• facebook
  • whatsapp
  • telegram

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

* సెక్యూరిటీ కాంట్రాక్టుల (క్రమబద్ధ) చట్టం - 1956 ప్రకారం ‘సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘాన్ని ‘స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌’  (Stock Exchange) అంటారు. నమోదైన లేదా నమోదు కాని వ్యక్తులు ఈ సంఘంలో ఉంటారు.

* వ్యవస్థీకృత మూలధన మార్కెట్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ముఖ్యమైన భాగం. ఇందులో పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీల క్రయవిక్రయాలు జరుగుతాయి. దీన్నే స్టాక్‌ మార్కెట్‌ అని కూడా పిలుస్తారు. దేశంలోని ఆర్థిక వాతావరణానికి దీన్ని భారమితిగా పేర్కొంటారు.

* కంపెనీల చట్టం ప్రకారం కంపెనీలు తమ సెక్యూరిటీలను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అధికారిక జాబితాల్లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో చేర్చిన సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పరిధిలో జరుగుతాయి. జాబితాలో చేర్చని సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లను మధ్యవర్తులు (బ్రోకర్లు) ఎక్స్ఛేంజ్‌ వెలుపల నిర్వహిస్తారు. ప్రభుత్వ సెక్యూరిటీలకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి పొందిన ప్రభుత్వ బ్రోకర్లు ఉంటారు.

* స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో చేర్చిన సెక్యూరిటీలకు మార్కెట్‌లో న్యాయబద్ధమైన ధర లభిస్తుంది. పన్నుల విధింపులోనూ కొన్ని రాయితీలు లభిస్తాయి. ఈ సెక్యూరిటీలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. పరపతిని సులభంగా పొందొచ్చు. వాటాల బదిలీ కూడా తేలిగ్గా జరుగుతుంది. ఇలాంటి సెక్యూరిటీలు ఉన్న కంపెనీలకు మార్కెట్‌లో గౌరవం, నమ్మకం ఎక్కువగా ఉంటాయి.  
 

షేర్‌/ వాటా: షేర్‌ అంటే వాటా లేదా భాగం అని అర్థం. ఏదైనా కంపెనీ షేర్‌ను కొంటే అందులో మనకు భాగం ఉందని అర్థం. వ్యాపార విస్తరణకు, వస్తూత్పత్తికి, నిర్వహణ సంబంధిత కార్యకలాపాలకు అవసరమయ్యే డబ్బును సమకూర్చుకునేందుకు కంపెనీలు వాటాలు లేదా షేర్లను విక్రయిస్తాయి. క్రయ, విక్రయాలు: ఒక కంపెనీకి మెరుగైన లాభాలు వస్తే, దాని షేర్లు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. నష్టాలు వస్తే అప్పటికే కొన్నవారు వాటిని విక్రయించాలనుకుంటారు. ఈ క్రయ, విక్రయాలను స్టాక్‌ మార్కెట్‌లో జరుపుతారు. ఇక్కడ వాటాలు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అవుతాయి. అందుకే వీటిని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు అంటారు.


మార్కెట్‌ క్రాష్‌: షేర్ల ధరలు ఉన్నట్లుండి పడిపోతే దాన్ని మార్కెట్‌ క్రాష్‌ అంటారు.
ఉదా: 1992లో హర్షద్‌ మెహతా చేసిన సెక్యూరిటీస్‌ కుంభకోణం వల్ల షేర్‌ మార్కెట్‌  క్రాష్‌కు గురైంది. కేతన్‌ పరేఖ్‌ సెక్యూరిటీల విలువను కృత్రిమంగా సృష్టించాడు. దీంతో 2001లో మార్కెట్‌ మరోసారి పతనమైంది.


మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌: మొత్తం షేర్ల సంఖ్యను మార్కెట్‌ విలువతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ అంటారు. దీని ఆధారంగానే కంపెనీల షేర్ల పరిస్థితి తెలుస్తుంది.


లిస్టెడ్‌ సెక్యూరిటీలు: వివిధ కంపెనీలు తమ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్, లిస్ట్‌ చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంటాయి. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సంవత్సరానికి కొంత మొత్తం ఫీజు చెల్లించాలి. ఇలా చేసే కంపెనీల షేర్లను లిస్టెడ్‌ సెక్యూరిటీస్‌ అంటారు.


పర్మిటెడ్‌ సెక్యూరిటీలు: కొన్ని సందర్భాల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి. ఈ మేరకు వాటి షేర్లను ట్రేడింగ్‌ చేయడానికి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ బ్రోకర్లకు అనుమతి ఇస్తుంది. వీటిని పర్మిటెడ్‌ సెక్యూరిటీలు అంటారు.


స్పెసిఫైౖడ్‌ లేదా ‘ఎ’ గ్రూప్‌ షేర్లు: ఎక్కువ మంది షేర్‌ హోల్డర్లు అధిక పెట్టుబడి పెట్టిన పెద్ద కంపెనీల షేర్లను స్పెసిఫైడ్‌ షేర్లు లేదా ఎ గ్రూప్‌ షేర్లు అంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ విషయంలో  బ్రోకర్లకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది.


నాన్‌ స్పెసిఫైడ్‌ లేదా ‘బి’ గ్రూప్‌ షేర్లు: తక్కువ మంది షేర్‌ హోల్డర్లు, తక్కువ పెట్టుబడి కలిగి, అంతగా ప్రాముఖ్యత లేని, కొంత మేరకు మాత్రమే పరిమితమయ్యే కంపెనీల షేర్లను నాన్‌ స్పెసిఫైడ్‌ షేర్లు లేదా ‘బి’ గ్రూప్‌ షేర్లు అంటారు.


కెర్బ్‌ ట్రేడింగ్‌: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు పనిచేసేందుకు పరిమిత పని గంటలు ఉంటాయి. ఈ సమయంలోనే ట్రేడింగ్‌ జరగాలి. ఈ ట్రేడింగ్‌ అంతా నమోదవుతుంది. పని గంటలు అయ్యాక కూడా స్టాక్‌ బ్రోకర్లు కొంతసేపు షేర్లకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్లను అనధికారికంగా కొనసాగిస్తారు. దీన్నే ‘కెర్బ్‌ ట్రేడింగ్‌’ అంటారు.


బుల్స్‌: షేర్‌ మార్కెట్‌లో వ్యాపారం చేసే వాళ్లలో బుల్స్‌ అనేది ఒక కేటగిరి. దేశ ఆర్థిక పరిస్థితి, కంపెనీల ఫలితాలు, డివిడెండ్లు, బోనస్‌లు, వివిధ కంపెనీల విస్తరణ, బడ్జెట్‌ లాంటి విషయాల కారణంగా మార్కెట్‌లో మార్పులు సంభవిస్తాయి. వీటి వల్ల వివిధ కంపెనీల షేర్ల ధరలు పెరుగుతాయని భావించి భవిష్యత్తులో లాభాలు స్వీకరించవచ్చనే ఉద్దేశంతో ట్రేడింగ్‌ చేసే వారిని బుల్స్‌ అంటారు. వీరు ఆశావాదులు. రానున్న కాలంలో ధరలు పెరుగుతాయని ఊహించి, ప్రస్తుత రేట్ల వద్ద సెక్యూరిటీలు కొని, విలువ పెరిగాక షేర్లను విక్రయిస్తారు.


బేర్‌లు: భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి, సెక్యూరిటీలను అమ్మేవారిని బేర్‌లు అంటారు. వీరు నిరాశావాదులు.


స్టాగ్‌లు: వీరు బుల్స్‌లాగానే భవిష్యత్తులో సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఊహిస్తారు. కొత్త కంపెనీ జారీ చేసిన సెక్యూరిటీలకు ఎక్కువ దరఖాస్తు రుసుం చెల్లించి, పెద్ద మొత్తంలో వాటికోసం నమోదు చేసుకునే వారే స్టాగ్‌లు. వీరి చర్యల వల్ల సెక్యూరిటీలకు కృత్రిమ డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరుగుతాయి. కానీ వీటి ధరలు త్వరలోనే తగ్గిపోతాయి.


లేమ్‌డక్‌లు: వీరి దగ్గర సెక్యూరిటీలు లేనప్పటికీ అమ్మడానికి కాంట్రాక్టులు రాసి, వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలు కొనడానికి అన్వేషిస్తుంటారు.


ఫండమెంటల్‌ ఎనాలసిస్‌: ఒక కంపెనీ పనితీరు, ఆర్థిక పరిస్థితి, లాభాలు, విస్తరణ, వాటాలు, డిబెంచర్లు లాంటి విషయాలకు సంబంధించిన విశ్లేషణను ఫండమెంటల్‌ ఎనాలసిస్‌ అంటారు. ఇందులో వివిధ పన్నులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు లాంటి అంశాలను విశ్లేషిస్తారు.


టెక్నికల్‌ ఎనాలసిస్‌: స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ జరుగుతున్న పలు కంపెనీల షేర్ల లభ్యత ఆధారంగా ఈ ఎనాలసిస్‌ ఉంటుంది. కంపెనీ షేర్ల డిమాండ్, సప్లయ్‌ అంశాల ఆధారంగా జరిగే ట్రేడింగ్‌ను ఇది విశ్లేషిస్తుంది. వివిధ కంపెనీల షేర్ల విలువలను వాటి కదలికలను గ్రాఫ్‌ల రూపంలో వివరిస్తుంది.


బుక్‌: ఇది నిర్దిష్ట షేర్లకు సంబంధించిన కొనుగోలు, విక్రయ ఆర్డర్ల పెండింగ్‌ జాబితాను నిర్వహించే ఎలక్ట్రానిక్‌ రికార్డు. ఇందులో ఏ షేర్ల కొనుగోళ్లకు బిడ్‌లు, విక్రయానికి ఆఫర్లు వచ్చాయనే వివరాలుంటాయి.


బుక్‌ వాల్యూ: ఒక కంపెనీ మూలధనాన్ని, రిజర్వ్‌ నిధులను అది జారీచేసిన వాటాలతో భాగిస్తే వచ్చేదాన్ని బుక్‌ వాల్యూ అంటారు. ఇది షేర్‌ అసలు ధరను ప్రతిబింబిస్తుంది.


రైట్స్‌ ఇష్యూ: వివిధ కంపెనీలు విస్తరణ, తదితర కారణాలతో మూలధనాన్ని తిరిగి వాటాదారుల వద్ద నుంచి సేకరించాలని నిర్ణయిస్తాయి. దీనికి ప్రతిఫలంగా వాటాదారులకు మరికొన్ని వాటాలను కేటాయిస్తారు. సాధారణంగా వాటాదారులకు రైట్స్‌ ఇష్యూ ద్వారా మార్కెట్‌ ధర కంటే తక్కువకు షేర్లు లభ్యమవుతాయి.


బోనస్‌ ఇష్యూ: గణనీయంగా లాభాలు సంపాదించేవి, రిజర్వులు అధికంగా ఉన్న కంపెనీలు తమ వాటాదారులకు రిజర్వుల నుంచి ఉచితంగా కొన్ని షేర్లను కేటాయిస్తాయి. ఈ విధంగా అవి వాటాదారుల నుంచి ఎలాంటి సొమ్ము వసూలు చేయకుండా వాటాలు కేటాయించడాన్ని బోనస్‌ షేర్లు లేదా బోనస్‌ ఇష్యూ ప్రకటించడం అంటారు.

ప్రాథమిక షేర్‌ మార్కెట్‌

ఒక కంపెనీ మూలధనం కోసం ప్రజల నుంచి వాటాల రూపంలో డబ్బును సేకరించే ప్రక్రియను షేర్‌ మార్కెట్‌లో ప్రాథమిక మార్కెట్‌గా వ్యవహరిస్తారు. ఇలా పెట్టుబడి సమీకరణకు కంపెనీలు జారీచేసే షేర్ల ప్రక్రియను పబ్లిక్‌ ఇష్యూ అని కూడా అంటారు. పబ్లిక్‌ ఇష్యూ జారీచేసే సమయంలో కంపెనీ ఉత్పత్తులు, ప్రమోటర్ల వివరాలు, ఉత్పత్తి ప్రారంభమయ్యే కాలం, సేకరిస్తున్న మూలధన వివరాలు లాంటి విషయాలను కంపెనీలు వివరంగా ప్రకటించాలి. సాధారణంగా ప్రాథమిక షేర్‌ మార్కెట్‌లో పొదుపు చేయడం శ్రేయస్కరమని పెట్టుబడిదారులు భావిస్తారు.


ద్వితీయ షేర్‌ మార్కెట్‌ 
పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ పూర్తి చేసిన కంపెనీల షేర్లు మార్కెట్‌లో ట్రేడ్‌ అవుతాయి. ఈ విధమైన షేర్లను కొనడం లేదా అమ్మడాన్ని ద్వితీయ మార్కెట్‌ (సెకండరీ షేర్‌ మార్కెట్‌) విధానంగా పేర్కొంటారు. వివిధ కంపెనీలు ప్రకటించే లాభాలు, బోనస్‌లు, డివిడెండ్‌లు, రైట్స్‌ లాంటి అనేక విషయాల ప్రాతిపదికన ద్వితీయ మార్కెట్‌లో షేర్లను కొంటారు. ఈ షేర్ల కొనుగోలుకు  మార్కెట్‌లో ఉన్న రేటును చెల్లించాలి.


ప్రాఫిట్‌ ఈక్విటీ రేషియో

వివిధ కంపెనీల షేర్ల విలువకు, ఆ కంపెనీ షేర్ల మీద వచ్చే రాబడికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రాఫిట్‌ ఈక్విటీ రేషియో అంటారు. ఒక షేర్‌ను ఎన్ని రెట్లు ఎక్కువ ధరకు కొంటున్నామో దీని ఆధారంగానే తెలుస్తుంది. కంపెనీ షేర్‌ ధరను ఆ కంపెనీ ఈక్విటీ ప్రాఫిట్‌ రేషియోతో భాగిస్తే ప్రాఫిట్‌ ఈక్విటీ తెలుస్తుంది.


ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

ఒక కంపెనీకి సంబంధించిన రైట్స్, బోనస్, డివిడెండ్, విస్తరణ లాంటి విషయాలను ముందుగానే తెలుసుకొని వాటి ఆధారంగా ఆ కంపెనీ షేర్ల క్రయ, విక్రయాలను జరపడాన్ని ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ అంటారు. దీని వల్ల సామాన్య వాటాదారులు నష్టపోతారు. ఇలాంటి ట్రేడింగ్‌కు పాల్పడే వారిపై సెబీ చర్యలు తీసుకుంటుంది.


బ్లూచిప్‌ షేర్లు

బ్లూచిప్‌ అనే పదాన్ని పోకర్‌ ఆట నుంచి గ్రహించారు. ఆ ఆటలో తెలుపు, ఎరుపు, నీలం రంగుల్లో చిప్స్‌ ఉంటాయి. వాటిలో బ్లూ చిప్స్‌కు విలువ అధికం. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మంచి ఆర్థిక ఫలితాలను సాధిస్తూ, కొన్నేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తూ, డివిడెండ్లు, బోనస్‌లు, రైట్స్‌ ఇష్యూల లాంటివి పాటిస్తూ, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందిన కంపెనీల షేర్లను ‘బ్లూచిప్‌ షేర్లు’ అంటారు. లేదా ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలకు చెందిన షేర్లను బ్లూచిప్‌ షేర్లు అంటారు. 


కాల్‌మనీ

కొత్తగా ప్రజల నుంచి వాటాల రూపంలో సొమ్మును సేకరించే కంపెనీలు వాయిదాల రూపంలో షేర్లను అమ్ముతాయి. ఒక వాయిదా అనంతరం మిగతా వాయిదాకు సంబంధించిన సొమ్మును చెల్లించమని వాటాదారులను కోరతారు. దీన్నే కాల్‌మనీ అంటారు. వాయిదాలన్నీ చెల్లించిన వారినే కంపెనీ వాటాదారులుగా భావిస్తుంది.

స్పెక్యులేషన్‌/అంచనా 

వ్యాపారం/ సత్తా వ్యాపారం

స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్లు వివిధ కంపెనీల షేర్లను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనడం లేదా అమ్మడం చేస్తారు. మరికొందరు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు తమ పట్టులోకి వచ్చే స్థాయిలో లావాదేవీలు చేస్తుంటారు. తక్కువ ధర ఉన్న షేర్‌ను బ్రోకర్లు ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొంటే, సామాన్య పెట్టుబడిదార్లు కూడా అదే కంపెనీ షేర్లు కొనేందుకు సిద్ధపడతారు. అదే సమయంలో అతడు తన వద్ద ఉన్న షేర్లను వెంటనే అమ్ముతాడు. దీని వల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయో పెట్టుబడిదారులకు అర్థంకాక నష్టపోతారు. షేర్‌ ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయని ఊహించి పెద్దమొత్తంలో లావాదేవీలు చేయడాన్ని స్పెక్యులేషన్‌ అంటారు.


బుక్‌ క్లోజర్‌

వివిధ కంపెనీలు బోనస్, రైట్స్, డివిడెండ్‌ ఇచ్చే సమయంలో కొంతకాలం కంపెనీ రిజిస్టర్లను నిలిపేస్తాయి. ఏ తేదీ వరకు క్లోజ్‌ చేస్తారనే విషయాన్ని కంపెనీ ముందుగానే వాటాదారులకు తెలుపుతుంది. బుక్‌ తేదీ తర్వాత కంపెనీ రిజిస్టర్లలో ఉన్నవారినే వాటాదారులుగా పరిగణిస్తారు. వారి షేర్‌తోనే డివిడెండ్, బోనస్, రైట్స్‌ లాంటివి జారీ చేస్తుంది.
 

భారత ఆర్థిక వ్యవస్థ - స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రభావం

వివిధ కంపెనీల షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి ఉన్న వేదికే స్టాక్‌ మార్కెట్‌. ఇది దేశ ఆర్థిక ప్రగతిలోనూ ముఖ్య భూమిక పోషిస్తోంది. షేర్లలో పెట్టుబడి పెడితే త్వరగా లాభాలు పొందొచ్చని సాధారణ ప్రజలు భావిస్తారు. షేర్‌ మార్కెట్‌ల ఏర్పాటు, క్రయవిక్రయాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం మొదలైన విషయాల గురించి పరీక్షార్థులకు అవగాహన అవసరం.  


కన్వర్టబుల్‌ సెక్యూరిటీలు: ఏదైనా సంస్థ లేదా ప్రభుత్వం జారీచేసిన  సెక్యూరిటీ (బాండ్లు, డిబెంచర్లు, ప్రిఫర్డ్‌ స్టాక్స్‌)లను అదే సంస్థకు లేదా ప్రభుత్వానికి చెందిన మరో సెక్యూరిటీగా మార్చొచ్చు. వీటినే‘కన్వర్టబుల్‌ సెక్యూరిటీస్‌’ అంటారు. ఒక్కోసారి ఈ సెక్యూరిటీలను తీసుకున్న వ్యక్తి ఎంపిక ద్వారా ఇలా జరుగుతుంది. లేదంటే సంస్థ లేదా ప్రభుత్వ ఎంపిక ద్వారా కూడా ఇలా అవ్వొచ్చు.


రక్షణాత్మక షేరు (డిఫెన్సివ్‌ స్టాక్‌): విపత్కర ఆర్థిక పరిస్థితుల్లోనూ స్థిరంగా డివిడెండ్లు, ఆదాయాలను అందించే షేర్‌ను రక్షణాత్మక షేర్‌ అంటారు. యాంటీ స్టాక్‌ మార్కెట్స్‌ (Anti - Stock Markets) తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సమయంలోనూ ఈ కంపెనీలు స్థిరమైన రేటు వద్ద డివిడెండ్లు ఇస్తాయి. మదుపర్లు సాధారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లను డిఫెన్సివ్‌ స్టాక్స్‌గా  భావిస్తారు.


కమోడిటీస్‌: ఇవి ప్రత్యేక, అధీకృత ప్లాట్‌ఫాంపై ట్రేడయ్యే వాణిజ్య ఉత్పత్తులు. వ్యవసాయ ఉత్పత్తులు, సహజ వనరులు ఇందులో ఉంటాయి. 
ఉదా: బంగారం, వెండి, చమురు, సహజ వాయువు, అల్యూమినియం, ధనియాలు, పసుపు తదితరాలన్నీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే కమోడిటీస్‌.


డెరివేటివ్స్‌: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంతర్లీన ఆస్తుల నుంచి ఏదైనా ఒక సెక్యూరిటీ ధరను నిర్ణయిస్తే దాన్ని డెరివేటివ్‌గా చెప్పొచ్చు. ఆ అంతర్లీన ఆస్తుల జాబితాలో షేర్లు, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీలు, వడ్డీరేట్లు, సూచీలుంటాయి. ఈ డెరివేటివ్స్‌గా ఫ్యూచర్స్, ఆప్షన్‌లను మళ్లీ పుట్‌ ఆప్షన్, కాల్‌ ఆప్షన్‌ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.


హెడ్జింగ్‌: ఇదో ట్రేడింగ్‌ వ్యూహం. సెక్యూరిటీల ధరల్లో హెచ్చుతగ్గుల నుంచి నష్టాలను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నం. ఉదా: ఒక గోధుమ రైతు పంట చేతికి రాకముందే ఆ కమోడిటీ ఫ్యూచర్స్‌ (వీట్‌ ఫ్యూచర్స్‌)ను విక్రయించవచ్చు. ఒకవేళ నగదు మార్కెట్లో ధరలో క్షీణత కనిపించి, నష్టం వాటిల్లినా ఫ్యూచర్‌ పొజిషన్‌ ద్వారా వచ్చిన లాభాలతో దాన్ని తగ్గించుకోవచ్చు.


బాండ్లు: ఇవి కంపెనీలు లేదా ప్రభుత్వాలు కొనుగోలుదారులకు జారీచేసే హామీ పత్రాలు. వీటిని కొంటే నిర్దిష్ట సమయం వరకు నిర్దిష్ట మొత్తాన్ని ఆ బాండ్లలో కొనుగోలుదారు ఉంచినట్లు లెక్క. ఆ బాండ్‌కి ఇచ్చే కూపన్‌ రేటు (వడ్డీ రేటు)ను బట్టి మెచ్యూరిటీ సమయానికి నిర్దిష్ట సొమ్ముపై వడ్డీతో కూడిన మొత్తం అందుతుంది.


లావాదేవీలు: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో చిన్న మదుపుదార్ల (షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిపేవారు) నుంచి సంస్థాగత మదుపుదార్లు, పెన్షన్‌ ఫండ్, బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్, హెడ్జ్‌ఫండ్‌ ట్రేడర్లు లాంటి అనేక స్థాయుల వ్యక్తులు, సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తారు.


విదేశీ మూలధనం (Foreign Capital): ఒక దేశ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో విదేశీ మూలధనం అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా పెట్టుబడి పెట్టడం లేదా రుణాలు, గ్రాంట్ల రూపంలో నిధులు సమకూర్చడం చేయొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామీకరణ, ఆర్థికాభివృద్ధి వేగవంతమవ్వాలంటే తొలిదశల్లో యంత్రాలు, పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, ముడి పదార్థాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకు విదేశీమారక ద్రవ్యం కావాలి.


విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (Foreign Direct Investment - FDI): విదేశీ సంస్థలు ప్రత్యక్షంగా ప్రవేశించి తమ పెట్టుబడులతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించవచ్చు. కొన్ని పెద్ద విదేశీ సంస్థలు వాటి శాఖ (బ్రాంచ్‌)లను ఏర్పాటు చేయొచ్చు.


విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లేదా మదుపుదారులు (Foreign Portfolio investment - FPI): 
* మన దేశ స్టాక్‌ మార్కెట్లో భారీ హెచ్చు తగ్గులు ఏర్పడటానికి విదేశీ సంస్థాగత పెట్టుబడులే కారణమని  చెప్పొచ్చు. FPIలను కాళ్లు నిలవని పెట్టుబడులు (Footloose capital) అని అంటారు.
* ఎఫ్‌పీఐలను ‘సీతాకోకచిలుక పెట్టుబడులు’ (Butterfly Capital)  అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం సీతాకోకచిలుక వాలడం, ఎగిరిపోవడం లాగా ఉంటుంది. 
* స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని వాలడంగా, ఉపసంహరించడాన్ని ఎగిరిపోవడంగా పేర్కొంటారు. షేర్లు కొన్నప్పుడు స్టాక్‌మార్కెట్‌ ఒక్కసారిగా ఊపందుకోవడం, షేర్లను అమ్మినప్పుడు పతనమవ్వడం లాంటివి జరుగుతాయి. 
* కాబట్టి నీశిఖిలకు ప్రిడేటరీ క్యారెక్టర్‌ ఉంటుంది. వీటివల్ల విదేశీ పెట్టుబడుదారులు భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి వైదొలిగి షేర్లు అమ్ముకుంటారు. దీనికి కారణం ‘ప్రాఫిట్‌ బుకింగ్‌’. అంటే షేర్ల ధరలు భారీగా పెరిగినప్పుడు లాభాల కోసం అమ్ముకోవడం. 


డాలర్‌ విలువ పెరగడం (డాలర్‌ ఇండెక్స్‌):
* డాలర్‌ విలువను అంతర్జాతీయ కరెన్సీలతో పోల్చి దాని సగటు విలువను అంచనా వేస్తారు. దాన్నే డాలర్‌ ఇండెక్స్‌ అంటారు. అంటే అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌కు విలువ పెరగడం 
ఉదా: డాలర్‌ విలువ 0.43 శాతం పెరిగిందనుకుంటే, ఇండియా కరెన్సీ రూపాయితో పోల్చితే దాని విలువ ఒక్క రూపాయి నాలుగు పైసలు పెరుగుతుంది. 
* డాలర్‌ విలువ పెరిగినప్పుడు మనదేశంలోని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు తమ షేర్లను అమ్ముకొని డాలర్లను కొంటారు. వాటినే డాలర్‌ డినామినేటెడ్‌ అసెట్స్‌ అంటారు. అంటే డాలర్‌ రూపంలో ఉన్న ఫైనాన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌  కొనుగోలు చేస్తారు. ఉదా: బాండ్స్‌
* అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి సానుకూల అంశాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. దాంతో పాటు అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో వచ్చిన పరిణామాలు కూడా స్టాక్‌ మార్కెట్‌ పతనానికి కారణమవుతాయి.


విదేశీ పరోక్ష పెట్టుబడులు:
విదేశీ సంస్థలు మనదేశంలోకి ప్రవేశించి పరోక్షంగా బాండ్‌లు లేదా సెక్యూరిటీల రూపంలో పెట్టుబడులు పెడతాయి. వీటినే విదేశీ పరోక్ష పెట్టుబడులు అంటారు.


ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల (స్టాక్‌ మార్కెట్స్‌) ఏర్పాటు
* ప్రపంచంలో మొట్టమొదట స్థాపించిన స్టాక్‌మార్కెట్‌ లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. దీన్ని 18వ శతాబ్దంలో నెలకొల్పారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
* అమెరికాలోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నాస్‌డాక్‌  (NASDAQ - National Association of Securities Dealers Automated Quotation system). 
* ఇంగ్లండ్‌లోని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌.
* భారత్‌లో మొట్టమొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ను 1875లో ముంబయిలో స్థాపించారు. తర్వాత అహ్మదాబాద్‌ (గుజరాత్‌), చెన్నై (తమిళనాడు), దిల్లీ, ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), కాన్పూర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), బెంగళూరు (కర్ణాటక), లూథియానా (పంజాబ్‌) మొదలైన నగరాల్లో స్థాపించారు.
* భారతదేశంలో సెబీ గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఎనిమిది. వీటిలో అయిదు శాశ్వతమైనవి. అవి:
1. అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (1894లో ఏర్పాటైంది.)
2. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
3. కోల్‌కతా స్టాక్‌ ఎక్చేంజ్‌ (1908లో  ఏర్పాటైంది.)
4. మగథ్‌ (పాట్నా) స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
5. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


 ప్రస్తుతం దేశంలో ఉన్న ఆపరేటింగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
1. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి)
2. కోల్‌కతా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌
3. ఇండియా ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (India INX)
4. మెట్రో పాలిటన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి)
5. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) (ముంబయి)
6. ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌ఈ   - NSE IFSE


ప్రస్తుతం దేశంలో ఆపరేటింగ్‌ కమోడిటీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు:
1. ఇండియన్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ - ICX   (ముంబయి)
2. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా - MCX (ముంబయి) 
3. నేషనల్‌ కమోడిటీ, డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ - NCDX (ముంబయి)


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  (BSE)

* 1875లో బొంబాయిలో  ‘The Native Share and Stock Broker’s Association’ అనే సంస్థ ఏర్పడింది. అదే తర్వాత బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. 1957, ఆగస్టు 31న ఇది శాశ్వత ప్రాతిపదిక గుర్తింపు పొందింది. భారత్‌లో ఈ గుర్తింపు పొందిన తొలి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇదే. 
* దీని ప్రధాన కార్యాలయం ముంబయిలోని దలాల్‌ స్ట్రీట్‌లో ఉంది. ఇది ఆసియాలోని పురాతన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* 2021, ఫిబ్రవరి నాటికి మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.8 ట్రిలియన్‌ డాలర్లు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రపంచంలో ఏడో అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 
* బీఎస్‌ఈలో జాబితాల సంఖ్య 5,439. సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎస్‌ అండ్‌ పి బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్, ఎన్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ మిడ్కాప్, ఎన్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ లార్జ్‌ క్యాప్, బీఎస్‌ 500.
& హిందీలో దలాల్‌ స్ట్రీట్‌ అంటే బ్రోకర్‌ స్ట్రీట్‌ అని అర్థం.


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  (NSE)

* 1992, నవంబరులో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాను ముంబయిలో స్థాపించారు. 1994, జూన్‌ 30 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట రుణ మార్కెట్‌ విభాగం మాత్రమే పని చేయడం ప్రారంభించింది. ఈక్విటీ మార్కెట్‌ విభాగం 1994, నవంబరు 3 నుంచి లావాదేవీలను ప్రారంభించింది. అప్పటివరకు అతిపెద్దదైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కంటే ఎక్కువ వ్యాపారాన్ని సాధించింది. దేశంలో ఆధునిక, పూర్తి ఆటోమేటెడ్‌ స్క్రీన్‌ ఆధారిత ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ వ్యవస్థను అందించిన తొలి ఎక్స్ఛేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ. ఇది పెట్టుబడిదారులకు సులభమైన వాణిజ్య సౌకర్యాలను అందించింది. ఎన్‌ఎస్‌ఈలో జాబితాల సంఖ్య 1,952. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2.27 ట్రిలియన్‌ డాలర్లు (2018, ఏప్రిల్‌ నాటికి). సూచీలు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్‌ 50, నిఫ్టీ 500. ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. 


అంచనా వ్యాపారం
సాధారణంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో అంచనా వ్యాపారం (Speculation Business) ఎక్కువగా జరుగుతుంది. భవిష్యత్తులో సెక్యూరిటీల ధరల్లో వచ్చే మార్పులను ముందుగా అంచనా వేసి, అధిక లాభాపేక్షతో కొనుగోలు, అమ్మకం చేసే వ్యాపారులను అంచనా వ్యాపారులు (Speculators) అంటారు.  ఫార్వర్డ్‌ డెలివరీ కాంట్రాక్ట్‌లలో ఈ వ్యాపారం జరుగుతుంది. దేశంలోని కొన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో మాత్రమే దీన్ని అనుమతించారు. అంచనా వ్యాపారం చేసే సభ్యులను నాలుగు రకాలుగా వర్గీకరించారు.
* బుల్స్‌ (Bulls)   
* బేర్స్‌  (Bears) 
* స్టాగ్స్‌ (Stags) 
* లేమ్‌ డక్‌ (Lame ducks)

 

భారతదేశంలో స్టాక్‌మార్కెట్‌ సూచికలు
ప్రపంచంలో ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ సూచికలు డో జోన్స్‌ (న్యూయార్క్‌); నిక్కీ (టోక్యో); హాంగ్‌కాంగ్‌ (హాంగ్‌ సెంగ్‌); డోలెక్స్, సెన్సెక్స్, నిఫ్టీ-ఫిఫ్టీ (ఇండియా).  
* భారత్‌లో ప్రధాన స్టాక్‌ మార్కెట్‌ సూచికలు రెండు. అవి: 1. సెన్సెక్స్‌     2. నిఫ్టీ ఫిఫ్టీ 


సెన్సెక్స్‌: 1875లో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటైంది. తర్వాత 111 ఏళ్లకు 1986లో సెన్సెక్స్‌ ఏర్పడింది. తొలుత దీన్ని 100 పాయింట్లతో ప్రారంభించారు. ప్రాతిపదిక ఏడాదిగా 1978-79ను తీసుకున్నారు. సెన్సిటివ్, ఇండెక్స్‌ అనే పదాల నుంచి సెన్సెక్స్‌ ఏర్పడింది. ఈ పేరును సూచించింది దీపక్‌ మొహానీ అనే స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు. దీన్నే సెన్సిటివ్‌ ఇండెక్స్‌గా కూడా పిలుస్తారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన సూచిక. ఇందులోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 30.


నిఫ్టీ ఫిఫ్టీ - NSE 50:  ఈ సూచికను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ రూపొందిస్తుంది. ఇందులో 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలను చేర్చారు. దీనిపేరును S&P CNX  నిఫ్టీగా మార్చారు. నిఫ్టీ సూచిక 1996, ఏప్రిల్‌ 22న ప్రారంభమైంది. నిఫ్టీ 50 ఇండెక్స్‌ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో (2020, జూన్‌ 20 నాటికి) 14 రంగాలకు వర్తిస్తుంది.


నేషనల్‌ ఇండెక్స్‌: ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన మరో సూచిక. దీనిలోని ప్రాతినిధ్య సంస్థలు 100. ఆధార సంవత్సరం 1983-84.


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ): ఈ సూచికలో 200 ప్రాతినిధ్య సంస్థలు ఉన్నాయి. ఆధార సంవత్సరం 198990. దీనిలో 21 ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు ఉన్నాయి.
డోలెక్స్‌: బీఎస్‌ఈ200 డాలర్‌ విలువను డోలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 198990.
బ్యాంకెక్స్‌: దీన్ని 2003, జూన్‌ నుంచి రూపొందిస్తున్నారు. ఇందులో 12 బ్యాంకుల వాటాలను చేర్చారు. ఆధార సంవత్సరం జనవరి 2002.


కమోడిటీ ఫ్యూచర్‌ మార్కెట్‌
* భవిష్యత్తులో కొన్ని వస్తువుల ధరల్లో అధిక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ ప్రభావాన్ని తప్పించేందుకు కొనుగోలుదార్లు, అమ్మకందార్లు ఒక వస్తువును రానున్న కాలంలో  ఒక నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత తేదీన, నిర్ణీత ధర వద్ద కొనడం లేదా అమ్మడం గురించి ఒప్పందం కుదుర్చుకుంటారు. దీన్నే కమోడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్లు అంటారు.
* వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడిచమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు మొదలైన వస్తువులతో ఫ్యూచర్‌ వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్‌కు సంబంధించిన ఎక్స్ఛేంజ్‌లను కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు అంటారు. 


భారత్‌లో పనిచేస్తున్న కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు 
* నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (NMCE) 
* ఎంసీఎక్స్‌ (MCX) ముంబయి (2003)
* నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (NCDEX) 
* ఏసీఈ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ముంబయి 


క్రిసిల్‌
* క్రిసిల్‌ (CRISIL - Credit Rating Information Services of India Limited) భారతదేశ మొదటి రేటింగ్‌ ఏజెన్సీ. దీన్ని 1987లో నెలకొల్పారు. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌తో కలిసి క్రిసిల్‌ - 500 సూచికను అభివృద్ధి చేసింది. దీనిపేరును S&P CNX-550 సూచికగా మార్చారు. ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది.
* ఇది రేటింగ్స్, డేటా, పరిశోధన, విశ్లేషణ, సొల్యూషన్స్‌ లాంటి సేవలను అందిస్తుంది. సంస్థల వ్యాపార నష్ట భయం, నిర్వహణ నష్టభయం, ఆర్థిక నష్టభయం అనే మూడు అంశాలను మూల్యాంకనం చేసి వ్యాపార సంస్థలకు రేటింగ్‌ ఇస్తుంది. 2020, డిసెంబరు నాటికి క్రిసిల్‌ ఆదాయం 290 మిలియన్‌ డాలర్లు, నికర ఆదాయం 50 మిలియన్‌ డాలర్లు. దీని మాతృసంస్థ  S&P గ్లోబల్‌.


కొవిడ్‌ నేపథ్యంలో దేశ జీడీపీ - స్టాక్‌ మార్కెట్ల తీరు తెన్నులు

* ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను స్టాక్‌ మార్కెట్లు ప్రతిఫలిస్తాయి. పతనం, వృద్ధి ఏదైనా మార్కెట్లు ముందే స్పందిస్తాయి. భవిష్యత్తు ఆధారంగానే వీటి పనితీరు ఉంటుంది.
* 201920 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 4.2 శాతం (2020-21 సర్వే ప్రకారం) వృద్ధి రేటు సాధించింది. కొవిడ్‌ కారణంగా 2020-21లో జీడీపీ క్షీణత (-) 7.7 శాతంగా (2020-21 సర్వే ప్రకారం) నమోదైంది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష 2021, ఏప్రిల్‌ నివేదికలో 2021-22లో భారత్‌ జీడీపీ వృద్ధిరేటును 10.5 శాతంగా అంచనా వేసింది. ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ 2021, ఏప్రిల్‌ నివేదిక ప్రకారం 2021లో దేశ జీడీపీ వృద్ధి రేటు 12.5 శాతం, కాగా 2022లో 6.9 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.
* 2020, మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. అయితే 2020, నవంబరు నుంచి సూచీలు లాభపడుతూ వచ్చాయి.
* 2021, జనవరి 21న స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో తొలిసారి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 50,000 పాయింట్లను తాకింది. 
* బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ 20 ఏళ్లలో 32 రెట్లు పెరిగింది. 
* 2001-02 ఆర్థిక సంవత్సరం చివర్లో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6.12 లక్షల కోట్లు కాగా, 2020-21, జనవరి 21 నాటికి దీని విలువ రూ.196.51 లక్షల కోట్లకు చేరింది. 
* 2021, జనవరి 12న జీవితకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఆ రోజు నమోదైన రూ.197.46 లక్షల కోట్లు ఇప్పటి వరకు అత్యధికం.
* 2008, జనవరిలో సెన్సెక్స్‌ 21,000 పాయింట్ల వద్ద ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అదే ఏడాది అక్టోబరు చివరికి 8700 పాయింట్లకు చేరింది. 
* 2008-09 ఆర్థిక సంవత్సరం చివర్లో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.30 లక్షల కోట్లకు క్షిణించింది. 2007-08లో ఈ విలువ రూ.51 లక్షల కోట్లు. అయితే తర్వాతి ఏడాది పుంజుకుని రెట్టింపైంది. 
* 2020, మార్చిలో కొవిడ్‌ సంక్షోభంతో సెన్సెక్స్‌ 26000 పాయింట్లకు, కంపెనీల మార్కెట్‌ విలువ రూ.113 లక్షల కోట్లకు చేరింది. 2018-19 ఆఖరులో ఈ విలువ రూ.151 లక్షల కోట్లు.


స్టాక్‌ మార్కెట్లు - జీడీపీ వృద్ధి - ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు
* బ్యాంకులు స్థిరీకరణ, రుణాల రికవరీపై దృష్టి సారించడం వల్ల వాటి ఆర్థిక నిల్వలు బలోపేతమయ్యాయి. అవి వ్యాపార సంస్థల విస్తరణ అవసరాలకు రుణాలిచ్చేందుకు సిద్ధమయ్యాయి. కార్పొరేట్‌ సంస్థలు తమ అప్పులు తగ్గించుకున్నాయి. 
* గత కొన్నేళ్లలో జీఎస్టీ - ఐబీసీ (దివాలా స్మృతి) అమలుతో పాటు కొవిడ్‌ పరిణామాల నేపథ్యంలో బలహీన కార్పొరేట్‌ సంస్థలు మూతపడగా, తట్టుకున్న సంస్థలు బలోపేతమయ్యాయి. ఇలా నిలిచిన సంస్థల మార్కెట్‌ వాటా, ఆదాయాలు పెరుగుతున్నాయి. అందుకే వచ్చే ఆర్థిక సంవత్సరం, ఆపై ఏడాది కూడా భారత్‌ అధిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే స్టాక్‌ మార్కెట్స్‌కు ఇంధనం. 
* ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా సమీప భవిష్యత్తులో కోలుకుంటుందని, కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేస్తాయనే అంచనాలతో షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ముందుకొస్తున్నారు. 
* కొత్త ఇన్వెస్టర్లకు అనుగుణంగా డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.


స్టాక్‌ మార్కెట్లు - డీమ్యాట్‌ ఖాతాలు 
స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. ఈ ఖాతాలు పెరుగుతున్నాయంటే, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికమవుతోందని అర్థం.
* 2018-19తో పోలిస్తే 2019-20లో 49 లక్షల నూతన డీమ్యాట్‌ ఖాతాలు పెరిగాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో కొత్త ఖాతాలు మరింత పెరిగినట్లు సమాచారం.


 సంవత్సరం    డీమ్యాట్‌ ఖాతాలు (కోట్లలో)
 2010-11          1.90
 2011-12          1.99
 2012-13          2.09
 2013-14          2.18
 2014-15          2.33
 2015-16          2.52
 2016-17          2.79
 2017-18          3.19
 2018-19          3.59
 2019-20          4.08


మనదేశ జీడీపీ వృద్ధిరేట్లు (శాతంలో)
సంవత్సరం        జీడీపీ వృద్ధి
2010-11              9.3
2011-12              6.2
2012-13              5.6
2013-14              6.6
2014-15              7.2
2015-16               8
2016-17              8.2
2017-18               7
2018-19              6.1
2019-20              4.2
2020-21            (-) 7.7 
2021-22              11 

ఆధారం: భారత ఆర్థిక సర్వే: 2012-13, 2015-16, 2018-19, 2020-21

Posted Date : 17-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌