• facebook
  • whatsapp
  • telegram

ఫలాదికరణం

పరాగరేణువు మొలకెత్తడం

పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరిన తరువాత, కీలాగ్రం నుంచి ప్రవహించే పదార్థాలను గ్రహించి,  ఉబ్బుతాయి. కీలాగ్ర స్రావంలో లిపిడ్లు, కార్బోహైడ్రేట్‌లు, అమైనో ఆమ్లాలు, ఫినాలిక్, ఇతర పదార్థాలు ఉంటాయి. ఈ విధంగా స్రవించే కీలాగ్రాలను ఆర్ధ్రతగల కీలాగ్రాలు అంటారు. ఇవి పెటూనియా, జియామేజ్‌ లాంటి మొక్కల్లో ఉంటాయి. కొన్ని మొక్కల్లో కీలాగ్రాల నుంచి ఎలాంటి స్రావాలు వెలువడవు. వీటినే శుష్క కీలాగ్రాలు అంటారు. ఇవి గాసిపియం మొక్కల్లో కనిపిస్తాయి. పరాగ రేణువులు కీలాగ్ర స్రావాన్ని గ్రహించడంతో అంతఃకవచం ఉబ్బి, బీజ రంధ్రం ద్వారా నాళంలా బయటకు వస్తుంది. దీన్నే పరాగ నాళం అంటారు. పరాగ రేణువు అంకురించడానికి కావాల్సిన సమయం వేర్వేరు జాతుల్లో భిన్నంగా ఉంటుంది. చెరకు, మొక్కజొన్నలో పుప్పొడి కీలాగ్రం మీద పడటంతోనే పరాగ రేణువులు మొలకెత్తుతాయి. కొన్ని మొక్కల్లో పరాగ రేణువులు మొలకెత్తడానికి కొంత సమయం పట్టొచ్చు.

సాధారణంగా ఒక పరాగ రేణువు నుంచి ఒక పరాగ నాళం మాత్రమే ఏర్పడుతుంది. ఇటువంటి వాటిని ఏకనాళికాయుతాలు అంటారు. మాల్వేసి, కుకుర్బిటేసి, కంపాన్యులేసి కుటుంబాల్లో ఒక పరాగ రేణువు  నుంచి అనేక పరాగనాళాలు ఏర్పడతాయి. వీటినే బహుళ నాళికాయుతాలు అంటారు. 
ఉదా: ఆల్థియా, మాల్వానెక్లెస్‌. 
అనేక పరాగనాళాలు ఏర్పడినా, వాటిలో ఒకటి మాత్రమే పూర్తిగా పెరిగి పిండకోశాన్ని చేరుతుంది. అరుదుగా, కొన్ని సందర్భాల్లో అమెంటిఫెరి కుటుంబ మొక్కల్లో పరాగనాళం శాఖాయుతంగా ఉంటుంది.



పరాగనాళం పెరుగుదల 

పరాగనాళం కీలాగ్రంలోని కణజాలాన్ని చీల్చుకుని కీలంలోకి ప్రవేశిస్తుంది. కీలంలో పరాగనాళం పెరుగుదల వేర్వేరుగా ఉంటుంది. కీలం నాళంలా ఉంటే, పరాగనాళం కీలకుల్యం ద్వారా పెరుగుతుంది. కీలకుల్యం ఆవరించి ఉండే బాహ్య చర్మకణాలు, గ్రంథి కణజాలంగా పనిచేసి పోషక పదార్థాలను స్రవిస్తాయి. సొలనేసి, మాల్వేసి కుటుంబాలకు చెందిన మొక్కల్లో కీలం గట్టిగా ఉన్నప్పుడు, పరాగనాళం కణాంతర అవకాశాల ద్వారా అండాలను చేరుతుంది. అరుదుగా ఉమ్మెత్త, పత్తి లాంటి మొక్కల్లో కీలంలోని కణాలను చీల్చుకుంటూ, పరాగనాళం పెరుగుతుంది. ఇది ఏర్పడిన తర్వాత, పరాగరేణువులోని కణద్రవ్యం, కేంద్రకాలు పరాగనాళంలోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా పరాగనాళ కొనభాగంలో కణద్రవ్యం కేంద్రీకృతమై ఉంటుంది. శాఖీయ కణ కేంద్రకం, ఉత్పాదక కణాలు ఈ కణద్రవ్యంలో ఉంటాయి. పరాగనాళం గోడ పలుచగా లేదా మందంగా ఉండి, సెల్యులోస్, పెక్టిన్‌తో నిర్మితమై ఉంటుంది. పరాగనాళం పొడవు పెరుగుతున్నకొద్దీ, అందులో కాలోస్‌తో కూడిన భాగాలు ఏర్పడుతూ ఉంటాయి. పూర్తిగా ఎదిగిన పరాగనాళం అనేక చిన్న గదులుగా విభజితమై ఉంటుంది.
పరాగనాళం కొనభాగంలో పారదర్శకంగా ఉండే అర్ధగోళాకార ప్రాంతం ఉంటుంది. దీన్ని శీర్షఅవరోధం అంటారు. ఈ ప్రాంతానికి దిగువన ఉన్న కణద్రవ్యంలో అనేక సంఖ్యలో మైటోకాండ్రియా, గాల్జి సంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలం, లిపిడ్లు ఉంటాయి. గాల్జి సంక్లిష్టం అధికంగా ఉండి, పాలీ శాఖరైడ్‌లు, ళివితి కలిగి ఉంటాయి.
పరాగనాళం పెరుగుదల ఎల్లప్పుడూ అండాశయం వైపునకు జరుగుతుంది. సహాయ కణాల్లోని ఫిలిఫారం పరికరం నుంచి స్రవించిన రసాయన పదార్థాలు పరాగనాళాన్ని పిండకోశం వైపునకు ఆకర్షిస్తాయి. అంతేగాకుండా పరాగనాళ కొనభాగం అధిక మొత్తంలో గుమిగూడిన కార్బోహైడ్రేట్లు దీని పెరుగుదలను ఒకే దిశలో జరిగేలా చూస్తాయి. అనేక మొక్కల్లో ప్లాసెంటా లేదా అండవృంతం లేదా అండకవచాలపై ఏర్పడిన అబ్యురేటర్‌ పరాగనాళం అండద్వారంలోకి ప్రవేశించే విధంగా సహాయపడుతుంది.



పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించడం

అండంలోకి పరాగనాళం ఏవిధంగా ప్రవేశించినప్పటికీ పిండకోశంలోకి మాత్రం ఎల్లప్పుడూ స్త్రీ బీజకణ పరికరం ఉన్నచోటే ప్రవేశిస్తుంది. పరాగనాళం అండకోశంలోకి ప్రవేశించడం సహాయకణం ద్వారా లేదా సహాయకణం, స్త్రీ బీజకణానికి మధ్యగా లేదా పిండకోశం గోడకు, సహాయకణానికి మధ్యగా అనే మూడు రకాలుగా ఉండొచ్చని గతంలో భావించారు. కానీ ఇటీవల కాలంలో ఎలక్ట్రాన్‌ సూక్ష్మదర్శినితో నిర్వహించిన పరిశోధనల వల్ల పరాగనాళం ఎల్లప్పుడూ సహాయకణం ద్వారా మాత్రమే ప్రవేశిస్తుందని తెలిసింది. ప్రతి సహాయకణానికి అండద్వారం వైపునకు ఫిలిఫారం పరికరం ఉంటుంది. పరాగనాళం ఫిలిఫారం ద్వారా పెరిగి, సహాయకణంలోని కణద్రవ్యాన్ని చేరుతుంది. తర్వాత పరాగనాళానికి ఉపాగ్ర రంధ్రం ఏర్పడి రెండు పురుష బీజాలు, శాఖీయకణ కేంద్రకం, కొంత కణద్రవ్యం విడుదలవుతాయి. పురుష బీజకణాలు సహాయకణం నుంచి పిండకోశం మధ్యలోకి విడుదలవుతాయి.



ద్విఫలదీకరణం

ఒక పురుష సంయోగ బీజం స్త్రీ బీజకణం కలవడంతో సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీన్నే సంయుక్త సంయోగం అంటారు. ఈ ప్రక్రియను స్ట్రాస్‌ బర్గర్‌ అనే శాస్త్త్ర్రవేత్త మొదటిసారి వర్ణించారు. సంయుక్త బీజం విభజన అనంతరం పిండంగా మారుతుంది. రెండో పురుష సంయోగ బీజం ద్వితీయ కేంద్రంతో సంయోగం చెందుతుంది. దీంతో ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. ఈ సంయోగంలో రెండు ధ్రువ కేంద్ర]కాలు, ఒక పురుష బీజం పాల్గొనడంతో దీన్ని త్రిసంయోగం అంటారు. దీన్ని నవాషిన్‌ అనే శాస్త్త్ర్రవేత్త కనుక్కున్నారు. ఆవృత బీజాల్లో ఏర్పడిన రెండు పురుష సంయోగబీజాలు భిన్నమైన కణాలతో సంయోగం చెందుతాయి. ఒకటి స్త్రీ బీజకణంతో కలుస్తుంది. ఇది సామాన్య ఫలదీకరణం. రెండోది ధ్రువ కేంద్రకాలతో కలుస్తుంది. ఇది శాఖీయ ఫలదీకరణం. అందుకే దీన్ని ద్విఫలదీకరణం అంటారు. ఈ దృగ్విషయం ఆవృతబీజాల్లో అతి విశిష్టమైంది.
సంయుక్త సంయోగం మాత్రమే జరిగితే, ఫలవంతమైన విత్తనాలు ఉత్పత్తికావు. త్రిసంయోగ ఫలితంగా ధ్రువ కేంద్రకాల నుంచి పోషక కణజాలం, అంకురచ్ఛదం ఏర్పడతాయి. పిండం పెరుగుదలకు ఇది చాలా అవసరం. వివృతబీజాల్లో స్త్రీ సంయోగబీజం అంకురచ్ఛదంగా పనిచేయడం వల్ల, పిండం పెరుగుదలతో సంబంధం లేకుండా అండాలు విత్తనాలుగా మారతాయి. కానీ ఆవృతబీజాల్లో ఫలదీకరణ తర్వాత మాత్రమే అంకురచ్ఛదం ఏర్పడుతుంది. ఈ విధంగా ఆవృతబీజాలు ద్విఫలదీకరణ లక్షణాన్ని కలిగి ఉండి వృక్ష రాజ్యంలోనే ప్రత్యేకమైన సముదాయంగా గుర్తింపు పొందాయి.



పరాగనాళం అండంలోకి ప్రవేశించడం

పరాగనాళం అండాన్ని చేరిన తర్వాత వివిధ రకాలుగా అండంలోకి ప్రవేశిస్తుంది. పరాగనాళ ప్రవేశం మూడు రకాలుగా జరుగుతుంది.

ఎ) రంధ్ర సంయోగం: అజాడిరక్టా ఇండికా, ఒరైజా సటైవా, నిక్టాంధన్, ఒట్టీలియా లాంటి మొక్కల్లో పరాగనాళం అండద్వారం నుంచి అండంలోకి ప్రవేశిస్తుంది. దీన్ని రంధ్ర సంయోగం అంటారు.

బి) చలాజోగమి: కొన్ని అమెంట్‌ఫెరే కుటుంబ మొక్కల్లో పరాగనాళం అండంలోకి చలాజా మార్గం ద్వారా ప్రవేశిస్తుంది. దీన్నే చలాజోగమి అంటారు.

సి) మధ్య సంయోగం: కుకుర్బిటేసి కుటుంబ మొక్కల్లో అండ కవచం ద్వారా లేదా అండవృంతం ద్వారా పరాగనాళం అండంలోకి ప్రవేశించడాన్ని మధ్య సంయోగం అంటారు.



పురుష బీజాలు ఏర్పడటం

ఉత్పాదక కణం విభజన చెంది రెండు పురుష బీజాలను ఏర్పరుస్తుంది. ఈ విభజన పరాగకోశం నుంచి పుప్పొడి విడుదల కాకముందే ఆస్టరేసి, బ్రాసికేసి, కారియోఫిల్లేసి, పోయేసి మొక్కల్లో జరుగుతుంది. ఇలాంటి మొక్కల్లో పుప్పొడి 3 కణాల దశల్లో విడుదల అవుతుంది. కొన్ని మొక్కల్లో ఉత్పాదక కణం విభజన పరాగ రేణువుల విడుదల తర్వాత జరుగుతుంది. ఈ మొక్కల్లో పరాగ రేణువులు 2 - కణాల దశలో విడుదలవుతాయి. అప్పుడు ఉత్పాదక కణం విభజన పరాగరేణువు కీలాగ్రాన్ని చేరిన తర్వాత గానీ లేదా పరాగనాళంలో గానీ జరుగుతుంది.



మాదిరి ప్రశ్నలు


1. అభివృద్ధి చెందిన పరాగ రేణువుల్లో ఏర్పడిన పురుష సంయోగ బీజం పిండకోశంలో గల స్త్రీ బీజకణాన్ని చేరి ఫలదీకరణ జరగడానికి ....... తోడ్పడుతుంది 
1) పరాగ సంపర్కం  2) ఫలదీకరణ   3) అంకురచ్ఛదం   4)పుష్పం ఏర్పాటు


2. ఆవృత బీజాల్లోని పరాగసంపర్కం ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటుంది?

1) ఒకటి    2) రెండు   3) మూడు    4) నాలుగు


3. ఒక పుష్పంలో కేసరాలుగానీ, అండకోశంగానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే వాటిని .......పుష్పాలు అంటారు.

1) ద్విలింగ     2) సహద్విరూప    3)సంకలిత   4) ఏకలింగ పుష్పాలు


4. ఒక పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన కేసరాల్లో ఉన్న పరాగ కోశాల్లోని పరాగ రేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండకోశంలోని కీలాగ్రాన్ని చేరతాయి. ఈ ప్రక్రియను ఏమంటారు?

1)పరపరాగ సంపర్కం     2)స్వపరాగ సంపర్కం

3) ఆత్మసమ్మేళన పరాగ సంపర్కం  4)  మిథ్యా పరాగ సంపర్కం


5. సంవృత సంయోగం జరిపే మొక్కకు ఉదాహరణ......

1) అరిస్టలోఖియా  2) రనన్క్యులస్‌   3) కొమ్మలైనా బెంగాలెన్సిస్‌  4) సొలానం


6. హెర్కోగమిని ప్రదర్శించే మొక్కకి ఉదాహరణ....

1) గ్లోరియోసా సూపర్బ  2) మార్టీనియా  3) డాలికస్‌          4) రనన్క్యులస్‌


7. సెరటోఫిల్లం మొక్కల్లో ఏ రకమైన పరాగ సంపర్కం జరుగుతుంది?

1)జలపరాగ సంపర్కం.   2) పక్షుల ద్వారా పరాగ సంపర్కం

3) గాలి ద్వారా అపరాధ సంపర్కం  4) కీటకాల ద్వారా పరాగ సంపర్కం


8. హమ్మింగ్‌ పక్షులు ఏ రకమైన పరాగ సంపర్కానికి సహకరిస్తాయి?

1)ఆర్నిథోఫిలి    2) బ్లూఫిలి    3) హెటిరోఫిలి    4) ఎనిమోఫిలి


9. ఎంటమోఫిలి అనే పరపరాగ సంపర్కం వేటి ద్వారా జరుగుతుంది?

1) పక్షులు  2) గబ్బిలాలు  3) నీరు   4) కీటకాలు


10. గబ్బిలాల వల్ల జరిగే పరపరాగ సంపర్కాన్ని ...... అంటారు.

1) ఆర్నిథోఫిలి   2)జూఫిలి   3)ఎనిమోఫిలి    4) కీరాప్టెరిఫిలి


11. ఒకే జాతి మొక్కలు పుష్పాలు కీలాలు వేర్వేరు ఎత్తుల్లో అమరి ఉండటం...?

1) సమకీలత   2) విషమ కీలత   3) భిన్న కీలత  4)విభిన్న కీలత


సమాధానాలు

1-1  2-2  3-4  4-1  5-3 6-1  7-1  8-1   9-4  10-4  11-3
Posted Date : 12-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌