• facebook
  • whatsapp
  • telegram

గుప్తానంతర యుగం - హర్షవర్ధనుడు

హర్షవర్ధనుడు క్రీ.శ.606 నుంచి క్రీ.శ.647 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు ఉత్తర భారతదేశాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, ఎన్నో విజయాలు సాధించాడు. ఇతడు గొప్ప హిందూ చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు.


ఆధారాలు

* క్రీ.శ. 6వ శతాబ్ది ద్వితీయార్ధ భాగం, 7వ శతాబ్ది కాలానికి చెందిన శాసనాల ద్వారా ఆనాటి సాంఘిక, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. చివరి గుప్త రాజులు వేయించిన శాసనాలు, మౌఖరులు, మైత్రకులు, చాళుక్యులు, బెంగాల్, ఒడిశా రాజుల శాసనాలు, సాహిత్య రచనలు, యాత్రికుల రచనలు మొదలైనవి కూడా నాటి చరిత్రకు ఆధారాలు. 

* హర్షుడి కాలానికి చెందిన ‘బన్సీఖేరా’, ‘మధుబన్‌ సోపటి’ శాసనాలు హర్షవర్ధనుడు రాజైన విధాన్ని తెలుపుతున్నాయి. హర్షుడు కాలంనాటి నాణేలు, కట్టడాలు మొదలైన పురావస్తు ఆధారాలు పుష్యభూతి వంశ చరిత్రను వివరిస్తున్నాయి.

వివిధ ధర్మశాస్త్రాలు, కామాందకుడి నీతిశాస్త్రం, వాత్సాయన కామసూత్రాలు, స్మృతుల ద్వారా నాటి దండనీతి, పరిపాలనా వ్యవస్థ గురించి తెలుసుకోవచ్చు. 

* స్వదేశీ రచనల్లో దండి రచించిన ‘దశకుమార చరిత్ర’; హర్షుడు స్వయంగా రాసిన ‘రత్నావళి’, ‘ప్రయదర్శిక’, ‘నాగానందం’; బాణుడి ‘కాదంబరి’ నాటకం మొదలైనవి హర్షుడి గురించి వివరిస్తున్నాయి. 

* బాణుడు రాసిన ‘హర్షచరిత్ర’లో హర్షుడి జీవితం, అతడు తన చెల్లెలు ‘రాజ్యశ్రీ’ని కాపాడిన విధానం గురించి ఉంది. కొంతమంది చరిత్రకారులు భారతీయ సాహిత్యంలో రాజుల జీవిత చరిత్ర గురించి రాసిన మొదటి గ్రంథంగా దీన్ని పేర్కొంటారు.

* చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ రాసిన ‘సి-యు-కి’, హ్యుతి రచించిన ‘హుయాన్‌త్సాంగ్‌ జీవిత చరిత్ర’ గ్రంథాలు హర్షుడితోపాటు నాటి సమకాలీన పరిస్థితుల గురించి తెలుపుతున్నాయి.

* రెండో పులకేశి ‘ఐహోలు’ శాసనంలో హర్షుడి దండయాత్రల గురించి ఉంది.


హర్షవర్ధనుడు (క్రీ.శ. 606-647)

* ఇతడు క్రీ.శ. 606లో పరిపాలనా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాజుగా పట్టాభిషేకం క్రీ.శ. 612లో జరిగింది.

* హర్షుడు తన ముఖ్యమంత్రి ‘బందీ’కి పాలనా బాధ్యతలు అప్పగించి సోదరి రాజ్యశ్రీని వెతుక్కుంటూ సైన్యంతో కనౌజ్‌ చేరాడు. అక్కడ చెల్లెల్ని రక్షించి, కనౌజ్‌ను తన రాజ్యంలో కలుపుకున్నాడు. 

* ఆర్‌.ఎస్‌.ఛటోపాధ్యాయ అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం, ‘హర్షశకం’ క్రీ.శ.606లో ప్రారంభమైంది. 

* ‘‘కనౌజ్‌ను తన రాజ్యంలో కలుపుకోవడం హర్షవర్ధనుడికి ఇష్టం లేదు. గృహవర్మకు వారసులు లేకపోవడం వల్ల ‘పోని’ అనే మంత్రి సలహా మేరకు, బోధిసత్వుడి ప్రోత్సాహంతో కనౌజ్‌ రాజుగా ఉండటానికి అంగీకరించాడు’’ అని హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో పేర్కొన్నాడు.

* చైనా చారిత్రక గ్రంథం ‘ఫంగ్‌-చి’లో హర్షుడు తన చెల్లెలు రాజ్యశ్రీతో కలిసి కొంతకాలం రాజ్యపాలన చేశాడని, చివరికి కనౌజ్‌పై పూర్తి అధికారం పొందాడని ఉంది.


పుష్యభూతి వంశం

* బాణుడి ‘హర్షచరిత్ర’ ప్రకారం, హర్షవర్ధనుడు తూర్పు పంజాబ్‌లోని స్థానేశ్వరాన్ని రాజధానిగా చేసుకుని పాలన ప్రారంభించాడు. వీరి మూలపురుషుడు ‘పుష్యభూతి’, అందుకే వీరికి పుష్యభూతి వంశం అనే పేరు వచ్చింది.

* పుష్యభూతి వంశంలో మూడోతరానికి చెందిన ఆదిత్యవర్ధనుడు గుప్త రాకుమారి మహాసేనగుప్తను వివాహం చేసుకున్నాడు. దీంతో పుష్యభూతి వంశం రాజకీయంగా ప్రాముఖ్యం పొందింది. 

* ఆదిత్యవర్ధనుడి కుమారుడు ప్రభాకరవర్ధనుడు. ఇతడికి ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు ఉంది. 

* హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడ్ని ‘హూణహరికేసరి’ (హూణులనే జింకలకు సింహం లాంటివాడు) అని పేర్కొన్నారు. ఇతడికి ‘పరమభట్టారక’ అనే బిరుదు కూడా ఉంది. ఇతడు మాళవరాజు యశోధర్ముడి కుమార్తె యశోమతిదేవిని వివాహం చేసుకున్నాడు. 

* ప్రభాకరవర్ధనుడికి రాజ్యవర్ధనుడు, హర్షవర్ధనుడు అనే కుమారులు, రాజ్యశ్రీ అనే కుమార్తె ఉన్నారు. 

ఇతడు తన కుమార్తెను మౌఖరి వంశస్థుడైన గృహవర్మకి ఇచ్చి వివాహం చేశాడు. గృహవర్మ కన్యాకుబ్జానికి (కనౌజ్‌) రాజు. 

* మాళ్వా గుప్తరాజులకు, మౌఖరీ వంశానికి రాజకీయ శత్రుత్వం ఉంది. మాళ్వా రాజైన దేవగుప్తుడు బెంగాల్‌ రాజు గౌడశశాంకుడి సహాయంతో ‘గృహవర్మను’ ఓడించి, వధించాడు. రాజ్యశ్రీని చెరబట్టాడు.

* ఇలాంటి పరిస్థితుల్లో క్రీ.శ.604లో హూణులు స్థానేశ్వరంపై దాడిచేసి, ప్రభాకరవర్ధనుడ్ని చంపారు. తర్వాత పెద్దకుమారుడు రాజ్యవర్ధనుడు స్థానేశ్వర రాజయ్యాడు. తన బావ గృహవర్మ మరణానికి ప్రతీకారంగా రాజ్యవర్ధనుడు దేవగుప్తుడిపై దండెత్తి, ఓడించి, వధించాడు. అయితే గౌడశశాంకుడి కుట్ర ఫలితంగా రాజ్యవర్ధనుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారసత్వంగా రాజ్యం హర్షవర్ధనుడికి దక్కింది.


హర్షుడి దండయాత్రలు

* హర్షుడు కనౌజ్‌ను తన రాజ్యంలో కలుపుకున్నాక, అక్కడి నుంచే రాజ్యపాలన ప్రారంభించాడు. ఇతడు స్థానేశ్వరం, కనౌజ్‌లను ఏకం చేసి ‘శిలాదిత్య’ అనే బిరుదు పొందాడు.

* హర్షుడు దాదాపు 6 సంవత్సరాలపాటు నిరంతర యుద్ధాలతో రాజ్యాలను జయిస్తూ, తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 

* హర్షుడి సైన్యం మాళ్వాపై దండెత్తి, దేవగుప్తుడ్ని ఓడించింది. 

ఇతడు యుద్ధంలో గుజరాత్‌ పాలకుడు రెండో ధ్రువసేనుడ్ని (ధ్రువభటుడు) జయించి, తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు.

* గౌడ రాజైన శశాంకుడ్ని హర్షవర్ధనుడు ఓడించాడని ఆర్‌.డి.బెనర్జీ, రాజేంద్రప్రసాద్‌లు పేర్కొనగా, క్రీ.శ. 619-629 మధ్య హర్షుడు, భాస్కరవర్మ కలిసి శశాంకుడ్ని ఓడించారని ఆర్‌.ఎస్‌.త్రిపాఠి, ఆర్‌.సి.మజుందార్‌ వెల్లడించారు. క్రీ.శ. 637లో గౌడశశాంకుడు మరణించాడు. తర్వాత హర్షుడు బెంగాల్‌ను తన రాజ్యంలో కలుపుకున్నాడు.

* హర్షుడు పూర్ణవర్మను ఓడించి, అతడ్ని మగధకి గవర్నర్‌గా నియమించాడు. 

* ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుని క్రీ.శ. 641లో ‘మగధాధిపతి’ అనే బిరుదు పొందాడు. 

* హర్షుడు తన దండయాత్ర రెండో భాగంలో సట్లెజ్‌ వరకు దండయాత్ర చేసి సన్‌కీస, అంత్రజిఖేర, గోవిసాన, బ్రాహ్మపుర, మతిపుర, సృఘ్న, స్థానేశ్వర, మధుర, జైపూర్, సర్హింద్, కుల్లు, జలంధర్, చీనభుక్తి, తక్క ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు.

* క్రీ.శ.629లో వల్లభి రాజులైన ధ్రువసేన, ఆదిత్యను ఓడించాడు. దీంతో తన రాజ్యం తపతి మైదానం వరకు విస్తరించింది. 

* బాణుడు తన హర్షచరిత్రలో హర్షుడు కశ్మీర్, నేపాల్, సింధూ రాజ్యాలను జయించాడని పేర్కొన్నాడు.

రెండో పులకేశితో యుద్ధం 

* ఉత్తరాన తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాక హర్షుడు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేశాడు. ఆ సమయంలో బాదామి చాళుక్య రాజు రెండో పులకేశి దక్షిణ భారతదేశాన్ని సమైక్యం చేసి పాలిస్తున్నాడు. అతడు హర్షుడిని నర్మదానది ఒడ్డున ఓడించాడు. 

ఈ రెండు రాజ్యాలకు నర్మదానది సరిహద్దు అయ్యింది. రెండో పులకేశి క్రీ.శ. 635లో వేయించిన ‘ఐహోల్‌’ శాసనంలో ఈ ప్రస్తావన ఉంది. ఈ శాసనంలో హర్షుడిని ‘సకలోత్తర పథేశ్వరుడు’గా కీర్తించారు.

* ఈ యుద్ధం తర్వాత రెండో పులకేశి ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు. 

* ఈ దండయాత్ర గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ‘‘హర్షుడికి, రెండో పులకేశికి మధ్య క్రీ.శ. 63034 మధ్య యుద్ధం జరిగిందని’’ రాధాకమల్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ‘‘క్రీ.శ. 612లో హర్షుడిని పులకేశి ఓడించాడు. ఇదే విషయం క్రీ.శ. 612 నాటి పులకేశి హైదరాబాద్‌ శాసనంలో ఉంది. కాబట్టి వీరి మధ్య యుద్ధం క్రీ.శ. 612లో జరిగిందని’’ కె.ఎ.నీలకంఠశాస్త్రి తెలిపారు.

* సింధూ, నేపాల్‌ దండయాత్రల తర్వాత హర్షుడు క్రీ.శ. 634లో ఒడిశాలోని గంజాంపై యుద్ధం చేసినట్లు వివిధ చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 

* హర్షుడు కశ్మీర్‌ను, క్రీ.శ. 642 నాటికి ఒడిశాలోని ఓడరేవు ప్రాంతాన్ని ఆక్రమించి, పాలించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.

* హుయాన్‌త్సాంగ్‌ తన రచనల్లో ‘‘హర్షుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ఉన్న రాజ్యాలన్నింటినీ జయించాడని, పంచ భారత్‌ రాజ్యాలకు అతడు ప్రభువని, అతడి పాలన సుదూర ప్రాంతాలకూ వ్యాపించిందని’’ రాశాడు.

* హర్షుడి సామ్రాజ్యం పశ్చిమాన వల్లభి, సౌరాష్ట్ర; తూర్పున కామరూప; దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించింది. 

* హర్షుడు తన పాలనా కాలంలో చైనా పాలకుడు ‘టై-త్సంగ్‌’ ఆస్థానానికి రాయబార బృందాన్ని పంపాడు. ‘సుంగ్‌’ అనే బ్రాహ్మణ రాయబారి చైనాకు వెళ్లగా, అక్కడి నుంచి  ఒక రాయబార బృందం భారతదేశానికి వచ్చింది.

*ఈవిధంగా హర్షుడు ఉన్నంత వరకు ఉత్తర భారతదేశ రాజ్యం సమైక్యంగా ఉంది. అతడి మరణానంతరం రాజ్యం విచ్ఛిన్నమై సామంతుల హస్తగతం అయ్యింది.

* ఇంత విశాల సామ్రాజ్యం స్థాపించిన హర్షవర్ధనుడు పరిపాలన విషయంలో తనదైన ముద్ర వేసి ఎన్నో పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు.


గుప్తయుగం - మాదిరి ప్రశ్నలు

1. విలుకాడు, గండ్రగొడ్డలి, పులి రూపాలతో ఉన్న నాణేలను ముద్రించిన గుప్త చక్రవర్తి ఎవరు?

1) శ్రీగుప్తుడు      2) సముద్రగుప్తుడు   3) రెండో చంద్రగుప్తుడు    4) రామగుప్తుడు


2. గుప్తుల కాలం నాటి సాంఘిక ఆధారాల గురించి తెలిపే గ్రంథం ఏది? 

1) విశాఖదత్తుడి ముద్రారాక్షసం     2)అలహాబాద్‌ శాసనం

3) హుయాన్‌త్సాంగ్‌ సి-యు-కి గ్రంథం    4) మందసోర్‌ శాసనం


3. సింహం గుర్తు ఉన్న నాణేలను ముద్రించిన గుప్త చక్రవర్తి ఎవరు?

1) రెండో చంద్రగుప్తుడు      2) సముద్రగుప్తుడు   3) రామగుప్తుడు      4) స్కందగుప్తుడు


4. బంగారు నాణేలు విడుదల చేసిన గుప్తచక్రవర్తి ఎవరు?

1) బుధగుప్తుడు     2) స్కందగుప్తుడు       3) సముద్రగుప్తుడు    4) మొదటి చంద్రగుప్తుడు


5. గుప్తులు తమ రాజ్యాన్ని పాలనా సౌలభ్యం కోసం కింది ఏ క్రమంలో విభజించారు?

1) విషయాలు, నాణేెలు, ప్రదేశాలు    2) భుక్తులు, విషయాలు, ప్రదేశాలు

3) విషయాలు, ప్రదేశాలు, భుక్తులు    4) ప్రదేశాలు, విషయాలు, భుక్తులు


6. గుప్తవంశ మూల పురుషుడు ఎవరు?

1) శ్రీముఖుడు        2) శ్రీగుప్తుడు    3) శ్రీకృష్ణుడు        4) రామగుప్తుడు


7. శ్రీగుప్తుడికి, మొదటి చంద్రగుప్తుడికి మధ్య భారతదేశాన్ని పాలించిన గుప్త చక్రవర్తి?

1) రామగుప్తుడు      2) ఘటోత్కచగుప్తుడు     3) సముద్రగుప్తుడు     4) రెండోచంద్రగుప్తుడు


సమాధానాలు

12   23   31   44   52   62   72

Posted Date : 20-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌