Post your question

 

  Asked By: అమూల్య

  Ans:

  స్టేట్‌ బోర్డుతో పోల్చినప్పుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌.. రెండూ విభిన్నమైనవే. సాధారణంగా స్టేట్‌ బోర్డు పరిధిలో ఉన్న చాలా పాఠశాలల్లో మార్కులపై, పరీక్షా ఫలితాల శాతంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో విద్యార్థులు పొందే మార్కులకూ, వారికి ఉన్న విజ్ఞానానికీ పొంతన ఉండట్లేదు. పది, ఇంటర్‌లలో 90 శాతం కంటే పైన మార్కులు పొందుతున్న చాలామంది జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో కనీస మార్కులు సాధించలేక పోతున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ ప్రవేశ పరీక్షల్లో కొంతమేరకు మెరుగైన ప్రతిభను చూపగలుగుతున్నారు. ఈ బోర్డుల్లో చదివినవారిలో చాలామందికి మార్కులకంటే నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి.
  విషయ పరిజ్ఞానం పెంచుకొంటూ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడే విద్య కావాలనుకుంటే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో చదివితే మెరుగైన ఫలితాలు లభించవచ్చు. రెండు బోర్డుల్లో, సీబీఎస్‌ఈ సిలబస్‌ కొంతమేరకు సైన్స్, మ్యాథ్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జేెఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా ఉంటుంది. ఐసీఎస్‌ఈలో.. సైన్స్, మ్యాథ్స్‌లతో పాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకూ ప్రాధాన్యమిస్తారు. ఐసీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో ఇతర బోర్డులతో పోల్చినప్పుడు ఫీజు ఎక్కువ. స్టేట్‌ బోర్డుతో సహా అన్నిరకాల బోర్డుల సిలబస్‌లు విద్యార్థి విజ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్నీ పెంచే విధంగానే తయారు చేశారు. వాటిని ఆచరించే పాఠశాలను బట్టి విద్యా నాణ్యత ఉంటుంది. కాబట్టి బోర్డుతో పాటు మంచి పాఠశాలను కూడా ఎంచుకొంటేనే మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: రాథోడ్‌ నవీన్‌

  Ans:

  గణితంపై ఆసక్తి ఉంది కాబట్టి గణితాన్ని కొనసాగించే కోర్సులగురించి ఆలోచించండి. పదో తరగతి తరువాత డిప్లొమా చేయడం వల్ల మ్యాథ్స్‌ సబ్జెక్టును అంతగా నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇంటర్‌ (ఎంపీసీ) చదివిస్తూ ఎన్‌ఐటీ/ఐఐటీలో ఇంజినీరింగ్‌ కోసం జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాయించండి. అలా కానీ పక్షంలో ఎంసెట్‌లో మంచి ర్యాంకు ద్వారా ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీటు కోసం ప్రయత్నించండి. ఒకవేళ తనకు ఇంజినీరింగ్‌ మీద ఆసక్తి లేకపోతే ఇంటర్‌ ఎంపీసీ తర్వాత బీఎస్సీలో మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ / జియాలజీ/ డేటా సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని డిగ్రీ చేయొచ్చు. ఆపై మ్యాథ్స్‌లో పీజీ చేయటం మంచిది. బీఎస్సీపై ఆసక్తి లేకపోతే బీఏలో మ్యాథ్స్‌తో పాట ఎకనామిక్స్‌ /స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టులతోనూ డిగ్రీ చేయొచ్చు. అప్పుడు కూడా మ్యాథ్స్‌లో పీజీ చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే ఆ తరువాత మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా సీఏ లాంటి కోర్సుల్లో ఆసక్తి ఉంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌ చదివి.. బీకాం చేస్తూ సీఏ కూడా చేసే వీలుంటుంది. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన జాతీయ విద్యావిధానం-2020 ద్వారా మ్యాథ్స్‌లో నాలుగు సంవత్సరాల ఆనర్స్‌ డిగ్రీని చేయొచ్చు. ఇంటర్‌ తరువాత చాలామంది ఇంజినీరింగ్‌ కోర్సులకు వెళ్ళడం వల్ల మ్యాథ్స్‌ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉంది. మీ సోదరికి మ్యాథ్స్‌ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఉంటే బీఎస్సీ/ బీటెక్‌ తరువాత బీఈడీ చేసి, ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఆర్‌. దుర్గాప్రసాద్‌

  Ans:

  కొంత ఆలస్యం అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి, ఆ విద్యార్హతలతో మెరుగైన ఉద్యోగాలు సంపాదించడం శ్రేయస్కరం. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక, ఇంటర్మీడియట్‌ ఎంపీసీతో చదివి మంచి కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివితే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇంటర్‌లో బైపీసీ తీసుకొని, నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్‌ చదివితే వైద్యశాలల్లో నర్సుగా స్థిరపడొచ్చు. ఇంటర్మీడియట్‌ తరువాత రెండు సంవత్సరాల డీ…ఈడీ చేసి బోధన రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఐ.టి.ఐ., పాలిటెక్నిక్‌ లాంటి కోర్సులున్నాయి. ఐ.టి.ఐ. పూర్తి చెయ్యడానికి రెండు సంవత్సరాలు, పాలిటెక్నిక్‌ పూర్తి చెయ్యడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. త్వరగా ఉద్యోగం పొందాలనుకొంటే, పాలిటెక్నిక్‌ లేదా ఐ.టి.ఐ. ఎంచుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకొంటే ఇంటర్‌ లో మీరు తీసుకునే గ్రూపును బట్టి ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: కె. భాను

  Ans:

  అమెజాన్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే, మీ అమ్మాయిని కనీసం డిగ్రీ చదివించండి. బీటెక్‌ డిగ్రీ చదివితే ఎక్కువ ఉపయోగకరం. బీటెక్‌ ఏ బ్రాంచ్‌లో చేసినా, ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న ఉద్యోగాలతో పాటు సాధారణ డిగ్రీ అర్హత ఉన్న చాలా ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్, డేటా సైన్స్‌ లాంటి బ్రాంచిలు చదివితే ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. డిగ్రీ తరువాత ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఎంబీఏ/ఎంటెక్‌ చేసినట్లయితే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజినీరింగ్‌ కోర్సులయినా, మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ అయినా అత్యుత్తమ జాతీయ విద్యాసంస్థల్లో చదవడం శ్రేయస్కరం. మెరుగైన కెరియర్‌ కోసం విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, ప్రాబ్లెమ్‌ సాల్వింగ్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, టీంబిల్డింగ్, టీంవర్కింగ్‌ స్కిల్స్, సృజనాత్మకత చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎన్‌. హరిప్రసాద్‌

  Ans:

  పదో తరగతి చదివాక ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఎంట్రన్స్‌ పరీక్ష రాసి ప్రవేశం పొందినట్లయితే, ఇంటర్మీడియట్‌ ఉచితంగా, వసతిగృహంలో ఉండి చదివే అవకాశం ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేకంగా వసతిగృహాలతో కూడిన జూనియర్‌ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూడా ఇంటర్‌ని ఉచితంగా చదవొచ్చు. హాస్టల్‌తో సంబంధం లేకుండా ఇంటర్‌ను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నామమాత్రపు ఫీజుతో చదువుకోవచ్చు. పద్దెనిమిది సంవత్సరాలు నిండాక ఉద్యోగం కావాలనుకుంటే వొకేషనల్‌ కోర్సులతో ఇంటర్‌ చదవొచ్చు. ఉపాధి త్వరగా లభించే అవకాశాలుంటాయి. ఇంటర్మీడియట్‌ చదివేవారికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాలను బట్టి ప్రభుత్వ స్టైపెండ్‌ వచ్చే అవకాశం ఉంది. పద్దెనిమిది ఏళ్లకే ఉద్యోగం కావాలనుకొంటే, పదో తరగతి పూర్తయ్యాక పాలిటెక్నిక్‌ కోర్సు చదవొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: Hathiram Hathiram

  Ans:

  All types of previous papers are available on Home page of our site.

  Asked By: basha shaik

  Ans:

  No passive voice for a verb like, 'go', because it has no object.

  Asked By: prasanth

  Ans:

  రెండు వస్తువుల సహజ పౌనఃపున్యాలు సమానంగా ఉన్నప్పుడు ఒకదాన్న్రి కంపింపజేస్తే రెండోది అధిక కంపన పరిమితితో కంపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని అనునాదం అంటారు.