• facebook
  • whatsapp
  • telegram

కౌటిల్యుడి - అర్థశాస్త్రం

* అర్థశాస్త్రం అనేది ప్రముఖ రాజనీతి గ్రంథం. దీన్ని చంద్రగుప్త మౌర్యుడి ప్రధాని అయిన కౌటిల్యుడు రచించాడు. సంస్కృత భాషలో రాసిన ఈ గ్రంథంలో 6000 శ్లోకాలు, 15 భాగాలు, 150 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 1909లో ఆచార్య శ్యామశాస్త్రి ఆంగ్ల భాషలోకి అనువదించారు. ఈ గ్రంథం మౌర్యుల 

పరిపాలనా విధానాన్ని వివరిస్తుంది.

* రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి? ప్రజల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి? ప్రభుత్వ ఉద్యోగుల విధివిధానాలు, ప్రజాసంక్షేమాన్ని ఎలా సాధించాలి? అనే అంశాలను ఈ గ్రంథంలో వివరించారు.

* శత్రునిర్మూలనకు, రాజకీయ లక్ష్యాల సాధనకు కఠినమైన నియమాలు అనుసరించాలని, ‘మార్గం కంటే లక్ష్యమే ముఖ్యం’ అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అందుకే ఈయన్ను ‘‘భారతీయ మాకియవెల్లీ’’ (Indian Machiavelli)గా పిలుస్తారు.

* ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం గురించి వివరిస్తూ ‘‘నీటిలో బతికే చేప నీరు తాగడాన్ని ఎలా గమనించలేమో, ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోవడాన్ని అలాగే గుర్తించలేం’’ అని కౌటిల్యుడు పేర్కొన్నాడు.

* ప్రజల ఆనందంలోనే రాజు/ చక్రవర్తి ఆనందం ఉంటుందని, అలాగే ప్రజలందరూ భావించిన మంచినే రాజు కూడా మంచిదిగా గుర్తించాలని ఆయన తెలిపారు.

గుప్తుల పరిపాలనా విధానం

మనదేశంలో గుప్త చక్రవర్తుల పాలనను ‘స్వర్ణయుగం’గా పేర్కొంటారు. వీరి పాలన గురించి కామందకుడు ‘నీతిసారం’ అనే గ్రంథాన్ని రచించారు. దీని ప్రకారం వీరి పాలనను కింది విధంగా చెప్పొచ్చు.

చక్రవర్తి: రాజ్యాధిపతి, సర్వాధికారి.

బలాధికర్నిక: సర్వసైన్యాధ్యక్షుడు. 

దండ పాసాధికర్నిక: రక్షకభటాధికారి.

రణభండాగారిక: సైనిక కోశాధికారి.

వినయస్థితి స్థాపక: శాంతిభద్రతలు, న్యాయశాఖా మంత్రి.

భటస్వపతి: పదాతి, అశ్వికదళ సేనాధిపతి.

మహాపిలుపతి: గజదళ సేనాధిపతి.

సాధనిక: అప్పులు, జరిమానాలను పర్యవేక్షించే అధికారి.

హిరణ్య సముద్రిక: కరెన్సీ అధికారి.

తాడయుక్తక: కోశాధికారి.

జౌనస్థానిక: సిల్కు కర్మాగారాలను పర్యవేక్షించే అధికారి.

అగ్రహారిక: అగ్రహారాల పర్యవేక్షక అధికారి.

కరణిక: పత్రాల పర్యవేక్షకుడు.

అవస్థిక: ధర్మశాలల పర్యవేక్షకుడు.

మొగల్‌ చక్రవర్తుల పరిపాలనా విధానం

మొగల్‌ చక్రవర్తుల పాలనా కాలంలో సుస్థిర పాలన అభివృద్ధి చెందింది. వీరి పరిపాలనా విధానం గురించి అబుల్‌ ఫజల్‌ ‘ఐనీ అక్బరీ’, ‘అక్బర్‌నామా’ అనే గ్రంథాలు రాశారు. బదౌనీ రచించిన ‘ముంతకాబ్‌-ఉల్‌-తవారిక్‌’, అబ్దుల్‌ హమీద్‌ లాహిరీ గ్రంథమైన ‘పాదుషానామా’లోనూ వీరి పాలన గురించి ఉంది.

కేంద్ర ప్రభుత్వం - పరిపాలన:

చక్రవర్తి: చక్రవర్తి సర్వాధికారి. ఇతడి మాటే శాసనం.

వకీలు: ప్రధానమంత్రి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇతడి ఆధీనంలో ఉంటుంది.

దివాన్‌-ఇ-వజీర్‌: ఆర్థిక మంత్రి.

మీర్‌బక్షి: సేనాధిపతి. 

సదుర్‌-ఉస్‌-సుదుర్‌: మత, ధార్మిక సంస్థల పర్యవేక్షణ అధికారి.

ఖాజి- అల్‌- ఖజాద్‌: న్యాయ వ్యవహారాలను నిర్వహించే అధికారి.

ఖాన్‌-ఇ-సమాన్‌: రాజు అంతఃపుర విషయాలను పర్యవేక్షించే అధికారి.

దరోగా-ఇ-తోప్‌ఖానా: తుపాకులు, ఫిరంగుల విభాగానికి అధిపతి.

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన:

* పరిపాలనా సౌలభ్యం కోసం మొగల్‌ పాలకులు తమ రాజ్యాన్ని ‘సుబాలు’గా విభజించారు. 

* సుబా పాలకుడు ‘సుబేదార్‌’. ఇతడు పౌర, సైనిక అధికారాలను కలిగి ఉంటాడు.

* ‘సుబేదార్‌’కు పరిపాలనలో సహకరించేందుకు దివాన్, అమీర్, ఫౌజ్‌దార్, పోద్దార్‌ అనే అధికారులు ఉండేవారు.

* ప్రతి ‘సుబా’ను పరిపాలనా సౌలభ్యం కోసం ‘సర్కారులు’గా విభజించారు. 

* సర్కార్‌ పాలనాధికారి ‘ఫౌజ్‌దార్‌’. ఇతడికి పాలనలో సహకరించేందుకు ‘అమల్‌ గుజార్‌’, ‘ఖజానాదారు’, ‘బితిక్చి’ మొదలైన ఉద్యోగులు ఉండేవారు.

* అమల్‌ గుజార్‌’ శిస్తు వసూలు చేసే అధికారి. ఇతడికి  ‘బితిక్చి’ అనే కింది స్థాయి ఉద్యోగి సహకరించేవాడు.

* పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి ‘సర్కార్‌’ను ‘పరగణా’ లేదా ‘మహల్‌’గా విభజించారు. పరగణా పాలనాధికారి ‘షిక్‌దార్‌’.

* ‘పరగణా’లో శిస్తు నిర్ణయించి, వసూలు చేసే అధికారి ‘అమీర్‌’.

* ‘పరగణా’లో ఖజానా అధికారి ‘పోద్దార్‌’.

* ‘పరగణా’ పరిధిలో ఉండే గ్రామ నిర్వాహకులను పర్యవేక్షించడానికి ‘కానుంగో’ అనే అధికారి ఉండేవాడు.

* గ్రామ పాలనను గ్రామపంచాయతీలు నిర్వహించేవి. గ్రామస్థాయిలో ‘మక్‌దన్‌’, ‘పట్వారీ’ అనే ఉద్యోగులు ఉండేవారు. వీరు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షించే వారు.

నగర పాలన:

మొగలుల కాలంలో రాజ్యానికి కావాల్సిన ముఖ్యమైన నగర పాలనను ‘కొత్వాల్‌’ అనే ఉద్యోగి నిర్వహించేవారు. ఇతడు నగరంలో శాంతి-భద్రతలను పరిరక్షించడం, ధరలను క్రమబద్ధీకరించడం మొదలైన విధులను నిర్వహించేవాడు.

దహ్‌సాల పద్ధతి: 

దీన్ని రాజాతోడర్‌మల్‌ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పదేళ్ల సరాసరి పంటను, పది సంవత్సరాల ధరలను ప్రమాణంగా తీసుకుని పన్నులు నిర్ణయించేవారు.

మౌర్యుల పరిపాలన విధానం

భారతదేశ చరిత్రలో మౌర్య చక్రవర్తులు మొదటిసారి దేశంలోని అత్యధిక భాగాన్ని ఒకే పాలన కిందకు తీసుకువచ్చారు. వీరు చక్కని పరిపాలనా వ్యవస్థను ఏర్పరచుకుని పాలనలో ఏకరూపతను పెంపొందించారు. వీరు అత్యంత కేంద్రీకృత పాలనను ఏర్పరిచారు. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాని స్వరూపం కింది విధంగా ఉండేవి.

చక్రవర్తి (స్వామి): పరిపాలనలో చక్రవర్తి సర్వాధికారి. ఇతడు రాజ్యపాలకుడు, సర్వసైన్యాధ్యక్షుడు, శాసనకర్త.

మంత్రి పరిషత్‌: రాజ్యపాలనలో చక్రవర్తికి సహకరించడానికి ఏర్పాటు చేసిన కొంతమంది వ్యక్తుల బృందం. మంత్రుల ఎన్నిక తప్పనిసరిగా ప్రతిభ ఆధారంగానే జరిగేదని అర్థశాస్త్ర గ్రంథంలో పేర్కొన్నారు.

అమాత్య: ఉద్యోగి పాలన, కార్యనిర్వాహక అధికారులు.

అధ్యక్ష: వివిధ విభాగాల బాధ్యుడు.

సన్నిధాత: ముఖ్య కోశాధికారి.

సమాహర్త: ముఖ్య రెవెన్యూ అధికారి.

దండపాల: ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌.

అక్షపటల్‌: అకౌంటెంట్‌ జనరల్‌.

కార్మిక: వివిధ విభాగాల్లో పనిచేసే లేఖకులు.

ధమ్మమహామాత్ర: ధర్మ ప్రచారానికి కృషి చేసేవారు.

అంతమహామాత్రులు: సరిహద్దు ప్రజలు, గిరిజనులతో కలిసి పనిచేసేవారు.

మహాపాత్ర: నగరాల్లోని న్యాయమూర్తులు.

ఇతిజఖ మహామాత్ర: స్త్రీల పర్యవేక్షణాధికారులు.

ప్రాదేశిక: జిల్లాస్థాయిలో పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారి.

గణికాధ్యక్షులు: వేశ్యలపై పర్యవేక్షణ చేసేవారు.

రజ్జుక: న్యాయాధికారి. జిల్లాస్థాయిలో భూసర్వే, మదింపు జరిపే అధికారి.

యుక్త: జిల్లాస్థాయి కోశాధికారి.

పతివేదికలు: ప్రజల సమాచారాన్ని రాజుకు చేరవేసే అధికారులు.

పులిసాని: దిగువస్థాయిలో రాజు ప్రతినిధి.

నాగరిక: పట్టణస్థాయిలో శాంతిభద్రతలు, పరిశుభ్రత లాంటి అంశాలను పర్యవేక్షించే అధికారి.

సేనాపతి: సైన్యాధిపతి.

గ్రామిక: గ్రామ పాలనా బాధ్యుడు.

గూఢ పురుష: రాజ్యంలోని గూఢచారులు.

కంఠకశోధన: న్యాయస్థానం (క్రిమినల్‌ వివాదాలను విచారిస్తుంది.)

రూపదర్శక: నాణేలను పరీక్షించేవాడు.

అగరనోమై: మార్కెట్‌ కమిషనర్లు.

ధర్మస్థేయ: న్యాయస్థానం (సివిల్‌ వివాదాలను విచారిస్తుంది.)

* మౌర్యుల కాలంలో 10 గ్రామాలకు సంగ్రహ న్యాయస్థానం, 400 గ్రామాలకు ద్రోణముఖ న్యాయస్థానం, 800 గ్రామాలకు ఒక ప్రాంతీయ న్యాయస్థానం ఉండేవి.

* గ్రామ పరిపాలనకు, జిల్లా పరిపాలనకు మధ్యస్థాయిలో 5 నుంచి 10 గ్రామాలను ఒక భాగంగా ఏర్పాటు చేశారు.  దీనికి సంబంధించిన లెక్కలను, పద్దులను ‘గోప’ అనే అధికారులు నిర్వహించేవారు. ‘స్థానిక’ అనే అధికారి ఈ భాగంలో పన్నులు వసూలు చేసేవారు.

* ప్రతి గ్రామంలోనూ గ్రామ పెద్ద (గ్రామిక) ఉండేవారు. ఈయన గ్రామ పరిపాలనా విషయాలను గమనిస్తూ ‘గోప’కు బాధ్యత వహించేవారు.

పట్టణ పరిపాలన

మనదేశంలో పట్టణ పరిపాలనను అభివృద్ధి చేసిన పాలకులుగా మౌర్యులను పేర్కొంటారు. మెగస్తనీస్‌ రాసిన ‘ఇండికా’ గ్రంథం ప్రకారం మౌర్యుల రాజధాని అయిన పాటలీపుత్ర నగర పాలనను 30 మంది సభ్యుల బృందం చూసుకునేది. అయిదుగురు సభ్యులతో కూడిన 6 కమిటీలు సమర్థవంతంగా పట్టణ పాలనను నిర్వహించేవి. అవి: 

1. జనన మరణాల రికార్డుల నిర్వహణ కమిటీ

2. తూనికలు, కొలతల నిర్వహణ కమిటీ

3. విదేశీ యాత్రికుల సదుపాయాల కమిటీ

4. పరిశ్రమలు, చేతివృత్తుల కమిటీ

5. వస్తువుల ఉత్పత్తి, నాణ్యత, అమ్మకం కమిటీ

6. వస్తువుల అమ్మకంపై 10 శాతం పన్ను వసూలు చేసే కమిటీ.

రచయిత: బంగారు సత్యనారాయణ, విషయ నిపుణులు 

Posted Date : 18-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌