• facebook
  • whatsapp
  • telegram

భూకంపాలు

* భూమి ఉపరితలం ఆకస్మికంగా కదలడాన్ని భూకంపం అంటారు.

* భూమి ఉపరితలంపై ఉన్న భ్రంశానికి రెండువైపులా ఉన్న ప్రదేశాలు ఒకదానికొకటి అభిముఖంగా, ఆకస్మికంగా కదలడం వల్ల ఇవి సంభవిస్తాయి.

* భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం భూకంపశాస్త్రం (Seismology).

* భూమి అంతర్భాగంలో 6000oC వేడి ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల అక్కడి శిలలు కరిగి స్థానభ్రంశం చెంది, శక్తి వెలువడుతుంది. ఈ శక్తి తరంగాల రూపంలో అన్ని దిక్కుల్లో వ్యాపిస్తుంది. వీటిని P, S, L తరంగాలు అంటారు.

* ఇవి నిరంతరం భూ అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాల వైపు వెళ్తాయి.

* సాధారణంగా భూ అంతర్భాగానికి దగ్గరగా ఉన్న భూ ఉపరితల ప్రాంతాలను భూకంప తరంగాలు మొదట చేరతాయి. కాబట్టి ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి.

* భూమి అంతర్భాగానికి అతి దగ్గర్లో ఉన్న భూ ఉపరితల ప్రాంతం ‘పసిఫిక్‌ మహాసముద్రం’. ఇక్కడ రోజూ భూకంపాలు సంభవిస్తాయి.

భూకంపనాభి: భూకంపాలు ఏర్పడిన ప్రాంతాన్ని భూకంపన కేంద్రం లేదా భూకంపనాభి అంటారు. దీన్నే భూకంపం ఉద్భవించే అంతర్థామ బిందువుగా పిలుస్తారు.

అధికేంద్రం (Epicentre): భూకంపనాభికి ఊర్ధ్వంగా ఉండే భూ ఉపరితల ప్రాంతాన్ని భూకంప అధికేంద్రం లేదా అభికేంద్రం అంటారు. భూ ప్రకంపనలు ఈ ప్రాంతంలో అతి తీవ్రంగా సంభవిస్తాయి. నష్టం కూడా అధికేంద్రం దాని పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది.

భూకంప లేఖిని (Seismograph): భూకంప లేఖిని అనే పరికరం భూకంపాలను, వాటి తీవ్రతను నమోదు చేస్తుంది.

భూకంపరేఖాచిత్రం(Seismogram): భూకంప లేఖిని గుర్తించిన భూకంప తరంగాలను ఒక గ్రాఫ్‌ రూపంలో సూచిస్తారు. దీన్నే ‘సిస్మోగ్రాం’ అంటారు.

ఐసోసిస్మల్‌ (Isoseismal) రేఖలు: ఒకే భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ‘ఐసోసిస్మల్‌ రేఖలు’ అంటారు.

* ఈ రేఖలు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి.

భూకంపాలు - రకాలు

భూకంపాలను అవి సంభవించే ప్రాంతాల (భూకంప నాభి) లోతు ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

లోతు నాభి లేదా అగాధ భూకంపాలు: భూకంప నాభి లోతు 300 కి.మీ. కంటే ఎక్కువగా ఉంటే అలాంటి భూకంపాలను లోతు నాభి భూకంపాలు అంటారు.

మాధ్యమిక నాభి భూకంపాలు: భూకంప నాభి లోతు 60 కి.మీ. నుంచి 300 కి.మీ. మధ్య ఉంటే వాటిని మాధ్యమిక భూకంపాలు అంటారు.

* హిమాలయాలు, ఆల్ఫ్స్‌ పర్వత ప్రాంతాల్లో సంభవించే భూకంపాలు ఈ రకానికి చెందినవే.

తక్కువ లోతు లేదా గాధ భూకంపాలు: భూకంప నాభి లోతు 60 కి.మీ. కంటే తక్కువ ఉంటే వాటిని తక్కువ లోతు భూకంపాలు అంటారు.

* ఈ భూకంపాలు చాలా తరచుగా సంభవిస్తాయి.

* నాభి భూ ఉపరితలానికి సమీపంలో ఉండటం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది.

* భూకంపనాల నాభి లోతు పెరిగేకొద్దీ భూకంప ప్రభావానికి లోనయ్యే ప్రాంత వైశాల్యం పెరుగుతుంది.

* భూకంప నాభి లోతు తగ్గేకొద్దీ భూకంపం తీవ్రత పెరుగుతుంది.

భారతదేశంలో భూకంప నమోదు కేంద్రాలు

* భారతదేశంలో మొట్టమొదటి భూకంప నమోదు కేంద్రాన్ని 1898లో కలకత్తాలో ఏర్పాటు చేశారు.

* 1961లో హైదరాబాద్‌లో జాతీయ భౌతిక పరిశోధన కేంద్రాన్ని (National Geophysical Research Institute -NGRI) ఏర్పాటు చేశారు.

* భూకంపాలను తట్టుకునే విధంగా ఇళ్లను నిర్మించడానికి సంబంధించిన పరిశోధనా కేంద్రం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ‘రూర్కి’లో ఉంది.

* భూకంపాలను ముందుగానే గ్రహించి హెచ్చరించే భూకంప ముందస్తు హెచ్చరికల వ్యవస్థ (Earthquake Early Warning System) ను మొదటిసారి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 2015 జులైలో ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలను గుర్తించి 1 నుంచి 40 సెకన్లు ముందుగా హెచ్చరించవచ్చు. ఉత్తరాఖండ్‌లో 8 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

భూకంప తరంగాలు - లక్షణాలు


ఇవి మూడు రకాలు. అవి: P, S, L తరంగాలు.

P తరంగాలు: భూకంపాలను నమోదు చేసే కేంద్రాలకు మొదట చేరతాయి. అందుకే శాస్త్రవేత్తలు వీటికి ‘ప్రాథమిక తరంగాలు’ లేదా  ‘P తరంగాలు’ అని పేరు పెట్టారు.

* ఇవి తరంగ మార్గం వెంట ఉన్న అణువులను ముందుకు - వెనక్కు కుదుపుతూ () ప్రయాణిస్తాయి. కాబట్టి వీటిని ‘తోపుడు తరంగాలు’ (Push waves) అని కూడా అంటారు.

* ఇవి ఏ మాధ్యమం ద్వారానైనా (వాయు, ద్రవ, ఘన) ప్రయాణించగలవు.

* వీటి వేగం శిలలను బట్టి సెకనుకు 5 నుంచి 13.8 కి.మీ. వరకు ఉంటుంది.

* ఇవి శబ్ద తరంగాలను పోలి ఉంటాయి.

S తరంగాలు: ఇవి కాంతి తరంగాలను పోలి ఉంటాయి. తరంగ మార్గంలోని అణువులను పైకి-కిందికి కదుపుతూ () లంబంగా ప్రయాణిస్తాయి. ఇవి భూమిపై అధిక నష్టానికి కారణమవుతాయి.

* వీటినే గౌణ తరంగాలు, చీల్చేతరంగాలు, సెకండరీ వేవ్స్, తిర్యక్‌ తరంగాలు అంటారు.

* S తరంగాలు భూ అంతర్భాగంలోని పొరల ద్వారా కొంత దూరం వరకు మాత్రమే  నేరుగా ప్రయాణిస్తాయి.

* ఇవి భూ కేంద్ర మండలం, ద్రవ ప్రాంతాల్లో (నీటిలో) ప్రయాణించలేవు.

* వీటి వేగం శిలలను బట్టి సెకనుకు 3.2 నుంచి 7.2 కి.మీ.గా ఉంటుంది.

L తరంగాలు (లవ్‌ తరంగాలు):

* వీటిని Longitudinal waves అంటారు.

* ఈ తరంగాలను మొదట అగస్టస్‌ ఎడ్వర్డ్‌ హగ్‌ లవ్‌ అనే శాస్త్రవేత్త గుర్తించారు. అందుకే వీటిని ‘లవ్‌ తరంగాలు’ అంటారు.

* P, S తరంగాలు భూ ఉపరితలాన్ని చేరేసరికి అవి దీర్ఘ తరంగాలు (Long Waves)గా మారతాయి.

* వీటి వేగం సెకనుకు 4 నుంచి 4.5 కి.మీ. వరకు ఉంటుంది.

* ఇవి ఘన, ద్రవ, వాయు పదార్థాల ద్వారా; భూపటలం నుంచి వర్తులాకారంగా ప్రయాణిస్తాయి.

* వీటిని భూతల తరంగాలు (Surface Waves) అంటారు.

* ఈ తరంగాలు భూ ఉపరితలంలో తరంగ మార్గానికి లంబంగా పైకి - కిందికీ ళీ తరంగాలుగా, తరంగ మార్గానికి అనుగుణంగా సముద్ర కెరటంలా  ర్యాలీ తరంగాలుగా ప్రయాణిస్తాయి.

* L తరంగాలు భూమి ఉపరితల పొరల ద్వారా ప్రసరిస్తాయి. భూమి ఉపరితలంపై సంభవించే నష్టాలకు ఇవే కారణం.

* L తరంగాలను Q తరంగాలు అని కూడా అంటారు. జర్మన్‌ భాషలో Quer అంటే తదుపరి (Lateral)అని అర్థం.

* భూకంపం ప్రారంభమయ్యే ప్రాంతాన్ని‘ఫోకస్‌’ (Focus) అని, భూకంప ప్రభావం ఉండే భూ ఉపరితలాన్ని ఎపిసెంటర్‌ (Epicentre) అని అంటారు.

భూకంప తీవ్రతను తెలియజేసే వివిధ రకాల స్కేళ్లు

రిక్టర్‌ స్కేలు: 1935లో డాక్టర్‌ చార్లెస్‌ రిక్టర్‌ అనే శాస్త్రవేత్త దీన్ని తయారు చేశారు. భూకంప సమయంలో వెలువడిన మొత్తం శక్తిని తెలుసుకునేందుకు దీన్ని రూపొందించారు.

* చార్లెస్‌ రిక్టర్‌ భూకంప తరంగదైర్ఘ్యం ఆధారంగా ఒక పట్టికను రూపొందించి, భూకంప తీవ్రతను 0 నుంచి 9 వరకు 10 వర్గాలుగా విభజించారు.

* రిక్టర్‌ స్కేలుపై గుర్తించిన ఈ ప్రమాణంలో ప్రతి ఏకాంకం కింది ఏకాంకం సూచించే శక్తి కంటే 30 రెట్లు అధిక శక్తిని విడుదల చేస్తుంది.

* రిక్టర్‌ స్కేలుపై భూకంప తరంగదైర్ఘ్యం ఆధారంగా భూకంప తీవ్రతను కొలుస్తారు.

* రిక్టర్‌ స్కేలుపై ఉండే 10 ప్రమాణాల్లో (వర్గాల్లో) 0 నుంచి 2 వరకు మనం భౌతికంగా గుర్తించలేని తక్కువ భూకంప తీవ్రతను సూచిస్తే, 3 నుంచి 9 వరకు ఒకే విశాలమైన ప్రాంతాన్ని నాశనం చేయగల భూకంప తీవ్రతను తెలుపుతుంది.

* ఇప్పటి వరకు రిక్టర్‌ స్కేలుపై నమోదైన అతిపెద్ద భూకంప పరిమాణం 9.25. 1960లో చిలీలో నమోదైంది.

మెర్కలీ స్కేలు: దీన్ని ఇటలీకి చెందిన మెర్కలీ రూపొందించారు.

* ఇది భూకంపం సంభవించిన ప్రదేశంలో దాని ప్రభావాన్ని కొలుస్తుంది.

* ఈ స్కేలు ద్వారా నిర్మాణాలు, ప్రజలపై భూకంప ప్రభావ తీవ్రతను తెలుసుకోవచ్చు.

* భూకంప తీవ్రతను ఖి నుంచి శ్రీఖి వరకు రోమన్‌ అంకెల్లో అంచనా వేస్తారు.

షింతో స్కేలు: దీన్ని జపాన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు.

* ఈ స్కేలు ఒక నిర్ణీత ప్రదేశంలో భూకంప తీవ్రతను లెక్కిస్తుంది.

* జపాన్‌లో భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్‌ స్కేలుకు బదులు షింతో స్కేలును ఉపయోగిస్తారు.

* ఈ స్కేలుపై 1 నుంచి 7 వరకు సూచనలు ఉంటాయి.

భారతదేశంలో భూకంప మండలాలు

భూకంప వైపరీత్యాలకు గురయ్యే తీవ్రత దృష్ట్యా భారతదేశ భూభాగాన్ని సెస్మిక్‌ జోన్‌ మ్యాపింగ్‌లో జోన్‌ 2 నుంచి 5 వరకు వర్గీకరించారు.

జోన్‌-2: భూకంప మండలం మొదటి జోన్‌లోని ప్రాంతాల్లో ప్రమాద తీవ్రత అత్యల్పం. జోన్‌-1ను కూడా ఇందులో విలీనం చేశారు.

* దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎంఎస్‌కే64 స్కేలు (Medvedev Sponheuer Karnik scale - MSK) పై 7గా ఉంటుంది.

* అత్యల్ప నష్టం, ముప్పు ఉన్న జోన్‌గా దీన్ని పరిగణిస్తారు.

* కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని ప్రాంతాలు ఈ జోన్‌లో ఉన్నాయి.

జోన్‌-3: 

* ఇది ఒక మోస్తరు ప్రమాదకర ప్రాంతం.

* ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాలు ఈ జోన్‌లో ఉన్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం దీని కిందికి వస్తుంది.

జోన్‌-4: ఎంఎస్‌కే స్కేల్‌పై భూకంప తీవ్రత 8గా ఉన్న ప్రాంతాలు ఈ జోన్‌ పరిధిలోకి వస్తాయి.

* భూకంప తీవ్రత అధికంగా ఉండే రెండో జోన్‌గా దీన్ని పరిగణిస్తారు.

* జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హరియాణా, మహారాష్ట్రలోని కొయానా ప్రాంతం ఈ జోన్‌లో ఉన్నాయి.

జోన్‌-5: 

* ఇది అత్యంత తీవ్రమైన మండలం.

* ముప్పు తీవ్రత చాలా ఎక్కువ.

* ఎంఎస్‌కే స్కేల్‌పై భూకంప తీవ్రత 9గా ఉన్న ప్రాంతాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయి.

* ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు ఈ జోన్‌ పరిధిలో ఉన్నాయి.

MSK- 64 తీవ్రత స్కేలు

* దీన్ని 1964లో రష్యాకు చెందిన సెర్గ్‌ మెద్వెదేవ్, జర్మనీకి చెందిన విలియం స్పోన్‌హర్, చెకోస్లావియాకు చెందిన లిట్‌ కార్నిక్‌లు రూపొందించారు. అందుకే దీన్ని MSK-64 స్కేలు అని పిలుస్తారు.

* భూకంపాల తీవ్రత ఆధారంగా దేశాన్ని జోన్‌లుగా విభజించడానికి MSK-64 స్కేలును ఉపయోగిస్తారు.

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌