• facebook
  • whatsapp
  • telegram

మౌర్య సామ్రాజ్యం - 3  

మౌర్య సామ్రాజ్య పతనం 

అశోకుడి తర్వాత రాజ్యాన్ని పాలించిన వారంతా బలహీనులు కావడంవల్ల క్రీ.పూ.187 నాటికి మౌర్య సామ్రాజ్యం పతనమైంది. దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి:

అశోకుడి మతవిధానం: కళింగయుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించి, శాంతి, అహింస, దమ్మ నియమాలతో రాజ్యపాలన చేశాడు. అశోకుడు పరమత సహనం పాటించి, బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేశాడు. దీంతో వైదికమతం నిరాదరణకు గురైంది. జంతుబలులను, మాంసాహారాన్ని నిషేధించడం లాంటి చర్యల వల్ల అన్ని వర్గాల్లో  రాజుపై వ్యతిరేకత పెరిగింది. 

అశోకుడి అహింసా విధానం: అశోకుడు అహింసా విధానాన్ని పాటించడం వల్ల మౌర్య సైన్యం యుద్ధ విద్యల్లో నైపుణ్యం కోల్పోయింది. దీంతో వీరు గ్రీకు దండయాత్రను ఎదుర్కోలేకపోయారు.

మౌర్య చక్రవర్తి శుభగసేనుడు సిరియా రాజైన ఆంటియోకస్‌కు సామంతుడయ్యాడు. సైనికబలం క్షీణించడంతో రాజ్యాధికారం కోసం చిన్న రాష్ట్రాల అధికారులు తిరుగుబాటు చేశారని రాయ్‌చౌదరి అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.

* అశోకుడు అహింసను పాటించినప్పటికీ, మరణశిక్షను రద్దు చేయలేదు. శిక్షలు కఠినంగా అమలు చేశాడు.

ఆర్థిక కారణాలు: చివరి మౌర్య చక్రవర్తులు ఆర్థికాభివృద్ధి కోసం ప్రజల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేశారు. నటులు, వేశ్యలపై కూడా పన్నులు విధించారు.

* ఈ సమయలో నకిలీ నాణేల బెడద ఉండేదని డి.డి.కోశాంబి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. దీంతో కేంద్రాధికారం తగ్గినట్లు పేర్కొన్నాడు.

* మౌర్యుల కాలంలో వర్తక, వాణిజ్య, రవాణా, సౌకర్యాలు బాగా అభివృద్ధి చెంది, రాజ్యం ఆర్థికంగా పురోగతి సాధించినట్లు రొమిల్లా థాపర్‌ అనే చరిత్రకారిణి పేర్కొంది. 

* అయితే వీరి శాసనాల్లో మౌర్య సామ్రాజ్యం ఆర్థికంగా వెనుకబడినట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఆర్థిక కారణాలతో మౌర్య సామ్రాజ్యం పతనం కాలేదని కొందరు చరిత్రకారుల వాదన.

* మౌర్యుల ప్రధాన ఆదాయవనరు ‘భూమిశిస్తు’. ఇది పంటలో 1/4 వంతు నుంచి 1/6 వంతు వరకు ఉండేది. మెగస్తనీస్‌ తన ‘ఇండికా’ గ్రంథంలో మౌర్యులు 1/4 వంతు పన్ను వసూలు చేశారని పేర్కొన్నాడు. 

* అత్యవసర పరిస్థితుల్లో పన్నులు పెంచొచ్చని అర్థశాస్త్రం పేర్కొంది. దీన్నే చివరి మౌర్యపాలకులు అవలంబించారు. దీంతో ప్రజలు అనేక చోట్ల తిరుగుబాట్లు చేశారు.

* రాజ్యంలోని ఉన్నతోద్యోగులకు ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించేవారు. 

* ఆ సమయంలో వచ్చిన కరవు కారణంగా వ్యవసాయ ఆదాయం తగ్గింది. ఫలితంగా రాజ్యనిర్వహణ, సైనిక పోషణభారం కష్టమైంది. 

* అశోకుడు బౌద్ధబిక్షువులకు పెద్దఎత్తున దానాలు చేయడం వల్ల ఖజానా ఖాళీ అయ్యింది.


బలహీనమైన వారసులు: అశోకుడి తర్వాత వచ్చిన వారసులంతా బలహీనులే. వారు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను అణచివేయడంలో విఫలమయ్యారు. అశోకుడు కూడా తన వారసుడ్ని ప్రకటించలేదు, దీంతో వారసత్వ తగాదాలు జరిగాయి. వీరంతా రాజ్యాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. ఫలితంగా మౌర్యసామ్రాజ్యం బలహీనమైంది. వీరు వాయవ్య ప్రాంతంపై జరిగిన బాక్ట్రియన్‌-గ్రీకు దండయాత్రలను ఎదుర్కోలేకపోయారు.

అంతర్యుద్ధాలు: రాజ్యం బలహీనపడ్డాక ఆంధ్రా, పంజాబ్, గాంధార, కశ్మీర్, కళింగ ప్రాంతాల్లో తిరుగుబాట్లు జరిగాయి. అవి తమను తాము స్వత్రంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. ఆ సమయంలో ఆంధ్రా ప్రాంతం శాతవాహనుల ఆధీనంలో ఉంది. వీరిని మౌర్య రాజులు అదుపు చేయలేకపోయారు.


పాలనలో అంతర్గత విభేదాలు: మౌర్య సామ్రాజ్యంలో రాజే అత్యున్నత అధికారి. పాలనలో సౌలభ్యం కోసం వీరు రాష్ట్రాలకు గవర్నర్లను, మంత్రులను నియమించారు. వీరు తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారు.

*ప్రజాభిప్రాయాన్ని చెప్పే వ్యవస్థ లేకపోవడం, కేవలం గూఢచారులపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం, కొంతమంది వద్దే ఎక్కువ అధికారాలు ఉండటం లాంటి కారణాలతో పరిపాలనలో సమర్థత లోపించింది. 

* మౌర్యుల కాలంలో ఉన్న నగరపాలన కాలక్రమేణా కష్టతరమైంది. రాజు తన అధికారాన్ని ఉద్యోగులకు, భూయజమానులకు పంచడం వల్ల ఈ సమస్య తలెత్తింది.

* అధికారుల్లో అశ్రద్ధ, అవినీతి పెరిగి, క్రమశిక్షణ లోపించి, పరిపాలన దెబ్బతింది. 


మతం: మౌర్యులు బౌద్ధమతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బౌద్ధ ఆరామాలు బలపడి రాజ్యానికి పెట్టుబడి పెట్టేస్థాయికి ఎదిగాయి. 

* ఈ ఆరామాలకు దానాలు ఎక్కువగా రావడం, వ్యాపారులు వాటిని ప్రోత్సహించడం వల్ల బ్రాహ్మణ వర్గంలో ద్వేషం పెరిగింది.

* గణ వ్యవస్థ అంతరించి, మత సంప్రదాయాలపై విధేయత పెరిగింది. రాజకీయ వ్యవస్థ కంటే వర్ణ వ్యవస్థ ప్రధానం అయ్యింది.


మాదిరి ప్రశ్నలు


1. అశోకుడ్ని మగధరాజుగా పేర్కొన్న శాసనం?

1) 13వ శిలాశాసనం 2) మస్కీ శాసనం

3) తరై స్తంభ శాసనం 4) బబ్రూ శాసనం


2. అశోకుడి పేరును ‘అశోక ప్రియదర్శి’ అని తెలుపుతున్న ఏకైక శాసనం ఏది?

1) కళింగ శాసనం    2) బరాబర్‌ గుహశాసనం

3) బబ్రూ శాసనం   4) మస్కీ శాసనం


3. చంద్రగుప్త మౌర్యుడ్ని ‘శాండ్రకోటాస్‌’గా పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?

1) టాలమీ      2) ప్లూటార్క్‌ 

3) హెరిడోటస్‌      4) ప్లినీ


4. అశోకుడికి బౌద్ధమత దీక్ష ఇచ్చిన గురువు?

1) రాజగుప్తుడు  2) ఉపగుప్తుడు

3) మహాగుప్తుడు    4) చంద్రగుప్తుడు


5. కళింగయుద్ధం గురించి ఎన్నో శిలాశాసనంలో పేర్కొన్నారు?

1) 13   2) 10   3) 8    4) 5


6. ‘‘ప్రజలందరూ నా బిడ్డలే’’ అని అశోకుడు ఎన్నో శిలాశాసనంలో పేర్కొన్నాడు?

1) 13   2) 6    3) 14    4) 8


సమాధానాలు

1-4   2-4   3-2   4-2   5-1   6-2


చివరి మౌర్య రాజులు

* అశోకుడు మరణించాక మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు పాలించారన్నదానిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. వాయుపురాణం, బ్రహ్మాండపురాణం ప్రకారం కుణాలుడు; మత్స్యపురాణం ప్రకారం దశరథుడు; రాజతరంగిణి ప్రకారం జాతకుడు; వి.ఎ.స్మిత్‌ ప్రకారం దశరథుడు, సంప్రతి ఏకకాలంలో తూర్పు, పశ్చిమ భారతదేశాన్ని పాలించారని పేర్కొన్నారు. 

* బౌద్ధగ్రంథం ‘దివ్యవదన’లో అశోకుడి తర్వాత కుణాలుడి కుమారుడైన సంప్రతి రాజ్యపాలన చేసినట్లు చెప్పగా, టిబెట్‌ చరిత్రకారుడు తారానాథ్‌ వీరసేన, సుభగసేన మౌర్యవారసులయ్యారని పేర్కొన్నాడు.

వాయు, బ్రహ్మాండ పురాణాల ప్రకారం అశోకుడి తర్వాత కుణాలుడు, బంధుపాలితుడు, ఇంద్రపాలితుడు, దేవవర్మ, శతధనుష్, బృహద్రధుడు పాలించారు. 

* విష్ణుపురాణం ప్రకారం సుయశ, దశరథుడు, సంగత, శాలిశుక, సోమవర్మ, శతధన్వ, బృహద్రధుడు పాలించారు. 

బౌద్ధగ్రంథం ‘అశోకవదనం’ ప్రకారం అశోకుడి తరువాత సంప్రతి, వృహస్పతి, వృషసేన, పుష్యధర్మ, పుష్యమిత్ర మగధను పాలించారు. 

* రొమిల్లా థాపర్‌ అనే చరిత్రకారిణి ప్రకారం అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని తూర్పు - పశ్చిమ భాగాలుగా విభజించారు. తూర్పు భాగ రాజధాని ‘పాటలీపుత్రం’. దీన్ని దశరథుడు, సంప్రతి, శాలిశుక, దేవవర్మ, శతధన్వ, బృహద్రధుడు 52 ఏళ్లు పాలించారు. పశ్చిమ భాగ రాజధాని ‘తక్షశిల’ దీన్ని మొదట కుణాలుడు, తర్వాత సంప్రతి పాలించారు. 

* బృహద్రధుడ్ని అతడి సేనాని పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి, ‘శుంగ’ వంశాన్ని స్థాపించాడు. ఇతడు బ్రాహ్మణుడు.


అశోకుడి 14 శిలాశాసనాలు

మొదటి శిలాశాసనం: ఇందులో ‘ప్రియదర్శి’ అనే పేరు ఉంది. దీని అర్థం   ‘దేవుడికి ప్రియమైనవాడు’. ఈ శిలా శాసనం అన్ని యజ్ఞాలను, ఎక్కువ పండుగలను నిషేధించింది.


రెండో శిలాశాసనం: ఇందులో మనుషులకు, జంతువులకు చేయాల్సిన వైద్య సేవల గురించి పేర్కొన్నారు. బావుల తవ్వకం, చెరువుల నిర్మాణం, బాటల పక్కన చెట్లు పెంచడం, వివిధ సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన ఉంది.


మూడో శిలాశాసనం: ఇందులో ‘యుక్తుల’ నియామకం గురించి ఉంది. ‘యుక్త’ అంటే కింది తరగతి అధికారి. అలాగే ‘రజ్జుక’ (గ్రామీణ పాలనాధికారి), ‘ప్రదేశిక’ (జిల్లా అధికారి) నియామకం గురించి ఉంది.


నాలుగో శిలాశాసనం: ఇందులో బేరిఘోషను దమ్మఘోషగా మార్చారు. పెద్దలను, రుషులను, మునులను, బంధువులను గౌరవించాలని ఇందులో ఉంది. హత్యలు చేయకూడదని, ఇతరులను హింసించకూడదని ఇందులో పేర్కొన్నారు.


అయిదో శిలాశాసనం: ఇందులో ధర్మమహామాత్యుల నియామకం, వారి విధులను పేర్కొన్నారు. 


ఆరో శిలాశాసనం: ఏ పనిలో ఉన్నా, రాజు తాను చేయాల్సిన విధులను వెంటనే చేయాలని ఇందులో ఆదేశించారు. అందరి సంక్షేమం కోరుకునే తండ్రిలా రాజు వ్యవహరించాలని పేర్కొన్నారు.


ఏడో శిలాశాసనం: ఏ శాఖవారైనా ఎక్కడైనా నివసించొచ్చని ఇందులో ఉంది. ఆత్మనిగ్రహం లేని ఔదార్యం నీచగుణం లాంటిదని ఇందులో పేర్కొన్నారు.


ఎనిమిదో శిలాశాసనం: అధికారంలోకి వచ్చిన పదేళ్లకు తాను బోధి వృక్షాన్ని సందర్శించినట్లు ఇందులో అశోకుడు పేర్కొన్నాడు.


తొమ్మిదో శిలాశాసనం: ధర్మానికి ఉన్న ప్రాధాన్యం, విలువ దేనికీ లేవని పేర్కొన్నాడు. దమ్మం అంటే ఉపాధ్యాయులను గౌరవించడం, సేవకులను, బానిసలను సరిగ్గా చూసుకోవటం, సకల జీవకోటి పట్ల దయగా ప్రవర్తించడం అని తెలిపాడు.


పదో శిలాశాసనం: ఇందులో అశోకుడు తనకు వ్యక్తిగత కీర్తి కాంక్ష లేదని స్పష్టం చేశాడు. తన ప్రజలు ధర్మం పాటించడమే తన ఏకైక వాంఛ అని అశోకుడు పేర్కొన్నాడు.


పదకొండో శిలాశాసనం: ధర్మ బహుమతి కంటే మరే బహుమతి, కానుక విలువైనవి కావని ఇందులో చెప్పాడు. ధర్మ ప్రవర్తన వచ్చే జన్మలో కూడా ఉపయోగపడుతుందని తెలిపాడు.


పన్నెండో శిలాశాసనం: అన్ని శాఖలనూ గౌరవించాలని ఈ శాసనం కోరుతుంది.


పదమూడో శిలాశానసం:

1. ధర్మ విజయమే మహోన్నత విజయం.

2. ధర్మాన్ని అన్ని దిశలా వ్యాప్తిచేయాలి.

3. టాలెమీ, ఆంటియోకస్, అలెగ్జాండర్,  పాండ్యులు, చోళుల ప్రస్తావన ఉంది.


పద్నాలుగో శిలాశాసనం: ఇందులో రెండు ప్రత్యేక శాసనాలున్నాయి.

1. అధికారులు న్యాయంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి.

2. కొండజాతి ప్రజల సంక్షేమం కోసం అధికారులు, యువరాజులకు సూచనలు ఇచ్చారు.

Posted Date : 24-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌