. దీన్ని అనుసరించే, వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదార్ల నుంచి రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు  (Prime Lending rate) మారుతుంది. ఆర్థిక వ్యవస్థలో పరపతి ఎక్కువగా ఉంటే ఆర్‌బీఐ ‘బ్యాంకురేటును’ పెంచుతుంది. దీనివల్ల పరపతి తగ్గుతుంది. ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితుల్లో బ్యాంకురేటు తగ్గిస్తుంది. దానివల్ల పరపతి పరిమాణం పెరుగుతుంది. 

2021, జనవరి 8 నాటికి బ్యాంకు రేటు 4.25 శాతంగా ఉంది.

2) నగదు నిల్వల నిష్పత్తి  sCash Reserve Ratio - CRR): ఆర్‌బీఐ చట్టం 1934, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం - 1949 ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలోని కొంత మొత్తాన్ని ఆర్‌బీఐ దగ్గర ఉంచాలి. దీన్నే ‘నగదు నిల్వల నిష్పత్తి’ అంటారు.

ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఆర్‌బీఐ ఈ నిష్పత్తిని పెంచుతుంది.

ఆర్థికమాంద్యం తలెత్తినప్పుడు ఈ నిష్పత్తిని తగ్గిస్తుంది.

నగదు నిల్వల నిష్పత్తి 2021, జనవరి 8 నాటికి  3 శాతంగా ఉంది.

3) శాసనాత్మక, ద్రవ్యత్వ నిష్పత్తి  (Statutory Liquidity Ratio - SLR): 1949 బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం సెక్షన్‌ 24 ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ నగదు నిల్వల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ ఆమోదం పొందిన సెక్యూరిటీల్లో శాసనాత్మకంగా పెట్టుబడులు పెట్టించే నిబంధన ఉంది. దీన్ని ఎస్‌ఎల్‌ఆర్‌ అంటారు.

ఎస్‌ఎల్‌ఆర్‌ రేటు 2021 జనవరి 8, నాటికి 18 శాతంగా ఉంది.

4) రెపోరేటు: వాణిజ్య బ్యాంకుల్లో నగదు నిల్వ తగినంత లేనప్పుడు ఆర్‌బీఐ నుంచి రుణం తీసుకుంటాయి. దానిపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే ‘రెపోరేటు’.

ద్రవ్యోల్బణ సమయంలో రెపోరేటును పెంచుతారు. ప్రతిద్రవ్యోల్బణ (వస్తు, సేవల ధరలు తగ్గడం) సమయంలో ‘రెపోరేటు’ను తగ్గిస్తారు.

ఈ విధంగా ఆర్‌బీఐ ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణాన్ని నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని నివారిస్తుంది.

రెపోరేటును 1992లో ప్రవేశపెట్టారు.

2021, జనవరి 8 నాటికి రెపోరేటు 4 శాతంగా ఉంది.

5) రివర్స్‌ రెపోరేటు: వాణిజ్య బాంకులు తమ దగ్గర అదనపు నగదు నిల్వలు ఉన్నప్పుడు వాటిని ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేయొచ్చు. వాటిపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీ రేటును ‘రివర్స్‌ రేపోరేటు’ అంటారు. ద్రవ్యోల్బణ సమయంలో ఆర్‌బీఐ రివర్స్‌ రెపోరేటు పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ సమయంలో రివర్స్‌ రెపోరేటును తగ్గిస్తుంది. రివర్స్‌ రెపోరేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు తమ నిధులను ఆర్‌బీఐ వద్ద ఉంచుతాయి. దీంతో మార్కెట్‌లో ద్రవ్య సరఫరా తగ్గి వస్తువుల డిమాండ్, ధరలు నియంత్రణలోకి వస్తాయని ఆర్‌బీఐ భావిస్తుంది.

2021, జనవరి 8 నాటికి రివర్స్‌ రెపోరేటు 3.35 శాతంగా ఉంది.

6) బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు (Open Market Operations):  ఆర్‌బీఐ తన సొంత చొరవతో ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వం ఆమోదించిన సెక్యూరిటీలను కొనడం లేదా అమ్మడాన్ని ‘బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు’ అంటారు. ఆర్‌బీఐ, వాణిజ్య బ్యాంకులు, విత్త మార్కెట్‌లోని ఇతర సంస్థలు ఈ లావాదేవీల్లో పాల్గొంటాయి. మార్కెట్ల నుంచి సెక్యూరిటీలను ఆర్‌బీఐ కొంటే మార్కెట్లో పరపతి పరిమాణం లేదా ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ఈ విధంగా ఆర్‌బీఐ పరపతిని నియంత్రిస్తుంది.

గుణాత్మక నియంత్రణ పద్ధతులు 

పరిమాణాత్మక పరపతి నియంత్రణ పద్ధతుల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తంలో అన్ని రంగాలకు లభించే పరపతి పరిమాణం మారుతుంది. రుణ అవసరాల మధ్య, రంగాల మధ్య విచక్షణ ఉండదు. పరపతిని తగ్గించే చర్యలు తీసుకున్నప్పుడు వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు, చేతి వృత్తుల వారు మొదలైన రంగాల వారికి పరపతి లభించడం కష్టం కావొచ్చు. అందుకే ఆర్‌బీఐ కింది విధంగా కొన్ని గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులను పాటిస్తోంది.

1) పరపతి రేషనింగ్‌  (Credit Rationing): ఈ పద్ధతిలో విభిన్న అవసరాలకు వేరువేరుగా పరపతిపై గరిష్ఠ పరిమితులను విధించవచ్చు. దీన్ని ‘రేషనింగ్‌’ అంటారు. అలాగే వివిధ రంగాలకు కోటాలు నిర్ణయించవచ్చు. 
ఉదా: ఆర్‌బీఐ ప్రాథమిక రంగానికి 40 శాతం నిధులను కేటాయించింది.

2) మార్జిన్లలో మార్పు: ఏదైనా అవసరం కోసం ఖాతాదారులు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నప్పుడు ఆ అవసరం విలువలో కొంత శాతాన్ని చెల్లిస్తే మిగతా మొత్తాన్ని రుణంగా ఇస్తారు. ఖాతాదారు తన నిధుల నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని ‘మార్జిన్‌’ అంటారు. దీన్ని మార్చడం వల్ల ఖాతాదారుకు బ్యాంకు చెల్లించే రుణ మొత్తం మారుతుంది. అవసరాలకు అనుగుణంగా ఆర్‌బీఐ మార్జిన్లను నిర్ణయిస్తుంది.

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు  వ్యక్తుల అర్హత, ఆస్తుల తాకట్టు, పూచీ, నిబంధనలతో కూడిన అనేక షరతులను విధిస్తాయి. వీటిని ఆర్‌బీఐ మార్పుచేయొచ్చు. దీనివల్ల వివిధ రంగాల మధ్య రుణ పంపిణీలో విచక్షణ ఉంటుంది.

3) వ్యత్యాస వడ్డీ రేట్ల మార్పు: అవసరాలకు తగ్గట్టు వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. వడ్డీ రాయితీల్లో కూడా తేడా ఉంటుంది.

ఉదా: రైతులకు పావలా వడ్డీరేటు పథకం.

4) నైతిక ఉద్బోధ: వివిధ రంగాల అవసరాలు, ప్రాధాన్యతలను బట్టి ఆయా రంగాలకు అధికంగా రుణాలివ్వమని, లేదా తగ్గించమని ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులను కోరవచ్చు.

5) ఆదేశాలు జారీ చేయడం (Issue of Directions):  పరపతి విషయంలో ఆర్‌బీఐ సూచనలే కాకుండా, కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తుంది. వాటిని పాటించకపోతే చర్యలు తీసుకుంటుంది.

ద్రవ్య విధాన సంఘం (Monetary Policy Committee - MPC): 1934 ఆర్‌బీఐ చట్టం కింద ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ డా. ఉర్జిత్‌ పటేల్‌ సిఫార్సు మేరకు ద్రవ్య విధాన కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 2016, జూన్‌ 27 నుంచి అమల్లోకి వచ్చింది. ద్రవ్య విధాన సంఘాన్ని ఆర్‌బీఐ నియంత్రిస్తుంది. ఎంపీసీ దేశంలోని ధరల స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ద్రవ్యోల్బణ నియంత్రణే లక్ష్యంగా ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తుంది. విధాన రేట్లలో మార్పులు, చేర్పులు ప్రకటిస్తుంది. కమిటీ ఎగ్జిక్యూటివ్‌గా ఆర్‌బీఐ గవర్నర్‌ ఉంటారు.

జింబాబ్వే ఎదుర్కొన్న ఆర్థిక ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం ఎంత ఎక్కువైతే ఆ దేశ కరెన్సీ విలువ అంతగా పతనమవుతుంది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు తమ ఇష్టానుసారం నోట్లను ముద్రించి ఆర్థికవ్యవస్థలోకి తీసుకురావడంతో ద్రవ్యోల్బణం అధికమై కరెన్సీ విలువ భారీగా పతనమైంది

ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు 2007 - 09 మధ్యకాలంలో పెద్ద ఎత్తున నగదును ముద్రించింది. దీంతో ఆ దేశ కరెన్సీ విలువ భారీగా తగ్గింది. ఎంతగా అంటే ఆ దేశం 100 ట్రిలియన్‌ జింబాబ్వే డాలర్‌ నోటును సైతం ముద్రించాల్సి వచ్చింది. దాని విలువ కేవలం 40 అమెరికా సెంట్లు మాత్రమే. దీంతో ఆ దేశ ప్రజలు జింబాబ్వే డాలర్‌ కంటే ఇతర దేశాల కరెన్సీతోనే ఆర్థిక లావాదేవీలు జరిపే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభావం ఇప్పటికీ తగ్గలేదు. ప్రస్తుతం ఆ దేశంలో అమెరికా డాలర్, భారతదేశ రూపాయి, తదితర విదేశీ కరెన్సీలతోనే క్రయవిక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. ఇలాంటి విధానాల వల్ల కొన్ని ఆఫ్రికా దేశాల్లో ద్రవ్యోల్బణం 200% నుంచి 500% వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి

Posted Date : 08-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌