• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ నదీ వ్యవస్థ - 1

సింధూ నదీ వ్యవస్థ 

* సింధూ నదిని ఆంగ్లంలో ఇండస్‌ అంటారు. దీనివల్లే మనదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.

ఇది టిబెట్‌లోని కైలాస పర్వతాల తూర్పు భాగాన ఉన్న మానస సరోవరంలోని ‘బొఖార్‌ చూ’ వద్ద జన్మించింది.

సింధూ నది టిబెట్, భారతదేశం, పాకిస్థాన్‌ దేశాల్లో ప్రవహిస్తుంది.

ఇది భారతదేశంలోకి ప్రవేశించే ప్రాంతం - థాంచోక్‌ (లద్దాఖ్‌).

ఈ నది మొత్తం పొడవు 2880 కి.మీ. భారతదేశంలో - 709 కి.మీ.

*  ఈ నది మొత్తం పరీవాహక ప్రాంతం 11,65,00 చ.కి.మీ., భారతదేశంలో - 3,21,000 చ.కి.మీ.

ఇది మనదేశంలో లద్దాఖ్‌్ ప్రాంతంలోని జస్కార్‌ పర్వతాల మధ్య ప్రవహించి, సింధూ తర్బల మైదానం నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. చివరకు కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది.


ఇతర పేర్లు: సింధూ నదిని వివిధ భాషల్లో అనేక పేర్లతో పిలుస్తున్నారు. 

సంస్కృతం - సింధు, లాటిన్‌ - సిందూస్, పర్షియన్‌ - హైందవి, గ్రీక్‌ - సింథోస్, టిబెట్‌ - సింగి ఖంబన్‌ (Lion’s Mouth)


పరీవాహక ప్రాంతం: సింధూనది భారతదేశంలో 39% పరీవాహక ప్రాంతాన్ని కలిగిఉంది. మన దేశంలోని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, 5 రాష్ట్రాలు సింధూనది పరీవాహక ప్రాంత పరిధిలో ఉన్నాయి. అవి: లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్థాన్‌. 

*   సింధూనది  నాగపర్బత్‌ ప్రాంతాన్ని తాకుతూ ప్రవహిస్తూ, ఉత్తరాన బుంజి వద్ద అత్యంత లోతైన సింధూగార్జ్‌ను ఏర్పరిచింది.

సింధూ పాకిస్థాన్‌ జాతీయ నది.


సింధూనది - ఉపనదులు


కుడి వైపు నుంచి కలిసేవి/ పర్వత ప్రాంత ఉపనదులు: సోనక్, శిగర్, గిల్‌గట్, హంజ, విబోవ, గోమల్, ద్రోచి, కాబూల్‌.

కాబుల్‌ నది ఆఫ్గనిస్థాన్‌ నుంచి వచ్చి, అటోక్‌ వద్ద సింధూనదిలో కలుస్తుంది.


ఎడమవైపు నుంచి కలిసేవి/ మైదాన ప్రాంత ఉపనదులు: జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, జస్కర్, ద్రాస్‌.


జీలం: దీన్ని వితస్థ అని కూడా అంటారు. పొడవు 724 కి.మీ. శ్రీనగర్‌ లోయ మీదుగా ప్రవహిస్తుంది. దీనిపై ఉలార్‌ సరస్సు ఉంది.


చినాబ్‌: దీన్ని చంద్రభాగ అంటారు. పొడవు 1180 కి.మీ.


రావి: దీన్ని పరూష్ని అంటారు. పొడవు  720 కి.మీ.

*   పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఈ నది ఒడ్డునే ఉంది. దీన్ని లాహోర్‌ నది అని కూడా పిలుస్తారు.

తొలి వేదకాలంలో దశరాజ యుద్ధం ఈ నది ఒడ్డునే జరిగింది.

బియాస్‌: దీని మరోపేరు విపాస. పొడవు 460 కి.మీ.

*   భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే ఏకైక సింధూ ఉపనది.

సట్లెజ్‌: పూర్వ నామం శతుద్రి. పొడవు 1450 కి.మీ.

సింధూ నదికి సమాంతరంగా ప్రవహించే ఉపనది.

సింధూ నది ఉపనదుల్లో పొడవైంది.

*   భాక్రా నంగల్‌ ప్రాజెక్టు ఈ నదిపైనే ఉంది


గంగా నదీ వ్యవస్థ 


ఇది అలక్‌నంద, భాగీరథి అనే రెండు ప్రధాన సెలయేర్ల కలయికతో ఏర్పడింది. ఈ రెండూ ఉత్తరాఖండ్‌లోని శివాలిక్‌ పాదాల వద్ద ఉన్న దేవప్రయాగ దగ్గర ఒకటిగా కలుస్తాయి.


అలక్‌నంద: ఉత్తరాఖండ్‌లోని కుమయూన్‌ హిమాలయాల్లో ఉన్న ఘర్వాల్‌ జిల్లాలోని బద్రీనాథ్‌ సమీపంలో సంతోపత్‌ అనే హిమనీనదంలో జన్మించింది.


భాగీరథి: ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉన్న గంగోత్రి హిమనీనదం వద్ద జన్మించింది.


*  హరిద్వార్‌ వద్ద మైదానంలోకి ప్రవేశించి; ఉత్తరాఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌ బంగా మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది.


*  ఇది మనదేశంలో అతి పొడవైన నది. మొత్తం పొడవు 2525 కి.మీ. పరీవాహక ప్రాంతం 8,61,000 చ.కి.మీ.


గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మ అని పిలుస్తారు. 


దీన్నే జాహ్నవి, అతితరుణ అని కూడా అంటారు.


గంగానది ఉపనదులు


దీని ఉపనదులను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:


1. హిమాలయాల్లో పుట్టి, దక్షిణ దిశగా ప్రవహించి ఎడమవైపు నుంచి గంగా నదిలో కలిసేవి. 

ఉదా: రామ్‌గంగా, గోమతి, ఘాగ్ర, గండక్, కోసి, మహానంద, బుర్హ్‌.


2. హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహించి, కుడివైపు నుంచి గంగా నదిలో కలిసేవి.

ఉదా: యమునా నది.


3. ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టి, కుడివైపు నుంచి గంగా నదిలో కలిసే ఉపనదులు.

ఉదా: సోన్, దామోదర్, చంబల్, బెట్వా.


*   గంగా నది ఉపనదులలో అతి పొడవైంది - యమునా (1376 కి.మీ.)


*  కోసి నదిని బిహార్‌ దుఃఖదాయిని అంటారు.


దామోదర్‌ నదిని బెంగాల్‌ దుఃఖదాయిని అంటారు. ఈ నది చోటానాగ్‌పుర్‌ పీఠభూమిలోని పలమూరు కొండల్లో జన్మించింది. ఇది చోటానాగ్‌పుర్‌ పీఠభూమిని రెండుగా విభజిస్తుంది.


సంస్కృతంలో దామోదర్‌ అంటే“Rope around belly” అని అర్థం.


రామ్‌గంగా నది జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ మీదుగా ప్రవహిస్తుంది.


ద్వీపకల్ప పీఠభూమి నుంచి గంగా నదిలో కలిసే ఉపనదుల్లో పెద్దది - సోన్‌.

*  భారతదేశంలో అతిపెద్ద ముఖద్వారం కలిగి ఉన్న నది - హుగ్లీ.


పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే ద్వీపకల్ప నదులు నర్మద 


మధ్యప్రదేశ్‌లోని మైకాల్‌ శ్రేణిలో ఉన్న అమరకంఠక్‌ పీఠభూమిలో జన్మించింది.


* మొత్తం పొడవు 1312 కి.మీ. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ మీదుగా ప్రవహించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది.


* ఈ నది వింధ్య, సాత్పుర పర్వతాల మధ్య ఉన్న పగులులోయ మీదుగా ప్రవహిస్తుంది.


* ఇది భారతదేశ భూభాగానికి మధ్యలో ప్రవహిస్తుంది.


* ఇది పశ్చిమంగా ప్రవహించే నదుల్లో అతి పెద్దది. ఈ నది డెల్టాను ఏర్పరచదు.


ఇతర పేర్లు: రివర్‌ ఆఫ్‌ ప్లెజర్, రేవానది, నేరబుద్ద, లైఫ్‌ ఆఫ్‌ గుజరాత్, మధ్యప్రదేశ్‌.


దీనిపై ఉన్న జలపాతాలు: కపిలధార, దూద్‌ధర్, మార్బుల్, మంతర్, దర్ది. ఇవన్నీ మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.


ఉపనదులు: కుడివైపు - హిరాన్, బర్నా, కోలర్, బర్సాంగ్‌. ఎడమవైపు - షక్కర్, తవ, బంజర్‌. తవ అతిపెద్ద ఉపనది కాగా బంజర్‌ పొడవైంది.


తపతి 


మధ్యప్రదేశ్‌లోని భేతుల్‌ పీఠభూమిలో ఉన్న ముల్తాయి వద్ద జన్మించింది. మొత్తం పొడవు 724 కి.మీ.


* ఈ నదిని సూర్యపుత్రి లేదా నర్మదకు కవల (The Twin of Narmada) అంటారు.


* ఈ నదికి ఉత్తరాన సాత్పుర పర్వతాలు, దక్షిణాన అజంతా కొండలు, సాత్మల కొండలు సరిహద్దులుగా ఉన్నాయి.


* తపతి నదికి వ్యతిరేక దిశలో ప్రవహించేది - వార్దానది.


* తపతి నది ఖాందేష్‌ మైదానాన్ని ఏర్పరస్తుంది.


* ఈ నది ఒడ్డున ఉన్న నగరం - సూరత్‌


ఉపనదులు: వాఘర్, గోమమ్, పూర్ణ, గిర్నా, పంజ్రా, అరుణవతి, నేసు.


ఈ నదిపై ఉన్న డ్యాంలు: కాక్రపార, ఉకాయ్‌.


సబర్మతి 


ఆరావళి పర్వతాల్లో మెహర్‌ వద్ద ఉన్న దేబార్‌ సరస్సు వద్ద జన్మించింది.


* దీన్ని గిరి కర్ణిక అని కూడా అంటారు.


గరుడ పురాణంలో దీని ప్రస్తావన ఉంది.


మొత్తం పొడవు 371 కి.మీ. అధిక పరీవాహక ప్రదేశం గుజరాత్‌లో ఉంది.


సర్దార్‌ సరోవర్‌ కెనాల్‌ ద్వారా నర్మదా నది నీటిని సబర్మతి నదిలో కలుపుతారు.


కాంబే సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.


అహ్మదాబాద్, గాంధీనగర్‌ పట్టణాలు ఈ నది ఒడ్డున ఉన్నాయి.

ఉపనదులు: 


హర్నవ్, వాకల్, హత్‌మతి, నేష్వా, సెయ్‌.


మహినది 


* మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వతాల్లో ఉన్న భోపవర్‌ వద్ద జన్మించింది.


* మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ప్రవహించి, కాంబే సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది.


* భారతదేశం మధ్యగా వెళ్లే అక్షాంశ రేఖ అయిన కర్కాటక రేఖను రెండుసార్లు ఖండిస్తూ ప్రవహిస్తుంది.


ఈ నది వాల్వోడ్, గజాన అనే నదీ ఆధారిత దీవులను ఏర్పరిచింది.


ఉపనదులు:

సోమ్, అనాస్, మోరన్, భదర్‌.


బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ


* టిబెట్‌లోని కైలాస కొండల్లో ఉన్న మానస సరోవరంలోని ‘షమయంగ్‌ జంగ్‌’ అనే హిమనీనదం వద్ద జన్మించింది.


* మొత్తం పొడవు 2900 కి.మీ. భారతదేశంలో - 916 కి.మీ.


* ఈ నది టిబెట్‌ నుంచి తూర్పుకు ప్రవహించి, అరుణాచల్‌ప్రదేశ్‌లోని సిడియా వద్ద భారతదేశంలోకి వస్తుంది. అక్కడి నుంచి అసోం మీదుగా ప్రవహిస్తూ, బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.


ప్రాంతీయ పేర్లు:


టిబెట్‌ - త్సాంగ్‌పో (స్వచ్ఛమైన) అరుణాచల్‌ ప్రదేశ్‌ - దిహాంగ్, సియాంగ్‌


అసోం - సైడాంగ్, ఎరుపు నది, అసోం దుఃఖదాయిని


ఉత్తర బంగ్లాదేశ్‌ - జమున 


దక్షిణ బంగ్లాదేశ్‌ - మేఘన


*  ఇది అబోర్‌ కొండలు, మిష్మి కొండల మధ్య ప్రవహిస్తూ, ఫసిఘూట్‌ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది.


* భారతదేశంలో దీని పరీవాహాక ప్రాంతం 2,400 చ.కి.మీ.


* ఇది అసోం లోయలోకి ప్రవేశించే సమయంలో ఇందులో దిబాంగ్, లోహిత అనే నదులు కలుస్తాయి.


బ్రహ్మపుత్ర నది అసోంలోని ఎర్రనేలల మీదుగా ప్రవహిస్తూ మియాండర్స్, ఆక్స్‌బౌ అనే సరస్సులను ఏర్పరుస్తుంది.


జమునగా పిలిచే బ్రహ్మపుత్ర, పద్మ అనే గంగా నదులు బంగ్లాదేశ్‌లోని గులంబో వద్ద ఒకటిగా కలిసి, మేఘన అనే నదిని ఏర్పరుస్తాయి.


బ్రహ్మపుత్ర నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం దాకిన్‌ షాహాద్‌పూర్‌.


మజూలీ దీవి:


బ్రహ్మపుత్ర నది అసోంలో రెండు శాఖలుగా విడిపోయి 90 కి.మీ. తర్వాత మళ్లీ కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని జోర్హాట్‌ అంటారు. ఈ రెండు శాఖల మధ్య ఉన్న దీవిని ‘మజూలీ’ అంటారు. ఇది మనదేశంలో ఏకైక నదీ ఆధారిత దీవి.


* ఈ దీవిలో మిషింగ్‌ తెగ నివసిస్తుంది.


* దీని పొడవు - 90 కి.మీ., వెడల్పు - 20 కి.మీ. వైశాల్యం - 1250 చ.కి.మీ.


జాంగ్‌ము డ్యాం: దీన్ని చైనా బ్రహ్మపుత్ర నదిపై భారత్, భూటాన్‌ సరిహద్దుల్లో నిర్మించింది. ఈ నిర్మాణాన్ని భారత్‌ వ్యతిరేకించింది.


ఉపనదులు: ఎడమవైపు కలిసేవి: దిబాంగ్, లోహిత, దిహాంగ్, ధన్‌సిరి, కొపిలి, బాక్‌. కుడివైపు కలిసేవి: సుబన్‌సిరి, కామెంగ్, మనాస్, సంకోష్, తీస్తా.


* హిమాలయాల్లో జన్మించి, ప్రవహించే నదుల్లో పొడవైంది బ్రహ్మపుత్ర.


* బ్రహ్మపుత్ర ఉపనదుల్లో అతి పొడవైంది బరాక్‌ (902 కి.మీ.).

Posted Date : 03-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌