Post your question

 

    Asked By: శ్యామ్‌ప్రసాద్‌

    Ans:

    ఐటీ రంగంలో స్థిరపడటానికి ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేసినా సరిపోతుంది. కాకపోతే, ఇంజినీరింగ్‌లో చదివిన బ్రాంచికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు ఉంటే సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచితో సంబంధమున్న ఐటీ అప్లికేషన్స్‌ గురించి కొంత అవగాహన ఉంటుంది. మీరు ఐటీ రంగంలో ప్రవేశించాలంటే రెండు మార్గాలున్నాయి. కెమికల్‌ ఇంజనీరింగ్‌కి సంబంధించిన ఐటీ అప్లికేషన్స్‌లో శిక్షణ పొంది, రసాయనిక పరిశ్రమ కోసం ఐటీని వృద్ధి చేస్తున్న సంస్థల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించడం;  అన్ని రంగాలకూ సంబంధించిన ఐటీ సంస్థలకు కావాల్సిన జనరల్‌ సాఫ్ట్‌వేర్‌ నేర్చుకొని ఆ సంస్థల్లో స్థిరపడటం.
    మీరు కెమికల్‌ ఇంజినీరింగ్‌ సంబంధిత ఐటీ ఉద్యోగాల కోసం MATLAB, SCILAB, ASPEN, HYSYS, CHEMCAD లాంటి సాఫ్ట్‌వేర్‌ నేర్చుకోండి. ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా ఏదైనా ఐటీ రంగంలోకి ప్రవేశించాలంటే ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మ్యాట్‌ ల్యాబ్, సీ ప్రోగ్రామింగ్, జావా, విజువల్‌ బేసిక్, ఎస్‌క్యూఎల్‌ లాంటివి నేర్చుకోవడం ముఖ్యం. కంప్యుటేషన్, సిమ్యులేషన్, ఆటోమేషన్‌లకు సంబంధించిన ఐటీ టూల్స్‌ గురించీ తెలుసుకోండి. ఐటీ రంగంలో రాణించాలంటే కోడింగ్, ప్రోగ్రామింగ్, ప్రాబ్లం సాల్వింగ్‌ లాంటి నైపుణ్యాలతో పాటు భావ వ్యక్తీకరణ సామర్ధ్యం, ఆంగ్ల భాషపై పట్టు, బృందాల్లో పనిచేయగలగటం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: లింగరాజు జల

    Ans:

    ప్రస్తుతం బీఈడీలో చదువుతున్న ఇంగ్లిష్, సోషల్‌ స్టడీస్‌ మెథడాలజీలతో సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్, ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ రెండు పోస్టులకూ మీరు అర్హులే. వీటితో పాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుకు కూడా అర్హత ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంటర్మీడియట్‌/ దీనికి సమానమైన కోర్సు కచ్చితంగా చదివివుండాలి. డీఈడీ/ బీఈడీల శిక్షణ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. టెట్‌లో 1 నుంచి 5 వరకు బోధించడానికి పేపర్‌-1 లో, 6 నుంచి 8 వరకు బోధించడానికి పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించాలి. పేపర్‌-1లో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2 (ఇంగ్లిష్‌), మేథమ్యాటిక్స్, ఎన్విరాన్మెంటల్‌ స్టడీస్‌ల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. పేపర్‌-2లో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2 (ఇంగ్లిష్‌), మేథమ్యాటిక్స్‌/ సైన్స్‌/సోషల్‌ స్టడీస్‌ల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి.
    ఇంటర్మీడియట్, డీఈడీ లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, టెట్‌ల్లో ఉత్తీర్ణులయినవారు డీ…ఎస్‌సీ పరీక్ష రాయాల్సివుంటుంది. దీనిలో జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, పర్‌స్పెక్టివ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్‌ సైకాలజీ, ఎంచుకున్న సబ్జెక్టులో కంటెంట్, మెథడాలజీల్లో ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి జాతీయ విద్యాసంస్థల్లోనూ ప్రయత్నించండి. వీటి కోసం సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌ రాయవలసి ఉంటుంది. టెట్, సీటెట్‌.. రెండు పరీక్షలకూ ఒకే సిలబస్‌ ఉంటుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి. వేణు

    Ans:

    * స్టార్టప్‌కైనా కొంత ఉద్యోగ అనుభవం అవసరం 
    సాధారణంగా బీకాం చదివినవారికి ఎం కామ్‌ చదివే అవకాశం ఉంది. మీకు మేనేజ్‌మెంట్‌ రంగంలో ఆసక్తి ఉంటే ఎంబీఏ చేయవచ్చు. బోధనరంగం ఇష్టమైతే బీఈడీ చేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో అకౌంటెంట్‌గా, ఆడిటర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. చార్టెడ్‌ అకౌంటెంట్లు, ఆదాయపన్ను కన్సల్టెంట్ల దగ్గర అసిస్టెంట్లుగా చేరవచ్చు. బీమా, బ్యాంకింగ్‌ రంగాల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఇక బిజినెస్‌ అవకాశాల విషయానికొస్తే- వేరే వారితో పోల్చినప్పుడు బీకాం చదివినవారికి కొంత వెసులుబాటు ఉంటుంది. ఏ స్టార్టప్‌కైనా కొంత ఉద్యోగానుభవం అవసరం. మీరు ఏ రంగంలో స్టార్టప్‌ పెట్టాలనుకొంటున్నారో, ఆ రంగంలో కొంతకాలం ఉద్యోగం చేసి, ఆ వ్యాపారానికి సంబంధించిన మెలకువలు నేర్చుకోండి. ఆ తర్వాత సొంతంగా బిజినెస్‌ ప్రారంభించండి. 
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: చాంద్‌ పాష

    Ans:

    హిందీ విద్వాన్‌ కోర్సు డిగ్రీకి సమానం కాదు. ఈ కోర్సు చదివినవారు డిగ్రీ అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు. అయితే, హిందీ పండిట్‌ శిక్షణ చేయడం కోసం మాత్రం దీన్ని డిగ్రీ విద్యార్హతగా పరిగణిస్తున్నారు. విద్వాన్‌తో పాటు హిందీ పండిట్‌ శిక్షణ పొందినవారు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హిందీ బోధించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె. ప్రశాంత్‌

    Ans:

    బీఏ ( సోషల్‌ సైన్స్‌) చదివినవారు మంచి ఉద్యోగావకాశాల కోసం చాలా రకాల కోర్సులు చదవొచ్చు. బీఏలో మీరు చదివిన సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేయండి. భాషాశాస్త్రాల్లో ఆసక్తి ఉంటే, డిగ్రీలో మీరు చదివిన లాంగ్వేజెస్‌కు సంబంధించిన తెలుగు/హిందీ/ఇంగ్లిష్‌/ లింగ్విస్టిక్స్‌/ఉర్ద్డూ/ సంస్కృతం/ ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌/ కంపేరిటివ్‌ లిటరేచర్‌లో పీజీ చేయవచ్చు. బోధన వృత్తిపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి ఆ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ప్రాధమిక పాఠశాలల్లో బోధన కోసం డీఈడీ కోర్సు కూడా చేయవచ్చు. భాషా పండితునిగా స్థిరపడాలనుకొంటే భాషా పండిట్‌ శిక్షణ పొందవచ్చు. క్రీడల పట్ల ఆసక్తి ఉంటే బేచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది వ్యాయామ ఉపాధ్యాయుడిగా స్థిరపడవచ్చు. న్యాయశాస్త్రంలో ఆసక్తి ఉంటే లా కోర్సు, మేనేజ్‌మెంట్‌పై ఇష్టముంటే ఎంబీఏ చేయవచ్చు. పర్యాటక రంగంలో అభిరుచి ఉంటే టూరిజం మేనేజ్‌మెంట్, ఆతిథ్య రంగంలో ఆసక్తి ఉంటే హోటల్‌ మేనేజ్‌మెంట్, పురావస్తుశాస్త్రం ఇష్టమైతే ఆర్కియాలజీ, నటనారంగం నచ్చితే థియేటర్‌ ఆర్ట్స్‌ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
    ఇవే కాకుండా ఫిలాసఫీ, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, ఎడ్యుకేషన్, సోషియాలజీ, హ్యూమన్‌ రైట్స్, జర్నలిజం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి కోర్సుల గురించీ ఆలోచించవచ్చు. మీరు ఇంటర్మీడియట్‌ స్థాయిలో మేథమేటిక్స్‌ చదివివుంటే ఎంసీఏ లాంటి కోర్సులు చేయవచ్చు. పబ్లిక్‌ పాలసీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్, రీజనల్‌ స్టడీస్, ఫైనాన్షియల్‌ ఎకానమిక్స్, యానిమేషన్, మల్టీమీడియా, ఫ్యాషన్‌ టెక్నాలజీ లాంటి వినూత్న కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది.

    Asked By: రవికుమార్

    Ans:

    కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచి తక్కువ కాలేజీల్లో అందుబాటులో ఉండటం వల్ల ఈ కోర్సు చదివినవారికి డిమాండ్‌ ఉంది. ఈ కోర్సు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల సమ్మేళనం. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు కెమికల్‌ ఇంజినీర్‌గా, ఎనర్జీ ఇంజినీర్‌గా, పెట్రోలియం ఇంజినీర్‌గా, నూక్లియర్‌ ఇంజినీర్‌గా, ప్రొడక్ట్‌ ఇంజినీర్‌గా, ప్రాసెస్‌ ఇంజినీర్‌గా ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎనర్జీ, ఫార్మా, ఫుడ్‌ అండ్‌ బెవరెజ్, వాటర్‌ ట్రీట్‌మెంట్, సిమెంట్‌ తయారీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లో, ఉక్కు పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఈ కోర్సు చదివితే మనదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగానూ ఉపాధి అవకాశాలుంటాయి. ఇంజినీరింగ్‌ చదివాక ఎంటెక్, పీ‡హెచ్‌డీ లాంటి ఉన్నత విద్యావకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ. సాయిపవన్‌

    Ans:

    మీరు బీఎస్సీ చదివేప్పుడే రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో పనిచేయాలని ఆలోచించడం అభినందనీయం. బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీలు రెండూ పరిశోధనకు బాగా అవకాశమున్న రంగాలే. లైఫ్‌ సైన్సెస్‌లో ముఖ్యమైన విభాగాలే. రెండు కోర్సుల్లో చదివే సిలబస్‌లో సారూప్యం ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో రెండు నుంచి మూడు సెమిస్టర్లు.. ఈ రెండు కోర్సులవారు ఒకే తరగతి గదిలో కలిసే చదువుతారు. ఈ రెండు విభాగాల్లో పరిశోధనాంశాలు కూడా చాలావరకు ఒకేలా ఉంటాయి. మీకు అమితాసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని, ప్రాథ]మికాంశాలు, అప్లికేషన్స్‌ బాగా నేర్చుకొని మేలైన పరిశోధనలు చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మణికంఠ

    Ans:

    ఇంటర్మీడియట్‌ చదవకుండా, దూరవిద్యలో మీరు చదివిన బీకాంతో నిరభ్యంతరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందవచ్చు. కొన్ని ఉద్యోగాలకు మాత్రమే 10+2+3 పద్ధ్దతిలో చదివివుండాలన్న నిబంధన ఉంటుంది. అలాంటి ఉద్యోగాలకు మాత్రం మీరు అర్హులు కారు. ముఖ్యంగా, బీఈడీ చేయాలంటే పైన చెప్పిన 10+2+3 అర్హత అవసరం. ఉపాధ్యాయ ఉద్యోగాలు, అతికొన్ని ప్రత్యేక ఉద్యోగాలను మినహాయిస్తే, మీ విద్యార్హతల చెల్లుబాటు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రిషిత

    Ans:

    వివిధ విద్యాసంస్థలు ఇచ్చే అడ్మిషన్‌ నోటిఫికేషన్ల ప్రకారం ఎంబీఏ చదవడానికి ఉద్యోగానుభవమేదీ అవసరం లేదు. కానీ ఈ అనుభవం ఉన్న వారికి ప్రాంగణ నియామకాల్లో మంచి కొలువులూ, ఎక్కువ వేతనాలూ లభించే అవకాశం ఉంటుంది. ఎక్కువ డిమాండ్‌ ఉన్న ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఎంబీఏ ముందు వరసలో ఉంటుంది. ఏ ప్రొఫెషనల్‌ కోర్సుకయినా విజ్ఞానంతో పాటు మెలకువలు చాలా అవసరం. ఉద్యోగానుభవంతో నేర్చుకోగలిగే కొన్ని ప్రత్యేక మెలకువలను విద్యాసంస్థలు తరగతి గదిలో అందించలేవు. మీరు మేనేజ్‌మెంట్‌ కెరియర్లో అత్యున్నత స్థాయికి వెళ్లాలంటే కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగానుభవంతో పాటు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి ఎంబీఏ చదివే ప్రయత్నం చేయండి.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మురళీ కిరణ్‌‌

    Ans:

    ఎమ్మెస్సీలో కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ, మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ల్లో ఏ కోర్సు చదివినా కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రమే అర్హత పొందుతారు. ఈ రెండు కోర్సులూ విభిన్నమైనవీ, ప్రత్యేకమైనవీ. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారు అనే విషయాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. పరిశోధన, బోధన రంగాల్లో ఆసక్తి, విదేశాల్లో స్థిరపడాలన్న అభిలాష లాంటివీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. ఏ యూనివర్సిటీల్లో చదవాలనుకొంటున్నారో, ఆ వర్సిటీల సిలబస్‌ను గమనించి ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోండి.
    కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అండ్‌ మెరైన్‌ బయోటెక్నాలజీ అప్లైడ్‌ సైన్స్‌ కోర్సు అయితే మెరైన్‌ బయాలజీ అండ్‌ ఫిషరీస్‌ అనేది కొంతవరకు బేసిక్‌ సైన్స్‌ అని చెప్పవచ్చు. రెండు కోర్సుల్లోనూ పరిశోధనకు విస్తృత అవకాశాలున్నాయి. రెండు కోర్సులు చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి.
    - ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌