Post your question

 

    Asked By: లావణ్య

    Ans:

    ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నదే! ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం తేలికే కానీ, దాని అమలులో చాలా ఇబ్బందులున్నాయి. మీ అబ్బాయి డిగ్రీ చదివి, సివిల్స్‌కు సన్నద్ధం అవుతున్నాడంటే, అతడికి కనీసం 22 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వయసు పిల్లల్ని నియంత్రించాలి అనుకోవడమే అసలు సమస్య. సివిల్స్‌ సన్నద్ధత అనేది అతని ఆశయమా? మీ ఆశయమా? ఒకవేళ, అది అతని ఆశయమే అయితే ఒకసారి మాట్లాడి చూడండి. చాలా సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోగా జటిలం అయ్యే అవకాశాలూ ఉంటాయి కాబట్టి, తెగేవరకు లాగకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలా మాట్లాడటంలో మీకేమైనా ఇబ్బంది ఉంటే, మీ బంధువుల్లో మీ అబ్బాయికి బాగా నచ్చినవారితో మాట్లాడించండి. అలా కూడా కుదరని పక్షంలో, మీ అబ్బాయి స్నేహితులు ఎవరైనా ఉంటే, వారితో మాట్లాడించండి, లేదా మీ అబ్బాయికి నచ్చిన ఉపాధ్యాయులతో లేదా అధ్యాపకులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చివరి ప్రయత్నంగా ఎవరైనా కౌన్సెలర్‌ దగ్గరకు తీసుకు వెళ్ళండి. వీటన్నింటికి ముందు మీ అబ్బాయికి సివిల్స్‌ పరీక్ష రాయడానికి అవసరమైన ప్రేరణ ఉందో, లేదో నిర్ధÄరించుకోండి. అందుకోసం, ఇప్పటికే సివిల్స్‌లో ర్యాంకు సాధించినవారితో మాట్లాడించి చూడండి.
    ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు ఉద్యోగం చేయడం లేదని చెప్పడం ఇష్టం లేక, సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నామని చెబుతున్నారు. పైన చెప్పిన వాటిలో మీ అబ్బాయి సమస్యకు ఏది సరైన పరిష్కారమో మీరే నిర్థరించుకోండి. రాత్రులు సోషల్‌ మీడియాలో ఉండటం, వీడియో గేమ్స్‌ ఆడటం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, వారాంతాల్లో సినిమాలు చూడటం.. ఈతరం పిల్లల్లో దాదాపుగా సహజం అయిపోయింది. ముఖ్యంగా 2000 సంవత్సరానికి అటూ, ఇటుగా పుట్టిన పిల్లల్లో చాలామంది ఇలానే ఉన్నారు. మీ అబ్బాయిని ప్రత్యేకంగా చూడకండి. ఈ తరం పిల్లల్లో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే- వారికి నచ్చినదాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఇష్టం లేకపోతే, లక్షల రూపాయల ఉద్యోగాన్ని కూడా మరో ఆలోచన లేకుండా వదిలివేయగలరు.
    మీ అబ్బాయి భవిష్యత్తు గురించి ఎక్కువగా దిగులు పడకండి. చివరిగా- సివిల్స్‌ పరీక్షకు ఎన్ని గంటలు చదవాలి అనే ప్రామాణికాలు ఏమీ ఉండవు. ఎంతసేపు చదవాలి అనేది, మీ  అబ్బాయి మేధా సామర్థ్యం, ఎంచుకొన్న ఆప్షనల్, జ్ఞాపకశక్తి, విశ్లేషణ శక్తి, ప్రేరణ లాంటి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎక్కువసేపు చదవకపోయినా సంగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి ఎంతసేపు చదివినా అర్థం కాకపోవచ్చు. మీ అబ్బాయి ఏ రకానికి చెందినవాడో తెలుసుకోండి. సివిల్స్‌ కోచింగ్‌లో నిపుణులైన వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: విక్రమ్‌

    Ans:

    ఏ ఉద్యోగం అయినా కొంతకాలం అయ్యాక బోర్‌ కొడుతుంది. విసుగుపుట్టడం అనేది ఉద్యోగంలో ఉండదు. ఉద్యోగం చేసే వారి మానసిక స్థితిని బట్టీ, ఉద్యోగాన్ని చూసే తీరుని బట్టీ ఉంటుంది. చేసే పనిని ఇష్టంగా చేసుకొని, ఆ పనిని సృజనాత్మకంగా చేస్తే, విసుగు అనిపించదు. భవిష్యత్తులో మీరు అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగానికి వెళితే, కొంతకాలానికి అది కూడా బోర్‌ కొట్టదన్న గ్యారంటీ ఏమీ లేదు. ముందుగా, మీకు ఏం కావాలో, మీ అభిరుచులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఒకవేళ, అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగం మీకు అత్యంత ఇష్టమైతే దాన్ని ఎంచుకోండి. భవిష్యత్తులో మీ బయోడేటాలో ఒకదానికొకటి సంబంధం లేని ఇన్ని రకాల ఉద్యోగాలు చూసి, మీకు ఉద్యోగం ఇవ్వాలంటే ఉద్యోగ సంస్థలు కూడా భయపడతాయి. కెరియర్‌ మొదట్లో ఇలాంటివి సహజం కానీ, జీవితకాలం ఉద్యోగాలు మారుతూ ఉంటే, చేరే ప్రతి ఉద్యోగంలోనూ అతి చిన్న ఉద్యోగాన్ని, తక్కువ వేతనంతో మొదలుపెట్టాల్సి వస్తుంది. అలాగే మీకంటే చిన్న వయసులో ఉన్నవారు, మీ పై స్థాయిలో ఉంటే.. అప్పుడూ ఇబ్బంది పడతారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన ఉద్యోగం చేయాలంటే రెండు మార్గాలున్నాయి. మొదటిది, మీ డిగ్రీ విద్యార్హతతో యూపీఎస్‌సీ, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించి, అడ్మినిస్ట్రేటర్‌గా స్థిరపడొచ్చు. అలా కాకుండా, ఎంబీఏ లాంటి కోర్సును ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చదివితే మంచి వేతనంతో జీవితకాలం అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగం చేయొచ్చు. మనదేశంలో ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) ద్వారా ప్రవేశాలు చేపడుతున్నాయి. క్యాట్‌ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు ఉంటాయి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: పి.బాలకృష్ణ

    Ans:

    మీకు నచ్చిన ఉద్యోగం చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం. చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయడం అదృష్టం కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చదివిన కోర్సుకూ, చేయాలనుకొన్న - చేస్తున్న కొలువుకూ ఎలాంటి సంబంధం ఉండట్లేదు. దీంతో కొందరు ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. టూరిజం రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హిస్టరీ అండ్‌ టూరిజంలో పీజీ చేశారు కాబట్టి ఎంబీఏ ట్రావెల్‌ అండ్‌ టూరిజం, బీబీఏ టూరిజం చదివినవారితో పోటీ పడాల్సి ఉంటుంది. మీరు ఈ రంగంలో రాణించాలంటే- కంప్యూటర్, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పెంపొందించుకోండి. అవకాశం ఉంటే తెలుగు, ఇంగ్లిష్‌లతో పాటు హిందీ, మరో విదేశీ భాషను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. టూరిజం రంగంలోనే స్థిరపడాలనుకొంటే ఎంబీఏ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ చదివే ప్రయత్నం కూడా చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: పి.హరితేజ

    Ans:

    ఇంజినీరింగ్‌లో ఈసీఈ చదువుతూ సీ‡ఎస్‌ఈ విద్యార్థిలా కోడింగ్‌ చేయగలగడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా ఈ రెండు బ్రాంచ్‌ల సిలబస్‌ పరిశీలించండి. రెండిటిలో కామన్‌గా ఉన్న సబ్జెక్టులను ఎలాగూ మీరు చదువుతారు. సీఎస్‌ఈలో కోడింగ్‌కి సంబంధించిన సబ్జెక్టులు ఏమున్నాయో తెలుసుకొని వాటిని నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ముందుగా ఎంఎస్‌ ఎక్సెల్, సీ, సీ ప్లస్‌ ప్లస్, ఆర్, జావా, పైతాన్‌ ప్రోగ్రామింగ్‌లను నేర్చుకోవడం మొదలుపెట్టండి. తరువాత వెబ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులను కూడా చేయండి. వీటితో పాటు కోర్స్‌ఎరా, యుడెమి, ఎడెక్స్, ఉడాసిటీ, ఖాన్‌ అకాడెమీ, స్వయం, ఎన్‌పీటెల్‌తో పాటు కోడింగ్‌కి సంబంధించిన  ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సరైన కోర్సులు చేయండి. కోడింగ్‌ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈసీఈ కోర్సును నిర్లక్ష్యం చేయకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: లహరి

    Ans:

    చాలా యూనివర్సిటీల్లో బీసీఏ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఉండాలన్న నిబంధన ఉంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ నిబంధన లేనప్పటికీ బీసీఏ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌ని బ్రిడ్జి కోర్సుగా చేయాల్సి ఉంటుంది. సాధారణంగా బీసీఏ లాంటి కోర్సుల్లో రాణించాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులపై పట్టు అవసరం. ఇక బీబీఏ, బీకాం  రెండు కోర్సులకూ మంచి భవిష్యత్తు ఉంది. బీబీఏని పేరున్న బిజినెస్‌ స్కూల్‌లో చదివితే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశం ఉంది. బీబీఏ చదివినవారికి బీకాం పూర్తిచేసిన వారి కంటే కొంత ఎక్కువ వేతనం లభించవచ్చు. అదే సమయంలో బీబీఏ చదివిన వారినుంచి వ్యాపార సంస్థలు చాలా ఎక్కువ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. బీకాంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదో ఒక ఉపాధి దొరికే అవకాశం ఉంది. బీకాం, బీబీఏల్లో దాదాపు సగం సిలబస్‌ ఒకేలా ఉంటుంది. కానీ వాటిని రెండు కోర్సుల్లో ఒక్కో రకంగా బోధిస్తారు. బీకాంలో వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను ఎక్కువగా బోధిస్తారు. బీబీఏలో వ్యాపారానికి సంబంధించిన అప్లికేషన్‌లతో పాటు, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, ప్రాబ్లం సాల్వింగ్, కంప్యూటర్‌ నైపుణ్యాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. బీకాంలో అకౌంట్స్, ఫైనాన్స్, ట్యాక్స్, బిజినెస్‌ చట్టాలు, బ్యాంకింగ్‌ లాంటి అంశాలపై బోధన ఎక్కువ. డిగ్రీతో పాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లాంటి కోర్సులు చేయాలంటే బీకాం చదవడం ఉపయోగకరం. భవిష్యత్తులో ఎంబీఏ చదవాలంటే బీబీఏతో పాటు, బీకాం పూర్తిచేసుకున్నవారూ అర్హులే. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలనూ, ఆసక్తినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె. వెంకటేష్‌

    Ans:

    ఇంటర్‌ బైపీసీ తర్వాత నర్సింగ్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్సెస్, ఫిజియో థెరపీ,  ఫార్మసీ, ఆప్టోమెట్రీ, హెల్త్‌ సైకాలజీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, నేెచురోపతి, న్యూట్రిషన్, హోమ్‌ సైన్స్, హార్టి కల్చర్, ఆక్వా కల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, జియాలజీ, ఫుడ్‌ సైన్స్, న్యూరో సైన్స్‌ కోర్సులు చదివే అవకాశం ఉంది. బయాలజీకి సంబధం లేని ప్రొఫెషనల్‌ కోర్సుల విషయానికొస్తే- ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, టూరిజం, విజువల్‌ డిజైన్, హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మల్టీమీడియా, మాస్‌ కమ్యూనికేషన్‌ లాంటి కోర్సులు చదవవచ్చు. సాధారణంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రతి సంవత్సరం జులైౖలోగా పూర్తవుతాయి. కొన్ని కోర్సులకు ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత అడ్మిషన్లు నిర్వహిస్తారు. మరి కొన్ని కోర్సుల్లో ఇంటర్‌లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: రోహిత్‌

    Ans:

    దాదాపుగా ఆరేళ్ల విరామం తరువాత ఎస్‌ఏపీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంటే మీ వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు. బీబీఏ/ ఎంబీఏలో మీరు ఏ స్పెషలైజేషన్‌ చదివారో, ఉద్యోగానుభవం ఉందో, లేదో చెప్పలేదు. సాధారణంగా ఎస్‌ఏపీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ని ఫైనాన్స్‌ రంగంలో కొంత అనుభవం పొందాక చేయడం శ్రేయస్కరం. ఈ రంగంలో ఉద్యోగం పొందాలంటే ఫైనాన్స్‌ నైపుణ్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా అవసరం. ఈ కోర్సు చేసినవారికి కన్సల్టెంట్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. ఈ రంగంలో తక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉండటం వల్ల పోటీ ఎక్కువే. మీరు ఎస్‌ఏపీ ఎఫ్‌ఐసీఓ నేర్చుకొనేముందు ఫైనాన్స్‌ రంగంలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసి, ఆ విభాగానికి సంబంధించిన విషయాలపై పట్టు సాధించండి. ఈ కోర్సును మంచి శిక్షణ సంస్థ నుంచి నేర్చుకుంటే మెరుగైన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇందులో రాణించాలంటే అనలిటికల్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్, ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎన్‌ అభిషేక్‌

    Ans:

    బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు తరువాత డేటా అనలిస్ట్‌ అవ్వాలన్న మీ నిర్ణయం సరైందే. బీకాం తరువాత, అవకాశం ఉంటే ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు కూడా చదవండి. డేటా అనలిస్ట్‌ అవ్వడానికి సంబంధించిన ప్రాథమిక మెలకువలను మీరు బిజినెస్‌ అనలిటిక్స్‌ డిగ్రీలో చదువుతారు. అవకాశం ఉంటే ఐఐటీ మద్రాస్‌ అందిస్తున్న ఆన్‌లైన్‌ బీఎస్‌సీ డేటా సైన్స్‌ డిగ్రీని కూడా పూర్తి చేయండి. అలా కాకపోతే డిగ్రీ చేస్తూనే, డేటా సైన్స్‌ కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా చేయండి. డేటా అనలిస్ట్‌ అవ్వాలంటే మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్, కోడింగ్‌లపై మంచి పట్టుండాలి. మీరు ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చదివారు కాబట్టి, ఇంటర్‌ మ్యాథ్స్‌పై పట్టు సాధించండి. బీకాం డిగ్రీతో పాటు డేటా సైన్స్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేస్తూ, లైవ్‌ ప్రాజెక్టులు కూడా చేస్తే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి.ఆశారాణి

    Ans:

    చదువుకు వయసుతో పనిలేదు. ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. కాకపోతే, మీరు ఎందుకోసం చదవాలనుకుంటున్నారో తెలుసుకోండి. విజ్ఞానం కోసం, సమాజాన్ని తెలుసుకోవడానికి, పిల్లల్ని బాగా చదివించడానికి, వ్యాపారం కోసం, సమాజంలో హోదా, సమాజ సేవ, చిన్ననాటి కలల్ని నెరవేర్చుకోడం.. ఇలాంటివి ఏమైనా కావొచ్చు. ఏ కారణంతో అయినా సరే, ఈ వయసులో చదువు కొనసాగించాలన్న మీ ఆశయం అభినందనీయం. ముందుగా మీరు పదో తరగతిని ప్రైవేటుగా పరీక్ష రాసే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి పూర్తి చేయండి. ఇంటర్‌ని కూడా ప్రైవేటుగా కానీ, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా గాని పూర్తి చేయండి. ఇంకా ఆసక్తి ఉంటే, ఓపెన్‌ యూనివర్సిటీ లేదా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేయండి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే ఇంటర్‌ తరువాత డీఈడీ.. కానీ, డిగ్రీ తరువాత బీఈడీ.. కానీ చేయవచ్చు. అలా కాకుంటే పదో తరగతి/ ఇంటర్‌ తరువాత నచ్చిన ఒకేషనల్‌ కోర్సు చదవండి. ఇంటర్‌/ డిగ్రీ తరువాత ఉద్యోగం త్వరగా లభించే కంప్యూటర్, టూరిజం, కుకింగ్, ఎంబ్రాయిడరీ, న్యూట్రిషన్, హోమ్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ /డిప్లొమా కోర్సులు చేయండి. అవకాశం ఉంటే పీజీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.శ్రీహరి

    Ans:

    మీరు దూరవిద్యలో ఎంబీఏ చేయాలనుకొంటే ఆంధ్రప్రదేశ్‌ నుంచే చేయాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా చేస్తే మీ డిగ్రీకి ఎక్కువ గుర్తింపు ఉండే అవకాశం ఉంది. పాండిచ్చేరి యూనివర్సిటీ దూరవిద్య ద్వారా కూడా ఎంబీఏ చదవొచ్చు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ నుంచీ చదివే అవకాశం ఉంది. ఇవే కాకుండా సాంప్రదాయిక విశ్వవిద్యాలయాలైన ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో కూడా దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రైవేటు డీమ్డ్‌ టు బీ వర్సిటీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఎంబీఏ చేయొచ్చు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖ ప్రైవేటు/డీమ్డ్‌ టు బీ వర్సిటీలు ఎంబీఏని ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నాయి. కోర్సును, యూనివర్సిటీని ఎంచుకొనేముందు ఆ కోర్సుకు యూజీసీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతులు, ఏఐసీటీఈ గుర్తింపు, ఆ వర్సిటీకి న్యాక్‌ గ్రేడింగ్‌ ఏ/ఏ ప్లస్‌/ఏ ప్లస్‌ ప్లస్‌ ఉన్నాయో, లేదో తెలుసుకోండి. సాధారణంగా ఎంబీఏలో ప్రవేశం పొందాలంటే ఆ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష కానీ, రాష్ట్రస్థాయి ఐసెట్‌ కానీ రాయవలసి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌