• facebook
  • whatsapp
  • telegram

మౌర్యసామ్రాజ్యం -2

* బౌద్ధసాహిత్యం ప్రకారం, మౌర్యుల జన్మస్థానంలో ‘నెమళ్లు’ అధికంగా ఉండటం వల్ల ‘మౌర్య’ అనే పేరు వచ్చింది. 

* ముద్రారాక్షసం, విష్ణుపురాణం ప్రకారం చంద్రగుప్తుడి తల్లి ‘ముర’. ఆమె పేరు మీదే ఈ వంశానికి మౌర్య అనే పేరు వచ్చింది.

* గ్రీకు చరిత్రకారుడు జస్టిన్‌ ప్రకారం చంద్రగుప్తుడు సామాన్య కుటుంబానికి చెందినవాడు. ముద్రారాక్షసంలో ఇతడ్ని కులహీనుడిగా, వృషలుడి (శుద్రుడు)గా అభివర్ణించారు. 

* బౌద్ధగ్రంథాల ప్రకారం ‘మెరియ’ నుంచి ‘మౌర్య’ వచ్చింది. 

*మహావంశం (బౌద్ధగ్రంథం), పరిశిష్టపర్వం (జైనగ్రంథం) గ్రంథాల్లో మౌర్యులను క్షత్రియులుగా పేర్కొన్నారు.

చంద్రగుప్త మౌర్యుడు

* ఈయన క్రీ.పూ. 322 నుంచి క్రీ.పూ. 298 వరకు రాజ్యపాలన చేశాడు. 

* జైన సాహిత్యంలో చంద్రగుప్తుడు ఒక గ్రామాధికారి కుమారుడని ఉంది; ఇతడు నందరాజుకు, శూద్ర స్త్రీకి పుట్టాడని కొంతమంది చరిత్రకారుల భావన.

* చంద్రగుప్తుడి తండ్రి చిన్నతనంలో మరణించాడు. 

* చంద్రగుప్తుడిలోని ప్రతిభను గుర్తించిన కౌటిల్యుడు, ముర సమ్మతితో అతడ్ని తక్షశిలకు తీసుకెళ్లి అక్కడ అనేక విద్యలు నేర్పించాడు.

* కౌటిల్యుడు తనను అవమానించిన నందరాజును ఓడించాలని గురుదక్షిణగా కోరతాడు. 

* నందరాజును ఓడించేందుకు చంద్రగుప్తుడు పంజాబ్‌లో ఉన్న అలెగ్జాండర్‌ సాయం కోరాడు. దీనికి అతడు నిరాకరించి చంద్రగుప్తుడ్ని బంధించాలని ప్రయత్నించాడు. గ్రీకు రచయిత ప్లూటార్క్‌(Plutarch)  రాసిన ‘లైఫ్‌ ఆఫ్‌ అలెగ్జాండర్‌’ గ్రంథంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు.

*క్రీ.పూ. 323లో అలెగ్జాండర్‌ మరణించాక, పంజాబ్‌లో అలజడి చెలరేగింది. కాందహార్‌లో తిరుగుబాటురాగా, పంజాబ్‌ గవర్నర్‌ ‘ఫిలిప్సన్‌’ను హత్య చేశారు.

*సింధులో గ్రీకుల అధికారం నామమాత్రం అయ్యింది.

* ఈ పరిస్థితులను చంద్రగుప్తుడు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. 

* స్థానిక తెగలతో బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, పర్వతరాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

* వాయవ్య భారతదేశంపై దండెత్తి ‘పంజాబ్‌’ను ఆక్రమించాడు. 

* క్రీ.పూ. 322లో చాణక్యుడి ఆదేశం మేరకు పాటలీపుత్రాన్ని ఆక్రమించి, చివరి నందరాజైన ధననందుడ్ని వధించి తనను మౌర్య చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. 

* అలెగ్జాండర్‌ భారత్‌లో ఆక్రమించిన భూభాగాన్ని, అతడి మరణం తర్వాత అలెగ్జాండర్‌ సేనానులు పంచుకున్నారు. 

* తూర్పు భాగాలైన పంజాబ్, సింధును ఆక్రమించడానికి కీ.పూ. 305లో సెల్యుకస్‌ నికేటర్‌ (అలెగ్జాండర్‌ సర్వసేనాని, బాక్ట్రియా పాలకుడు) భారతదేశంపైకి దండెత్తి వచ్చాడు. అతడు చంద్రగుప్తుడి చేతిలో ఓడి, సంధి కుదుర్చుకున్నాడు.

* దీని ప్రకారం సెల్యుకస్‌ తన కుమార్తె ‘హెలెనా’ని చంద్రగుప్తుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాక హీరట్, కాబూల్, కాందహార్, బెలూచిస్థాన్‌ రాష్ట్రాలను; 500 ఏనుగులను బహుమతిగా ఇచ్చాడు. 

* సెల్యుకస్‌ తన రాయబారిగా ‘మెగస్తనీస్‌’ని చంద్రగుప్తుడి ఆస్థానానికి పంపాడు.  

* జస్టిన్‌ అనే గ్రీకు రచయిత ప్రకారం, చంద్రగుప్తుడు అవంతి, సౌరాష్ట్రలతోపాటు మొత్తం భారతదేశాన్ని జయించాడు.

* శకరుద్రదాముడు వేయించిన ‘జునాగఢ్‌ శాసనం’ ప్రకారం, సౌరాష్ట్ర చంద్రగుప్తుడి రాజ్యంలో భాగం. 

*చంద్రగుప్త మౌర్యుడి గురించి తెలిపే మొట్టమొదటి ఆధారం ‘జునాగఢ్‌ శాసనం’. 

* చంద్రగుప్తుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాక రాజ్య విస్తరణపై దృష్టి సారించాడు. 

*అతడు పశ్చిమాన ఆక్మాస్‌ నది నుంచి తూర్పున బెంగాల్‌ వరకు; ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన కర్ణాటకలోని ‘సిద్ధపురం’ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 

* చోళ, చేర, పాండ్య, సత్యపుత్ర, కేరళ రాజ్యాలు మినహా యావత్‌ భారతదేశం మౌర్య సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చింది. 

* ఇండికా గ్రంథం ప్రకారం, చంద్రగుప్తుడి సైన్యంలో ఆరు లక్షల పదాతిదళం, ముప్పై వేల అశ్వదళం, తొమ్మిది వేల గజదళం, ఎనిమిది వేల రథబలం ఉంది.

*గ్రీకులు చంద్రగుప్త మౌర్యుడ్ని ‘శాండ్రకొట్టాస్‌’, ‘ఫాలిబ్రోతస్‌’ అని పిలిచేవారు.

ఇతర అంశాలు:

* జునాగఢ్‌ శాసనం ప్రకారం చంద్రగుప్తుడి రాష్ట్రపాలకుడు ‘పుష్యగుప్తుడు’. వ్యవసాయాభివృద్ధికి ఇతడు జునాగఢ్‌లో సుదర్శన సరోవరాన్ని (తటాకాన్ని) నిర్మించాడు.

* చంద్రగుప్తుడు పరిపాలనలో పటిష్ఠ పాలనా యంత్రాంగాన్ని రూపొందించి, తనదైన ముద్ర వేశాడు.

* ‘పరిశిష్ట పర్వం’ అనే జైన గ్రంథం ప్రకారం మగధలో 12 సంవత్సరాలు క్షామం (కరవు) సంభవించింది. ఆ సమయంలో చంద్రగుప్తుడు తన కుమారుడైన ‘బిందుసారుడికి’ రాజ్యాధికారాన్ని అప్పగించాడు. 

* జైన గురువు ‘భద్రబాహు’ బోధనలకు ప్రభావితుడైన చంద్రగుప్తుడు అతడితోపాటు కర్ణాటకలోని ‘శ్రావణబెలగొళ’కి వెళ్లి, అక్కడే జైనమతాన్ని స్వీకరించాడు. ‘సల్లేఖనవ్రతం’ (ఉపవాసం ఉండి, శరీరాన్ని కృశింపజేసుకోవడం) పాటించి నిర్యాణం పొందాడు. 

*శ్రావణబెలగొళలో నేటికీ ఒక కొండను ‘చంద్రగిరి’ అని, జైన దేవాలయాన్ని ‘చంద్రగుప్తబసది’ అని పిలుస్తున్నారు. 

* భారతదేశంలో మొట్టమొదటిసారి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, సుస్థిర పాలన అందించి, విదేశీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించిన ఏకైక తొలి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు.

* ‘‘చరిత్రకు తెలిసిన ఘనులైన రాజుల్లో ఒకడిగా చంద్రగుప్తుడి కీర్తిని చాటిచెప్పొచ్చు’’ అని  వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.

బిందుసారుడు

* ఇతడు క్రీ.పూ.298 నుంచి క్రీ.పూ. 273 వరకు రాజ్యపాలన చేశాడు.

* ఇతడు చంద్రగుప్తుడి కుమారుడు. మౌర్య సామ్రాజ్యానికి రెండో చక్రవర్తి. 

* బిందుసారుడు తన తండ్రి విస్తరించిన సామ్రాజ్యాన్ని సంరక్షించి, తూర్పు-పశ్చిమ సముద్రాల మధ్య ఉన్న 16 నగరాలను జయించాడని టిబెట్‌ చరిత్రకారుడు ‘తారానాథ్‌’ పేర్కొన్నాడు. 

* ఇతనికి ‘అమిత్రఘాత’ (శత్రు సంహారి), ‘సింహసేనుడు’ (జైనగ్రంథం రాజవళికథ ప్రకారం) అనే బిరుదులు ఉన్నాయి. 

* గ్రీకులు ఇతడ్ని ‘అమిత్రఖేట్స్‌’ అని పిలిచేవారు.

* కౌటిల్యుడు, ఖల్లాటకుడు, రాధాగుప్తుడు ఇతడి ప్రధానులుగా పనిచేశారు. 

* బిందుసారుడు తక్షశిలకు సుశీనుడ్ని, ఉజ్జయినికి అశోకుడ్ని రాష్ట్రపాలకులుగా నియమించాడు.

* తక్షశిలలో పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగ్గా అశోకుడు అక్కడికి వెళ్లి దాన్ని అణచివేశాడు. దీంతో బిందుసారుడు తక్షశిలకు ప్రతినిధిగా అశోకుడ్ని నియమించాడు. అశోకవదనం, దివ్యవదనం గ్రంథాల్లో ఈ విషయాలు ఉన్నాయి.

* సిరియా రాజైన ఆంటియోకస్‌ సోతర్‌ తన రాయబారిగా ‘డమేఖస్‌’ను, ఈజిప్ట్‌ రాజు రెండో టాలమీ ఫిలడెల్పస్‌ తన రాయబారిగా ‘డయోనిసియస్‌’ను బిందుసారుడి ఆస్థానానికి పంపారు. 

* బిందుసారుడు గ్రీకు, ఈజిప్ట్‌ దేశాలతో దౌత్య సంబంధాలు నెలకొల్పాడు. 

* ఇతడి ఆస్థానంలో ‘పింగళివత్స’ అనే అజీవక సన్యాసి ప్రముఖ స్థానం పొందాడని ‘దివ్యవదనం’ గ్రంథంలో ఉంది. 

క్రీ.పూ.272లో బిందుసారుడు మరణించాక, నాలుగేళ్లపాటు సింహాసనం కోసం వారసుల మధ్య యుద్ధాలు జరిగాయి. చివరికి అశోకుడు విజయం సాధించి క్రీ.పూ.268లో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు.

చారిత్రక ఆధారాలు

అర్థశాస్త్రం:

* కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లో మౌర్యుల చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. 

* ఇది మౌర్యుల కాలంనాటి పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలుపుతుంది.

* కౌటిల్యుడు, చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి. ఈయన్ను ‘ఇండియన్‌ మాఖియవెల్లి’ అంటారు. 

* అర్థశాస్త్రంలో 6000 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని 15 భాగాలు, 18 ఉపభాగాలు, 150 ప్రకరణలుగా విభజించారు. 

* శ్యామశాస్త్రి మొదటిసారి దీన్ని సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. 

* ఆర్థశాస్త్రంలో రాజనీతి, సంక్షేమపాలన, రాజుకు ఉండాల్సిన లక్షణాలు, ఇంకా మరెన్నో విషయాలను పొందుపరిచారు. 

* కౌటిల్యుడికి ఉన్న ఇతర పేర్లు - ‘విష్ణుగుప్తుడు’, చాణక్యుడు’.


ఇండికా:

* గ్రీకు రచయిత మెగస్తనీస్‌ రచించిన ‘ఇండికా’ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడి పాలన, నగర పాలనను వివరించారు.

* ఆనాటి సమాజంలో ఏడు వర్గాలు ఉన్నట్లు ఆ గ్రంథంలో ఉంది. 

*ఇండికా గ్రంథం పూర్తి స్థాయిలో చరిత్రకారులకు లభించలేదు. అందులోని కొన్ని భాగాలు మాత్రమే ఇప్పటి వరకు లభించాయి.

*మెగస్తనీస్, సెల్యుకస్‌ నికేటర్‌ రాయబారిగా చంద్రగుప్తుడి ఆస్థానంలోకి వచ్చి, తాను స్వయంగా చూసిన విషయాలను గ్రంథ రూపంలో పొందుపరిచాడు.


ఇతర ఆధారాలు:

* అశోకుడి శిలా శాసనాల్లో మౌర్యుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వీటిని శిలా, స్తంభ, గుహ శాసనాలుగా వర్గీకరించారు. ఈ రకమైనవి దేశవ్యాప్తంగా 14 శిలాశాసనాలు లభించాయి. వీటిని బ్రహ్మీ, కరోష్ఠి లిపిలో రాశారు. ఇవి అశోకుడి దమ్మ విధానం, బౌద్ధమత సేవ, మౌర్యుల చరిత్రను తెలియజేస్తున్నాయి.

* విశాఖదత్తుడు రచించిన ‘ముద్రా రాక్షస గ్రంథం’లో మౌర్యుల ప్రస్తావన ఉంది. దీన్ని గుప్తుల కాలంలో రాశారు. చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా సింహాసనాన్ని అధిష్టించాడో ఇందులో ఉంది. అంతేకాక మౌర్యుల కాలం నాటి సమకాలీన పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి.

* సింహళదేశ (శ్రీలంక) బౌద్ధ గ్రంథాలైన దీపవంశం, మహావంశం; మహావంశంపై  వ్యాఖ్యాన గ్రంథం వసంత ప్రకాశిని; టిబెట్‌కి చెందిన ‘లాయా-తారానాథ్‌’ రచనలు; కల్హణుడి ‘రాజతరంగిణి’; సోమదేవుడి ‘కథా సరిత్సాగరం’ మొదలైనవి మౌర్యుల చరిత్రను తెలియజేస్తున్నాయి. 

* విదేశీ రచయితలైన స్ట్రాబో, డయోనిసియస్, ఫాహియాన్, హుయాన్‌ త్సాంగ్‌ తమ రచనల్లో మౌర్య సామ్రాజ్యం గురించి ప్రస్తావించారు.

* బుద్ధుడి జాతక కథలు, హేమచంద్రుడి పరిశిష్టపర్వన్, పురాతన కట్టడాలు, నిర్మాణాలు, తవ్వకాల్లో లభించిన నాణేలు, శాసనాలు మొదలైనవి మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు.

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌