• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు

భూమి.. భుక్తి.. విముక్తి!

 వలస పాలకుల దోపిడీ విధానాలు, భూస్వామ్య వ్యవస్థలతో దేశంలోని ఎక్కువ శాతం భూమి కొంతమంది చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో వ్యవసాయాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. సామాజిక అసమానతలు తీవ్రమయ్యాయి. ఆ అసంతృప్తి భూ హక్కుల పోరాటాలుగా, తిరుగుబాట్లు, విప్లవాలుగా మారింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు భూసంస్కరణలను, భూ పంపిణీ పథకాలను అమలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో అవి ఏ మేరకు విజయవంతమయ్యాయో  పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  భూమి లేని పేదలకు భూమి హక్కును, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయడంతోపాటు వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అనేక వ్యవస్థాపూర్వక సంస్కరణలనే భూసంస్కరణలు అంటారు. సేద్యంలో పురోగతి సాధించే ఉద్దేశంతో సమానత్వం, సాంఘిక న్యాయం ప్రాతిపదికన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి భూమికి సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర మార్పులు ప్రవేశపెట్టడమే భూసంస్కరణలని చెప్పవచ్చు.

* చిన్న, ఉపాంత, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో చేసే భూమి పునఃపంపిణీ కార్యక్రమాలే భూసంస్కరణలు: ఐక్యరాజ్య సమితి

* వ్యవసాయ అభివృద్ధి కోసం భూమిపై చేపట్టే సంస్కరణలే భూసంస్కరణలు: భారత ప్రణాళికా సంఘం

భూసంస్కరణలపై ప్రముఖుల నిర్వచనాలు

కారల్‌మార్క్స్‌: ఆంగ్లేయుల కాలంలోని జమీందారీ పద్ధతి బ్రిటిష్‌ భూస్వామ్య వ్యవస్థకు, రైత్వారీ పద్ధతి ఫ్రెంచ్‌ రైతుస్వామ్య వ్యవస్థకు ప్రతిబింబాలు.

గున్నార్‌ మిర్దాల్‌: వెనుకబడిన దేశాల్లో వ్యవసాయ రంగ సంక్షోభానికి ప్రధాన కారణం భూస్వామ్య విధానమే.

ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ: మధ్యవర్తుల తొలగింపు, భూమి హక్కుల పునఃపంపకం, కమతాల సమీకరణ, కౌలు సంస్కరణలు, సహకార, సామూహిక వ్యవస్థల నిర్మాణం లాంటి అంశాలే భూసంస్కరణలు.

చారిత్రక నేపథ్యం

* ప్రపంచంలో మొదటిసారిగా క్రీ.పూ.7వ శతాబ్దంలో చైనాలో భూసంస్కరణల అమలుకు ప్రయత్నాలు జరిగాయి.

* తైవాన్‌లో 37%, జపాన్‌లో 33%, దక్షిణ కొరియాలో 32%, ఫ్రాన్స్‌లో 30%, స్వీడన్, డెన్మార్క్, ఐర్లాండ్‌ లాంటి దేశాల్లో కొంతవరకు భూసంస్కరణలు విజయవంతమయ్యాయి.

* ఈజిప్టు, వెనుజువెలా దేశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నీ భూసంస్కరణల వల్లే ప్రభావితమయ్యాయి.

* భారతదేశంలో స్వాతంత్య్రానికి పూర్వం ఆర్‌.కె.ముఖర్జీ ‘భారతదేశంలో భూసమస్యలు’ అనే గ్రంథం రచించారు. 1899లో డాక్టర్‌ వాల్కర్‌ లోపభూయిష్టమైన భూస్వామ్య విధానాలే భారతదేశ వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకతకు కారణమని తెలిపాడు.

* 1919లో అమృతసర్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో దున్నేవారికే భూ యాజమాన్య హక్కు కల్పించాలని ప్రత్యేక తీర్మానం చేశారు.

* కాంగ్రెస్‌ కార్యక్రమంలో భూస్వాముల తొలగింపు కీలకాంశమని 1928లో జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

* 1931లో కరాచీ కాంగ్రెస్‌ సమావేశంలో మొదటిసారిగా జమీందారీ వ్యవస్థ రద్దు తీర్మానం ప్రవేశపెట్టారు.

* 1936లో లఖ్‌నవూ (పైజాపూర్‌)లో జరిగిన సమావేశంలో వ్యవసాయ పతాకాన్ని రూపొందించారు. 

* 1946 ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యవర్తుల తొలగింపు, వారి నష్టపరిహారం గురించి ప్రతిపాదించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పోరాటాలు

* భూస్వాములపై, ప్రభుత్వంపై కోస్తా - ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని రైతులు తిరుగుబాటు చేశారు.

* మొదటిసారిగా 1832లో ఉత్తరాంధ్రలో గోండుల తిరుగుబాటు జరిగింది.

* 1858- గోదావరి ఏజెన్సీలో తిరుగుబాటు.

* 1879- రంప-పితూరీ తిరుగుబాటు.

* 1846- కోయిలకుంట్లలో రైతుల తిరుగుబాటు.

* 1920- రైతు సంఘాల ఏర్పాటు.

* 1928- ఆచార్య ఎన్‌.జి.రంగా అధ్యక్షతన ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం ఏర్పాటు.

* 1930- ఆచార్య ఎన్‌.జి.రంగా పాదయాత్ర.

* 1931- ఆంధ్ర రాష్ట్ర జమీన్‌ రైతు సంఘం ఏర్పాటు.

* 1936- అఖిల భారత కిసాన్‌ సభ ఏర్పాటు.

* 1967- భూ సమస్య ప్రేరణతో పశ్చిమ బెంగాల్‌లో నక్సల్‌బరీ గ్రామంలో మావో ఆశయాల సాధన కోసం ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే నినాదంతో విప్లవ పోరాటాలు జరిగాయి.

భూసంస్కరణల లక్ష్యాలు

1951లో భారత ప్రణాళిక సంఘం భూసంస్కరణల లక్ష్యాలను తెలియజేసింది. అవి 

* అనాదిగా వ్యవసాయ రంగం ప్రగతిని కుంటుపరిచే అన్నిరకాల ప్రతిబంధకాలను నిర్మూలించడం.

* వ్యవసాయ రంగంలోని అన్నిరకాల దోపిడీలు, పీడనాలు, సాంఘిక అన్యాయాలు, అసమానతలు తొలగించి, సమాన అవకాశాల కల్పన ద్వారా దున్నేవారికి భూమిపై హక్కు కల్పించడం.

భూసంస్కరణల ఆవశ్యకత: 

* వ్యవసాయ అభివృద్ధి.

* ఆర్థికాభివృద్ధి సాధన.

* సాంఘిక న్యాయం సాధించడం

* వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం

భూస్వామ్య పద్ధతులు

ఈస్టిండియా కంపెనీ 1600 సంవత్సరంలో వాణిజ్యం కోసం మన దేశంలో ప్రవేశించి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించి క్రమంగా భారత ఉపఖండాన్ని తన అధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత వలస పాలకులు భూస్వామ్య విధానాలను అవలంబించారు. అవి 

1) జమీందారీ పద్ధతి 

2) రైత్వారీ పద్ధతి 

3) మహల్వారీ పద్ధతి

జమీందారీ పద్ధతి: బ్రిటిష్‌ ప్రభుత్వం 1793 వరకు భూమిశిస్తు వసూలు చేసే అధికారాన్ని వేలం వేసేది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం సరిగ్గా రావడం లేదని 1793లో ‘కారన్‌ వాలిస్‌’ పశ్చిమ బెంగాల్‌లో జమీందారీ పద్ధతి ప్రవేశపెట్టాడు. దీన్నే శాశ్వత సెటిల్‌మెంట్‌ అని కూడా అంటారు. జమీందారీ పద్ధతి అంటే రైతుల నుంచి శిస్తు వసూలు చేసే అధికారం కొంతమంది వ్యక్తులకు వంశపారంపర్య హక్కుగా ఇవ్వడం. 30-40 ఏళ్లకు ఒకసారి శిస్తును నిర్ణయించేవారు. పన్ను వసూలు చేసినందుకు 1/11వ వంతు కమిషన్‌ను ప్రభుత్వం ఇచ్చేది.


రైత్వారీ విధానం: 1972లో మొదటిసారిగా థామస్‌ మన్రో ఈ పద్ధతిని మద్రాసు రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. ఇది హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న వ్యవస్థ. ఇందులో భూమిని సాగు చేసే రైతు పన్నును నేరుగా ప్రభుత్వానికి కట్టేవాడు. భూసారం, ఉత్పత్తి, ఖర్చు ఆధారంగా శిస్తును నిర్ణయించేవారు. 20-30 ఏళ్లకు పన్నును నిర్ణయించేవారు.

మహల్వారీ పద్ధతి: దీన్నే తుషల్వారీ పద్ధతి అని కూడా అంటారు. 1883లో సర్‌ మెకంజీ ఈ పద్ధతిని ఆగ్రా, అయోధ్య, ఔద్‌ లాంటి ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. ఇది ‘ముస్లిం సంప్రదాయానికి’ అనుగుణంగా ఉండేది. ఈ వ్యవస్థలో ‘గ్రామపెద్ద’ శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించేవారు. భూమి శిస్తు 30 - 40 ఏళ్లకు ఒకసారి నిర్ణయించేవారు. పన్ను వసూలు చేసేవారికి 5% కమిషన్‌ ఉండేది.

ఆంధ్ర ప్రాంతంలో భూస్వామ్య విధానాలు

జమీందారీ విధానం: ఉత్తర కోస్తా, ఆంధ్రా ప్రాంతాలైన ఉమ్మడి శ్రీకాకుళం, కొండపల్లి, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి; కృష్ణా, విశాఖ ప్రాంతాల్లో 1802లో మద్రాస్‌ రాష్ట్రం జారీ చేసిన శాశ్వత శిస్తు చట్టం ప్రకారం జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. 70% జమీందారీ భూములు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి. ఆంధ్ర ప్రాంతంలో రాజులకు, జమీందారులకు వ్యక్తిగత సేవలు చేసినందుకు వారు తమ అధీనంలో ఉన్న కొంత భూమిని దానంగా ఇచ్చేవారు. వాటిని ‘ఇనాం’ భూములు అంటారు. ఇవి రెండు రకాలు.

* ఒక గ్రామం లేదా కొన్ని గ్రామాల్లోని మొత్తం భూమిని దానంగా ఇస్తే దాన్ని ‘మేజర్‌ ఖండిక’ లేదా ‘శోత్రియ’ భూములు అంటారు.

* గ్రామంలోని కొంత భూమిని మాత్రమే దానంగా ఇస్తే దాన్ని మైనర్‌ ఖండిక అంటారు.

కౌలుదారులు రెండు రకాలు: 

1) జిరాయితీ హక్కులున్న కౌలుదారులు లేదా శాశ్వత కౌలుదారులు.

2) జిరాయితీ హక్కులు లేని కౌలుదారులు లేదా తాత్కాలిక కౌలుదారులు.

మాగాణి భూముల్లో పండిన పంటలో 1/3వ వంతు, మెట్ట భూముల్లో పండిన పంటలో 1/4వ వంతు కౌలుగా వసూలు చేసేవారు.

రైత్వారీ విధానం: నిజాం నవాబుతో కుదిరిన ఒప్పందం ప్రకారం 1800, అక్టోబరు 12న కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి ప్రాంతాలు ఈస్టిండియా కంపెనీకి దత్త మండలాలుగా వచ్చాయి. 1801లో నెల్లూరు, చిత్తూరులను కంపెనీ స్వాధీనం చేసుకుంది. థామస్‌ మన్రో సేలం జిల్లాలో ‘కర్నల్‌ రీడ్‌’ కింద సబ్‌కలెక్టరుగా పనిచేస్తున్నప్పుడు 1807లో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1820 నాటికి నెల్లూరు, చిత్తూరు, సర్కారు ప్రాంతాల్లో ఈ విధానాన్ని విస్తరించాడు.

భూసంస్కరణలు - ప్రభుత్వం చేపట్టిన మౌలికాంశాలు: * మధ్యవర్తుల తొలగింపు * కౌలుదారీ చట్టం * భూకమతాలపై గరిష్ఠ పరిమితి చట్టం * కమతాల సమీకరణ * భూదాన ఉద్యమం

మధ్యవర్తుల తొలగింపు చట్టం

  1948 మద్రాసు అసెంబ్లీలో ఆంధ్ర ప్రాంత జమీందారుల రద్దు, రైత్వారీ విధాన అమలు చట్టం ప్రవేశపెట్టారు. దీన్ని మద్రాసు ఎస్టేట్‌ బిల్లు అని అంటారు. 1949, ఏప్రిల్‌ 19న అసెంబ్లీ ఆ చట్టాన్ని ఆమోదించింది. 1950, జనవరి 1 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం జమీందార్లు, సంస్థానాధిపతుల వ్యవస్థ రద్దయింది. జమీందారులకు రూ.25,000 నుంచి రూ.15,00,000 వరకు నష్టపరిహారం పొందే హక్కు లభించింది. 1956 ఆంధ్ర ప్రాంత ఇనాంల రద్దు, రైత్వారీ విధాన అమలు చట్టం ద్వారా అగ్రహార భూములను కౌలుకు చేసుకొనే 20 లక్షల మంది రైతులు యాజమాన్య హక్కులు పొందారు. 1967లో మతసంబంధ భూములకు కూడా ఈ చట్టాన్ని వర్తింపజేశారు. ఇనాం భూములు కోల్పోయిన వారికి రూ.15.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని 1985లో నాటి ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

కౌలుదారీ చట్టం

ఆంధ్ర ప్రాంతంలో కౌలుదారులు మూడు రకాలుగా ఉండేవారు. 

i)  జిరాయితీ హక్కులున్న కౌలుదారులు

ii) ఏ హక్కులు లేని కౌలుదారులు

iii) ఉప కౌలుదారులు

  1955లో కౌలు సంస్కరణలపై లక్కరాజు సుబ్బారావు కమిటీని నియమించారు. 1956లో ఈ కమిటీ సిఫార్సు మేరకు మాగాణి భూములకు గరిష్ఠ కౌలు 30%, మెట్ట భూములకు 25% కౌలుగా నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం వరుసగా ఆరేళ్లకు మించి కౌలు చేసేవారికి జిరాయితీ హక్కు లేదా రక్షిత కౌలుదారు లేదా శాశ్వత కౌలుదారుగా గుర్తిస్తారు. (జిరాయితీ హక్కు పొందాలంటే కౌలు పత్రం లిఖిత రూపంలో ఉండాలి. 30 రోజుల్లోపు ఎమ్‌ఆర్‌ఓ కార్యాలయంలో సమాచారాన్ని తెలియజేయాలి.)

భూగరిష్ఠ పరిమితి చట్టం

కుటుంబాలకు భూగరిష్ఠ పరిమితిని నిర్ణయించేందుకు 1958లో ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నిర్దేశిత పరిమితి కంటే అధికంగా ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని వారికి పంచాలనేది చట్టం ఉద్దేశం. 1958 నాటికి 70% వ్యవసాయ భూమి భూస్వాముల చేతుల్లో ఉండేది.

  * 1961, జూన్‌ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఒక కుటుంబానికి ప్రాంతం, పంట, సాగునీటి సదుపాయాల ఆధారంగా 27 నుంచి 324 ఎకరాల పరిమితిని నిర్ణయించారు. ఈ పరిమితికి మించి ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ చట్టం అమలుచేస్తే 30 లక్షల ఎకరాల మిగులు భూమి లభిస్తుందని అంచనా వేశారు. కానీ పదేళ్ల తర్వాత కూడా 30,600 ఎకరాలే లభించింది.

 చట్టం వైఫల్యానికి ప్రధాన కారణాలు: * కమత పరిమాణం అధికంగా ఉండటం.

* బినామీ పేర్లతో భూముల రిజిస్ట్రేషన్‌ జరగడం.

* మత సంబంధమైన భూములకు వర్తించకపోవడం.

* చెరకు, మామిడి, సుగంధద్రవ్య తోటలకు చట్టం వర్తించకపోవడం

ఈ కారణాలతో చాలామంది భూస్వాములు చట్టం నుంచి తప్పించుకోగలిగారు.

భూ పరిమితి చట్టం - 1973

  1972, సెప్టెంబరు 1న రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1973, జనవరి 1న రాష్ట్రపతి ఆమోదం పొందింది. 1974లో 34వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌లో ఈ చట్టాన్ని చేర్చారు. 1975, జనవరి 1 నుంచి చట్టాన్ని అమలుచేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని భూములను 11 రకాలుగా వర్గీకరించారు. మాగాణి భూములను 6 రకాలుగా, మెట్ట భూములను 5 రకాలుగా పేర్కొన్నారు. 5 మంది సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. (తల్లి, తండ్రి, ముగ్గురు మైనర్లు) ఒకవేళ మేజర్లు ఉంటే వారిని అదనపు యూనిట్‌గా పరిగణిస్తారు.

గమనిక: ఈ చట్టం చుక్కల భూములకు వర్తించదు. చుక్కల భూమి అంటే రాష్ట్ర రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ యాజమాన్య హక్కులకు సంబంధించి తగిన ఆధారాలు లేని భూములు. ఇలాంటి భూములను సర్వే చేసి వాటిని సాగు చేసేవారికి పట్టాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం - 1976

  రాష్ట్రంలోని పట్టణాలను వర్గీకరించి ఒక వ్యక్తికి గరిష్ఠంగా ఎంత భూమి ఉండాలో నిర్దేశించారు. ఒక వ్యక్తికి 500 చదరపు గజాల నుంచి 2000 చదరపు గజాల వరకు పరిమితి విధించారు. 1992లో ఈ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సిఫార్సు చేసింది. 2008, మార్చి 16న ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ రద్దు చేసింది.

అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం - 1977

  ప్రభుత్వం పేదవారికి ఉచితంగా ఇచ్చిన వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలను అసైన్డ్‌ భూములు అంటారు. ఇలాంటి భూములను వంశపారంపర్యంగా బదిలీ చేయవచ్చు, వీటిని బయటి వ్యక్తులకు తనఖా పెట్టడం అన్యాక్రాంతం అవుతుంది. అసైన్డ్‌ భూములకు ఇచ్చే పట్టాను ‘డి - ఫారమ్‌ పట్టా’ అంటారు. జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎన్‌ఓసీ పొందిన తర్వాత వీటిని విక్రయించుకోవచ్చు.

మిగులు భూమి పంపిణీ 

  పేదరికాన్ని తగ్గించడానికి, సమాజంలో మెరుగైన సాంఘిక హోదా కల్పించడానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత భూమి పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మొదటి దశలో 1968, నవంబరు 1న మొదటిసారి 20 వేల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. 2005 నుంచి రెండో దశలో ఏడు సార్లు భూపంపిణీ జరిగింది. మొత్తం 9 లక్షల ఎకరాలను సుమారు 6 లక్షల మందికి పంపిణీ చేసింది.

* భూ పంపిణీలో 50% ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపు.

* ఇందిరప్రభ పథకం ద్వారా భూములు పొందిన వారికి, భూముల అభివృద్ధికి నాబార్డు ద్వారా రుణాలు అందించడం.

* మెట్టభూమి గరిష్ఠంగా 5 ఎకరాలు, మాగాణి భూమి 2 1/2 ఎకరాలకు మించకుండా పంపిణీ చేయాలి.

కోనేరు రంగారవు కమిటీ

  కోనేరు రంగారావు అధ్యక్షతన భూసంస్కరణల కమిటీని 2004, డిసెంబరు 1న 977 జీవో ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 8 మంది సభ్యులుంటారు. ఈ కమిటీ రాష్ట్రమంతటా పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించి 2006లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ ప్రభుత్వానికి 104 సిఫార్సులు చేసింది. అందులో ముఖ్యాంశాలు-

* ప్రభుత్వ భూముల యాజమాన్యం - 12 సిఫార్సులు

* హక్కుల రికార్డులకు సంబంధించి - 9 సిఫార్సులు

* కౌలుకు సంబంధించి - 2 సిఫార్సులు

* భూసంస్కరణలకు సంబంధించి - 15 సిఫార్సులు

* నివేశ స్థలాలు గురించి - 2 సిఫార్సులు

* భూమి రికార్డులకు సంబంధించి - 3 సిఫార్సులు

* దేవాలయ భూములకు సంబంధించి - 4 సిఫార్సులు

* ఆదివాసీ భూ సమస్యలు - 41 సిఫార్సులు

* భూ వ్యాజ్యాలు - 7 సిఫార్సులు

* పేదల అనుకూల అంశాలు - 1 సిఫార్సులు

* పేదలకు భూమిని అందించడానికి - 4 సిఫార్సులు

గమనిక: కోనేరు రంగారు కమిటీ నివేదికలోని మొతం సిఫార్సుల్లో 74 సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. 1894 భూసేకరణ చట్టం స్థానంలో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేశారు. ఇది 2014, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 2013 భూసేకరణ చట్టాన్ని, 2018 ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టంగా అమలు చేస్తున్నారు.

  కమతాల సమీకరణ: వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భూమిని ఒక సేద్యపు భూమిగా మార్చడాన్ని కమతాల సమీకరణ అంటారు.

భూదాన ఉద్యమం

  1951, ఏప్రిల్‌ 18న ఆచార్య వినోబా భావే సర్వోదయ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చి శివరాంపల్లి మీదుగా నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామానికి పాదయాత్ర చేసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 40 మంది షెడ్యూల్డ్‌ కులాలవారు తమకు భూమి కావాలంటూ విన్నవించారు. అక్కడ ఉన్న వెదిరె రామచంద్రారెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం 100 ఎకరాల భూమిని దానం చేయడంతో భూదాన ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో భూమిని దానంగా పొందిన మొదటి వ్యకి మైసయ్య. ఆ తరువాత ఈ ఉద్యమం గ్రామదానంగా మారింది.

భూసంస్కరణలు - ముఖ్యమైన సంవత్సరాలు

1792 - రైత్వారీ విధానం

1793 - జమీందారీ విధానం

1832 - మహల్వారీ విధానం

1894 - భూసేకరణ చట్టం

1905 - భూ దురాక్రమణ చట్టం

1948 - ఆంధ్ర జమీందారీ చట్టం

1949 - జేసీ కుమరప్ప కమిటీ

1950 - ఆంధ్రప్రదేశ్‌ ఏరియా కౌలు చట్టం

1951 - భూదాన ఉద్యమం

1956 - ఆంధ్ర ఇనాం భూముల రద్దు చట్టం

1961 - ఆంధ్రప్రదేశ్‌ మొదటి భూపరిమితి చట్టం

1972 - కేంద్ర భూసంస్కరణ

1973 - ఆంధ్రప్రదేశ్‌ భూగరిష్ఠ పరిమితి చట్టం

1974 - ఎవరికీ చెందని భూముల చట్టం

1976 - పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం

1977 - ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం

1999 - పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం రద్దు

2004 - కోనేరు రంగారావు చట్టం

2007 - అసైన్డ్‌ భూముల సవరణ చట్టం

2013 - నూతన భూసేకరణ చట్టం

2018 - ఆంధ్రప్రదేశ్‌ నూతన భూసేకరణ చట్టం

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 22-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌