• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ నదీ వ్యవస్థ - ద్వీపకల్ప నదులు

గోదావరి 

* దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది. భారతదేశంలో రెండో పెద్ద నది.

* గోదావరి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసికా త్రయంబకం పీఠభూమి వద్ద అరేబియా సముద్రానికి 80 కి.మీ. దూరంలో జన్మించింది.

* నదీ పరీవాహక ప్రాంతం 3,12,812 చ.కి.మీ.

* మొత్తం పొడవు 1465 కి.మీ.; తెలంగాణ - 520 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌ - 250 కి.మీ.

ప్రవహించే రాష్ట్రాలు: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి.

ఇతర పేర్లు: తేలివాక, వృద్ధగంగా, దక్షిణగంగా, ఇండియన్‌ రైన్, కవుల నది.

* గోదావరి నది నిజామాబాద్‌ జిల్లాలోని కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.

* ఇది తెలంగాణలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో ప్రవహిస్తుంది.

* మంచిర్యాలలోని ‘జంగాం’ అనే ప్రాంతం వద్ద ఇది అర్ధచంద్రాకారంలో ప్రవహిస్తుంది.

* తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది ప్రవహించే జిల్లాలు: అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ.

* ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండల వద్ద ఈ నది బైసన్‌ గార్జ్‌ను ఏర్పర్చింది.

* ఈ నది పోలవరం వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.

* గోదావరి సముద్రంలో కలిసే ముందు 7 పాయలుగా చీలింది. అవి: గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ.

* గౌతమి, వశిష్ఠల మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘కోనసీమ’ అంటారు. ఇది కొబ్బరి తోటలకు ప్రసిద్ధి.

* కోనసీమను ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవనంగా పిలుస్తారు.

ఉపనదులు

ఎడమవైపు ప్రవహించేవి: పూర్ణ, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా, వైన్‌గంగా, వార్దా, ఇంద్రావతి, శబరి.

కుడివైపు ప్రవహించేవి: మంజీర, మానేరు, కిన్నెరసాని, ప్రవర.

వార్దా: మధ్యప్రదేశ్‌లోని సాత్పుర కొండల్లో ఉన్న ముత్తాయి వద్ద జన్మించింది.

పూర్ణా నది: అజంతా కొండల్లో జన్మించింది. జంబుల్‌బెట్‌ వద్ద గోదావరిలో కలుస్తుంది. 

పూర్ణానది, దాని ఉపనది అయిన దుదున మధ్యలో ఎల్లోరా కొండలు ఉన్నాయి.

ప్రాణహిత: పెన్‌గంగా, వైన్‌గంగా, వార్దా నదులు కలిసి ప్రాణహితగా ఏర్పడ్డాయి. ఈ మూడు నదులు ఒకటిగా కలిసే ప్రాంతం చెన్నూరు.

గోదావరి ఉపనదుల్లో పెద్దది - ప్రాణహిత.

ఇది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది.

గోదావరి ఉపనదుల్లో ప్రాణహితలోనే పుష్కరాలను నిర్వహిస్తారు.

ఇంద్రావతి: ఇది ఒడిశాలో జన్మించి, తెలంగాణలో గోదావరిలో కలుస్తుంది.

 ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ జలపాతం ఈ నదిపైనే ఉంది. 

శబరి: ఒడిశాలోని సింకారం కొండల్లో జన్మించి, ఆంధ్రప్రదేశ్‌లోని కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. 

 * దీన్ని ఒడిశాలో కొలాల్‌ నది అంటారు.

కడెం: ఆదిలాబాద్‌లోని బోతాయి వద్ద జన్మించింది. 

 * తెలంగాణలో అత్యంత ఎత్తయిన జలపాతమైన కుంతల (49 మీ.) ఈ నదిపైనే ఉంది.

మంజీర: మహారాష్ట్రలోని బాలాఘాట్‌ కొండల్లో జన్మించింది.

 * కామారెడ్డిలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టును ఈ నదిపైనే నిర్మించారు.

 * గోదావరికి కుడివైపు నుంచి కలిసే ఉపనదుల్లో పెద్దది - మంజీర.

మానేరు: తెలంగాణలోని సిరిసిల్ల కొండల్లో జన్మించింది.

 * కరీంనగర్‌ ఈ నది ఒడ్డునే ఉంది.

కిన్నెరసాని: ములుగులోని తాడ్వాయి వద్ద జన్మించింది.

* ఇది ఆంధ్రప్రదేశ్‌లోని బూర్గంపాడు వద్ద గోదావరిలో కలుస్తుంది.

 * పాల్వంచ వద్ద కిన్నెరసాని నదిపై ‘కిన్నెరసాని ప్రాజెక్టు’ను కట్టారు.

 

గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు

జయక్‌వాది/ పైథాన్‌: మహారాష్ట్రలో ఉంది. గోదావరి నదిపై అతిపెద్ద ప్రాజెక్టు.

శ్రీరాం సాగర్‌ లేదా పోచంపాడు ప్రాజెక్టు: నిజామాబాద్‌ జిల్లాలో ఉంది.

ఇది తెలంగాణలో గోదావరిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు.

దీని ద్వారా రామగుండం థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌కు నీటిని సరఫరా చేస్తారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన మూడు ప్రధాన కాలువలు ఉన్నాయి. అవి: 

1. లక్ష్మీ కాలువ     2. కాకతీయ కాలువ,        3. సరస్వతి కాలువ.

తెలంగాణలో అతి పొడవైన మంచినీటి కాలువ కాకతీయ కాలువ. దీని పొడవు 284 కి.మీ. దీని ద్వారా కరీంనగర్‌ జిల్లాలోని ‘దిగువ మానేరు డ్యాం’కు నీటిని సరఫరా చేస్తారు.

తెలంగాణలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీరాం సాగర్‌.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: ఆదిలాబాద్‌లోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై ఉంది. ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని రీ-డిజైన్‌ చేసి దీన్ని రూపొందించారు.

* కాళేశ్వరం ప్రాజెక్టు జయశంకర్‌ భూపాలపల్లిలో ఉంది.

* హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలకు మంచినీటిని అందించే ప్రాజెక్టు మంజీర.

* కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు ఉంది. దీన్ని మంజీర నదిపై నిర్మించారు.

* పోలవరం ప్రాజెక్టు లేదా ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టును పశ్చిమ గోదావరిలో నిర్మిస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వద్ద నిర్మించారు.


కృష్ణానది 

మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఉన్న మహాబలేశ్వరం దగ్గర జోర్‌ గ్రామం వద్ద జన్మించింది.

* మొత్తం పొడవు 1440 కి.మీ.; తెలంగాణలో - 235 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో- 485 కి.మీ.

* కృష్ణానది మొత్తం పరీవాహక ప్రాంతం 2,58,948 చ.కి.మీ.

* అత్యధిక పరీవాహక ప్రాంతం కర్ణాటక (43%)లో ఉండగా, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26%), తెలంగాణ (19%), ఆంధ్రప్రదేశ్‌ (9%) ఉన్నాయి.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుగా ఈ నది ప్రవహిస్తుంది.

* ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఆంధ్రాలో పొడవైన నది కృష్ణా.

* ఈ నది మహారాష్ట్రలో జన్మించి, అక్కడి నుంచి కర్ణాటకలోకి ప్రవేశించి తర్వాత ఉత్తరం నుంచి దక్షిణంగా ప్రవహించి తెలంగాణలోని నారాయణపేటలోని మక్తల్‌ తాలూకాలో ఉన్న తంగడి వద్ద ప్రవేశిస్తుంది.

* తెలంగాణలో కృష్ణానది ఆరు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. అవి: నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్‌ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట.

* కృష్ణానది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే జిల్లాలు: కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్‌.టి.ఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల.

* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది.

* ​​​​​​​ కృష్ణానది విజయవాడ సమీపంలో రెండు పాయలుగా చీలి, మళ్లీ ఒకటిగా కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని ‘దివిసీమ’ అంటారు.

* ​​​​​​​దివిసీమలో ఎక్కువగా పండించే పంట వరి.

* ​​​​​​​ కృష్ణానది హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.


 ఉపనదులు 

ఎడమవైపు కలిసేవి: భీమా, పాలేరు, మూసీ, మున్నేరు, దిండి.

కుడివైపు కలిసేవి: ఘటప్రభ, పంచగంగ, తుంగభద్ర, కొయనా.

భీమా: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉన్న భీమశంకర గుట్టల వద్ద జన్మించింది.

* ​​​​​​​కృష్ణా నది ఉపపనదుల్లో అతిపొడవైంది. దీని పొడవు 861 కి.మీ.

* ​​​​​​​ఇది కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తుంది.

మూసీ: 

* ​​​​​​​ వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉన్న శివారెడ్డిపేట వద్ద జన్మించింది.

* ​​​​​​​ నల్గొండలోని వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.

* ​​​​​​​ వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మూసీనది ప్రవహిస్తుంది.

* ​​​​​​​ హైదరాబాద్‌లోని ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ ప్రాజెక్టులను ఈ నదిపైనే నిర్మించారు.

దిండి: మహబూబ్‌నగర్‌లోని షాబాద్‌ కొండల్లో జన్మించింది.

* ​​​​​​​ దీన్ని మీనాంబరం, దుందిభి అని కూడా పిలుస్తారు.

* ​​​​​​​ ఇది నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

మున్నేరు: మహబూబాబాద్‌లోని పాకాల సరస్సులో జన్మించింది.

* ​​​​​​​ఏపీలోని జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

* ​​​​​​​ ఖమ్మం మున్నేరు నది ఒడ్డున ఉంది.

తుంగభద్ర: కర్ణాటకలోని వరాహగిరి పర్వతాల్లో జన్మించింది. దీని పొడవు 531 కి.మీ. 

* ​​​​​​​ ఇది కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్దది. దీన్ని రామాయణంలో పంబానదిగా పేర్కొన్నారు.

* ​​​​​​​తుంగభద్ర నది  ప్రవహించే రాష్ట్రాలు - కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.

* ​​​​​​​ ఇది కర్నూలులోని సంగం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

* ​​​​​​​ కృష్ణా, తుంగభద్రల మధ్య బాదామి కొండలు, రాయచూర్‌ పీఠభూమి, రాయచూర్‌ అంతర్వేది ఉన్నాయి.

ఉపనదులు: హగరి, హంద్రీ, వేదవతి.

* ​​​​​​​కర్ణాటకలో హోస్పేట్‌ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు ఉంది.

కొయనా: 

* ​​​​​​​దీన్ని మహారాష్ట్ర జీవనరేఖ (Life line of Maharashtra) అని పిలుస్తారు. 

* ​​​​​​​ కృష్ణా ఉపనదులైన బుడమేరు, తమ్మిలేరు, రాయలేరు వాగులు కొల్లేరు సరస్సులో కలుస్తాయి.

* ​​​​​​​ కృష్ణానది శ్రీశైలం సమీపంలో ‘పాతాళగంగ గార్జ్‌’ను ఏర్పరిచింది.

* ​​​​​​​ భారతదేశంలో అత్యంత అందమైన నదిగా కృష్ణానదిని పిలుస్తారు.

* ​​​​​​​ కృష్ణానదిని శిల్పుల నది అని కూడా అంటారు.

 

కృష్ణానదిపై ఉన్న ఆనకట్టలు

జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు: తెలంగాణలోని గద్వాల్‌ జిల్లాలో ఉంది.

* ​​​​​​​ ఇది తెలంగాణలో కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు.

ఈ ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాలు: 

1. వనపర్తిలోని భీమా లేదా రాజీవ్‌గాంధీ ప్రాజెక్టు.

2. గద్వాల్‌లోని నెట్టెంపాడు లేదా జవహర్‌ ప్రాజెక్టు.

శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్‌లోని  కర్నూలు జిల్లాలో నిర్మించారు.

* ​​​​​​​ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కాలువ లేదా మాధవరెడ్డి కాలువ ద్వారా తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు తాగునీరు అందిస్తున్నారు.

* ​​​​​​​ శ్రీశైలం కుడి కాలువ ద్వారా పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు తాగునీరు, సాగునీరు అందుతుంది.

 

శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా తెలంగాణలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు: 

1. నాగర్‌ కర్నూల్‌లోని కల్వకుర్తి ప్రాజెక్టు (లేదా) మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌.

2. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.

3. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు: దీన్ని  నల్గొండలోని నందికొండ వద్ద నిర్మించారు.

* ​​​​​​​ ఇది ఆంధ్రా, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు.

* ​​​​​​​ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తయిన రాతి డ్యాం (మాషనరీ డ్యాం). దీని ఎత్తు 127.8 మీటర్లు.

* ​​​​​​​ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1955లో ప్రారంభించి, 1967లో పూర్తిచేశారు.

* ​​​​​​​ నాగార్జునసాగర్‌ కుడి కాలువను జవహర్‌ కాలువ అని, ఎడమ కాలువను లాల్‌ బహదూర్‌ శాస్త్రి కాలువ అని అంటారు. 

* ​​​​​​​ కుడి కాలువ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం; ఎడమ కాలువ తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఏపీలోని ప్రకాశం ప్రాంతాలకు నీరు అందిస్తుంది.

ప్రకాశం బ్యారేజీ: 1853లో బ్రిటిష్‌వారు విజయవాడ దగ్గర కృష్ణా నదిపై ఈ బ్యారేజీని నిర్మించారు. 

* ​​​​​​​ దీని నుంచి కాలువల ద్వారా సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

పులిచింతల ప్రాజెక్టు: దీన్నే కె.ఎల్‌.రావు ప్రాజెక్టు అంటారు.

* ​​​​​​​ భారతదేశ నదుల అనుసంధాన పితామహుడు కె.ఎల్‌.రావు.


కృష్ణానదిపై కర్ణాటకలో నిర్మించిన ప్రాజెక్టులు: 

1. బసవసాగర్‌ ప్రాజెక్టు

2. ఆల్మట్టి ప్రాజెక్టు 

 

Posted Date : 27-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌