• facebook
  • whatsapp
  • telegram

ప్రభుత్వ విధానాలు - రూపకల్పన

ప్రభుత్వ విధానాల రూపకల్పనకు స్ఫూర్తినిచ్చే అంశాలు

    స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలు - ఆశయాలు

    రాజ్యాంగ ఉద్దేశాలు

    ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి వ్యూహాలు

    పౌర సమాజ అవసరాలు - పెరుగుతున్న ప్రజల ఆకాంక్షలు

    న్యాయ వ్యవస్థ క్రియాశీలత - కీలకమైన తీర్పులు

   వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఉద్దేశాలు, విధులు

స్వభావరీత్యా ప్రభుత్వ విధానాల వర్గీకరణ

ఆర్థిక రంగం: దీనిలో పారిశ్రామిక, వ్యవసాయ విధానాలు; ఎగుమతి, దిగుమతి విధానాలు; ద్రవ్య, పరపతి విధానాలు మొదలైనవి అంతర్భాగంగా ఉంటాయి.

సాంఘిక రంగం: సామాజిక భద్రత, మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, జనాభా, సంక్షేమం మొదలైన వాటికి సంబంధించిన విధానాలన్నీ ఇందులో అంతర్భాగంగా ఉంటాయి.

రాజకీయ - రక్షణ విధానం: విదేశాంగ విధానం, రక్షణ, అణుశక్తి, ఆంతరంగిక భద్రత మొదలైన విధానాలు ఉంటాయి.

ప్రభుత్వ విధానాల రూపకల్పన - స్థాయులు

    విధానాలు రూపొందించే బాధ్యత ప్రభుత్వానిదే. స్థాయి ఆధారంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1. కేంద్ర ప్రభుత్వ విధానాలు (Union Government Policies)

2. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు (State Government Policies)

కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాల ఆధారంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన ఉంటుంది.

 రక్షణ, విదేశాంగ, ద్రవ్య పరపతి, సరళీకృత ఆర్థిక విధానం, అణ్వాయుధ విధానం మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.

నీటిపారుదల, ప్రజారోగ్యం, శాంతి భద్రతలు, మార్కెట్లు, దస్తావేజులు, విద్యుత్‌ మొదలైన విధానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి.

ప్రభుత్వ విధానం -  రూపకల్పన దశలు

1. సమస్యల గుర్తింపు

2. విధాన ప్రత్యామ్నాయాల అన్వేషణ

3. విధానాల ఎంపిక

4. విధానాల రూపకల్పన

5. విధానాల అమలు

6. విధానాల పర్యవేక్షణ

7. విధానాల సమీక్ష, మూల్యాంకనం

పార్లమెంట్‌

 భారతదేశం పార్లమెంటరీ తరహా  ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. దీని ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి శాసన నిర్మాణ శాఖకు సమష్టి బాధ్యత వహిస్తుంది. 

మంత్రిమండలి రూపొందించిన ప్రభుత్వ విధానాలపై పార్లమెంట్‌ లోతుగా చర్చించి; చట్టాలు, తీర్మానాల రూపంలో ఆమోదిస్తుంది.

 వివిధ మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పార్లమెంటరీ సలహా కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటిలో పార్లమెంట్‌కు ఎన్నికైనవారు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీల సూచనల మేరకు ప్రభుత్వ విధానాల రూపకల్పన జరుగుతుంది. 

  ప్రభుత్వ విధానాల అమలుకు నిర్దేశించిన బడ్జెట్‌ను పార్లమెంట్‌ ఆమోదించాలి.

కేంద్ర సచివాలయం:

 మనదేశంలో బ్రిటిష్‌ వారి కాలంలోనే సచివాలయ వ్యవస్థ ఉంది. దీన్ని లార్డ్‌ కారన్‌ వాలీస్‌ వ్యవస్థీకృతం చేశారు. 1919 నాటి మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా ‘సచివాలయ’ విధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించారు.

 కేంద్ర సచివాలయంలో భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వానికి హృదయంలా వ్యవహరిస్తూ, కేంద్ర అంశాల పాలనకు బాధ్యత వహిస్తుంది.

కేంద్ర సచివాలయం జాతీయ ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాలను సమన్వయం చేస్తూ, ఆర్థికపరమైన - విదేశాంగ విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది. 

ఇది ప్రభుత్వానికి ప్రధాన కార్యనిర్వాహక అంగంగా పనిచేస్తుంది.

కేంద్ర సచివాలయం జారీచేసే ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఆదేశాలుగానే భావిస్తారు.

కేంద్ర సచివాలయంలో విధులు నిర్వర్తించే కార్యదర్శులందరినీ భారత ప్రభుత్వ కార్యదర్శులుగానే పరిగణిస్తారు.

‘రాజ్యం’ లక్ష్యాల అమలు కోసం ప్రభుత్వం రూపొందించే వివిధ పరిపాలనా చర్యలను ‘ప్రభుత్వ విధానాలు’గా పేర్కొంటారు. దేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతికి ప్రభుత్వం చేపట్టే విధివిధానాల తీరు, అమలు, పర్యవేక్షణలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.

ప్రభుత్వ విధానాల రూపకల్పన - సంస్థలు

కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ విధానాల రూపకల్పన బాధ్యత అనేక సంస్థలు/ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. అవి: కేంద్ర మంత్రిమండలి, పార్లమెంట్, కేంద్ర సచివాలయం, కేబినెట్‌ సచివాలయం, ప్రధానమంత్రి కార్యాలయం, న్యాయ వ్యవస్థ.

కేంద్ర మంత్రిమండలి:    మనదేశంలో ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి జాతీయ స్థాయిలో ‘ప్రభుత్వ విధానాల రూపకల్పన’లో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రాజకీయ కార్యనిర్వాహక వర్గంగా అనేక విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. 

విధానాల రూపకల్పనపై సమగ్ర అధ్యయనానికి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తుంది. 

ఈ కమిటీలు మంత్రిమండలి తీసుకునే విధాన నిర్ణయాలపై సూచనలు, సలహాలు ఇస్తాయి. విధాన నిర్ణయాలను మంత్రి మండలి ఆమోదించడం ద్వారా ప్రభుత్వ విధాన రూపకల్పన నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటుంది. 

ప్రభుత్వ విధానాల రూపకల్పనలో  వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అవసరం.

కేబినెట్‌ సచివాలయం

దీన్ని 1946లో ఏర్పాటు చేశారు. కేబినెట్‌ సచివాలయానికి మొదటి కార్యదర్శిగా హెచ్‌.ఎం.పటేల్‌ వ్యవహరించారు. ఈయన 1950 వరకు కేబినెట్‌ సెక్రటరీ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు.

ప్రభుత్వ యంత్రాంగ పునర్‌వ్యవస్థీకరణపై ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. దీనిప్రకారం 1950 నుంచి కేబినెట్‌ కార్యదర్శిని దేశంలోని అత్యున్నత సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగిగా గుర్తిస్తున్నారు. ఈ స్థాయిలో మొదటి కేబినెట్‌ సెక్రటరీగా ఎన్‌.ఆర్‌.పిళ్లై 1950, ఫిబ్రవరి 6 నుంచి 1953, మే 13 వరకు విధులు నిర్వర్తించారు. 

ప్రస్తుతం కేబినెట్‌ కార్యదర్శిగా రాజీవ్‌ గౌబా 2019 నుంచి కొనసాగుతున్నారు.

ప్రధానమంత్రి, కేబినెట్, కేబినెట్‌ కమిటీలకు ముఖ్య సలహాదారుడిగా కేబినెట్‌ కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈయన దేశంలో అత్యున్నత స్థాయి రాజకీయ వ్యవస్థకు, సివిల్‌ సర్వీసులకు వారధిగా వ్యవహరిస్తారు.

కేబినెట్‌ సచివాలయం ప్రధానమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేస్తుంది. కేబినెట్‌ కార్యదర్శి నాయకత్వంలోని కేబినెట్‌ సచివాలయ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ విధానాల రూపక్పనలో అత్యంత కీలక పాత్రను పోషిస్తారు. 

కేబినెట్‌ సామర్థ్యం కేబినెట్‌ సచివాలయం నిర్వర్తించే విధులపై ఆధారపడి ఉంటుంది.

ప్రధానమంత్రి కార్యాలయం (Prime Ministers Office - PMO)

మనదేశంలో ప్రభుత్వాధినేతగా, రాజకీయ కార్యనిర్వాహక అధిపతిగా ప్రధానమంత్రి అనేక రకాల అధికారాలు, విధులను నిర్వహిస్తారు.

ప్రధానమంత్రికి పరిపాలనలో సహకరించడానికి, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వివిధ మంత్రిత్వ శాఖలకు, కేబినెట్‌ సచివాలయానికి మధ్య సమన్వయాన్ని సాధించడానికి పీఎంఓ కృషి చేస్తుంది.

భారత్‌లో 1947, ఆగస్టు 15న ప్రధానమంత్రి సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో దీనికి అధికారిగా కార్యదర్శి వ్యవహరించేవారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ పాలనా కాలంలో హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌ పీఎం వ్యక్తిగత కార్యదర్శిగా నియమితులయ్యారు.

  ఇందిరా గాంధీ కాలంలో పి.ఎన్‌.హక్సర్‌ సచివాలయ ప్రాభవాన్ని తెలియజేశారు.

1977లో మొరార్జీ దేశాయ్‌ పాలనా కాలంలో దీని పేరును ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)గా మార్చారు. ఆ సమయంలో పీఎంఓ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వి.శంకర్‌ ఆదేశాలు ప్రధాని స్థాయిలోనే అమలయ్యేవి.

 రాజీవ్‌గాంధీ, పి.వి.నరసింహారావు, 

డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ పాలనా కాలంలో పీఎంఓ క్రియాశీలకంగా వ్యవహరించి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది.

నరేంద్ర మోదీ పరిపాలనా కాలంలో ప్రధానమంత్రి కార్యాలయం మరింత శక్తిమంతంగా రూపొందింది.

న్యాయవ్యవస్థ 

ప్రభుత్వ విధానాల రూపకల్పనలో న్యాయవ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మనదేశంలో వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన  తీర్పులు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు మార్గదర్శకంగా నిలిచాయి.

ప్రభుత్వ విధానాల చలనశీలత

మారుతున్న పరిస్థితులు, ప్రభుత్వాధినేతల సిద్ధాంతాలు, ఆదర్శాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు చలనశీలతకు గురవుతున్నాయి.

ఉదాహరణలు:

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ‘నెహ్రూ - మహలనోబిస్‌’ అభివృద్ధి వ్యూహాల్లో భాగంగా ‘స్వయం సమృద్ధి - పారిశ్రామికీకరణ’ లక్ష్యాలుగా ప్రభుత్వ విధానాలు రూపొందాయి.

1970, 80 దశకాల్లో ‘ఇందిరా గాంధీ - స్వామినాథన్‌’ వ్యూహాలను అనుసరించి ‘హరిత విప్లవం - పేదరిక నిర్మూలన’ లక్ష్యాలుగా ప్రభుత్వ విధానాలు మారాయి.

1990 దశకంలో ‘పి.వి.నరసింహారావు - మన్మోహన్‌సింగ్‌’ వ్యూహాల్లో భాగంగా ‘సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, ఉదారీకరణ’ లక్ష్యాలుగా ప్రభుత్వ విధానాలు రూపాంతరం చెందాయి.

2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ‘సుస్థిర పరిపాలన, స్వచ్ఛ భారత్, ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యాలుగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయి.

రచయిత

బంగారు సత్యనారాయణ

విషయ నిపుణులు 

Posted Date : 22-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌