• facebook
  • whatsapp
  • telegram

ప్రసిద్ధ సంస్థల్లో కోర్సులెన్నో......

ఇంట‌ర్ పూర్తయిన ఎక్కువ మంది విద్యార్థులకు క‌నిపించే దారులు రెండే. అవి.. అయితే ఇంజినీరింగ్ లేదంటే మెడిసిన్‌. మిగిలిన‌వాళ్లలో ఎక్కువ శాతం మూడేళ్ల సాధార‌ణ‌ డిగ్రీ కోర్సుల్లో చేర‌డానికి ప్రాధాన్యమిస్తారు. అయితే ఇంట‌ర్ విద్యార్థుల కోసం మెరుగైన ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. కోర్సుల వారీ ప్రముఖ సంస్థలు వెలిశాయి. సాధార‌ణ బ్యాచిల‌ర్‌ డిగ్రీ కోర్సులు సైతం పేరొందిన విశ్వవిద్యాల‌యాల క్యాంప‌స్‌ల్లో చ‌దువుకోవ‌చ్చు. కేంద్రీయ విశ్వవిద్యాల‌యాలు, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌, అజీం ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీ, ఇఫ్లూ, ఎయిమ్స్‌, ఐఎస్ఐ, ఆర్ఐఈ...ఇలా ప్రసిద్ధ సంస్థలెన్నో ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌లు కోర్సులు అందిస్తున్నాయి. ఆ వివ‌రాలు చూద్దాం..

ఇంజినీరింగ్‌కి...ఐఐటీలు, మెడిసిన్‌లో...ఎయిమ్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సుల కోసం...ఐఐఎంలు ఉన్నట్లుగానే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌, సోష‌ల్ వ‌ర్క్‌, ఫిజిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇంగ్లిష్‌, పాలిటీ, ఎక‌నామిక్స్....ఇలాంటి కోర్సులు చ‌దువుకోవ‌డానికీ విఖ్యాత సంస్థలెన్నో దేశంలో ఉన్నాయి. ఇంట‌ర్ అర్హత‌తో న‌చ్చిన కోర్సుల‌కు సంబంధించి మేటి సంస్థల్లో చేరిపోవ‌చ్చు. వీటి ద్వారా ప్రపంచ‌ స్థాయి ప‌రిజ్ఞానాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మంచి బోధ‌న‌, మెరుగైన వ‌స‌తులు ఈ సంస్థల ప్రత్యేక‌త‌. ప‌రిశీల‌న‌, స్వానుభ‌వం ద్వారా నేర్చుకోవ‌డానికి ప్రాధాన్యమిస్తారు. ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత బోధ‌నా సిబ్బంది ఇక్కడ ఉంటారు. రాత ప‌రీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశం ల‌భిస్తుంది. పలు సంస్థలు ప్రతి నెలా స్టైపెండ్‌నూ చెల్లిస్తున్నాయి.

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్

కోర్సులు: బీఏ సోష‌ల్ సైన్సెస్‌, బ్యాచిల‌ర్ ఆఫ్ సోష‌ల్ వ‌ర్క్‌

వ్యవ‌ధి: మూడేళ్లు

ఎక్కడ‌: బీఏ సోష‌ల్ సైన్సెస్‌, బ్యాచిల‌ర్ ఆఫ్ సోష‌ల్ వ‌ర్క్ కోర్సుల‌ను టిస్ ముంబ‌యి క్యాంప‌స్‌తోపాటు హైద‌రాబాద్, గువాహ‌తి, తుల్జాపూర్‌ కేంద్రాల్లో నిర్వహిస్తోంది. ఈ కోర్సుల‌కు ఎంపికైన‌వాళ్లు అదే క్యాంప‌స్‌లో కావాల‌నుకుంటే పీజీ కూడా పూర్తిచేసుకోవ‌చ్చు.

అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత‌

వెబ్‌సైట్‌: http://campus.tiss.edu

అజీం ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీ

అజీం ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీ రెసిడెన్షియ‌ల్ విధానంలో మూడేళ్ల బీఏ, బీఎస్సీ కోర్సుల‌ను అందిస్తోంది. ఎంపికైన విద్యార్థులు ఫిజిక్స్, బ‌యాల‌జీ, ఎక‌నామిక్స్‌, హ్యుమానిటీస్ వీటిలో ఏదైనా స్పెష‌లైజేష‌న్‌గా తీసుకోవ‌చ్చు. ఇంట‌ర్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

వెబ్‌సైట్‌: http://azimpremjiuniversity.edu.in/

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇండోర్

కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంబీఏఅయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపిఎం) కోర్సును ఐఐఎం ఇండోర్ అందిస్తోంది. ఈ త‌ర‌హా కోర్సును అందిస్తోన్న ఏకైక ఐఐఎం ఇండోర్ ఒక్కటే కావ‌డం విశేషం. కోర్సులో 120 సీట్లు ఉన్నాయి. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఆప్టిట్యూడ్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌, ఇంగ్లిష్, మ్యాథ్స్ స‌బ్జెక్టుల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని ప‌రిశీలిస్తారు. ఎంపికైన అభ్యర్థుల‌కు మూడేళ్ల కోర్సు అనంత‌రం క్యాట్ ద్వారా పీజీపీ కోర్సుల్లో చేరిన‌వారికి ఉండే క‌రిక్యుల‌మ్‌ని బోధిస్తారు. తొలి మూడేళ్లూ ఏడాదికి రూ.3 ల‌క్షలు ఫీజు చెల్లించాలి. అనంత‌రం పీజీపీ అభ్యర్థులు చెల్లించే ఫీజునే వీరూ చెల్లించాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్‌: www.iimidr.ac.in

ఐఐఎస్సీ

బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్‌) పేరుతో నాలుగేళ్ల కోర్సును ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగ‌ళూరు నిర్వహిస్తోంది. కోర్సులో 8 సెమిస్టర్లు ఉంటాయి. బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, మెటీరియ‌ల్స్‌, మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్ కోర్సుల‌ను అభ్యర్థులు నేర్చుకుంటారు. ఇంట‌ర్‌లో ఎంపీసీ గ్రూప్ లేదా బ‌యాల‌జీ, స్టాటిస్టిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్ స‌బ్జెక్టులు చ‌దివిన‌వాళ్లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కేవీపీవై, ఐఐటీ-జేఈఈ, ఏఐపీఎంటీ స్కోర్ ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

వెబ్‌సైట్‌: www.iisc.ernet.in

చెన్నై మ్యాథ‌మెటిక‌ల్ ఇన్‌స్టిట్యూట్‌

కోర్సు: బీఎస్సీ (ఆన‌ర్స్‌)- మ్యాథ్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌; బీఎస్సీ (ఆన‌ర్స్‌)-మ్యాథ్స్‌, ఫిజిక్స్ మూడేళ్ల కోర్సుల‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. రాత ప‌రీక్షలో చూపిన ప్రతిభ‌ ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. బీఎస్సీ కోర్సుల‌కు ఎంపికైన ప్రతి విద్యార్థికీ నెల‌కు రూ.4000 నుంచి రూ.5000 వ‌ర‌కు స్కాల‌ర్‌షిప్‌గా చెల్లిస్తారు.

వెబ్‌సైట్‌: www.cmi.ac.in

ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్

కోర్సులు: బ్యాచిల‌ర్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌, బ్యాచిల‌ర్ ఆఫ్ మ్యాథ‌మెటిక్స్‌

ఎక్కడ‌: కోల్‌క‌తా, బెంగ‌ళూరు, దిల్లీల్లో ఈ సంస్థ ఉంది. ఈ సంస్థ బ్యాచిల‌ర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిల‌ర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కోర్సు దిల్లీ క్యాంప‌స్‌లో నిర్వహిస్తోంది. కోర్సుల‌కు ఎంపికైన‌వారికి నెల‌కు రూ.3000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

వెబ్‌సైట్‌: www.isical.ac.in

ఇఫ్లూ

కోర్సులు: ఇంగ్లిష్‌, విదేశీ భాష‌లు (అర‌బిక్‌, ఫ్రెంచ్‌, జ‌ర్మన్‌, ర‌ష్యన్‌)ఇంగ్లిష్‌లో ఆస‌క్తి ఉన్నవారికి మంచి వేదిక ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివ‌ర్సిటీ (ఇఫ్లూ). ఈ యూనివ‌ర్సిటీకి హైద‌రాబాద్‌, షిల్లాంగ్ ల్లో క్యాంప‌స్‌లు ఉన్నాయి. బీఏ (ఆన‌ర్స్‌) ఇంగ్లిష్ కోర్సును ఈ క్యాంప‌స్‌ల్లో అందిస్తున్నారు. సెమిస్టర్ విధానంలో విద్యా బోధ‌న ఉంటుంది. హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో 46 సీట్లు ఉన్నాయి. రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఇంట‌ర్ ఉత్తీర్ణులు ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఫారిన్ లాంగ్వేజ్‌లు నేర్చుకోవాల‌నే ఆస‌క్తి ఉన్నవారికి ఇఫ్లూకు మించిన వేదిక లేదు. ఈ సంస్థలో బీఏ (ఆన‌ర్స్‌)- అర‌బిక్‌, ఫ్రెంచ్‌, జ‌ర్మన్‌, ర‌ష్యన్‌, స్పానిష్ కోర్సులు అందిస్తున్నారు. ఇవ‌న్నీ మూడేళ్ల కోర్సులే. ప్రతి కోర్సూ సెమిస్టర్ విధానంలో బోధిస్తారు. ఇంట‌ర్ ఉత్తీర్ణులు ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ విదేశీ భాష‌ల‌కు సంబంధించి స్పానిష్‌లో 24, మిగిలిన అన్ని భాష‌ల్లోనూ ఒక్కోదాంట్లో 16 చొప్పున సీట్లు ఉన్నాయి.

ల‌క్నో క్యాంప‌స్‌లో బీఏ (ఆన‌ర్స్‌) ఇంగ్లిష్‌లో 24 సీట్లు ఉన్నాయి. షిల్లాంగ్ క్యాంప‌స్‌లో బీఏ (ఆన‌ర్స్‌) ఇంగ్లిష్ 28 సీట్లు, బీఏ మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్నలిజం (ఎంసీజే) లో 16 సీట్లు ఉన్నాయి. వీట‌న్నింటికీ ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష నిర్వహించి అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

వెబ్‌సైట్‌: www.efluniversity.ac.in

హైద‌రాబాద్ సెంట్రల్ యూనివ‌ర్సిటీ

కోర్సులు: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఆర్ట్స్‌, సైన్స్‌, హ్యుమానిటీస్ కోర్సుల‌ను హెచ్‌సీయూ అందిస్తోంది. ఇంట‌ర్ పూర్తిచేసిన‌వాళ్లు ఈ కోర్సుల‌కు అర్హులు. రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

ఎమ్మెస్సీలో: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిక‌ల్ సైన్సెస్‌, సిస్టమ్ బ‌యాల‌జీ, ఆప్టోమెట్రీ అండ్ విజ‌న్ సైన్సెస్‌, హెల్త్ సైకాల‌జీ, ఎర్త్ సైన్సెస్ కోర్సులు అందిస్తోంది.

ఎంఏ హ్యుమానిటీస్‌లో: హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్ కోర్సులు బోధిస్తోంది.

ఎంఏ సోష‌ల్ సైన్సెస్‌లో: ఎక‌నామిక్స్‌, హిస్టరీ, పొలిటిక‌ల్ సైన్స్‌, సోషియాల‌జీ, ఆంత్రోపాల‌జీ కోర్సులు అందిస్తోంది.

పై కోర్సుల‌న్నీ ఇంటిగ్రేటెడ్ విధానంలో ఇంట‌ర్ విద్యార్థుల కోసం అందిస్తున్నారు. రాత ప‌రీక్ష ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. ఆయా స‌బ్జెక్టుల్లో పాత ప్రశ్నప‌త్రాలు కూడా యూఓహెచ్ వెబ్‌సైట్లో పొందుప‌ర్చారు.

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/couInt.html

రీజ‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న్- మైసూర్

కోర్సు: డిగ్రీ + బీఎడ్‌

వ్యవ‌ధి: నాలుగేళ్లు

డిగ్రీతోపాటు బీఎడ్ కూడా క‌లిపి చ‌దువుకోవాల‌నుందా. అయితే మీ కోస‌మే మైసూర్‌లోని ప్రాంతీయ విద్యా కేంద్రం ఎదురుచూస్తోంది. ఈ సంస్థలో నాలుగేళ్ల బీఎస్సీ బీఎడ్ లేదా బీఏ బీఎడ్ కోర్సుల‌ను చ‌దువుకోవ‌చ్చు. సెమిస్టర్ విధానంలో విద్యా బోధ‌న ఉంటుంది. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఇంట‌ర్‌లో ఆర్ట్స్‌, సైన్స్ కోర్సుల్లో 45 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైన విద్యార్థులు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాత ప‌రీక్ష ద్వారా ఎంపిక‌చేస్తారు. ఈ సంస్థ ఇంట‌ర్ విద్యార్థుల కోసం ఆరేళ్ల ఎమ్మెస్సీ ఎడ్యుకేష‌న్ కోర్సుని మ్యాథ్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో అందిస్తోంది. మొత్తం 12 సెమిస్టర్లు ఉంటాయి.

వెబ్‌సైట్‌: www.riemysore.ac.in

గాంధీగ్రామ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌- త‌మిళ‌నాడు

గాంధీగ్రామ్ రూర‌ల్ ఇన్‌స్టిట్యూట్‌, గాంధీగ్రామ్‌, దిండిగ‌ల్ జిల్లా, త‌మిళ‌నాడు సంస్థ కేంద్ర మాన‌వ వ‌న‌రుల విభాగం ఆధ్వర్యంలో న‌డుస్తోంది. ఇందులోనూ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సు అందుబాటులో ఉంది.

వెబ్‌సైట్‌: www.ruraluniv.ac.in

సెంట్రల్ యూనివ‌ర్సిటీలు

కొత్తగా ఏర్పడిన 8 కేంద్రీయ విశ్వవిద్యాల‌యాలు క‌లిసి ఉమ్మడి ప్రవేశ ప‌రీక్ష ద్వారా యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తున్నాయి. వీటిలో కొన్ని యూనివ‌ర్సిటీల్లో బీఎస్సీ బీఎడ్‌, బీఏ బీఎడ్ కోర్సులు ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్‌, ఇంటిగ్రేటెడ్ బీఎ బీఎడ్ రెండు కోర్సుల‌నూ జార్ఖండ్‌ సెంట్రల్ యూనివ‌ర్సిటీ అందిస్తోంది. ఒక్కో విభాగంలోనూ 50 చొప్పున సీట్లు ఉన్నాయి. ఇంట‌ర్ సైన్స్ కోర్సు విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్‌కి, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఏ ఎడ్ కోర్సుకి అర్హులు. ఇంట‌ర్‌లో 55 శాతం మార్కులు సాధించాలి.

ఈ సెంట్రల్ యూనివ‌ర్సిటీల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీలు అందుబాటులో ఉన్నాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల‌తోపాటు అప్లైడ్ ఫిజిక్స్‌, అప్లైడ్ కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథ్స్ కోర్సులు కూడా ఇవి బోధిస్తున్నాయి. స్టాటిస్టిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, జువాల‌జీ, లైఫ్ సైన్సెస్‌, బ‌యో కెమిస్ట్రీ, బ‌యె టెక్నాల‌జీ, మైక్రోబ‌యాల‌జీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ కోర్సులు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్టడీస్‌లో ఇంగ్లిష్‌, చైనీస్‌, కొరియ‌న్‌, టిబెట‌న్ భాష‌ల్లో అయిదేళ్ల విద్యను అభ్యసించ‌వ‌చ్చు. ఇంట‌ర్నేష‌న‌ల్ రిలేష‌న్స్‌, మాస్ క‌మ్యూనికేష‌న్‌, ఎక‌నామిక్స్ స‌బ్జెక్టుల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు కూడా ఈ కేంద్రీయ విశ్వవిద్యాల‌యాల్లో ఉన్నాయి. బీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలేష‌న్స్‌, బీఏ ఓక‌ల్ మ్యూజిక్‌/ థియేట‌ర్ కోర్సులు కూడా ఉన్నాయి. పై అన్ని కోర్సుల‌కూ రాత ప‌రీక్ష ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది.

వెబ్‌సైట్‌: http://cucet.co.in

ఐఐటీలు

కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

ఐఐటీ-జేఈఈ ప‌రీక్షతో బీటెక్ కోర్సుల‌తో పాటు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీల్లోనూ చేరొచ్చు. మ్యాథ్స్‌, పిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో ప‌లు ఐఐటీలు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సును అందిస్తున్నాయి.

ఎక‌నామిక్స్ @ ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌ఎమ్మెస్సీ ఎక‌నామిక్స్ పేరుతో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌కోర్సు అందిస్తోంది. ఐఐటీ-జేఈఈ ద్వారా ఈ కోర్సులో ప్రవేశం ల‌భిస్తుంది.

ఈ సంస్థ జేఈఈ స్కోర్‌తో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఇండ‌స్ట్రియ‌ల్ టెక్నాల‌జీ కోర్సులు నిర్వహిస్తోంది.

వెబ్‌సైట్: www.iitkgp.ac.in

ఎంఏ @ ఐఐటీ మ‌ద్రాస్‌

2006లో ఐఐటీ-మ‌ద్రాస్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఎంఏ డెవ‌ల‌ప్‌మెంట్ స్టడీస్‌, ఎంఏ ఇంగ్లిష్ స్టడీస్‌ల‌ను బోధిస్తున్నారు. హ్యుమానిటీస్ అండ్ సోష‌ల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేష‌న్ (హెచ్ఎస్ఈఈ) ద్వారా కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తారు. ఏటా ఏప్రిల్‌లో ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వహిస్తారు. ఒక్కో కోర్సుకీ 23 మంది చొప్పున మొత్తం 46 మంది విద్యార్థుల‌ను చేర్చుకుంటారు. ఇంట‌ర్ ఉత్తీర్ణులు ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వెబ్‌సైట్: http://hsee.iitm.ac.in/

నెస్ట్

ప‌రిశోధ‌నా రంగంలో రాణించాల‌నుకునే ఇంట‌ర్ సైన్స్ విద్యార్థుల‌కు నేష‌న‌ల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌)ని మించిన అవ‌కాశం లేద‌నే చెప్పుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష ద్వారా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, భువ‌నేశ్వర్‌; యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ విభాగానికి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం క‌ల్పిస్తారు. బ‌యాల‌జీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో ప్రవేశం ల‌భించిన‌వారు ఇన్‌స్పైర్ స్కాల‌ర్‌షిప్ తో ఐదేళ్ల పాటు నెల‌కు రూ.5000 చొప్పున ఉప‌కార వేత‌నం పొందొచ్చు. అలాగే వేస‌వి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభ క‌న‌బ‌ర్చిన విద్యార్థుల‌కు భాభా అటామిక్ రీసెర్చ్ సెంట‌ర్ (బార్క్‌) ట్రైనింగ్ స్కూల్‌లో ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వారా ప్రవేశం క‌ల్పిస్తారు.

వెబ్‌సైట్: www.nestexam.in

ఐఐఎస్ఈఆర్‌

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ పేరుతో దేశ‌వ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఉన్నాయి. వీటిని బ‌రంపూర్‌, భోపాల్‌, కోల్‌క‌తా, మొహాలీ, పుణె, తిరువ‌నంత‌పురం, తిరుప‌తిల్లో ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్‌ఎంఎస్ డ్యూయ‌ల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. బీఎస్ ఎంఎస్‌లో బ‌యలాజిక‌ల్ సైన్సెస్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మెటిక్స్‌, ఫిజిక్స్ కోర్సులు బోధిస్తున్నారు. ఈ కోర్సుల‌కు ఎంపికైన‌వాళ్లు కేవీపీవై లేదా ఇన్‌స్పైర్ స్కాల‌ర్‌షిప్పుల‌కు అర్హులు.

వెబ్‌సైట్: www.iiseradmission.in

ఎయిమ్స్

కోర్సులు: ఆప్టోమెట్రీ, మెడికల్ టెక్నాలజీ ఇన్ రేడియోగ్రఫీ, నర్సింగ్.

ఎక్కడ‌: బీఎస్సీ న‌ర్సింగ్ (పోస్ట్ బేసిక్‌) కోర్సు ఎయిమ్స్ న్యూదిల్లీలో నిర్వహిస్తున్నారు. బీఎస్సీ న‌ర్సింగ్ (ఆన‌ర్స్‌) కోర్సు ఎయిమ్స్ న్యూదిల్లీతోపాటు ఇత‌ర ఆరు కేంద్రాలైన భోపాల్‌, భువ‌నేశ్వర్‌, జోధ్‌పూర్‌, ప‌ట్నా, రాయ్‌పూర్‌, రిషికేశ్‌ల్లోనూ అందిస్తున్నారు.

వ్యవ‌ధి: నాలుగేళ్లు.

అర్హతలు: ఇంటర్ (సైన్స్ గ్రూప్) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.

వెబ్‌సైట్‌: www.aiimsexams.org

Posted Date: 17-08-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌