Post your question

 

    Asked By: Raju

    Ans:

    మీకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రాయడానికి అర్హత ఉంది. ఎలాంటి సందేహాలు లేకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: రిషి

    Ans:

    ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేవారు నాలుగు రకాలుగా ఉన్నారు.
    1) డిగ్రీ పూర్తిచేసి పూర్తికాలం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు.
    2) డిగ్రీ తరువాత ఏదైనా యూనివర్సిటీలో పీజీలో చేరి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు.
    3) ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు.
    4) మీలాగా ప్రైవేటు కొలువు చేస్తూ సర్కారీ నౌకరీకి ప్రయత్నాలు చేసేవారు. వీరిలో మొదటి రకానికి చెందినవారిలో విజయం సాధించేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉండటం గమనిస్తూనే ఉన్నాం.
    మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే- కనీసం ఆరు నెలలు మీ ఉద్యోగానికి సెలవు పెట్టి పూర్తికాలం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అలా వీలుకాని పక్షంలో వారానికి కనీసం మూడురోజులు, రోజుకు కనీసం 12 గంటల సమయం కేటాయించి చదువుకోండి. ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సరళి పూర్తిగా మారిపోయింది. బట్టీ పట్టి రాసే ప్రశ్నల కంటే, విశ్లేషణ అవసరమైన ఆలోచనాత్మక ప్రశ్నలు ఎక్కువగా ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించే తెలివితేటలు, వేగం చాలా అవసరం. కొన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు కూడా ఉంటున్నాయి. అంటే పూర్తిగా సమాధానం తెలియని ప్రశ్నలకు ఏదో ఒక జవాబు గుర్తిస్తే నష్టం. కోచింగ్‌ సంస్థలు ఇచ్చే జవాబులను మూస పద్ధతిలో రాసేవారికంటే.. వివిధ రకాల పుస్తకాలనూ, వార్తా పత్రికలనూ చదువుతూ, సొంతంగా నోట్సు తయారుచేసుకుని రాసినవారికే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. వీలున్నన్ని నమూనా పరీక్షలను రాస్తూ మీ సన్నద్ధతను మెరుగుపర్చుకొంటూ ప్రభుత్వ ఉద్యోగ కలను నెరవేర్చుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: మనోజ్‌

    Ans:

    సాధారణంగా నేర పరిశోధనను పోలీసు వ్యవస్థ చేస్తుంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివినవారు నేరపరిశోధనలో సహకారం మాత్రమే అందిస్తారు. ఒక నేరంలో అందుబాటులో ఉన్న సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ నిపుణులు శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి నివేదికను న్యాయస్థానాల్లో సమర్పిస్తారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌లో వివిధ విభాగాలుంటాయి. వాటిలో ఫోరెన్సిక్‌ ఆంత్రొపాలజీ, కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ, ఫింగర్‌ ప్రింట్, డీఎన్‌ఏ ప్రొఫైలింగ్, ఫోరెన్సిక్‌ బాలిస్టిక్స్, ఫోరెన్సిక్‌ పాథాలజీ, ఫోరెన్సిక్‌ సైకాలజీ, ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ముఖ్యమైనవి. మీ ఆసక్తిని బట్టి సరైన స్పెషలైజేషన్‌ ఎంచుకోండి. స్పెషలైజేషన్‌లు డిగ్రీ చివరి సంవత్సరంలో కానీ, పీజీలో కానీ ఉంటాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు ఫోరెన్సిక్‌ కోర్సును డిగ్రీ, పీజీ స్థాయిలో  అందిస్తున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ కోసం ప్రత్యేకించి నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ ఉంది. మద్రాసు యూనివర్సిటీ బీఏ స్థాయిలో పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ క్రిమినాలజీ కోర్సును అందిస్తోంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సు చదివినవారికి పోలీస్‌ శాఖ, డిఫెన్స్, కేంద్ర/రాష్ట్ర ప్రైవేటు ఫోరెన్సిక్‌ పరిశోధన సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రోహిత్‌

    Ans:

    మధ్యలోనే మానేసి నాకిష్టమైనది చదవాలా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. - రోహిత్‌
    ప్రస్తుతం మీ సమస్య చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్నదే. మనదేశంలో సరైన కెరియర్‌ నిర్ణయాలను తీసుకోవడంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ చాలాసార్లు విఫలమవుతున్నారు. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు సామాజిక హోదా కోసం వారిని బలవంతంగా ఇంజినీరింగ్‌/ ఇతర కోర్సులు చదివిస్తున్నారు.
    ఇంజినీరింగ్‌లో చాలా బ్రాంచ్‌లు ఉన్నప్పటికీ త్వరగా ఉద్యోగం వస్తుందన్న ఆశతో కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, ఐటీ, ఏఐ లాంటి బ్రాంచీల్లో మూకుమ్మడిగా చేర్పిస్తున్నారు. నాలుగు, ఐదు సంవత్సరాల తరువాత ఒకవేళ పరిస్థితులు మారితే మనదేశంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన నిరుద్యోగులు చాలామంది ఉండొచ్చు. ఈ మొత్తం ప్రక్రియలో విద్యార్థులు చాలా సందర్భాల్లో వారికి నచ్చని కోర్సులు చదవలేక, వదిలి రాలేక సతమతమవుతున్నారు.
    మీ విషయానికొస్తే ఆసక్తి లేని కోర్సును చదవడం అనవసరం. ఇంజినీరింగ్‌ కోర్సును మధ్యలో వదిలివేయడం కంటే మీరు ఏ కోర్సు, ఎక్కడ చదవాలని అనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ‘సోషల్‌ వెల్ఫేర్‌’ అనే కోర్సు ప్రత్యేకంగా ఉండదు. రూరల్‌ డెవలప్‌మెంట్, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ లాంటి సోషల్‌ సైన్స్‌ కోర్సుల్లో నచ్చిన కోర్సును ఎంచుకోండి. సామాజిక సేవ, సంక్షేమం, అభివృద్ధి లాంటి రంగాల్లో పనిచేసేవారికి ఆత్మసంతృప్తి ఉంటుంది. అయితే సాప్ట్‌వేర్‌ రంగంలో ఉన్నంత పెద్ద వేతనాలు దక్కవు. 
    ప్రస్తుతం మీరు అనుకొంటున్న కెరియర్‌తో జీవితకాలం ప్రయాణించగలరా లేదా అనేది ఆలోచించండి. అసలు ‘సోషల్‌ వెల్ఫేర్‌’ అంటే మీ ఉద్దేశం ఎంటి? స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజాభివృద్ధి చేయడమా, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా చేయడమా? దీనిపై స్పష్టత పొందండి.
    ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజాభివృద్ధి చేయాలనుకుంటే మీముందు మూడు అవకాశాలున్నాయి. 1) ఇంజినీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి సివిల్‌ సర్వీసెస్‌/ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించడం. 2) ఇంజినీరింగ్‌ కోర్సును మధ్యలోనే వదిలేసి, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవడం. 3) డిగ్రీ పూర్తయ్యాక, విదేశాల్లో సోషల్‌ సైన్స్‌ సంబంధిత కోర్సులు చదివి, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగం చేస్తూ మీ ఆశయాన్ని నెరవేర్చుకోవడం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, దాని పర్యవసానాలు మీరే అనుభవించాలి కాబట్టి, అన్ని కోణాల్లో ఆలోచించుకోండి. మీ మనసుకూ, జీవితానికీ సరిపడే సరైన నిర్ణయాన్ని తీసుకోండి! -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌