• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - అంతరిక్ష రంగం

భారతదేశం - అంతరిక్ష రంగం

* ఇస్రో ప్రధానంగా పీఎస్‌ఎల్వీ (పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌), జీఎస్‌ఎల్వీ (జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) అనే రాకెట్లను ప్రయోగిస్తుంది. తొలిసారి ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) అనే కొత్త తరహా రాకెట్‌ని ఎస్‌ఎస్‌ఎల్వీ- D1  పేరుతో 2022, ఆగస్టు 7న ప్రయోగించింది.

* ఎస్‌ఎస్‌ఎల్వీ- D1 తో ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు EOS - 02, ఆజాదీశాట్‌. ఇవి తమ కక్ష్యలను చేరడంలో విఫలమయ్యాయి.

* EOS ఒక భూపరిశీలన ఉపగ్రహం. ఆజాదీశాట్‌ 8 కేజీల  8U క్యూబ్‌శాట్‌. దీన్ని 75 ప్రభుత్వ పాఠశాలల్లోని 750 మంది బాలికలు రూపొందించారు. అజాదీశాట్‌ 14వ స్టూడెంట్‌ శాటిలైట్‌. దీనికి ముందు ప్రయోగించినవి: అనుశాట్‌ (2009) ,StudSat, SRMSAT, జుగ్ను, సత్యభామశాట్, స్వయం, ప్రథమ్, PISAT, NIUSAT, కలాంశాట్‌ - V2, UNITYSAT, SDSAT, ఇన్‌స్పైర్‌శాట్‌.


ఎస్‌ఎస్‌ఎల్వీతో తక్కువ ద్రవ్యరాశి (సుమారు 500 కేజ్శీ) ఉపగ్రహాలను, తక్కువ ఎత్తులోని (LEO)  కక్ష్యలోకి ప్రవేశపెట్టి, విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు.


భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. దీన్ని 1974, ఏప్రిల్‌ 19న USSR నుంచి ప్రయోగించారు. భారత తొలి రాకెట్‌ - SLV3 , దీంతో రోహిణి శాటిలైట్‌ (RS-1)  ని 1980లో శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. భారత తొలి రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ భాస్కర-1.


పీఎస్‌ఎల్వీ రాకెట్‌తో ప్రధానంగా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్లను ప్రయోగిస్తారు. ఇవే IRS (Indian Remote Sensing) ఉపగ్రహాలు. తర్వాతికాలంలో వాటి ఉపయోగం ఆధారంగా ఉపగ్రహాలను వివిధ పేర్లతో పిలిచారు. ప్రస్తుతం వీటిని EOS శ్రేణిగా పిలుస్తున్నారు. 


జీఎస్‌ఎల్వీ రాకెట్లతో పెద్ద (బరువైన) ఉపగ్రహాలను 36,000 కి.మీ. దూరంలోని కక్ష్యల్లో ప్రవేశపెట్టొచ్చు. కమ్యూనికేషన్‌ శాటిలైట్లను వీటిద్వారా ఎక్కువగా ప్రయోగిస్తారు. వీటిని పూర్వం INSAT (Indian National
Satellite), GSAT అనేవారు. ప్రస్తుతం వీటిని CMS (Communication Satellites) అని పిలుస్తున్నారు. 


పీఎస్‌ఎల్వీ రాకెట్‌లో నాలుగు దశలు (అంచెలు) ఉంటాయి. వీటిలో వరుసగా ఘన, ద్రవ, ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగిస్తారు.


జీఎస్‌ఎల్వీ రాకెట్‌లో మూడు దశలు ఉంటాయి. వీటిలో వరుసగా ఘన, ద్రవ, క్రయోజెనిక్‌ ఇంధనాలను వాడతారు.


క్రయోజెనిక్‌ ఇంజిన్లో అతిశీతల ద్రవ ఆక్సిజన్‌ (LOX) −183°C వద్ద ఉంటే, ద్రవ హైడ్రోజన్‌ (LH2) −253°C వద్ద ఉంటుంది.


క్రయోజెనిక్‌ టెక్నాలజీలో భారత్‌ మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. కాబట్టి, ఎక్కువ సంఖ్యలోని కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను విదేశీ రాకెట్లతో ప్రయోగించారు.


పీఎస్‌ఎల్వీ రాకెట్‌ని ఇస్రో గెలుపు గుర్రం అంటారు. దీన్ని 55 సార్లు ప్రయోగిస్తే, 53 సార్లు విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.


* పీఎస్‌ఎల్వీతో చంద్రయాన్, మంగళ్‌యాన్, నావిగేషన్‌ (IRNSS) ఉపగ్రహాలతోపాటు, కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను కూడా ప్రయోగించారు.


*  PSLV-C11 చంద్రయాన్‌-1, PSLV-C25 (2013) - మంగళ్‌యాన్‌ (MOM), PSLV-C37 తో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎలన్‌మస్క్‌కి చెందిన Space X  సంస్థ Falcon-9 రాకెట్‌తో 143 ఉపగ్రహాలను ఏకకాలంలో అంతరిక్షంలోకి పంపి, ఈ రికార్డును అధిగమించింది.


*  భారత్‌ పీఎస్‌ఎల్వీతో 34 దేశాలకు చెందిన 345 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది.


*  జీఎస్‌ఎల్వీతో కేవలం 10 ఉపగ్రహాలను మాత్రమే విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 44 కమ్యూనికేషన్స్‌ ఉపగ్రహాల్లో 4 పీఎస్‌ఎల్వీతో, 14 జీఎస్‌ఎల్వీతో ప్రయోగిస్తే, మిగిలినవాటిని విదేశీ రాకెట్లతో ప్రయోగించారు.


*  శ్రీహరికోటలోని రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని మొదట్లో SHAR (Sriharikota High Altitude Range) అనేవారు. ప్రస్తుతం దీన్ని SDSC (సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌)గా పిలుస్తున్నారు. ఇందులో రెండు లాంచింగ్‌ ప్యాడ్‌లు ఉన్నాయి.


* నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC)  హైదరాబాద్‌లో ఉంది.


* ఇస్రో తొలి వాణిజ్య విభాగం ANTRIX. రెండోది NSIL (New Space India Limited).


PSLV-C53 ద్వారా 2022, జూన్‌ 30న సింగపూర్‌కి చెందిన DS-EO, NeuSAR,SCOOB 1 అనే ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. పీఎస్‌ఎల్వీలోని నాలుగో అంచె PS4 కొంతకాలంపాటు కక్ష్యలో ప్రయోగవేదికగా ఉంటుంది. దీన్నే POEM (PSLV Orbrital Experimental Module) అంటారు.


PSLV-C52  ద్వారా 2022, ఫిబ్రవరి 14న EOS-04, INSPIRESat, INS-2D ఉపగ్రహాలను ప్రయోగించారు. 


* EOS-04 ఒక రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌. INSPIRESat ని Indian Institute of Space Science & Technology,, తిరువనంతపురం విద్యార్థులు, కొలరాడో, సింగపూర్, తైవాన్‌ విద్యార్థులతో కలిసి నిర్మించారు. INS-2D ఉపగ్రహాన్ని ఇండో-భూటాన్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్మించారు. ఇది భవిష్యత్తులో ప్రయోగించే భూటాన్‌ ఉపగ్రహం INS-2B కి ముందస్తు ప్రయోగం.


PSLV-C51 ద్వారా బ్రెజిల్‌కి చెందిన అమెజోనియా-1తోపాటు, మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించారు.


పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ రాకెట్‌ రెండో అంచెల్లో వికాస్‌ ఇంజిన్‌ని ఉపయోగిస్తారు.


2022, జూన్‌ 23న GSAT-24 ఉపగ్రహాన్ని Ariane-V రాకెట్‌తో కౌరూ, ఫ్రెంచ్‌ గయానా నుంచి ప్రయోగించారు. దీన్ని NSIL, ‘టాటాప్లే’కి 15 ఏళ్లపాటు డీటీహెచ్‌ సేవల కోసం లీజుకు ఇచ్చింది.


* రష్యాకి చెందిన క్రయోజెనిక్‌ ఆప్పర్‌ స్టేజ్‌(CUS) సాంకేతికతను వాడిన రాకెట్లను GSLV MK-I అని, భారత్‌ అభివృద్ధి చేసిన CUS ని వాడే రాకెట్లను GSLV MK-II అని పిలుస్తారు. GSLV MK-III మరింత అభివృద్ధి పరచిన రాకెట్‌. దీంతో 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను కూడా ప్రయోగించొచ్చు.


భారతదేశ సొంత నావిగేషన్‌ వ్యవస్థ IRNSS. దీన్నే NavIC అంటారు. ఇందులోని ఏడు ఉపగ్రహాలు భారత్‌తోపాటు, దేశ సరిహద్దులోని 1500 కి.మీ. పరిధిలోని భూభాగాన్ని నిశితంగా పరిశీలిస్తాయి. 


2023లో భారత్‌లో అమ్మే అన్ని స్మార్ట్‌ ఫోన్లలో జీపీఎస్‌కి బదులు నావిక్‌ని ఉపయోగించనున్నారు.


IRNSS - Indian Regional Navigation Satellite System

NavIC - Navigation with Indian Constellation.

వివిధ దేశాల నావిగేషన్‌ వ్యవస్థలు

1.GLONASS - రష్యా   


2. బిశిళీ  అమెరికా


3.GPS -  చైనా 


4.Quasi-Zenith Satellite System ( QZSS ) - జపాన్‌


5.Galileo -  యూరోపియన్‌ యూనియన్‌


2008, అక్టోబరు PSLV-C11 తో చంద్రయాన్‌-1 ని ప్రయోగించారు. ఇది ఆర్బైటర్, ఇంపాక్టర్‌లను కలిగి ఉంది. ఇది చంద్రుడిపై నీటిజాడను గుర్తించింది. దీన్నిNASA కూడా ధ్రువీకరించింది.


2019, జులై 22న GSLV-MK-III M-1 తో చంద్రయాన్‌-2ని ప్రయోగించారు. ఇది ఆర్బైటర్, ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రజ్ఞాన్‌)లను కలిగి ఉంది. విక్రమ్‌ చంద్రుడి ఉపరితలాన్ని అనుకున్న దాని కంటే ఎక్కువ వేగంతో ఢీకొట్టి ధ్వంసమైంది.


2013, నవంబరు 5న ఇస్రో PSLV C-25 రాకెట్‌ ద్వారా మార్స్‌ ఆర్బైటింగ్‌ మిషన్‌ (MOM) ప్రయోగించిది. ఇది 2014, సెప్టెంబరు 24న అంగారకుడి కక్ష్యని చేరింది. కుజుడిపై మీథేన్‌ ఆనవాళ్లను గుర్తించి, ఆ గ్రహం జీవానుకూలమా? కాదా? అని నిర్ధారించడం దీని లక్ష్యం. ఎనిమిదేళ్ల తర్వాత మంగళయాన్‌లో ఇంధన వనరులు తరిగిపోవడం వల్ల అది శాశ్వతంగా పనిచేయకుండా పోయిందని ఇస్రో ఇటీవల ప్రకటించింది.


భారతదేశ తొలి అంతరిక్ష పరిశోధనశాల ‘ఆస్ట్రోశాట్‌’. దీన్ని 2015, సెప్టెంబరు 28న PSLV C-30 ద్వారా ప్రయోగించారు.


* మొదటి విదేశీ ఉపగ్రహాలను PSLV-C2 ద్వారా ప్రయోగించారు. అవి దక్షిణ కొరియా, జర్మనీలకు చెందిన కిట్‌శాట్, టబ్‌శాట్‌. వీటిని ఓషన్‌శాట్‌-1తో పాటు ప్రయోగించారు.


* ఇస్రో జియోపోర్టల్‌ భువన్‌. ఇది జియోస్పేషియల్‌ సర్వీసులను, భూపరిశీలక దత్తాంశాన్ని అందిస్తుంది.


* 2022 చివరి నాటికి ఇస్రో GSLV-MK-III ద్వారా ‘గగన్‌యాన్‌’ని చేపట్టనుంది. ఇది ముగ్గురు వ్యోమగాములను సుమారు వారం పాటు అంతరిక్షంలోకి పంపే కార్యక్రమం. ఈ యాత్రకి ముందు హ్యూమనాయిడ్‌ లేడీ రోబోట్‌ ‘వ్యోమ్‌మిత్ర’ని అంతరిక్షంలోకి పంపుతారు. వ్యోమ్‌మిత్రని ఇస్రో అభివృద్ధి చేసింది.


* సూర్యుడి కరోనా, క్రోమోస్పియర్, ఫొటోస్పియర్, సౌర పవనాలు మొదలైనవాటి అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించనున్న మిషన్‌ ‘ఆదిత్యL-1.’. దీన్ని 1.5 మిలియన్‌ కి.మీ. దూరంలో ఉండే Lagrange point - 1 కి చుట్టూ ఉండే  Halo Orbit  లో ప్రవేశపెడతారు.


* నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టనున్న సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌ (శాటిలైట్‌) NISAR. ఇది భూగోళాన్ని ప్రతి 12 రోజులకు ఒకసారి స్కాన్‌ చేస్తుంది. భూఉపరితలాన్ని 0.4 చదరపు అంగుళం పరిమాణంలో అధ్యయనం చేస్తుంది.


శుక్ర గ్రహ అధ్యయనానికి ఇస్రో చేపట్టనున్న ప్రాజెక్ట్‌ - శుక్రయాన్‌.


భారత తొలి అంతరిక్ష యాత్రికుడు రాకేశ్‌ శర్మ. ఈయన 1984లో Soyuz T-2 అనే రష్యా స్సేస్‌షటిల్‌లో ప్రయాణించారు. 


భారతీయ మూలాలు ఉన్న 

అమెరికన్‌ వ్యోమగాములు

1. కల్పనా చావ్లా (కొలంబియా ప్రమాదంలో 2003లో మరణించారు.)

2. సునీతా విలియమ్స్‌ (అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న రెండో మహిళా వ్యోమగామి.)

3. రాజాచారి    

4. శిరీష బండ్ల


అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించి, వాటి భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం IN-SPACE (ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేసింది. ఇది స్వతంత్ర నోడల్‌ ఏజెన్సీ. ఇది ప్రైవేట్‌ ప్రాజెక్టులను గుర్తించడంతో పాటు, ఇస్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వాడుకునేందుకు వాటికి అనుమతి ఇస్తుంది.


ప్రైవేట్‌ ఏజెన్సీలు


 హైదరాబాద్‌కి చెందిన Skyroot Aerospace Private Ltd సంస్థ విక్రమ్‌- 1, విక్రమ్‌-II , విక్రమ్‌-III పేర్లతో రాకెట్లను ప్రయోగించనుంది. ఈ సంస్థ రామన్‌-1, కలాం-5 అనే ద్రవ, ఘన ఇంజిన్లను; ధావన్‌-1 పేరుతో క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ను పరీక్షించింది. భారత్‌లో ప్రైవేట్‌ సంస్థ అభివృద్ధి చేసిన తొలి చిన్న క్రయోజెనిక్‌ ఇంజిన్‌ ధావన్‌-1. ఇందులో ద్రవ లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్, ద్రవ ఆక్సిజన్లను ఉపయోగించారు.


చెన్నైకి చెందిన అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ అగ్నిబాణ్‌ పేరుతో చిన్న రాకెట్లను అభివృద్ధి చేస్తోంది. 


పిక్సెల్‌ సంస్థకి చెందిన ఉపగ్రహాలు ఆనంద్, శకుంతల.


 Satellize అనే సంస్ధ ExseedSAT ఉపగ్రహాన్ని PSLV-C45 ద్వారా ప్రయోగించింది.

Posted Date : 22-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌