• facebook
  • whatsapp
  • telegram

కాకతీయ సామ్రాజ్యం

  
త్రిలింగ దేశంలో ఘన చక్రవర్తులు!
 

మధ్యయుగంలో తెలుగు జాతిని, తెలుగు నేలను ఏకం చేసి జనరంజకంగా పరిపాలించిన కాకతీయులు శాశ్వత కీర్తిని సొంతం చేసుకున్నారు. ఆంధ్ర సంస్కృతికి సమగ్రరూపాన్ని అందించారు. తొలుత గ్రామస్థాయి నాయకులుగా, తర్వాత పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉన్న వీరు అంచలంచెలుగా ఎదిగి చక్రవర్తులుగా నిలిచారు. ఆంధ్రదేశ ఔన్నత్యాన్ని నలు దిక్కుల్లో చాటారు. ధీరులుగా, పోరాటయోధులుగా, పాలనాదక్షులుగా, రాజనీతిజ్ఞులుగా నిలిచిన కాకతీయ చక్రవర్తుల విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆవిర్భావం నుంచి  పతనం వరకు కాకతీయ రాజ్యం, పాలకులు, నాటి పొరుగు రాజ్యాలతో వారు సాగించిన స్నేహాలు, శతృత్వాలు, చేసిన యుద్ధాలపై అవగాహన పెంచుకోవాలి.

  ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. శాతవాహనుల తర్వాత వీరు ఆంధ్ర దేశాన్నంతా పరిపాలించారు. కవిపండితులను పోషించి, లలితకళలను ప్రోత్సహించారు. ‘ఆంధ్రులు’, ‘ఆంధ్రదీశదీశ్వర’ అనే బిరుదులు పొందారు. వీరి రాజ్యాన్ని ‘త్రిలింగదేశం’ అని అంటారు. అంటే కోస్తాంధ్రలో ద్రాక్షారామం, రాయలసీమలో శ్రీశైలం, తెలంగాణలో కాళేశ్వరం మధ్య ఉన్న ప్రాంతం.


కాకతీయుల రాజ్య సరిహద్దులు:

* తూర్పు - బంగాళాఖాతం 


* పశ్చిమ - తూర్పు కర్ణాటక 


* దక్షిణం -  ఉత్తర తమిళనాడు  


* ఉత్తర - దక్షిణ ఒడిశా తమిళనాడు


కాకతి పదానికి గుమ్మడి లేదా కుష్మాండినీ అని అర్థం ఉంది. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల వీరికి కాకతీయులనే పేరు వచ్చిందని అంటారు. అలాగే కర్ణాటకలోని కాకతి అనే కోటను పరిరక్షించడం వల్ల ఆ విధంగా పిలిచారని, తమిళనాడులోని కాకతీపురం అనే ప్రాంతం నుంచి రావడం వల్ల కాకతీయులుగా మారారని కూడా చరిత్రలో ఉంది.


 కాకతీయుల గురించి తొలిసారిగా ప్రస్తావించిన శాసనం మాగల్లు తామ్ర శాసనం  దానిని వేయించింది తూర్పు చాళుక్య రాజు అయిన దానార్ణవుడు. కాకతీయులు మొదటగా నిర్వహించిన పదవి రట్టడి. అంటే గ్రామపెద్ద. వీరు రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యుల వద్ద సామంతులుగా పనిచేశారు. ఈ వంశపు మూలపురుషుడు కాకర్త్య గుండన.


కాకర్త్య గుండన: కాకతీయ వంశ మూలపురుషుడు. రాష్ట్ర కూటరాజు అయిన మూడో కృష్ణుడి సేనాని. సామంతుడిగా కొరివి ప్రాంతాన్ని పాలించాడు. రెండో తైలపుని సేనాని మిరియాల ఎర్రనతో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఇతడి కుమారుడు మొదటి బేతరాజు.


మొదటి బేతరాజు (995-1052): ఇతడి బిరుదు కాకతి పురాధినాథ. గుండన చనిపోయే సమయానికి బేతరాజు చిన్నవాడు. దీంతో రాజ్య సంరక్షణ భారం మేనత్త కామసాని, ఆమె భర్త మిరియాల ఎర్రభూపతిపై పడింది. ఈ విషయం గురించి గూడూరు శాసనం, సిద్ధేశ్వర చరిత్ర గ్రంథం వివరిస్తున్నాయి. ఇతడు పశ్చిమ చాళుక్యులకు సామంతుడు. హనుమకొండను పరిపాలించాడు. దీనికి ఆధారం శనిగరం, ఖాజీపేట శాసనాలు. కాకతీయ రాజు అయిన బేతరాజును పదవీభ్రష్డుడిని చేయాలని సంకల్పించింది జటాచోడ భీముడు. ఇతడి మంత్రి నారాయణయ్య.


మొదటి ప్రోలరాజు (1052-1076): ఇతడి బిరుదు సమధిగత పంచ మహాశబ్ద, అరిగజకేసరి. బేతరాజు కుమారుడు. ఖాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతడి విజయాల గురించి తెలుపుతాయి. కల్యాణి చాళుక్యరాజైన ఒకటో సోమేశ్వరుడి వద్ద నుంచి హనుమకొండను శాశ్వతంగా పొందాడు. ఇతడి గురువు రామేశ్వరుడు. ‘కేసరి తటాకాలు’ తవ్వించాడు.


రెండో బేతరాజు (1076-1108): బిరుదులు మహామండలేశ్వర, త్రిభువన మల్ల, విక్రమచక్ర, చలమర్తి గండ అనే బిరుదులున్నాయి. రెండో ప్రోలరాజు కుమారుడు. కల్యాణి చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడి దండయాత్రలో పాల్గొని అతడి అభిమానాన్ని సంపాదించాడు. సబ్బి మండలంలో 1000 గ్రామాలు, ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు. హనుమకొండకు సమీపంలో శివపురి అనే నగరాన్ని నిర్మించాడు. గొప్ప శివభక్తుడు. పరమ మాహేశ్వరుడనే రామేశ్వర దీక్షితుడి శిష్యుడు.


దుర్గరాజు (1108 - 1116): రెండో బేతరాజు కుమారుడు. తండ్రి కాలం నుంచి రాజకీయాల్లో పాల్గొన్నాడు. బిరుదులు త్రిభువన మల్ల, చలమర్తిగండ. హనుమకొండలోని బేతేశ్వర ఆలయాన్ని కాలాముఖచార్యుడైన రామేశ్వర పండితుడికి దానం చేశాడని ఖాజీపేట శాసనంలో ఉంది. రామేశ్వర పండితుడు శ్రీపర్వత శైవ మఠాధిపతి.


రెండో ప్రోలరాజు (1116 - 1157): బిరుదులు మహామండలేశ్వర శూరుడు, దారిద్య్ర విద్రావణ. ఇతడి గురించి తెలుసుకోవడానికి ఆధారం రుద్రదేవుడి హనుమకొండ శాసనం. ఈ శాసనంలో ఇతడి ‘నిశ్శంకప్రథన ప్రబంధన మహాహంకా లంకేశ్వర’గా వర్ణించారు. మొదటి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు. తొలుత కొలనుపాకపై దండెత్తి పరమార జన్నగదేవుడిని ఓడించాడు. కల్యాణ చాళుక్యరాజు తైలవుని బంధీ చేసి వదిలిపెట్టాడు. మేడరాజు, గండరాజు, ఏడారాజు, కొండపల్లి అధిపతి అయిన గోంద దండ నాయకుడు, కందూరి చోడ భీమనలతో స్నేహ సంబంధాలను సాగించాడు. శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరించి, అక్కడ విజయ స్తంభం స్థాపించాడు. ఆంధ్రదేశమంతటా తన అధికారాన్ని విస్తరించాడు. వరంగల్లు వద్ద స్వయంభు శివాలయం, సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం నిర్మించాడు. వెలనాటి యువరాజు రాజేంద్రచోళుడు, వెలనాటి సామంతుడైన కోట చేతుల్లో మరణించాడు.


రుద్రదేవుడు (1158 - 1195):  రెండో ప్రోలరాజు జ్యేష్ఠ పుత్రుడు. ‘వినయ విభూషణ’ అనే బిరుదు ఉంది. ఇతడి విజయాలను గురించి హనుమకొండ శాసనం తెలియజేస్తుంది. తెలుగుచోడ వంశానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు. కరీంనగర్‌ జిల్లాకి చెందిన గొప్ప అశ్వదళాధిపతిగా పేరు పొందిన దొమ్మరాజుతో రెండేళ్లు పోరాడి అతడి పట్టణాన్ని జయించాడు. రాజ్యాన్ని గోదావరి నదీ తీరం వరకు విస్తరించాడు. చోడభీముడి ప్రాంతమైన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వర్ధమానపురంపై దండెత్తి దాన్ని తగలబెట్టాడు. చోడ ఉదయుడు రుద్రదేవుడితో సంధి చేసుకుని తన పుత్రిక పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకి సహాయం చేశాడు. ధరణి కోట ప్రభువు దొడ్డ భీముడిని చంపి ‘దొడ్డభీమా శిరచ్ఛేదక’ బిరుదు పొందాడు.


* ధరణికోట కాకతీయుల వశం అయినప్పటికీ దాన్ని రుద్రదేవుడు దొడ్డభీముడి కుమారుడైన రెండో కేతనకు ఇచ్చాడు. త్రిపురాంతకం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఓరుగల్లు/ఏకశిలా నగరం కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇతడు సంస్కృతంలో ‘నీతిసారం’ అనే గ్రంథం రచించాడు. యాదవ రాజు జైత్రపాలుడి చేతిలో హతుడయ్యాడు.


మహాదేవుడు (1196-1199): రుద్రదేవుడికి కుమారులు లేకపోవడంతో అతడి తమ్ముడు మహాదేవుడు సింహాసనం ఎక్కాడు. స్వల్పకాలమే పాలించాడు. దేవగిరి రాజ్యంపై దండెత్తి జైత్రపాలుడి చేతిలో మరణించాడు. మహాదేవుడు గొప్ప శివభక్తుడు. ఇతడికి కుమారుడు గణపతి దేవుడు, కుమార్తెలు మైలాంబిక, కుందాంబిక ఉన్నారు. మహాదేవుడి మరణం తర్వాత గణపతిదేవుడిని యాదవులు బంధించారు.


గణపతిదేవుడు (1199-1262): ఇతడి బిరుదులు రాయగజకేసరి, మహామండలేశ్వర. 63 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. మహాధీరుడు, రాజనీతి దురంధరుడు. రాజ్యాన్ని పాండ్య, హోయసాల, యాదవ రాజులు ఆక్రమించకుండా కాపాడాడు. ఇతడికి సంబంధించిన తొలి శాసనం పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో లభించింది. రేచర్ల రుద్రుడి కారణంగా యాదవుల చెరసాల నుంచి విడుదలయ్యాడు. యాదవరాజు జైత్రపాలుడు తన కుమార్తె సోమలదేవిని ఇచ్చి వివాహం చేశాడు.


గణపతిదేవుడు రాజ్యానికి వచ్చినప్పుడు తీరాంధ్ర చిన్నచిన్న రాజ్యాలుగా చీలిపోయి ఉండేది. కొలనివారు, బాగివారు, వెలనాటి చోళులు, కోట వంశం, తెలుగు చోళులు పరస్పరం కలహించుకునేవారు. గణపతిదేవుడు మొదటగా వెలనాటి చోళరాజు పృథ్వీశ్వరుడిపై దండెత్తాడు. 1201లో బెజవాడను ఆక్రమించాడు. దివిసీమపై దండెత్తాడు. అయ్యవంశపు రాజు పినచోడుడిని ఓడించాడు. ఇతడి కుమార్తెలు నారాంబ, పేరాంబలను వివాహం చేసుకున్నాడు. ఇతడి కుమారుడు జయపను గజసాహసిగా నియమించుకున్నాడు. ఈ విజయంలో గణపతిదేవుడికి సహకరించింది మలయాళ చౌండ సేనాని.


* నెల్లూరు తెలుగు చోళులతో ఉన్న మైత్రి కారణంగానే గణపతిదేవుడు దక్షిణ దేశ దండయాత్రకు సిద్ధమయ్యాడు. ఈ దండయాత్రల గురించి చేబ్రోలు శాసనం వివరిస్తుంది. నెల్లూరును పరిపాలించిన తిక్కసిద్ధి కుమారుడైన రెండో మనుమసిద్ధి సింహాసనం అధిష్టించడానికి గణపతిదేవుడు సహాయపడ్డాడు. రెండో మనుమసిద్ధి ఆస్థాన కవి తిక్కన గణపతిదేవుడి వద్దకు వచ్చాడు. మనుమసిద్ధి మోటుపల్లి రేవు పట్టణాన్ని గణపతిదేవుడికి ఇచ్చాడు. వర్తక అభివృద్ధి కోసం మోటుపల్లి వద్ద అభయ శాసనం వేయించాడు. గణపతిదేవుడు చివరికాలంలో నెల్లూరు రాజులతో కలిసి పాండ్యులతో యుద్ధం చేశాడు. 1263లో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు వద్ద జరిగిన ఈ యుద్ధంలో రెండో మనుమసిద్ధి హతుడయ్యాడు. అతడికి సహాయంగా వచ్చిన గణపతిదేవుడి సేనలను కృష్ణా నది తీరం వరకు పాండ్యులు తరిమేశారు. నెల్లూరు రాజ్యం పాండ్యులకు సామంత రాజ్యమైంది.


* గణపతి దేవుడు కాకతీయలందరిలో గొప్పవాడు. కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు. పొరుగు రాజులతో వివాహ సంబంధాలు కలిగి ఉన్నాడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు. వర్తకం, వ్యవసాయం, పరిశ్రమలను ప్రోత్సహించాడు. ఇతడికి కుమారులు లేరు. ఇద్దరు కుమార్తెలు రుద్రాంబ, గణపాంబ. రుద్రాంబ తూర్పు చాళుక్య రాజు వీరభద్రుడిని, గణపాంబ కోట వంశపు బేతనను వివాహం చేసుకున్నారు. గణపతిదేవుడి మరణానంతరం రుద్రాంబ సింహాసనాన్ని అధిష్టించింది.


రుద్రమదేవి (1262 - 1289): ఈమె బిరుదు రుద్రదేవ మహారాజా. గణపతి దేవుడు, సోయాంబల కుమార్తె. 1259 నుంచే రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించింది. 1269లో గణపతిదేవుడి మరణం తర్వాత కిరీటాన్ని ధరించింది. ఈ విషయాన్ని గణపతిదేవుడి మహాప్రధాని ‘పెద్ద మల్లయ్య వ్రేగ్గడ’ త్రిపురాంతకం శాసనంలో రాయించాడు. రుద్రమదేవి సవతి సోదరులైన హరిహరదేవుడు, మురారి దేవుడిని రేచర్ల ప్రసాదిత్యుడి సహాయంతో అణచివేసింది. ఈ విషయాన్ని తెలిపే గ్రంథం ప్రతాపరుద్ర చరిత్ర. 


* రుద్రమదేవిపై దాడికి దిగిన పొరుగు రాజులు గాంగులు, పాండ్యులు, యాదవులు. వీరిని అణచివేయడంలో రుద్రమకు సహాయపడినవారిలో రేచర్ల ప్రసాదిత్యుడు, గోన గన్నారెడ్డి, జన్నగ దేవుడు త్రిపురారి, అంబదేవుడు మొదలైనవారు ముఖ్యులు. వీరంతా రాయస్థాపనచార్య అనే బిరుదు పొందినవారే. కళింగ గజపతులను ఓడించింది. కళింగరాజైన మొదటి నరసింహుడు, మొదటి వీరభాను దేవుడు గోదావరి మండలంపై దండెత్తి వచ్చినప్పుడు రుద్రమదేవి సేనాధిపతులు పోతినాయకుడు, పోలినాయుడు వీరిని ఓడించారు.


ముత్తుకూరు యుద్ధం తర్వాత నెల్లూరు ప్రాంతంపై కాకతీయులు పట్టు కోల్పోయారు. నెల్లూరు రాజ్యాన్ని పాండ్యులకి సామంతుడైన వీర రాజేంద్రుడు పరిపాలించేవాడు. ఇతడిని రుద్రమదేవి సామంతుడైన నాగదేవ మహారాజు ఓడించి తరిమేశాడు. నాగదేవుడు నెల్లూరును కొంతకాలం పరిపాలించాడు. యాదవ రాజు మహాదేవుడు రుద్రమదేవిపై దండెత్తగా, అతడిని ఓడించి దేవగిరి వరకు వెంటాడింది. రుద్రమదేవిని వ్యతిరేకించిన కడప, నెల్లూరు ప్రాంతానికి చెందిన నాయకుడు కాయస్థ అంబదేవుడు. ఇతడు గొప్ప పరాక్రమవంతుడు. అంబదేవుడి విజృంభణను అడ్డుకోవడానికి రుద్రమదేవి ప్రతాపరుద్రుడిని పంపింది. ఓడిపోయిన ప్రతాపరుద్రుడు ములికినాడుకి పారిపోయాడు. ఆ తర్వాత రుద్రమదేవి స్వయంగా సైన్యాన్ని నడిపించింది. ఈ క్రమంలో త్రిపురాంతకాన్ని ఆక్రమించింది. అంబదేవుడు రెండోసారి రుద్రమదేవిపై దండెత్తాడు. చందుపట్ల వద్ద జరిగిన యుద్ధంలో ఆమె మరణించింది.


ప్రతాపరుద్రుడు (1289 - 1323): రుద్రమదేవి మరణం తర్వాత ఆమె మనమడు, ముమ్ముడమ్మ మహదేవుడి కుమారుడైన ప్రతాపరుద్రుడు రాజు అయ్యాడు. కాకతీయ చక్రవర్తుల్లో ఇతడు చివరివాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే అంబదేవుడిని అణచివేశాడు. ఇతడి ఆస్థానంలో 72 మంది నాయకులు ఉండేవారు. నెల్లూరుపై దాడి చేసి అంబదేవుడి పక్షీయుడైన మనుమగొండ గోపాలుడిని చంపి రంగనాథుడిని గద్దెక్కించాడు. అయితే రంగనాథుడు పాండ్యులతో చేతులు కలిపి ప్రతాపరుద్రుడిని ఎదిరించాడు. మరోసారి ప్రతాపరుద్రుడు నెల్లూరుపై జైత్రయాత్ర చేశాడు. కృష్ణ, తుంగభద్ర అంతర్వేదిని జయించి రాయచుర్‌ దుర్గం కట్టుదిట్టం చేశాడు. కాంచీపురాన్ని ఆక్రమించాడు. ఓరుగల్లుపై గాంగుల దాడిని తిప్పికొట్టాడు.


తురుష్కుల దండయాత్రలు: 1296లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ దిల్లీ సింహానాన్ని అధిష్టించిన తర్వాత ఉత్తరాదిని జయించి, దక్షిణాది వైపు మళ్లాడు. దక్షిణ పదంలోని అపార ధనరాశులపై అల్లావుద్దీన్‌ ఆశపడ్డాడు. దక్షిణ భారతదేశంపై సుమారు అయిదు సార్లు దిల్లీ సుల్తానులు దండెత్తారు. ఇవన్నీ ప్రతాపరుద్రుడి కాలంలోనే జరిగాయి. 1303లో ఖిల్జీ తన సైన్యాన్ని బెంగాల్‌ మీదుగా ఓరుగల్లు పైకి పంపాడు. ఉప్పరపల్లి (కరీంనగర్‌) వద్ద ఖిల్జీ సేనలను ప్రతాపరుద్రుడి సైన్యం ఓడించింది. 1309లో మాలిక్‌ కాఫర్‌ నేతృత్వంలో మరో సైన్యం దిల్లీ నుంచి వచ్చి ఓరుగల్లును ముట్టడించింది. ప్రతాపరుద్రుడు అపార ధనం ఇచ్చి ఏటా దిల్లీకి కప్పం చెల్లించేందుకు అంగీకరించాడు. 1316లో అల్లావుద్దీన్‌ మరణానంతరం కప్పం చెల్లించడం మానేశాడు.  ఖుస్రూఖాన్‌ని ముబారక్‌ ఖిల్జీ ఓరుగల్లుపై దాడికి పంపాడు. ప్రతాపరుద్రుడు బకాయిలు చెల్లించి మళ్లీ సంధి చేసుకున్నాడు. 1320లో దిల్లీలో తుగ్లక్‌లు అధికారంలోకి వచ్చాడు. దిల్లీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించలేదు. దీంతో ఘియాజుద్దీన్‌ 1321-22లో ప్రిన్స్‌ జునాఖాన్‌ను ఓరుగల్లుపై దాడికి పంపాడు. ఆరు నెలల తర్వాత జునాఖాన్‌ వెనుదిరిగి వెళ్లాడు. తిరిగి 1323లో దాడి చేసి ప్రతాపరుద్రుడిని బంధించాడు. చివరకు ప్రతాపరుద్రుడు దిల్లీకి బంధీగా తీసుకెళుతున్న సమయంలో మార్గమధ్యలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.రచయిత: గద్దె నరసింహారావు


 

Posted Date : 19-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌