• facebook
  • whatsapp
  • telegram

మౌర్యుల పరిపాలనా విధానం 

ప్రాచీన భారతదేశంలో ఆచరణలోకి వచ్చిన మొట్టమొదటి సక్రమమైన పాలనగా మౌర్యుల పాలనను చరిత్రకారులు అభివర్ణించారు. మౌర్యుల పరిపాలనా వ్యవస్థను ‘కేంద్రీకృత ఉద్యోగస్వామ్యం’గా పేర్కొన్నప్పటికీ, రాజు నిరంకుశ అధికారాలను కలిగి ఉండేవాడు. వీరి పరిపాలన పితృస్వామిక స్వభావాన్ని కలిగి ఉంది.

* మౌర్యచక్రవర్తులు తాము స్థాపించిన విశాల సామ్రాజ్యంలో సమర్థవంతమైన కేంద్రీకృతపాలనను ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు, జిల్లాలకు, గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించి సుస్థిరపాలనను అందించారు. వీరి పాలనను నేటికీ మనం అనుసరిస్తున్నాం.


కేంద్ర ప్రభుత్వం: రాజు కేంద్ర ప్రభుత్వంలో సర్వాధికారి. పాలనావ్యవహారాల్లో రాజుకు సహాయం చేసేందుకు అనేకమంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేసేవారు. 

* ‘‘పాలన అనేది ఒకరు చేసేది కాదు. ఒక వాహనాన్ని నడపడానికి చక్రాలు ఏ విధంగా అవసరమో, పాలన సక్రమంగా సాగేందుకు అనేకమంది ఉద్యోగులు అవసరం’’ అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. 

* కేంద్ర ప్రభుత్వంలో రాజుతోపాటు రాష్ట్ర గవర్నర్లు, రాజప్రతినిధులు, మంత్రులు, వివిధ శాఖల అధిపతులు, ముఖ్య కార్యనిర్వాహకులు, గ్రామపాలనలోని ముఖ్య ఉద్యోగులు ఉండేవారు. వీరినే కౌటిల్యుడు రాజ్యానికి సంబంధించిన ‘సప్తాంగులు’ అని ప్రస్తావించాడు.


మంత్రి పరిషత్‌: పరిపాలనలో రాజుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మంత్రి పరిషత్‌ ఉండేది. రాజనీతి, విజ్ఞానం, తెలివి కలిగిన వారిని ఈ పదవికి ఎంపిక చేసేవారు.

*మంత్రి పరిషత్‌లో పురోహితుడు, సేనాపతి, యువరాజు, ఇతర మంత్రులు సభ్యులుగా ఉంటారు. దీనికి ఒక కార్యనిర్వాహక అధికారి ఉంటాడు.

*అశోకుడి మూడు, నాలుగో శిలాశాసనాల ప్రకారం, అత్యవసర సమయాల్లో మంత్రి పరిషత్‌ సమావేశం అయ్యేది. మహామంత్రి రాజుకు, మంత్రిపరిషత్‌కు వారధిగా పనిచేస్తాడని అర్థశాస్త్రం పేర్కొంది.

* ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించడం, నూతన పథకాల అమలు, వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడం మంత్రి పరిషత్‌ విధులు.


ఉద్యోగ వ్యవస్థ: కేంద్ర ప్రభుత్వంలో 32 పాలనా శాఖలకు ఉన్నతోద్యోగులు ఉండేవారు. వీరు శాఖలకు అధ్యక్షులుగా ఉండి, సామాజిక, ఆర్థిక, పాలనా అధికారులతో సంబంధాలు కలిగి ఉండేవారు. 

మౌర్య రాజ్యంలో అక్షపటలాధ్యక్ష (గణాంకాలు), అకరాధ్యక్ష (గనులు), సువర్ణాధ్యక్ష (బంగారం), కోశాధ్యక్ష (కోశాగారం), పాణ్యాధ్యక్ష (వాణిజ్యం), కుప్యాధ్యక్ష (అటవీ ఉత్పత్తులు), ఆయుధాగారాధ్యక్ష (ఆయుధాల ఉత్పత్తి - నిర్వహణ), పౌతాధ్యక్ష (తూనికలు, కొలతలు), శుల్కాధ్యక్ష (కస్టమ్స్‌), లోహాధ్యక్ష (ఇనుము), సీతాధ్యక్ష (రాజభూములు), రథాధ్యక్ష (రథాలు), హస్తాధ్యక్ష (ఏనుగులు), ముద్రాధ్యక్ష (పాస్‌పోర్టు), పట్టణాధ్యక్ష (ఓడరేవులు), దేవతాధ్యక్ష (మత సంస్థలు), లక్షణాధ్యక్ష (నాణేల ముద్రణ), సమస్తాధ్యక్ష (వాణిజ్య, వ్యాపార, రహదారులు) మొదలైన అధ్యక్షులు ఉండేవారు. వీరంతా రాజుకు సహాయపడేవారు.

* ప్రభుత్వ ఆదాయాన్ని ధన, ధాన్య రూపంలో భద్రపరిచే అధికారిని ‘సన్నిధాత’; రెవెన్యూ వసూలు అధికారిని ‘సమాహర్త’ అనేవారు. వీరు రాజ్యంలో అత్యంత కీలకమైన స్థానాల్లో ఉండేవారు. 

* ‘తీర్థులు’ అనే ఉద్యోగులు సాధారణ మంత్రిమండలి పాలనలో తోడ్పడేవారు.

*‘యుక్త’ గణాంక అధికారి. ‘ప్రాదేశిక’ ప్రాంతాధికారి. ఇతడు ఆ ప్రాంత ప్రజాసంక్షేమ, న్యాయాధికారిగా ఉండేవాడు.

‘ప్రతివేదిక’ అనే అధికారి రాజుకు ఉపయోగపడే సమాచారాన్ని సేకరించి, అందించేవాడు. 

* అప్పటి ఆర్థిక సంవత్సరం ఆషాఢమాసం (జులై)లో ప్రారంభమయ్యేది. 

* ఆదాయంలో అధికభాగం సైన్యపోషణ, ఉద్యోగుల జీతాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు కేటాయించేవారు. 

* మంత్రి, పురోహితుడు, సేనానికి 48,000 పణాలు; మంత్రిపరిషత్‌లోని ఇతర సభ్యులకు 12,000 పణాలు; కిందిస్థాయి ఉద్యోగులకు 500 పణాలు జీతాలుగా చెల్లించేవారు.


రాజ్య విభాగాలు: పరిపాలనా సౌలభ్యం కోసం మౌర్యులు తమ రాజ్యాన్ని జనపదాలు, ప్రదేశాలు, ఆహారాలు, విషయాలుగా విభజించారు.

* ప్రతిదశలోనూ అధికారులు పాలనను నిర్వహించేవారు. ప్రజా సమస్యలను పౌరసభ, జనపదసభల ద్వారా తెలుసుకునేవారు.

* అశోకుడి శాసనాల్లో తక్షశిల, ఉజ్జయిని, తోసలి, సువర్ణగిరి అనే నాలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. 

*రాష్ట్రాల్లోనూ కేంద్రప్రభుత్వంలో ఉన్నట్లే మంత్రులు ఉండేవారు. 

ప్రతి రాష్ట్రాన్ని కొన్ని ప్రదేశాలుగా విభజించారు. వాటి పాలనకు ప్రాదేశిక, రజ్జుక, యుక్త అనే ఉద్యోగులు ఉండేవారు. 

*‘ప్రాదేశిక’ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాజశాసనాల అమలు, శాంతిభద్రతల నిర్వహణ చేసేవాడు. రజ్జుకులు న్యాయ నిర్వహణ, పంటపొలాల సర్వే చేసి పన్నులు విధించేవారు. వీరు ప్రాదేశికుల కింద పనిచేసేవారు. 


నగర పాలన: మౌర్యుల పాలనలో నగరపాలన ప్రముఖమైంది. మెగస్తనీస్‌ తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరపాలనను వివరించాడు. 

* ప్రతి నగరంలో శాంతిభద్రతల నిర్వహణకు ‘నగరిక’ అనే అధికారి ఉండేవాడు. 

* పాటలీపుత్ర నగరపాలన కోసం పరిశ్రమలు, విదేశీయుల సంక్షేమం, జనన-మరణాల నమోదు, వర్తక-వ్యాపారం, ఉత్పత్తి చేసిన సరకులపై పర్యవేక్షణ, పన్ను వసూలు అనే ఆరు ప్రధాన కమిటీలు ఉండేవి. ప్రతిదానిలో అయిదుగురు సభ్యుల చొప్పున మొత్తం 30 మంది సభ్యులు ఉండేవారు. 

* నగర పారిశుద్ధ్యం, ప్రజాహిత కార్యక్రమాలు, దేవాలయాలు - మార్కెట్ల నిర్వహణ లాంటి బాధ్యతలు ఈ కమిటీలు నిర్వహించేవి. 

* నగరపాలనలో గోప, స్థానిక అనే ఉద్యోగులు నాగరికుడికి తోడ్పడేవారు.


రెవెన్యూ విధానం: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు ‘భూమిశిస్తు’. ఈ ఆదాయం ధన, ధాన్య రూపంలో ఉండేది. భూమి శిస్తే కాకుండా గనులు, అడవులు, రహదారులు, వస్తు పన్నులు, అపరాధ రుసుముల నుంచి కూడా ఆదాయం వచ్చేది. 

* ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాజ్యంలో గిడ్డంగులు నిర్మించారు. కొన్ని బౌద్ధ క్షేత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చాడు.  

* ఆ కాలంలో భాగ, పిండాకార, కార, హిరణ్య అనే పన్నులు ఉండేవి.


గూఢచారి విధానం: అర్థశాస్త్రంలో ‘సాత్రిన్స్‌’ అనే ప్రత్యేక గూఢచారి దళాన్ని కౌటిల్యుడు పేర్కొన్నాడు. వీరిని రాజుకు చెవులు, కళ్లుగా పేర్కొంటారు. రాజ్యంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు రాజుకు చేరవేయడం వీరి విధి. 

* అనాథలు, బ్రాహ్మణులు, వితంతువులు, శూద్రస్త్రీలు, వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులను గూఢచారులుగా నియమించేవారు. 

* వీరిని నేరపరిశోధనకు, ప్రజాభిప్రాయ సేకరణకూ ఉపయోగించేవారు. 

* ఆ కాలంలోనూ డిటెక్టివ్‌ వ్యవస్థ ఉండేది. వీరిని ‘గద పురుషులు’ అనేవారు. 

గూఢచారి వ్యవస్థలో ‘సంస్థాన్‌’, ‘సంచారి’ అని రెండు భాగాలు ఉండేవి. సంస్థాన్‌ సభ్యులు సమాచారాన్ని కోడింగ్‌-డీకోడింగ్‌ రూపంలో, రహస్య భాషలో పంపేవారు. సంచారులు రాజ్యంలో తిరుగుతూ సమాచారాన్ని సేకరించేవారు. వీరు సమాచారాన్ని చేరవేసేందుకు పావురాలను వాడేవారు.


గ్రామ పాలన: మౌర్యుల పాలనలో అతిచిన్న పాలనా విభాగం గ్రామం. 

* గ్రామాల్లో ‘గ్రామిక’ అనే ఉద్యోగి పన్ను వసూలు, శాంతి భద్రతల రక్షణ చేసేవాడు. పెద్ద గ్రామాల్లో గ్రామికకు గణక, లేఖక అనే ఉద్యోగులు సాయపడేవారు. గోప ఆధీనంలో గ్రామికులు పనిచేసేవారు. ‘స్థానిక’ అనే ఉద్యోగి వంద గ్రామాలకు అధికారిగా ఉండేవాడు.


రాజు: మౌర్యుల పరిపాలనలో రాజే సర్వాధికారి. పాలన, న్యాయ విషయాల్లో అతడే అన్ని నిర్ణయాలు తీసుకునేవాడు. తనకు కావాల్సిన మంత్రి మండలి సభ్యులను రాజే స్వయంగా నియమించేవాడు.

చట్టాలను రూపొందించడం, ప్రభుత్వ నియమాలను పాటించడం, న్యాయపాలన చేయడం రాజు ప్రధాన విధి. 

* ప్రజాసంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం, రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడి, ప్రజలను రక్షించడం రాజు ప్రధాన కర్తవ్యం. 

* అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాజుకు ఉండాల్సిన కొన్ని ముఖ్య లక్షణాలను వివరించాడు. వాటిలో ముఖ్యమైనవి: రాజు అయ్యే వ్యక్తి ప్రజలకు మార్గదర్శకుడిగా, ఆ రాజ్యానికి చెందినవాడై, ధర్మశాస్త్రాల్లో నిపుణుడై ఉండాలి. మంచి శరీర సౌష్ఠవం, ధైర్యం కలిగి, నిజాయతీగా రాజ్యపాలన చేయాలి. మంచి రాజకుటుంబంలో జన్మించి, ఎలాంటి అనారోగ్యానికి గురికాని వ్యక్తిని రాజుగా నియమించాలని సూచించాడు.


సైనికపాలన: మౌర్యులు సమర్థవంతమైన సైన్యాన్ని పోషించారు. రాజు సర్వసైన్యాధిపతి. 

* ప్లినీ (గైనస్‌ ప్లినియస్‌ సెకండస్‌) అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం, మౌర్య సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వదళం, 9000 ఏనుగులు, 1000 రథాలు ఉండేవి. 

* ప్లూటార్క్‌ తన రచనల్లో రాజ్యంలో 80 వేల అశ్వదళం, 2 లక్షల కాల్బలం, 8 వేల రథాలు, 6 వేల గజబలం ఉండేదని రాశాడు. 

* సైనిక నిర్వహణకు 30 మంది సభ్యులు ఉన్న 6 కమిటీలు ఉండేవని మెగస్తనీస్‌ ఇండికాలో పేర్కొన్నాడు. అవి: నావికాదళం, సైనిక రవాణా, కాల్బలం, అశ్వదళం, రథబలం, గజబలం.

* సైనికులకు జీతాలు చెల్లించేవారు. ప్రతి సైనికుడికి సైనిక దుస్తులు, ఆయుధాలు ఇచ్చేవారు. సైనికుల బాగోగుల కోసం వివిధ రకాల వ్యవస్థలు ఉండేవి. సైన్యానికి క్రమశిక్షణ, యుద్ధవిద్యలు నేర్పించడం వీరి ప్రధాన విధి. 


న్యాయపాలన: న్యాయపాలనలో రాజే న్యాయనిర్ణేత. రాజు ఆస్థానమే ఉన్నత న్యాయస్థానం.

* ఆస్తిహక్కు తగాదాల పరిష్కారానికి ‘ధర్మస్థేయ’, అపరాధ విచారణ కోసం ‘కంఠక శోధన’ అనే న్యాయస్థానాలు ఉండేవి. 

* శిక్షలు కఠినంగా అమలు చేసేవారు. అశోకుడి కాలంలో వీటిని కొంత సడలించారు. ఉరిశిక్ష అమల్లో ఉండేది. 

మరణశిక్ష, అంగవిచ్ఛేదనం లాంటివి సాధారణ శిక్షలు. అసత్యమాడటం, పన్నులు ఎగ్గొట్టడం లాంటి నేరాలు చేసేవారిని కఠినంగా శిక్షించే వాళ్లు. 18 రకాల శిక్షలు అమల్లో ఉండేవి.


ప్రజాసంక్షేమ కార్యక్రమాలు: ప్రజల సౌకర్యం కోసం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు. వీటిని ‘పబ్లిక్‌ వర్క్స్‌’ శాఖ నిర్వహించేది. 

* రహదారుల వెంట చెట్లు నాటడం; పాదచారుల కోసం 1 - 2 మీటర్లు, రథాలకు 10 మీ., ట్రంక్‌ రోడ్లకు సుమారు 20 మీ. వెడల్పుతో రోడ్లు నిర్మించారు. 

మంచి నీరు, వైద్యశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, ధార్మిక సంస్థలు, బ్రిడ్జ్‌లు, డ్యాంలు, మార్కెట్లు, విశ్రాంతి గృహాలను ప్రభుత్వమే నిర్మించేది. 

* జంతువులకు కూడా ప్రత్యేక సదుపాయాలు ఉండేవి.


నీటి పారుదల: వ్యవసాయాభివృద్ధికి పెద్ద కాలువలు, బావులు, చెరువులు నిర్మించారు. మంచినీటి సదుపాయం ఉండేది. 

నీటిని నిల్వ చేసేందుకు పెద్ద సరస్సులు ఉండేవి. 

* చంద్రగుప్త మౌర్యుడి రాష్ట్ర గవర్నర్‌ ‘పుష్యగుప్తుడు’ గిర్నార్‌లో (గుజరాత్‌) ‘సుదర్శన తటాకాన్ని’ నిర్మించాడు. అశోకుడి కాలంలో తుషాష్పా ఈ తటాకానికి మరిన్ని కాలువలు నిర్మించి నీటిపారుదలకు కృషి చేశాడు.


జనాభా లెక్కలు: ప్రపంచ చరిత్రలోనే మౌర్య రాజులు మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ నిర్వహించారు. ఈ విషయాన్ని మెగస్తనీస్, కౌటిల్యుడు పేర్కొన్నారు. 

జనన, మరణాలను పుస్తకంలో రాసేవారు. పెద్ద నగరాల్లో ‘నాగరిక’ లెక్కలు సేకరించేవాడు. విదేశీయాత్రికులు, వ్యాపారుల సమాచారాన్ని వీరు సేకరించేవారు.

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌