• facebook
  • whatsapp
  • telegram

సమరశీల భావాలు - సాయుధ పోరాటాలు

ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!

  జాతీయోద్యమ కాలంలో భారతీయులపై ఆంగ్లేయుల అరాచకాలు, అతి క్రూరమైన అణచివేతలు అధికమయ్యాయి. మన వాళ్లకు కనీస హక్కులు  లేకుండా పోయాయి. స్వేచ్ఛ ఉండేది కాదు. పరిష్కారాల కోసం మితవాదులు చేసిన పోరాటాలతో ఆశించిన ప్రయోజనాలు అందలేదు. ఆ దశలో ఉద్యమకారుల్లో అసహనం ప్రబలింది. అది సాయుధ పోరాటంగా మారింది. దేశ, విదేశాల్లో ఎంతోమంది వీరులు నిరంకుశ పాలనపై అసమాన ధైర్య సాహసాలతో అనేక రకాలుగా తిరుగుబాటు సమరాన్ని సాగించారు. కొందరు దుర్మార్గులైన ఇంగ్లిష్‌ అధికారులను తుదముట్టించారు. దొరికిపోయినవారు జైళ్లలో చిత్రహింసలు అనుభవించారు. ప్రాణాలు కోల్పోయారు. కానీ స్వాతంత్రోద్యమ గతిని మార్చి చరిత్రలో అమరవీరులై చిరస్థాయిగా నిలిచిపోయారు. 

  భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో విప్లవవాదులకు విశిష్ట స్థానం ఉంది. తరతరాలుగా బ్రిటిష్‌ ప్రభుత్వ వలసవాద విధానాలు భారత జాతిని ఆర్థికంగా కుంగదీశాయి. నిరుద్యోగం, ఆకలి, అనారోగ్యం దేశమంతా విలయతాండవం చేశాయి. దీనికితోడు ఆంగ్లేయుల జాత్యహంకార ధోరణి, దురుసుతనం, భారత జాతీయోద్యమాన్ని మొగ్గ దశలోనే అణచివేసేందుకు ప్రయత్నించిన తీరు కొందరు ఉద్యమకారుల్లో ద్వేషభావాన్ని పెంచాయి. కాంగ్రెస్‌ మితవాదులు సాగిస్తున్న రాజకీయ కార్యకలాపాలు, ఫలితాలు సాధించలేని వారి పోరాటశైలి పట్ల ఈ వర్గం విసుగు చెందింది. బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం కూడా దేశంలో విప్లవభావం పెరిగేందుకు దోహదపడింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటం, ఇటలీ ఏకీకరణ, ఫ్రెంచ్‌ విప్లవం, చిన్న దేశమైన జపాన్‌ అతిపెద్దదైన రష్యాపై విజయం సాధించడం వంటి అంతర్జాతీయ సంఘటనలు విప్లవ భావజాలానికి ఉత్ప్రేరకాలుగా నిలిచాయి. బ్రిటిషర్ల బలప్రయోగ వ్యూహాలను అదే రీతిలో ఎదుర్కొంటేనే వారిని దేశం నుంచి సాగనంపడం సాధ్యమని సమరశీల నేతలు భావించారు. 

విధానాలు

విప్లవవాదులు లేదా సమరశీల జాతీయవాదులు అచంచల దేశభక్తులు. తొలి దశలో భారతదేశంలో, దేశం వెలుపలా రహస్య విప్లవ సంఘాలు, పత్రికలు స్థాపించి సదస్సులు,  సమావేశాలు నిర్వహించి, పుస్తకాలు ప్రచురించి విప్లవభావాలను ప్రచారం చేశారు. ఐరిష్‌ ఉగ్రవాదులు, రష్యన్‌ నిహిలిస్ట్‌ల నుంచి స్ఫూర్తి పొందారు. భారతీయుల పట్ల క్రూర విధానాలను అవలంబించిన ఇంగ్లిష్‌ అధికారుల హత్యలకు సిద్ధమయ్యారు. ఆంగ్లేయులను వ్యతిరేకించే దేశాల సహాయంతో సైనిక కుట్రలు చేశారు. తమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు, ఆయుధాల కోసం పోలీసుస్టేషన్లు, ప్రభుత్వ ఆయుధగారాలపై దాడులకు పాల్పడ్డారు.

  బెంగాల్‌ విభజనకు ముందే విప్లవ సంఘాల స్థాపన ఉన్నప్పటికీ, బెంగాల్‌ విభజనతో ఉగ్రజాతీయవాదం పెరిగింది. బెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాలు విప్లవ సంఘాల కార్యకలాపాలకు అడ్డాగా (కేంద్రంగా) మారాయి. ఈ సంస్థల్లో బరీంద్రకుమార్‌ ఘోష్, జతీంద్రనాథ్‌ బెనర్జీలు కలిసి స్థాపించిన ‘కలకత్తా అనుశీలన సమితి’, పుళిందాస్‌ స్థాపించిన ‘ఢాకా అనుశీలన సమితి’ ప్రధానమైనవి. ఇవి ఉనికిలో ఉన్నంతకాలం కేవలం మన దేశంలోని ఇతర విప్లవ సంస్థలతో పాటు ఇతర దేశాల్లోని సంస్థలతోనూ సంబంధాలను కొనసాగించేవి. సమరశీల, విప్లవవాద సిద్ధాంతాల ప్రచారంలో అవి ముందంజలో ఉండేవి.

  1905 బెంగాల్‌ విభజన తర్వాత దేశంలో అనేక తీవ్రవాద సంస్థలు పత్రికలను స్థాపించి తమ భావజాలాన్ని వ్యాప్తి చేశాయి. అలాంటి వాటిలో బెంగాల్‌లోని సంధ్య, యుగాంతర్, కాల్‌ ముఖ్యమైనవి. 1899లో సావర్కర్‌ సోదరులు మహారాష్ట్రలో ‘మిత్రమేళా’ పేరుతో రహస్య సంఘాన్ని స్థాపించారు. తర్వాత కాలంలో ఈ సంస్థ గణేష్‌ సావర్కర్‌ స్థాపించిన ‘అభినవ్‌ భారత్‌’తో కలిసి పశ్చిమ భారతంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యక్రమాలను నిర్వహించింది. 1905లో అశ్వినీకుమార్‌ దత్త స్థాపించిన ‘స్వదేశీ బాంధవ్‌ సమితి’ బెంగాల్‌ విభజన ఉద్యమకాలంలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఇలా అనేక విప్లవ సంఘాలు దేశమంతా ఏర్పాటయ్యాయి. పంజాబ్‌లో పలు రహస్య సంఘాలు అజిత్‌ సింగ్‌ నాయకత్వంలో చురుగ్గా పనిచేశాయి. తమిళ ప్రాంతంలో చిదంబరం పిళ్లై, సుబ్రమణ్య శివ తదితరులు బ్రిటిష్‌ వ్యతిరేక విప్లవ ఉద్యమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 1924లో సచింద్రనాథ్‌ సన్యాల్, జేజి ముఖర్జీ నేతృత్వంలో ‘హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ సంస్థ ఏర్పడింది. ఆగ్రా, అలహాబాద్, బెనారస్, కాన్పుర్, లఖ్నవూల్లో శాఖలను ఏర్పాటు చేసింది. బ్రిటిషర్లపై ప్రయోగించడానికి కలకత్తాలో బాంబుల తయారీని ప్రారంభించింది. 1928లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈ సంస్థ పేరును ‘హిందూస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’గా మార్చారు. 

  విప్లవ కార్యక్రమాల నిర్వహణకు విదేశాల్లో కూడా సంఘాలు/సంస్థలను భారతీయులు స్థాపించారు. అలాంటి వారిలో శ్యామ్‌జీ కృష్ణవర్మ, వి.డి.సావర్కర్, లాలా హర్‌దయాళ్‌ ముఖ్యులు. బ్రిటిష్‌ పాలకుల సొంతగడ్డ లండన్‌లోనే ఇండియా హౌస్‌ను శ్యామ్‌జీ కృష్ణవర్మ స్థాపించారు. ది ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ పత్రికనూ స్థాపించారు. వీర్‌ సావర్కర్‌ కూడా లండన్‌లోనే తన తోటి భారతీయ విద్యార్థులను ప్రేరేపించి ఆంగ్లేయుల వ్యతిరేక పోరాటానికి ‘ఫ్రీ ఇండియా సొసైటీ’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన గ్రంథం ‘ఫస్ట్‌ వార్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిపెండెన్స్‌’ 1857 సిపాయిల తిరుగుబాటు స్వభావాన్ని విశ్లేషిస్తుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అండమాన్‌లోని సెల్యూలర్‌ జైలులో నిర్బంధించి చిత్రహింసలు పెట్టింది. యూరప్‌లో భారత స్వాతంత్య్ర కాంక్షను ప్రచారం చేసిన వీర వనిత భికాజీ రుస్తుం కామా.

  అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్కోలో 1913లో ‘గదర్‌ పార్టీ’ ఆవిర్భవించింది. లాలా హర్‌దయాళ్, భాయ్‌ పరమానంద, సోహన్‌ సింగ్, మహమ్మద్‌ ఇక్బాల్, భగవాన్‌ సింగ్, కర్తార్‌ సింగ్, అబ్దుల్‌ హఫీజ్, మహమ్మద్‌ బర్కతుల్లా తదితర పంజాబీయులు ఇందులో కీలక సభ్యులు. ఆయుధాలను సేకరించి, యువతకు శిక్షణ ఇచ్చి, ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయడం ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం. పంజాబ్, తూర్పు ఆసియా దేశాల్లో గణనీయంగా అనుచరులను సిద్ధం చేసింది. బెంగాల్‌లో రాస్‌ బిహారీ బోస్‌ ఈ సంస్థ నాయకుడు. అయితే ఈ రహస్యాలను తెలుసుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని క్రూరంగా అణచివేసింది. వీరేంద్రనాథ్‌ చటోపాధ్యాయ్, భూపేంద్రనాథ్‌ దత్త తదితరులు 1915లో ‘బెర్లిన్‌ కమిటీ’ని స్థాపించి బ్రిటిషర్ల అకృత్యాలను ఐరోపా దేశాల్లో ఎండగడుతూ, సాయుధ పోరాటానికి కార్యకర్తలను తయారుచేశారు. 1915లో మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లా తదితరులు కాబూల్‌లో ‘ప్రొవిజనల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఫ్రీ ఇండియా’ను నెలకొల్పారు.

  ఆంగ్లేయుల సామ్రాజ్యవాద దాష్టీకాలకు, సాయుధ పోరాటంతో జవాబు చెప్పి, వారిని దేశం నుంచి తరిమికొట్టడం ఈ విప్లవకారుల ప్రధాన లక్ష్యం. భారతీయుల పట్ల క్రూరంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులను హత్య చేయడం వంటి కార్యక్రమాలను చాపేకర్‌ సోదరులైన దామోదర్‌ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్‌ ప్రారంభించారు. వీరు పుణెలో ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రిటిష్‌ అధికారులైన రాండ్, ఆయన మిలిటరీ సహాయకుడు లెఫ్టినెంట్‌ ఐరెస్ట్‌ను 1897లో కాల్చి చంపారు.  పరమక్రూరుడిగా పేరు పొందిన బెంగాల్‌ లఫ్టినెంట్‌ గవర్నర్‌ ఫుల్లర్‌ హత్యకు 1907లో ‘అనుశీలన సమితి’ కార్యకర్తలు చేసిన ప్రయత్నం విఫలమైంది. 1908లో ముజఫర్‌పుర్‌ న్యాయమూర్తి కింగ్స్‌ ఫోర్డ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి బాంబు విసిరారు. 1912లో అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ హార్డింజ్‌ దిల్లీలో ఏనుగుపై ఊరేగింపుగా వస్తుండగా రాస్‌ బిహారి బోస్, సచింద్ర సన్యాల్‌లు బాంబు విసిరారు. కానీ హార్డింజ్‌ త్రుటిలో తప్పించుకున్నాడు.

  సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో జరిగిన ‘సైమన్‌ గో బ్యాక్‌’ ఉద్యమానికి లాలా లజపతి రాయ్‌ నాయకత్వం వహించారు. పోలీస్‌ అధికారి సాండర్స్‌ కొట్టిన లాఠీ దెబ్బలకు లజపతి రాయ్‌ మరణించారు. ఇందుకు ప్రతిగా భగత్‌సింగ్, ఆజాద్, రాజ్‌గురులు 1928లో సాండర్స్‌ను హత్య చేశారు.

  నిధులు, ఆయుధాల కోసం 1920 నాటికి పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ ఆయుధ గిడ్డంగులపై స్వాతంత్రోద్యమ విప్లవకారులు చేసిన దాడులు వెయ్యికి పైగా ఉండవచ్చని అంచనా. ఆంధ్రాలో విశాఖ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోలీస్‌స్టేషన్లకు ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేసేవాడు. బాంబులు తయారు చేస్తున్నారనే కారణంతో కలకత్తాలో 1908లో అనేకమంది విప్లవకారులను ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనినే అలీపూర్‌ కుట్ర కేసు అంటారు. 1925లో కకోరి రైలు దోపిడీ కేసులో రాంప్రసాద్‌ బిస్మిల్, రోషన్‌ సింగ్, రాజేంద్ర లాహిరి, అష్ఫాక్‌ ఉల్లాలను ఉరి తీశారు. 1930లో సూర్యసేన్‌ నాయకత్వంలో చిట్టగాంగ్‌ విప్లవకారులు ప్రభుత్వ ఆయుధగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. భగత్‌ సింగ్, బి.కె.దత్‌లు ‘అప్రజాస్వామిక’ ప్రజా రక్షణ బిల్లును నిరసిస్తూ కేంద్ర శాసనసభలోకి బాంబులు విసిరారు. దాంతో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు 1931, మార్చి 23న లాహోర్  సెంట్ర‌ల్ జైలులో ఉరిశిక్ష విధించారు.

  ఒకవైపు గాంధీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్‌ అహింసాయుత రాజ్యాంగబద్ధ రాజకీయ పోరాటం చేస్తుంటే, మరోవైపు జరుగుతున్న విప్లవ సాయుధ పోరాటాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వేలమందికి జీవిత ఖైదు, మరణ శిక్షలు విధించినప్పటికీ విప్లవ యోధుల్లో ధైర్యం సడలలేదు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి వారు అవలంబించిన విధానాలకు పెద్దగా ప్రజామోదం లేనప్పటికీ, స్వాతంత్రోద్యమ గతిని మార్చడంలో గణనీయమైన పాత్ర పోషించారు. అచంచల దేశభక్తి, దేశం కోసం మరణానికి కూడా భయపడని మనోధైర్యం, త్యాగాలు, స్వతంత్ర పోరాట చరిత్రలో వారికి విశిష్ట స్థానం కల్పించాయి.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 16-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు