• facebook
  • whatsapp
  • telegram

జనాభా

తగ్గుతూ పెరిగి.. చైనాను దాటి!

  మొత్తానికి మన దేశ జనాభా చైనాను దాటేసింది. మొదట్లో జననాల రేటు ఎక్కువై జనాభా విపరీతంగా పెరిగిపోయింది.  స్వాతంత్య్రం తర్వాత జీవన ప్రమాణాలు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడటం అందుకు ప్రధాన కారణాలు. ఇరవయ్యో శతాబ్దం చివర నుంచి జనాభా పెరుగుతున్నప్పటికీ, పెరుగుదల రేటు తగ్గుతూ వస్తోంది. అయినా ఇప్పటికీ ఏటా ఒక ఆస్ట్రేలియా ఖండ జనాభాకి సమానమైన కొత్త జనాభా ఇక్కడ జత చేరుతూనే ఉంది. కానీ ఆ వృద్ధిరేటు దేశ వ్యాప్తంగా ఒకే రకంగా ఉండటం లేదు. ఈ జనాభా లెక్కలు, వృద్ధి రేటు ధోరణులను పోటీ పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

   ఒక నిర్దిష్ట ప్రదేశంలో నివసించే ప్రజల సంఖ్యను జనాభా అంటారు. ఆ జనాభాను సమగ్రంగా లెక్కపెట్టడాన్ని సెన్సస్‌ లేదా జనగణన అంటారు. భారతదేశంలో మొదటిసారిగా 1872లో జనాభాను లెక్కించినప్పటికీ, సమగ్రంగా లెక్కలు మాత్రం 1881లోనే జరిగాయి. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి దేశం మొత్తం ఉన్న జనాభాను లెక్కిస్తున్నారు.

* 1872లో జనాభాను లెక్క పెట్టడానికి ముందు అనేకసార్లు ఈ ప్రయత్నాలు జరిగాయి. ఒక అంచనా ప్రకారం క్రీ.శ.1600లో దేశ జనాభా కేవలం 10 కోట్లు. ఇది 1800లో 12 కోట్లకు పెరిగింది. 1841లో 13 కోట్లు, 1871 నాటికి 22.5 కోట్లకు చేరింది.

* 1872తో కలిపి 2011 వరకు 15 సార్లు జనాభాను లెక్కించారు. స్వాతంత్య్రానంతరం 7 సార్లు జనగణన జరిగింది. ప్రస్తుతం పదహారో జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు. జనాభాను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెమోగ్రఫీ’ అంటారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1999, అక్టోబరు 12న పాటించారు. అది ప్రపంచ జనాభా 600 కోట్లుగా నమోదైన రోజు.

* జనాభాను లెక్కించే ‘సెన్సస్‌ ఆఫ్‌ ఇండియా’ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మన దేశంలో ప్రస్తుతం (2011 లెక్కల ప్రకారం) 6,40,867 గ్రామాలున్నాయి. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,06,774; గోవాలో అతి తక్కువగా 334 గ్రామాలున్నాయి.

పెరుగుదల - ప్రాథమిక భావనలు

వృద్ధి రేటు: రెండు నిర్దిష్ట కాలాల మధ్య, నిర్దిష్ట ప్రాంతంలో నివసించే వ్యక్తుల సంఖ్యలో వచ్చే మార్పునే వృద్ధి రేటు అంటారు.

సహజ పెరుగుదల: సహజ జననాల రేటు, సహజ మరణాల రేటు మధ్య వ్యత్యాసాన్ని జనాభా సహజ పెరుగుదలగా పేర్కొంటారు.

వలసల వృద్ధి: వలసల వల్ల పెరిగే జనాభాను వలసల వృద్ధిగా పిలుస్తారు.

సానుకూల వృద్ధి: రెండు నిర్దిష్ట కాలాల మధ్య పెరిగిన జన సంఖ్యను సానుకూల వృద్ధి అంటారు. జననాల సంఖ్య, మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇతర ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సానుకూల వృద్ధి జరుగుతుంది.

ప్రతికూల వృద్ధి: రెండు నిర్దిష్ట కాలాల మధ్య జనాభా సంఖ్య తగ్గితే దాన్ని ప్రతికూల వృద్ధి అంటారు. మరణాల రేటు ఎక్కువగా, జననాల రేటు తక్కువగా ఉన్నప్పుడు, ఇతర ప్రాంతాలకు ప్రజల వలసలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రతికూల వృద్ధి నమోదవుతుంది.

భారతదేశ జనాభా గణన మొదలైనప్పటి నుంచి దాదాపు ప్రతిసారి సానుకూల వృద్ధి నమోదవుతూ ఉంది. కేవలం 1921లో ప్రతికూల వృద్ధి నమోదైంది. 1901 నుంచి దేశ జనాభా పెరుగుదల ధోరణులను పరిశీలిస్తే ఇందులో గణనీయమైన మలుపులు, వ్యత్యాసాలు కనిపిస్తాయి.

1) నిశ్చల జనాభా కాలం (1901-1921): 19వ శతాబ్దంలో జనాభా పెరుగుదల నిదానంగా జరిగింది. 1901 నుంచి 1911 వరకు జనాభా పెరుగుదల రేటు 5.42 శాతమే. కానీ 1921లో -0.31గా ప్రతికూల వృద్ధి రేటు నమోదైంది. దేశ చరిత్రలో కేవలం ఒక్కసారే ఇలా జరిగింది. దీన్నే జనాభా విభజన (డెమోగ్రఫిక్‌ డివైడ్‌) గా పిలుస్తారు. ఈ కాలంలో అధిక మరణాలకు కారణం ఇన్‌ఫ్లుయెంజా వైరస్, ప్లేగు, స్మాల్‌పాక్స్, కలరా మొదలైన అంటువ్యాధులు. 1911, 1913, 1915 సంవత్సరాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. 1914-18 మొదటి ప్రపంచ యుద్ధకాలంలో అనేక మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మన దేశం నుంచి వేల మంది ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు.

2) స్థిరమైన వృద్ధి కాలం (1921-1951): ఈ సమయంలో దేశ జనాభా 25.1 కోట్ల నుంచి 36.1 కోట్లకు పెరిగింది. ఈ 30 సంవత్సరాల్లో 47.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ కాలాన్ని స్థిరమైన వృద్ధి రేటు కాలం అంటారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యంలో మెరుగుదల కారణంగా మరణాల రేటు తగ్గింది. రవాణా సౌకర్యాలు మెరుగవడం, సకాలంలో ఆహార సరఫరా జరగడం కూడా మరణాల రేటును తగ్గించింది.

3) వేగవంతమైన అధిక వృద్ధి కాలం (1951-1981): 1951 తర్వాత మరణాల రేటు తగ్గింది. కానీ జననాల రేటు ఎక్కువగానే ఉంది. దీంతో జనాభా పెరుగుదల రేటు ఎక్కువైంది. ఈ కాలాన్ని జనాభా విస్ఫోటన కాలంగా చెప్పొచ్చు. మొత్తం దేశ జనాభా 1951లో 36.11 కోట్ల నుంచి 1981లో 68.33 కోట్లకు పెరిగింది. 30 ఏళ్ల కాలవ్యవధిలో 89.36 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. ఈ కాలంలో ఆరోగ్య పరిస్థితుల మెరుగుదల, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, జననాల రేటు మరణాల రేటు కంటే ఎక్కువగా ఉండటం, అధిక సంతానోత్పత్తి వంటివన్నీ అధిక వృద్ధి రేటుకు కారణమయ్యాయి.

అధిక వృద్ధి రేటు కాలం (1981-2011): 20వ శతాబ్దపు చివర, 21వ శతాబ్దపు ప్రారంభ దశగా ఉన్న ఈ కాలాన్ని కచ్చితమైన తగ్గుదల సంకేతాలతో కూడిన అధిక వృద్ధి కాలం అని పిలుస్తారు. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ 1981 తర్వాత అది క్షీణించింది. 1971-81 కాలంలో 22.2%, 1981-91లో 19.7%, 2001-11 మధ్య కాలంలో 14.7%గా నమోదైంది. ఈ కాలంలో మరణాల రేటు తగ్గుదల, చిన్న కుటుంబాల ఎంపిక, జనాభా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలనిచ్చాయి.

  1971 నుంచి భారతదేశ జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నప్పటికీ; చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్, ఇండొనేసియా, బంగ్లాదేశ్‌ వంటి దేశాల జనాభా వృద్ధి రేటు కన్నా భారత వృద్ధి రేటు చాలా ఎక్కువ. మన దేశంలో ఏటా పెరిగే జనాభా, ఆస్ట్రేలియా మొత్తం జనాభాకు సమానం. 2023, ఏప్రిల్‌ 20 నాటికి భారత జనాభా, చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2028 నాటికి భారత జనాభా 160 కోట్లకు చేరుకుంటుంది. తర్వాత తగ్గుతూ 2100 నాటికి 109 కోట్లుగా నమోదవుతుందని అంచనా. అధిక జనాభా వృద్ధి రేటున్న రాష్ట్రాలు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు 1% కంటే తక్కువగా ఉంది.

* ప్రస్తుత భారత జనాభా 142.86 కోట్లు ఉండగా, 142.57 కోట్లతో చైనా రెండో స్థానానికి మారింది. భారత్‌తో పోలిస్తే చైనా జనాభా 29 లక్షలు తక్కువ. అమెరికా 34 కోట్ల జనాభాతో మూడో స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2022, నవంబరు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది.

ముఖ్యాంశాలు

* 2011 జనాభా లెక్కల నినాదం: మన జనగణన, మన భవిష్యత్తు.

* 2021లో చేయాల్సిన జనగణన 16వది.

* దేశంలో నివసించే వ్యక్తుల సమగ్ర గుర్తింపు డేటాబేస్‌ను రూపొందించే జాతీయ జనాభా జాబితా (ఎన్‌పీఆర్‌)ను 2010లో మొదటిసారిగా సేకరించారు.

* దేశ పౌరసత్వ సవరణ చట్టం-2019 ప్రకారం 2014, డిసెంబరు 31 కంటే ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని కల్పిస్తారు.

* భారతదేశంలో ‘సెన్సస్‌ నగరం’గా గుర్తింపు పొందాలంటే కనీసం 5000 మంది జనాభా, ఒక చ.కి.మీ.కు 400 జనసాంద్రతతో పాటు మొత్తం పనిచేసేవారిలో 75% వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తూ ఉండాలి.

* దేశంలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు 2001 నాటికి 35 ఉండగా, 2011 నాటికి 53 ఉన్నాయి. 

* 2011 లెక్కల ప్రకారం దేశ జనసాంద్రత ఒక చ.కి.మీ.కు 382. 

* మనదేశంలో అధిక జనసాంద్రత తూర్పున (625), ఈశాన్య ప్రాంతంలో తక్కువగా (176) ఉంది.

* 2011లో లింగనిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు కేరళ, తమిళనాడు. కేరళలో వెయ్యి మంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉండగా, తమిళనాడులో 996 మంది స్త్రీలు ఉన్నారు.

* ప్రపంచ భూభాగంలో 2.4% ఉన్న మన దేశంలో ప్రపంచ జనాభాలో 17.5% జనాభా (2011 లెక్కల ప్రకారం) ఉంది.

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌

Posted Date : 19-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌