• facebook
  • whatsapp
  • telegram

హైకోర్టు

పౌరహక్కులకు ఉన్నత రక్షణ!


ఒక రాష్ట్రం పరిధిలో పౌరుల హక్కులను పరిరక్షిస్తుంది. దిగువ న్యాయస్థానాలను నియంత్రిస్తుంది. అప్పీళ్లను విచారిస్తుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను, ఉత్తర్వులను సమీక్షిస్తుంది. తీర్పులను భద్రపరుస్తుంది. సుప్రీం కోర్టు తర్వాత ఉన్నతంగా వ్యవహరించే ఈ హైకోర్టుల నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, తొలగింపు, విధులు, అధికారాలు తదతర అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.   


రాష్ట్రస్థాయిలో ‘హైకోర్టు’ అత్యున్నత న్యాయస్థానం. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై, స్వయం ప్రతిపత్తితో వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, రాజ్యాంగ నియమాలకు లోబడి కొనసాగేలా చూస్తుంది.


చారిత్రక నేపథ్యం: ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861 ప్రకారం 1862 జులై 1న కలకత్తాలో తొలి హైకోర్టు ఏర్పాటైంది. దీని మొదటి ప్రధాన న్యాయమూర్తి ‘సర్‌ బార్నెస్‌ పీకాక్‌’. 1862, ఆగస్ట్‌ 14న రెండో హైకోర్టును బొంబాయిలో; 1862, ఆగస్ట్‌ 15న మూడో హైకోర్టును మద్రాస్‌లో ఏర్పాటు చేశారు. ఈ మూడు హైకోర్టులు 2011లో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. 1866, మార్చి 17న అలహాబాద్‌లో హైకోర్టు ఏర్పాటైంది.


రాజ్యాంగ వివరణ: రాజ్యాంగంలోని 6వ భాగంలో 214 నుంచి 232 ఆర్టికల్స్‌ హైకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, నియమ నిబంధనలు, హైకోర్టుల పరిధి, అధికారాలు, విధుల గురించి పేర్కొంటున్నాయి.


ఆర్టికల్‌ 214, 216: ఈ ఆర్టికల్స్‌ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ప్రకారం పార్లమెంటు రూపొందించిన శాసనం ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ‘ఉమ్మడి హైకోర్టు’ ఏర్పాటు చేయవచ్చు. సాధారణంగా హైకోర్టు భౌగోళిక పరిధి సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధి వరకే ఉంటుంది. ఉమ్మడి హైకోర్టు భౌగోళిక పరిధి సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల భూభాగ పరిధి వరకు విస్తరించి ఉంటుంది.


న్యాయమూర్తుల సంఖ్య: హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఇందుకోసం సంబంధిత రాష్ట్ర జనాభా, విస్తీర్ణం, నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో అత్యధికంగా సుమారు 120 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా ముగ్గురు న్యాయమూర్తులే ఉన్నారు.


న్యాయమూర్తుల నియామకానికి ఉండాల్సిన అర్హతలు:

* భారతీయ పౌరుడై ఉండాలి.

* హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.(లేదా) * జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా 10 సం।।లు పనిచేసి ఉండాలి.

* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి.

నియామకం (ఆర్టికల్‌ 217):

* కొలీజియం సిఫార్సుల మేరకు హైకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు.

* హైకోర్టులో పనిఒత్తిడి ఎక్కువ ఉండి, తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేనప్పుడు రెండేళ్ల పదవీకాలానికి అదనపు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు.

ప్రమాణ స్వీకారం (ఆర్టికల్‌ 219): హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్‌ సమక్షంలో కిందివిధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ‘‘భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కల్గి ఉంటాను. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సంరక్షిస్తాను. నా సామర్థ్యం మేరకు రాగద్వేషాలు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తాను’’ అని ప్రమాణం చేస్తారు.

పదవీకాలం:

* హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. గతంలో ఇది 60 ఏళ్లుగా ఉండేది. 15వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963 ద్వారా పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.

* న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

* పార్లమెంటు సిఫార్సుల మేరకు న్యాయమూర్తులను రాష్ట్రపతి తొలగిస్తారు.

న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ:

* హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 100 మంది లోక్‌సభ సభ్యులు; రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది రాజ్యసభ సభ్యులు తీర్మాన ప్రతిపై సంతకాలు చేసి ఆయా సభాధ్యక్షులకు అందించాలి.

* అసమర్థత, అవినీతి ఆరోపణలపై న్యాయమూర్తిని తొలగించే ఈ తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభలు విడివిడిగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి సంబంధిత న్యాయమూర్తులను తొలగిస్తారు.

* 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సౌమిత్ర సేన్‌పై రాజ్యసభలో ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానం లోక్‌సభలో ప్రవేశపెట్టక ముందే ఆయన పదవికి రాజీనామా చేశారు.

జీతభత్యాలు:

* హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను  చట్టం ద్వారా పార్లమెంటు నిర్ణయిస్తుంది. వాటిని సంబంధిత రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవీవిరమణ అనంతరం పెన్షన్‌ను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

* 1950లో హైకోర్ట్‌ ప్రధాన న్యామూర్తి వేతనం రూ.4000. ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.3500.

* 2018లో రూపొందించిన చట్టం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.2,50,000. ఇతర న్యాయమూర్తుల వేతనం రూ.2,25,000.

* న్యాయమూర్తుల జీతభత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది. పదవీ కాలంలో ఉన్నంత వరకు వీరి జీతభత్యాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న నియమాల ఆధారంగా వీరికి జీతభత్యాలు అందుతాయి.

న్యాయమూర్తుల బదిలీ (ఆర్టికల్‌ 222):  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ‘కొలీజియం’ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఒక హైకోర్టు న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేస్తారు.

పదవీ విరమణ అనంతరం:

* పదవీవిరమణ అనంతరం న్యాయమూర్తులు వారు పనిచేసిన హైకోర్టులో తప్ప, ఇతర హైకోర్టుల్లో గాని, సుప్రీంకోర్టులో గాని న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు.

* పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్‌ (వీసీ) గా, విచారణ సంఘాలకు ఛైర్మన్లుగా, విదేశాలకు రాయబారులుగా నియమితులవుతున్నారు.

హైకోర్టు బెంచ్‌: ఒక రాష్ట్రంలో హైకోర్ట్‌ బెంచ్‌ను అదే రాష్ట్రంలో వేరే నగరంలో ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు.

హైకోర్ట్‌ అధికారాలు, విధులు

ప్రాథమిక/ ప్రారంభ/ ఒరిజినల్‌ విచారణాధికార పరిధి:

* అప్పీళ్ల ద్వారా కాకుండా హైకోర్టు నేరుగా విచారించే అధికారాలు దీని పరిధిలోకి వస్తాయి. సుప్రీంకోర్టు విచారణ అధికార పరిధి, హైకోర్టు విచారణ అధికార పరిధిని పోల్చి చూసినప్పుడు హైకోర్టు విచారణ అధికార పరిధే ఎక్కువ. దీనికి కారణం వ్యక్తుల, సంస్థల హక్కుల రక్షణకు హైకోర్టు ‘నిలుపుదల ఉత్తర్వులు’ (Injunction orders) జారీ చేస్తుంది.

* పార్లమెంటు, శాసనసభ ఎన్నికల వివాదాలను విచారిస్తుంది. వివాహం, విడాకులు, వీలునామా వంటి అంశాలకు సంబంధించిన వివాదాలను విచారిస్తుంది.

కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌:

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 215 ప్రకారం రాష్ట్రస్థాయిలో హైకోర్ట్‌ ‘కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌’గా వ్యవహరిస్తుంది. దీని ప్రకారం హైకోర్టు తాను ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలు, వ్యక్తులు, సంస్థలకు కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ శిరోధార్యం. కోర్ట్‌ ఆఫ్‌ రికార్డ్‌ ధిక్కరణను కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించి శిక్షిస్తారు.

* కోర్టు ధిక్కరణ అంటే న్యాయస్థానాల అధికారాలకు విఘాతం కలిగించడం, న్యాయపాలనలో అనవసర జోక్యం చేసుకోవడం, న్యాయస్థానాల తీర్పులను విమర్శించడం.

అప్పీళ్ల విచారణాధికార పరిధి: రాష్ట్రస్థాయిలో అత్యున్నత అప్పీళ్ల న్యాయస్థానం హైకోర్ట్‌. దీని భౌగోళిక పరిధిలోని దిగువ న్యాయస్థానాల తీర్పులపై వచ్చిన సివిల్, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అప్పీళ్లను విచారిస్తుంది. దిగువ స్థాయి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులతో అసంతృప్తి చెందిన వ్యక్తులు, సంస్థలు హైకోర్టును ఆశ్రయించవచ్చు. జిల్లా సెషన్స్‌ కోర్ట్‌ మరణ శిక్షను విధించినా లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించినా అలాంటి కేసులన్నింటినీ హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై హైకోర్టులో అప్పీలు చేయవచ్చు. ట్రిబ్యునల్స్‌ హైకోర్టు పరిధిలోకి వస్తాయని 1997లో సుప్రీంకోర్టు తీర్పుఇచ్చింది.

రిట్స్‌ జారీ చేయడం: ప్రాథమిక హక్కుల సంరక్షణకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది. అవి 1) హెబియస్‌ కార్పస్‌ 2) మాండమస్‌ 3) సెర్షియోరరీ 4) ప్రొహిబిషన్‌ 5) కోవారెంటో *హైకోర్టు ఏదైనా వ్యక్తికి/అధికారికి/ప్రభుత్వానికి ‘‘రిట్స్‌’’(Writs) జారీ చేయవచ్చు.* సుప్రీంకోర్టు, హైకోర్టుల రిట్స్‌ అధికార పరిధి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని, దీనిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించే వీలులేదని 1997లో చంద్రకుమార్‌ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

దిగువ న్యాయస్థానాలపై నియంత్రణ:

* హైకోర్టుకు రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాలపై నియంత్రణాధికారం ఉంటుంది. జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీలు, ఇతర సిబ్బంది ఎంపికలో హైకోర్టు కీలక పాత్రను పోషిస్తుంది.

* దిగువ న్యాయస్థానాలు విచారించే ఏదైనా కేసులో రాజ్యాంగపరమైన, శాసనపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని హైకోర్టు భావిస్తే సంబంధిత కేసును తనకు బదిలీ చేయించుకుని విచారిస్తుంది.

* హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని అన్ని దిగువ న్యాయస్థానాలకు శిరోధార్యం.

న్యాయ సమీక్షాధికారం:

* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు అని హైకోర్టు ‘న్యాయసమీక్ష’ ద్వారా ప్రకటిస్తుంది.

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా హైకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించారు. 43వ రాజ్యాంగ సవరణ చట్టం (1977) ద్వారా న్యాయసమీక్షాధికారాన్ని పునరుద్ధరించారు.

కీలక అంశాలు

* కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు - సుంబనాథ్‌ పండిట్‌

* కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి భారతీయుడు - పి.బి.చక్రవర్తి

* మన దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - అన్నాచాందీ (కేరళ)

* మన దేశంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - లీలా సేథ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)

* దిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ - జస్టిస్‌ రోహిణి

* 1954లో గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ కోకా సుబ్బారావు

* 1956లో హైదరాబాద్‌లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ కోకా సుబ్బారావు

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌.

* తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌కు తొలి ప్రధాన న్యాయమూర్తి (తాత్కాలిక) - జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ (01-01-2019)

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి (పూర్తిస్థాయి) - జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి (07-10-2019)

ప్రస్తుతం మన దేశంలో హైకోర్టుల సంఖ్య: 25

నోట్‌: 1956లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2019లో తెలంగాణ హైకోర్టుగా అవతరించింది.

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌