• facebook
  • whatsapp
  • telegram

నిర్ధారణ నుంచి నయమయ్యేదాకా!

ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తగానే డాక్టర్‌ దగ్గరకు వెళతాం. అనారోగ్యానికి కారణం కనుక్కోవడంలోనూ, పూర్తిగా నయమయ్యేలా చేయడంలో మరికొందరి సేవలు ఉపయోగపడతాయి. వీరిలో వైద్య అనుబంధ/ పారామెడికల్‌ నిపుణులది ప్రధాన పాత్ర. రోగ నిర్ధారణ పరీక్షలు, కొన్ని రకాల చికిత్సలు అందించడం వీరి విధి. ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ లాంటివి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రత్యేక పారా మెడికల్‌ కోర్సులున్నాయి. బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు ఈ కోర్సుల్లో ప్రవేశించవచ్చు!

వ్యాధులను ఓడించి, మనుషుల ప్రాణాలు రక్షించే వైద్య రంగం చాలా విస్తృతమైనది. దీనిలో పారామెడికల్‌ కోర్సులు ప్రముఖమైనవి. ప్రైవేటు, ప్రభుత్వరంగాల్లో వైద్యసేవలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగావకాశాలూ విస్తృతమవుతున్నాయి. పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ హెల్త్‌యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ త్వరలో ప్రకటనలు విడుదల చేస్తాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న వైద్య అనుబంధ కోర్సుల్లో చేరి, తగిన శిక్షణ పొందితే మంచి ఉపాధిని అందుకోవచ్చు.

మెడికల్‌ లెబోరేటరీ టెక్నాలజీ

వ్యాధిని గుర్తించడంలోనూ, దానికి తగిన చికిత్సను సూచించడంలోనూ క్లినికల్‌ లెబోరేటరీ టెస్ట్‌లు అవసరమవుతాయి. ఈ విధిని మెడికల్‌ లెబోరేటరీ టెక్నీషియన్లు నిర్వహిస్తారు. వీరు ల్యాబ్‌లో నిర్వహించే టెస్ట్‌లకు సంబంధించిన అంశాలన్నింటినీ నేర్చుకుంటారు. రోగితో నేరుగా సంప్రదించే అవకాశం తక్కువే అయినప్పటికీ ఆసుపత్రుల్లో వీరికీ ఎక్కువ ఆదరణ ఉంటుంది.

రెస్పిరేటరీ థెరపీ

శ్వాససంబంధ వ్యాధుల నిర్ధారణ, చికిత్స, రిహాబిలిటేషన్‌ అంశాలను అధ్యయనం చేస్తారు. రెస్పిరేటరీ థెరపిస్ట్‌ ఫిజీషియన్‌ ఆధ్వర్యంలో సంబంధిత చికిత్సను అందిస్తారు. దీర్ఘ వ్యాధులైన సీఓపీడీ, బ్రాంకైటిస్, లంగ్‌ డిసీజెస్, స్లీప్‌ ఆప్నియా, ఆస్తమా, అలర్జీ అంశాల్లో సంబంధిత నిపుణులకు సాయమందిస్తారు. వీరు ప్రధానంగా ఐసీయూలు, ల్యాబ్‌ల్లో ఎక్కువగా పనిచేస్తారు.

రేడియోథెరపీ టెక్నాలజీ

రేడియోగ్రాఫర్లు, రేడియేషన్‌ ఆంకాలజిస్టులు, మెడికల్‌ ఫిజిస్ట్‌లు, రేడియోథెరపీలో పనిచేసే నర్సులతో కలిసి వీరు పనిచేస్తారు. కోర్సులో భాగంగా హ్యూమన్‌ అనాటమీ, ఫిజియాలజీ, క్యాన్సర్లు, పేషెంట్‌ కేర్, రేడియోగ్రాఫిక్‌ టెక్నిక్‌లు, రేడియోథెరపీ చికిత్సా విధానాలు, ప్రాథమిక రేడియేషన్‌ ఫిజిక్స్, రేడియోథెరపిక్‌ ఎక్విప్‌మెంట్‌ టెక్నాలజీ అంశాలను నేర్చుకుంటారు.

మెడికల్‌ ఇమేజింగ్‌

మెడికల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఒక శాఖ. శరీరానికి వెలుపల తగిలే దెబ్బలు కంటికి కనిపిస్తాయి. కానీ లోపల తగిలే దెబ్బలు, విరిగిన ఎముకలు, వివిధ జబ్బులు, దెబ్బల తీవ్రత గురించి తెలుసుకోవడానికి టెక్నాలజీ సాయం అవసరమవుతుంది. ఎక్స్‌రే, రేడియోగ్రఫీ, ఫ్లూరోస్కోపీ, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ మొదలైనవన్నీ దీనికిందకే వస్తాయి. ఈ వివిధ రేడియోలాజికల్‌ టెక్నిక్‌ల గురించి కోర్సులో చదువుతారు.

ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ

వినడం, మాట్లాడటం.. కమ్యూనికేషన్‌లో ప్రధానాంశాలు. వీటిలో లోపాలు ఏర్పడినపుడు సంబంధిత నిపుణులు అవసరమవుతారు. ఆడియాలజీలో వినికిడి లోపాలను గుర్తించడం, అంచనావేయడం దానికి అనుగుణంగా చికిత్సను నిర్ణయిస్తారు. స్పీచ్‌ విభాగంలో.. మాట, భాష, గొంతు, స్పష్టత లోపాల గురించి తెలుసుకుంటారు. ఈ నిపుణులు వ్యక్తిలో వీటికి సంబంధించిన లోపాలను గమనించి, తగిన సాయమందిస్తారు.

పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ

వీరు వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌లు, ఇంట్రా ఆర్టిక్‌ బలూన్‌ పంప్స్‌ వంటి లైఫ్‌ సపోర్ట్‌ ఎక్విప్‌మెంట్లను నిర్వహించే నిపుణులు. గుండె సంబంధ సర్జికల్‌ టీమ్‌లో వీరూ ఒకరు. పెద్ద సర్జరీల సమయంలో పేషెంట్లకు లైఫ్‌ సేవింగ్‌ సపోర్ట్‌ను అందిస్తారు. కోర్సుల్లో భాగంగా కార్డియాట్రిక్‌ అనాటమీ, ఫిజియాలజీ, పాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫీటల్‌ అండ్‌ నియోనేటల్‌ కార్డియాక్‌ డెవలప్‌మెంట్, పర్‌ఫ్యూజన్‌ సైన్స్‌ అంశాలను నేర్చుకుంటారు.

కార్డియో వాస్కులార్‌ టెక్నాలజీ

ఆసుపత్రుల్లో కార్డియో వాస్కులర్‌ టీమ్‌లో ఈ నిపుణులదీ ప్రముఖ పాత్రే. గుండె సంబంధ క్లినికల్‌ ప్రాక్టీస్‌కు అవసరమైన థియరిటికల్‌ పరిజ్ఞానంతోపాటు ప్రస్తుత ఆధునిక పరికరాలకు సంబంధించిన అంశాలనూ కోర్సులో భాగంగా నేర్పుతారు. ఎలక్ట్రో కార్డియోగ్రఫీ, ట్రెడ్‌మిల్‌ స్ట్రెస్‌ టెస్టింగ్, 24 అవర్‌ ఆంబ్యులేటరీ ఈసీజీ మానిటరింగ్‌ మొదలైన పరికరాల గురించిన శిక్షణనిస్తారు.

డయాలసిస్‌ థెరపీ

కిడ్నీ సంబంధ వ్యాధులు, రీప్లేస్‌మెంట్‌ థెరపీ వంటి మూత్రపిండ చికిత్స అంశాలను నేర్చుకుంటారు. డయాలసిస్‌ మెషినరీని సెట్‌ చేయడం, ఉపయోగించడం, ప్రక్రియను చేపట్టాక పేషెంట్‌ పరిస్థితిని పర్యవేక్షించడం వంటివి చేస్తారు. అనాటమీ, ఫిజియాలజీ, రెంటల్‌ డిసీజెస్, బ్లడ్‌ కెమిస్ట్రీ అంశాలనూ తెలుసుకుంటారు.


 

ఆపరేషన్‌ గదిలో సర్జరీ నిర్వహించేది వైద్య బృందమే అయినా వారికి అవసరమైన సామగ్రిని సమయానికి అందుబాటులో ఉంచేవారు వేరు. ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ నిపుణులు ఈ పనిని చేస్తారు. అందుకే సర్జరీలో వీరిదీ ప్రముఖ పాత్రే. ఆపరేషన్‌ గదిని శస్త్రచికిత్సకు సిద్ధం చేయడం, ఆ సమయంలో వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులకు అవసరమైన టెక్నికల్‌ సాయం అందించడం వీరి విధి. సంబంధిత ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ అంశాలను కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ

ఆక్యుపేషనల్‌ థెరపీ

వైద్యులు సూచించిన నివారణ పద్ధతులను ఆచరించడం, రిహాబిలిటేషన్‌ ద్వారా జబ్బులను నయం చేయడం దీనిలో ప్రధానంగా కనిపిస్తుంది. దీన్నే ఫిజికల్‌ థెరపీ అనీ పిలుస్తారు. రోగి చుట్టుపక్కల వాతావరణం, దినచర్యల్లో మార్పులు చేయడం ద్వారా శారీరక, భావోద్వేగ, మానసిక సమస్యలను అదుపు చేయడం వంటివి కోర్సులో నేర్చుకుంటారు. దీనలో పీడియాట్రిక్స్, హ్యాండ్‌ థెరపీ, అడల్డ్‌ రిహాబిలిటేషన్స్‌ వంటి స్పెషలైజేషన్లుంటాయి. వీరికి ఆసుపత్రులు, రిహాబిలిటేషన్‌ సెంటర్లు, స్పెషల్‌ స్కూళ్లు, గెరియాట్రిక్‌ హోమ్స్‌ల్లో అవకాశాలుంటాయి.

క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ

తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఐసీయూలో ఉండే పేషెంట్ల బాధ్యతను వీరు చూసుకుంటారు. నేరుగా వారికి సేవలందించడంతోపాటు వెంటిలేటర్లు, కార్డియో వాస్కులార్‌ పెరామీటర్లను మానిటర్‌ చేయడం, బ్రాంకోస్కోపీ, కార్డియో పల్మనరీ రెసస్టికేషన్‌ మొదలైవన్నీ చూసుకోవడం వీరి విధి. వివిధ ఎక్విప్‌మెంట్లు, చికిత్స విధానాల గురించి కోర్సులో భాగంగా చదువుతారు.

అనస్థీషియా టెక్నాలజీ 

సర్జరీలు, ఆపరేషన్లు ఏవైనా అనస్థీషియా టెక్నీషియన్లు తప్పనిసరి. పేషెంట్‌ ప్రీ ఆపరేటివ్‌ కేర్‌కు సంబంధించిన అన్ని అంశాల్లో వీరి జోక్యం ఉంటుంది. సర్జరీ సమయంలో అనస్థీషియా నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను తీసుకుంటారు. వీరికి అనస్థీషియా టెక్నిక్‌లు, ఇన్‌స్ట్రుమెంట్లు, సప్లైస్, టెక్నాలజీ అంశాలపై పట్టు ఉంటుంది. వీరు ఎమర్జెన్సీ వార్డులు, ఐసీయూ, సర్జరీ క్లినిక్‌ల్లో పనిచేస్తారు.

ఇంకా.. న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ, ప్రొస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీఓ), ఎమర్జెన్సీ అండ్‌ ట్రామా కేర్‌ టెక్నాలజీ, ఫిజీషియన్‌ అసిస్టెంట్, న్యూరో ఎలక్ట్రోఫిజియాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్, యూరాలజీ టెక్నాలజీ, మెడికల్‌ రికార్డ్స్‌ సైన్సెస్, మెడికల్‌ సోషియాలజీ, కార్డియాలజీ, హాస్పిటల్‌ ఫుడ్‌ సర్వీస్‌ మేనేజ్‌మెంట్, రేడియోగ్రాఫిక్‌ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి.

ఎక్కడ? ఎలా?

పారామెడికల్‌ కోర్సులను ఉద్యోగాధారిత కోర్సులుగా వ్యవహరిస్తారు. వీరు మల్టీడిసిప్లినరీ విభాగాల్లో వైద్యులతో కలిసి పనిచేస్తారు. వీటిలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా డిగ్రీ కోర్సుల కాలవ్యవధి 3 నుంచి 4 ఏళ్లు; డిప్లొమా కోర్సులకు ఒకటి నుంచి రెండేళ్ల వరకూ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులు మాత్రం

ఏపీ - http://www.appmb.co.in/

తెలంగాణ - http://www.tspmb.telangana.gov.in/
 

పారామెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంస్థలన్నీ ఎక్కువశాతం మెరిట్‌ ఆధారంగానే ఎంచుకుంటున్నాయి. కొన్ని మాత్రం ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

Posted Date: 22-01-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌