• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రస్థానం

* భారత ప్రభుత్వం 1962లో అంతరిక్ష పరిశోధనల కోసం జాతీయ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో INCOSPAR (ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌)ని ఏర్పాటు చేసింది.  

రాకెట్‌ ప్రయోగాలను మరింత సులభతరం చేసేందుకు 1963లో తిరువనంతపురం దగ్గర్లో తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ (TERLS) ను ఏర్పాటు చేశారు. ఈ లాంచింగ్‌ స్టేషన్‌ నుంచే 1963లో మొదటిసారిగా సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాలు ప్రారంభించారు. 

1967లో అహ్మదాబాద్‌లో శాటిలైట్‌ టెలీకమ్యూనికేషన్‌ ఎర్త్‌ స్టేషన్‌ను ప్రారంభించారు.

* జాతీయ అణుశక్తి విభాగం (డీఏఈ) ఆధ్వర్యంలో 1969, ఆగస్టు 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ఏర్పాటు చేశారు. దీని ముఖ్య కేంద్రం బెంగళూరులో ఉంది.

* 1972లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పేస్‌ కమిషన్‌ ఏర్పాటైంది. 

* 1972, జూన్‌ 1న జాతీయ అంతరిక్ష విభాగం (డీఓఎస్‌)ను నెలకొల్పారు. దీని ఆధ్వర్యంలోనే ఇస్రో పనిచేస్తుంది.

విజయాలు

*  భారతదేశంలో మొదటిసారిగా 1972లో రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 

*  ఇస్రో 1970వ దశకంలోనే రిమోట్‌ సెన్సింగ్, వాతావరణ అధ్యయన పరిశోధనలు, పేలోడ్‌ అభివృద్ధి ప్రయోగాలు, కక్ష్యా మార్గాలు - వాటి నియంత్రణ, రికవరీ సాంకేతికత మొదలైన రంగాల్లో పరిశోధనలు ప్రారంభించింది. దీని ద్వారా ఉపగ్రహాలు, చిన్న ఉపగ్రహాలను తయారు చేసి, వాటిని కక్ష్యా మార్గంలో ప్రవేశపెట్టడం, వాటి నియంత్రణ మొదలైన కార్యక్రమాలు నిర్వహించింది. 

* 1975, ఏప్రిల్‌ 1న ఇస్రో భారత ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందింది. అదే ఏడాది ఏప్రిల్‌ 19న భారత మొదటి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను అంతరిక్షంలోకి పంపింది. దీనికి USSR (Union of Soviet Socialist Republics) సాంకేతిక సహకారం అందించింది. ఆర్యభట్టను అప్పటి రష్యాలోని బైకనూరు కేంద్రం నుంచి ప్రయోగించారు. 

* 197577 మధ్య ఉపగ్రహ ఆధారిత టెలివిజన్, సమాచార ప్రాజెక్టులైన ళీఖిగిని SITE (Satellite Instructional Television Experiment - 1975); STEP (Satellite Telecommunication Experiments Project - 1975) లను నిర్వహించారు.

* 1975లో ఇస్రో నాసా (అమెరికన్‌ టెక్నాలజీ సాటిలైట్, ATS-6) సహకారంతో టీవీ ప్రసారాల కోసం అంతరిక్ష ఆధారిత సమాచార వ్యవస్థను రూపొందించింది. దీన్నే SITE ప్రాజెక్ట్‌గా పేర్కొంటారు. భారత్‌లో ఆరు రాష్ట్రాల్లోని 2400 గ్రామాల ప్రజలకు టీవీ ప్రసార మాధ్యమం ద్వారా విద్యను అందించి, వారిని చైతన్యవంతులను చేయటం ఈ ప్రాజెక్ట్‌ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా సుమారు రెండు లక్షల మంది ప్రజలు లబ్ధి పొందినట్లు అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక ప్రయోగంగా నిలిచింది.

* 1977, జనవరి 1 నుంచి 1979 జనవరి 1 వరకు STEP పని చేసింది. 1975లో చేపట్టిన SITE ప్రాజెక్టుకు కొనసాగింపుగా దీన్ని పేర్కొంటారు. దీన్ని ఇస్రో, పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌ డిపార్ట్‌మెంట్‌లు సంయుక్తంగా చేపట్టాయి. జర్మనీకి చెందిన సింఫనీ శాటిలైట్‌ను ఉపయోగించి, సమాచార ప్రయోగాలను నిర్వహించారు. 

* 1979, జూన్‌ 7న భూ పరిశీలన ఉపగ్రహమైన భాస్కర-Iను ప్రయోగించారు. ఇది మనదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన మొట్టమొదటి రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పంపిన చిత్రాలను సముద్ర పరిశీలన అధ్యయనాల్లో (Oceanography), నీటి పరిశోధన అధ్యయనాల్లో (హైడ్రాలజీ), అటవీ పరిశోధన (ఫారెస్ట్రీ) అధ్యయనాల్లో ఉపయోగించారు.  

* 1979, ఆగస్టు 10న SLV-3 వాహకనౌక రోహిణి పేలోడ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విఫలమైంది. 

* 1980, జులై 18న RS-1 (రోహిణి సౌండింగ్‌ రాకెట్‌) ఉపగ్రహం SLV-3 వాహక నౌక ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. మనదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన  మొట్టమొదటి వాహకనౌక SLV-3.

* 1981, జూన్‌ 19న ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం ఆపిల్‌ APPLE -  Ariane Passenger Payload
Experiment) ను అంతరిక్షంలోకి పంపారు. దీన్ని ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ప్రస్తుతం ప్రయోగిస్తున్న సమాచార ఉపగ్రహాలకు దీన్ని మార్గదర్శిగా పేర్కొంటారు. 

* 1981, నవంబరు 20న భాస్కర -I కంటే మెరుగైన పేలోడ్‌ కలిగిన భాస్కర -II ఉపగ్రహాన్ని రష్యాలోని వోల్గోగ్రాడ్‌ లాంచ్‌ స్టేషన్‌ నుంచి అంతరిక్షంలోకి పంపారు. 

* 1983, ఏప్రిల్‌ 17న RS-D2 అనే ప్రయోగాత్మక రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని SLV-3 వాహక నౌక ద్వారా శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ ఉపగ్రహం అయిదు వేల కంటే ఎక్కువ ఉపగ్రహ ఆధారిత చిత్రాలను భూమిపైకి పంపింది. 

* 1982, ఏప్రిల్‌ 10న INSAT-1A ఉపగ్రహాన్ని, 1983, ఆగస్టు 30న INSAT-1B ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి పంపారు. ఈ రెండు ఉపగ్రహ ప్రయోగాలను అమెరికాలోని కేప్‌ కెనావరెల్‌ కేంద్రం నుంచి ప్రయోగించారు.

* 1988, జులై 22న ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు కేంద్రం నుంచి INSAT- 1C ప్రయోగం నిర్వహించారు. అది విజయవంతం కాలేదు.

* భారతదేశ మొదటి ఆపరేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని 1988, మార్చి 17న ప్రయోగించారు.

* భారతదేశ రెండో రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని 1991, ఆగస్టు 29న ప్రయోగించారు. రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహ వ్యవస్థలో దీన్ని విజయవంతమైన ఉపగ్రహంగా పేర్కొంటారు. 

* రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహ వ్యవస్థల్లో రెండో తరంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన INSAT- 2A ఉపగ్రహం ఏరియేన్‌ వాహక నౌక ద్వారా 1992, జులై 10న ప్రయోగించారు. 

* INSAT - 2Bని 1993, జులై 23న ప్రయోగించారు.

అనువర్తనాలు

* ఇస్రో ఇప్పటివరకు 114 అంతరిక్ష వాహక నౌకల ప్రయోగాలను (Space craft missions); 83 లాంచ్‌ వెహికల్‌ ప్రయోగాలను; 13 స్టూడెంట్‌ శాటిలైట్లు; 2 రీఎంట్రీ మిషన్లు; 342 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది.

* ఇస్రో తను నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్టుల ద్వారా అంతరిక్ష రంగ ప్రయోజనాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచటమే కాకుండా, దేశాభివృద్ధికి సైతం తన వంతు సహకారాన్ని అందిస్తోంది.

* ఇది తన ప్రయోగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఆరు అంతరిక్ష ఏజెన్సీల్లో ఒకటిగా నిలిచింది.

* ఇస్రో ఇన్‌శాట్‌ వ్యవస్థ ద్వారా కమ్యూనికేషన్‌ శాటిలైట్‌లను; ఐఆర్‌ఎస్‌ వ్యవస్థ ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌లను అంతరిక్షంలోకి పంపింది. వీటి ద్వారా అత్యంత వేగవంతమైన, విశ్వసనీయమైన సేవలను అందిస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ వీటి ప్రయోగాల్లో ముందంజలో ఉంది.

* ఇస్రో ప్రస్తుతం అత్యంత చవకైన, సమర్థవంతమైన ఉపగ్రహ తయారీ సేవలు అందిస్తోంది. ఇది వాహన నౌకల సాంకేతికత; ఇంధన, వివిధ విడిభాగాల తయారీ - అసెంబ్లీ; ఉపగ్రహ వ్యవస్థలో మిళితమై ఉన్న వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలు - చిప్స్, ఆప్టికల్‌ సెన్సార్లు, మైక్రోప్రాసెసర్స్‌ లాంటి అధునాతన పరికరాలను నిరంతరం తయారు చేస్తూ, వాటిని ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ఇది మనదేశానికే కాకుండా ఇతర దేశాలకూ తన ఉత్పత్తులను అందిస్తూ, దేశ ఆర్థికాబివృద్ధిలో తన వంతు సహకారాన్ని అందిస్తోంది. 

* అత్యంత అధునాతన సాంకేతికత కలిగిన వాహక నౌకల అభివృద్ధితో పాటు, అత్యంత బరువులను తీసుకెళ్లగల స్పేస్‌ క్రాఫ్ట్‌లు, వాహకనౌకలను; ఉపగ్రహాలను సరైన కక్ష్యలో ప్రవేశపెట్టి భూమికి తిరిగి చేర్చగలిగే రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌; నావిగేషన్‌ ఉపగ్రహాలు; క్రయోజెనిక్, సెమీ క్రయోజెనిక్‌ ఇంజిన్లు; సింగిల్‌ స్టేజ్‌ టు ఆర్బిట్‌ (ఎస్‌ఎస్‌టీఓ), టూ స్టేజ్‌ టు ఆర్బిట్‌ (టీఎస్‌టీఓ) వాహక నౌకలు;  మానవ అంతరిక్షయాన ప్రాజెక్టులు; సౌర పరిశోధనా ప్రాజెక్టులు; అంతర గ్రహ అన్వేషణలు; ఇతర అంతరిక్ష అనువర్తనాల పరిశోధన, పర్యవేక్షణ కార్యక్రమాలన్నీ ఇస్రో ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

పీఎస్‌ఎల్వీ

* అంతరిక్ష వాహక నౌకల్లో పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్వీ) అత్యంత సమర్థవంతమైన, నమ్మకమైన, చవకైన వాహకనౌకగా పేరొందింది. 

* 1994, అక్టోబరు 15న ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ D2 నుంచి ప్రస్తుత (2022, ఫిబ్రవరి 14)  పీఎస్‌ఎల్వీ C52 వాహక నౌక వరకు అతి తక్కువ వైఫల్యాలతో అత్యంత మెరుగైన సేవలను అందిస్తూ అంతరిక్ష విజ్ఞానశాస్త్ర ఫలాలను సామాన్యులకు మరింత చేరువ చేసింది.

జీఎస్‌ఎల్వీ

* జియో శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్వీ) ద్వారా అత్యంత అధునాతనమైన, ఎక్కువ బరువైన ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి అత్యంత సమర్థవంతంగా ప్రవేశపెడుతున్నారు. 

* ఇస్రో చంద్రుడిపై చేస్తోన్న ప్రయోగాలకు జీఎస్‌ఎల్వీ వాహక నౌకలనే ఉపయోగిస్తోంది. ఇతర గ్రహాంతర ప్రయోగాల్లోనూ దీన్నే వాహకనౌకగా వాడుతున్నారు.

************

* 1975లో ప్రయోగించిన ఆర్యభట్ట ఉపగ్రహం నుంచి 2022, ఫిబ్రవరి 14న అంతరిక్షంలోకి వెళ్లిన భూపరిశీలన ఉపగ్రహం EOS-04 వరకు ఇస్రో చేసిన ప్రయోగాలన్నీ అధిక శాతం విజయవంతం అయ్యాయి.

* EOS-4 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ C-52 వాహక నౌక ద్వారా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు. ఇందులోని రాడార్‌ ఇమేజింగ్‌ వ్యవస్థ ద్వారా వాతావరణ పరిశోధన, వ్యవసాయ రంగ అధ్యయనం, అటవీ సంపద, వివిధ రకాలైన ప్లాంటేషన్‌లు, భూమిలోని తేమశాతం, భూగర్భ నీటి వనరులు మొదలైన వాటిపై పరిశోధనలు చేసి, వాటి అనువర్తనాలను మానవ సంక్షేమానికి ఉపయోగిస్తారు.


రచయిత

రేమల్లి సౌజన్య

విషయ నిపుణులు

Posted Date : 28-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌