• facebook
  • whatsapp
  • telegram

సీఏ దారిలో గ్లోబల్‌ కెరియర్‌

ఇటీవలికాలంలో సీఏ కోర్సుకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది. దీనిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది విద్యార్థులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కోర్సు గురించీ, దాన్ని పూర్తిచేస్తే లభించే అవకాశాల గురించీ తెలుసుకుందాం! 

'చాలా కష్టం; చదవాలంటే 10- 15 సంవత్సరాలు కష్టపడాలి. రోజుకి 16- 18 గంటలు చదవాలి'- ఇప్పటివరకూ సీఏ కోర్సు గురించి మనకు వినిపించిన మాటలివి. కానీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

'ఈ కోర్సును ఎవరైనా చదవచ్చు. పూర్తిచేసినవారికి విస్తృత ఉపాధి అవకాశాలుంటాయి. మనదేశంలో ఇప్పటికిప్పుడు పది లక్షలమంది సీఏలు అవసరం'- సీఏ కోర్సు గురించి మారిన అభిప్రాయాలివి.

ఒకప్పుడు ఈ కోర్సుపై సరైన అవగాహన లేక, అపోహలతో చాలామంది సీఏ చేసేవారు కాదు. కానీ మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సీఏ ఇన్‌స్టిట్యూట్‌- ఐసీఏఐ వారు కోర్సు విధానాన్ని మార్చి సరళతరం చేశారు.

సీఏలో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి. ఈ కోర్సు మొత్తం పూర్తవడానికి ఇంటర్‌ తర్వాత అయితే కనీసం 4 సంవత్సరాలు; పదోతరగతి తరువాత ఆరు సంవత్సరాలు పడుతుంది.

సీఏ అభ్యసించేవారికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇంటర్‌ అర్హతతో సీపీటీకి సుమారు రూ. 6,000, ఐపీసీసీ కోసం రూ. 9,000, ఆర్టికల్‌షిప్‌ కోసం మరో రూ.2,000; సీఏ ఫైనల్‌ కోసం సుమారు రూ. 10,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి

పది తర్వాత సీఏ: సీఏ చదవాలనుకునే విద్యార్థి ఇంటర్‌ తర్వాత సీపీటీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో మేథమేటిక్స్‌, ఎకనామిక్స్‌, అకౌంట్స్‌తోపాటుగా లా సబ్జెక్టు కూడా ఉంటుంది. అందువల్ల లా మినహా మిగతా సబ్జెక్టులన్నింటినీ ఇంటర్‌లో ఎంఈసీ ఎంచుకున్నవారికి అవి వారి పాఠ్యాంశాల్లో భాగంగా ఉంటాయి. అందుకే నేడు సీఏ చదివే విద్యార్థులు ఎక్కువవుతున్నారు. మళ్లీ కామర్స్‌ కోర్సయిన ఎంఈసీకి పూర్వ వైభవం వస్తోంది. రాష్ట్రంలో నిన్నటివరకూ సైన్సు కోర్సులకే పరిమితమైన అన్ని కార్పొరేట్‌ కళాశాలలూ ఎంఈసీ గ్రూపును కూడా ప్రవేశపెట్టాయని గమనించాలి

కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (సీపీటీ)

సీపీటీని ఏటా జూన్‌, డిసెంబర్‌ మాసాల్లో దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షగా నిర్వహిస్తారు. అకౌంట్స్‌ 60 మార్కులకు, మర్కంటైల్‌ లా 40 మార్కులకు, ఎకనామిక్స్‌ 50 మార్కులకు, మేథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ కలిపి 50 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో కనీసం 30% మార్కులు సాధిస్తూ నాలుగు సబ్జెక్టులు కలిపి 50% పైగా అంటే 100కిపైగా మార్కులు సాధించవలసి ఉంటుంది. సీపీటీ పూర్తిచేసిన విద్యార్థులు 9 నెలల తరువాత ఐపీసీసీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. డిగ్రీ, పీజీ అర్హత పొందిన విద్యార్థులకు సీపీటీ పరీక్షను మినహాయించి నేరుగా సీఏ ఐపీసీసీలోకి ప్రవేశాన్ని ఐసీఏఐ కల్పిస్తోంది.

ఇంటిగ్రేటెడ్‌ ప్రొఫిషియన్సీ కాంపిటెన్సీ కోర్సు (ఐపీసీసీ)

ఏటా మే, నవంబర్‌ మాసాల్లో ఐపీసీసీ పరీక్షలు నిర్వహిస్తారు. ఐపీసీసీ రెండు గ్రూపులుగా ఉంటుంది.

గ్రూప్‌-1: దీనిలో అకౌంట్స్‌ 100 మార్కులకు, లా, ఎథిక్స్‌ & కమ్యూనికేషన్‌ 100 మార్కులకు, ఇన్‌కం టాక్స్‌, సర్వీస్‌ టాక్స్‌, వ్యాట్‌ 100 మార్కులకు, కాస్టింగ్‌ & ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

గ్రూప్‌-2: అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌ 100 మార్కులకు, ఆడిటింగ్‌ 100 మార్కులకు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి గ్రూపులో కనీసం ప్రతి సబ్జెక్టులో 40 మార్కులు సాధించాలి. అలాగే గ్రూప్‌ మొత్తం మీద 50% మార్కులు అంటే 150 ఆపై మార్కులు సాధించాలి. విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి/ విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. ఆ తరువాత ఓరియంటేషన్‌ కోర్సులో, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శిక్షణలో నిర్వహించే 100 గంటల కోర్సులోనూ ఉత్తీర్ణత సాధించాలి.

సీఏలో ఆర్టికల్‌షిప్‌తో స్త్టెపెండ్‌

ఐపీసీసీలో గ్రూప్‌-1 ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు/ రెండు గ్రూపులు పూర్తిచేసిన విద్యార్థులు ప్రొఫెషనల్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర మూడేళ్లపాటు తప్పనిసరిగా ఆర్టికల్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా వారి దగ్గర శిక్షణ పొందుతున్న కాలంలో ఈ విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 వరకు స్త్టెపెండ్‌ రూపంలో చెల్లిస్తారు. తల్లిదండ్రుల మీద భారం వేయకుండా చదువుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగం. ఆర్టికల్‌షిప్‌ మరో ఆరు నెలల్లో ముగుస్తుందనగా సీఏ ఫైనల్‌ పరీక్ష రాయాలి.

సీఏ ఫైనల్‌: సీఏ ఫైనల్‌ కూడా గ్రూప్‌-1, గ్రూప్‌-2లుగా ఉంటుంది. ఏటా మే, నవంబర్‌ మాసాల్లో సీఏ ఫైనల్‌కు పరీక్షలు జరుగుతాయి. గ్రూప్‌-1లో ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ 100 మార్కులకు, స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ 100 మార్కులకు, అడ్వాన్స్‌డ్‌ ఆడిటింగ్‌ & ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ 100 మార్కులకు, కార్పొరేట్‌ & ఎలైడ్‌ లాస్‌ 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. గ్రూప్‌-2లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ 100 మార్కులకు, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ కంట్రోల్‌ & ఆడిట్‌ 100 మార్కులకు, డైరెక్ట్‌ టాక్స్‌ 100 మార్కులకు, ఇన్‌డైరెక్ట్‌ టాక్స్‌ 100 మార్కులకు ఉంటాయి. సీఏ ఫైనల్‌లో కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు, ప్రతి గ్రూప్‌లో/ రెండు గ్రూపులు కలిపి 50% మార్కులు సాధించవలసి ఉంటుంది.

ఇంటర్‌తోపాటే సీఏ బోధన

అఖిల భారత ర్యాంకుల లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఇంటర్‌తోపాటు లాంగ్‌టర్మ్‌ సీపీటీ కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచే సుశిక్షితులైన సీఏలచేత శిక్షణ పొందిన విద్యార్థులు అఖిల భారత అత్యుత్తమ ర్యాంకులను సాధిస్తున్నారు.

ఇటీవల విడుదలైన సీఏ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులు మన తెలుగు విద్యార్థులకే లభించాయి.

ఇంటర్‌తోపాటు సీపీటీకి శిక్షణ పొందితే కేవలం 21 సంవత్సరాల పిన్న వయసులోనే ప్రొఫెషనల్‌ డిగ్రీతోపాటు ఆకర్షణీయ జీతంతో ఉద్యోగాలను సాధించడం సులువు.

సీఏకు మరోదారి: ఇంటర్‌ పూర్తిచేసినవారు కూడా సీఏ చదవవచ్చు. ఇంటర్‌- ఎంఈసీ/ ఎంపీసీ/ బైపీసీ/ సీఈసీ/ హెచ్‌ఈసీ ఇలా ఏ గ్రూపు వారైనా సీఏ కోర్సు చదవవచ్చు.

సీఏ సగం పూర్తిచేసినవారికి: సీఏ గట్టెక్కలేనివారి కోసం ప్రవేశపెట్టిన కోర్సు అకౌంటింగ్‌ టెక్నీషియన్‌. సీపీటీ పాసైన విద్యార్థి సీఏ పూర్తి చేయలేను అనుకున్నపుడు ఐపీసీసీలోని గ్రూప్‌-1 పూర్తిచేసి ఒక సంవత్సరం పాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర ఆర్టికల్‌షిప్‌ చేస్తే అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. పరిశ్రమలో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు, అంతర్జాతీయ గిరాకీ ఉన్నాయి. ఈ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో అకౌంటెంట్‌గా చేరి నెలకు కనీసం రూ.30,000, ఆపైన జీతం పొందవచ్చు.

ఎంపీసీ/ఎంఈసీలలో ఏది?

సీఏ చదవడానికి ఇంటర్‌ ఏ గ్రూపువారైనా అర్హులే. అంటే ఎంపీసీ నుంచి వచ్చినవారు కూడా అర్హులే. కానీ ఎంఈసీ నుంచి వచ్చేవారు జూనియర్‌ ఇంటర్‌ నుంచే సీఏ ఓరియంటెడ్‌గా చదివి ప్రాథమికాంశాలపై పట్టు సాధించవచ్చు. అటువంటివారు సీనియర్‌ ఇంటర్‌ పూర్తవుతుండగానే సీపీటీ పరీక్ష తేలిగ్గా రాయగలుగుతారు. దీనితో వీరికి 9 నెలల సమయం మిగులుతుంది. అదే ఎంపీసీ వారు అయితే ఇంటర్‌ పూర్తయిన తరువాత 9 నెలలపాటు సీపీటీ కోచింగ్‌ తీసుకుని సన్నద్ధమవాల్సి ఉంటుంది.

హోదాలు, ఉద్యోగాలు: సంస్థలకు మేనేజింగ్‌ డైరెక్టర్లుగా, ఫైనాన్స్‌ కంట్రోలర్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ప్లాంట్‌ అకౌంటెంట్స్‌, సిస్టమ్‌ ఇంప్లిమెంటార్స్‌, టెక్నో ఫంక్షనిస్టులుగా అవకాశాలు పొందవచ్చు. ట్రస్టీ, అడ్మినిస్ట్రేటర్‌, వాల్యూయర్‌, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, టాక్స్‌ కన్సల్టెంట్‌లుగానూ ఉద్యోగాలు లభిస్తాయి

అవధిలేని ఆర్జన: కామర్స్‌లో ఏం చదివినా, ఎంతవరకు చదివినా ఉద్యోగావకాశాలున్నాయి. నెలకు రూ. 50,000 సంపాదించుకునే అకౌంటెంట్‌ల నుంచి ఏడాదికి 18- 20 కోట్ల రూపాయలు ఆర్జించే ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌ వరకు అపరిమిత అవకాశాలు, అవధులు లేని ఆర్జనలు కామర్స్‌ రంగంలో చూడొచ్చు

Posted Date: 07-09-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌