• facebook
  • whatsapp
  • telegram

వాణిజ్య కొలువులకు వారధులు

అకౌంటింగ్‌ లేని సంస్థ దాదాపు ఉండనే ఉండదు. వ్యవస్థీకృతంగా లేదా అవ్యవస్థీకృతంగానైనా ఖాతాల లెక్కలు ఉంటాయి. వాటి కోసం ఉద్యోగులూ ఉంటారు. అందుకే అమ్మకాలు.. కొనుగోళ్లు ప్రధానంగా సాగే వాణిజ్యరంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి. పెట్టుబడులు, లాభాలు, నష్టాలు.. అంటూ సవాలుగా సాగే ఈ వ్యాపార సామ్రాజ్యంలో కెరియర్‌ను డిగ్రీ నుంచే ప్రారంభించవచ్ఛు అందుబాటులో ఉన్న అనేక కోర్సుల్లో తమ ఆసక్తి మేరకు తగిన వాటిని ఇంటర్మీడియట్‌ పూర్తయిన అభ్యర్థులు ఎంచుకోవచ్ఛు.

 

భవిష్యత్తుకు భరోసా ఇచ్చే వాటిల్లో కామర్స్‌ కోర్సులు ప్రధానమైనవి. వాణిజ్యశాస్త్రం చదివితే దాదాపు అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకోవచ్ఛుఅందుకే బీకామ్‌ సబ్జెక్టులపై పట్టు ఉంటే ఉద్యోగ జీవితం సులువైనట్లేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి సర్టిఫికేషన్లు తోడైతే చక్కటి కెరియర్‌ను సొంతం చేసుకోవచ్ఛు ఇప్పుడు నచ్చిన స్పెషలైజేషన్‌తో బీకామ్‌ చేసే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు బీకామ్‌తోపాటు సర్టిఫికేషన్లను అందిస్తున్నాయి. ప్రొఫెషనల్‌ కోర్సుల్లోనూ చేరవచ్ఛు ఇవన్నీ కామర్స్‌లో ఇంటర్‌ విద్యార్థులకు ఉన్న మార్గాలు. కుటీర పరిశ్రమ నుంచి కార్పొరేట్‌ సంస్థ వరకు అన్నింటిలో అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఉంటుంది. బహుళ జాతి కంపెనీలైతే అకౌంట్స్‌, ఫైనాన్స్‌, స్ట్రాటజీ ఇలా విడిగా విభాగాలను ఏర్పాటు చేసుకుంటాయి. ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లోనూ లావాదేవీలు, పద్దుల కోసం ప్రత్యేక సెక్షన్లు ఉంటాయి. వీటన్నింటిలో పని చేయడానికి కామర్స్‌ నేపథ్యం ఉన్నవారు కావాలి. ఉత్పత్తి, తయారీ రంగాలు, బ్యాంకింగ్‌, బీమా, ఫార్మా, ఫిన్‌టెక్‌, హెల్త్‌కేర్‌, సాఫ్ట్‌వేర్‌, రిటైల్‌, ఈ కామర్స్‌, మదింపు సంస్థలు, కన్సల్టెన్సీలు... ఇలా అన్ని రకాల వర్తక విభాగాల్లోనూ వాణిజ్యశాస్త్ర పట్టభద్రుల అవసరం ఉంటుంది. ఆడిట్‌, ఇన్‌కంటాక్స్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, అడ్వైజరీ, స్టాక్‌ బ్రోకింగ్‌ మొదలైన సేవల్లోనూ కామర్స్‌ నిపుణులే కీలకం. వాణిజ్యశాస్త్రంలో రాణించేందుకు బీకామ్‌ కోర్సు తొలి అడుగు. ఇంటర్‌లో ఎంఈసీ, సీఈసీలే కాకుండా అన్ని గ్రూపుల విద్యార్థులూ ఈ మూడేళ్ల డిగ్రీలో చేరవచ్ఛు.

 

 

ఎన్నో స్పెషలైజేషన్లు! 

అకౌంట్స్‌, కామర్స్‌ ప్రధానంగా బీకామ్‌ కోర్సులు ఉంటాయి. ఆసక్తిని బట్టి ఎంచుకోవడానికి ఇప్పుడు ఎన్నో స్పెషలైజేషన్లు వచ్చాయి. రెగ్యులర్‌/ ఆనర్స్‌ / టాక్సేషన్‌/ కంప్యూటర్స్‌/ ఈ-కామర్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ / అడ్వర్టైజింగ్‌ అండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌ / ఫారిన్‌ ట్రేడ్‌ / బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ / స్ట్రాటజిక్‌ ఫైనాన్స్‌ / బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలను బీకామ్‌లో ప్రత్యేక సబ్జెక్టులుగా తీసుకోవచ్ఛు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అసోషియేషన్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ), చార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ (సీఐఎంఏ) సర్టిఫికేషన్‌ కోర్సులను బీకామ్‌ ఆనర్స్‌తో అందిస్తున్నాయి. బీకామ్‌తోపాటు సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని డిగ్రీ కళాశాలలు ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కామర్స్‌ మూడు సబ్జెక్టుల కాంబినేషన్‌తో బీఏ డిగ్రీలనూ నిర్వహిస్తున్నాయి. బీకామ్‌ తర్వాత ఎంకామ్‌, ఎంకామ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, ఎంకామ్‌ ఫైనాన్స్‌, ఎమ్మెస్సీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోల్‌, ఎంబీఏ (ఫైనాన్స్‌) కోర్సుల్లో నచ్చినదాంట్లో చేరవచ్ఛు పీజీ అనంతరం పీహెచ్‌డీకీ అవకాశం ఉంది.

 

 

పలు రకాల సర్టిఫికేషన్లు

బీకామ్‌ చదువుతూ లేదా దాన్ని పూర్తిచేసుకున్న తర్వాత మంచి అవకాశాలను సొంతం చేసుకోవడానికి సాయపడే సర్టిఫికేషన్‌ కోర్సులెన్నో ఉన్నాయి. సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (సీఎంఏ) కోర్సును యూఎస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అకౌంటెన్సీ ప్రొఫెషన్లకు ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (ఐఎఫ్‌ఏసీ) ప్రపంచ స్థాయి సంస్థ. సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్‌ (సీపీఏ) నుంచి గుర్తింపు పొందినవారు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకోవచ్ఛు ఇది సీఏతో సమానమైన కోర్సు. సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ (సీఎఫ్‌పీ) గుర్తింపుతో కార్పొరేట్‌ కంపెనీలు, ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సంస్థల్లో రాణించవచ్ఛు సర్టిఫైడ్‌ ట్రెజరీ ప్రొఫెషనల్‌, సర్టిఫైడ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌ మొదలైన వాటితోనూ అవకాశాలు లభిస్తాయి. బీకామ్‌ ఆనర్స్‌ విద్యార్థులకు సర్టిఫికేషన్‌ పరీక్షల్లో కొన్ని పేపర్ల నుంచి మినహాయింపు ఉంటుంది.

 

 

సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులు

ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సుల్లో చేరవచ్ఛు ఎంఈసీ, ఎంపీసీ గ్రూపుల వారికి ఇవి కొంత సౌకర్యవంతంగా ఉంటాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సీఏ కోర్సు అందిస్తోంది. ముందుగా ఫౌండేషన్‌ కోర్సులో అర్హత సాధించాలి. ఏడాదికి రెండు సార్లు దీన్ని నిర్వహిస్తారు. ఫౌండేషన్‌లో అర్హులు దశలవారీ ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ పరీక్షలు పూర్తిచేసుకుంటే చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా గుర్తింపు పొందుతారు. కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (సీఎంఏ) కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అందిస్తుంది. ఇందులోనూ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ దశలుంటాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా సీఎస్‌ కోర్సు అందిస్తోంది. ఫౌండేషన్‌, ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసుకున్నవారు సీఎస్‌ అవుతారు. కార్పొరేట్‌ కంపెనీల్లో మంచి ఉద్యోగాలను అందుకోడానికి సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులు దోహదపడతాయి. డిగ్రీలో చేరకుండానే వీటిని పూర్తిచేసుకోవచ్ఛు.సీఏ, సీఎంఏ, సీఎస్‌లను నిర్దేశిత వ్యవధిలోగా పూర్తిచేసే వారు తక్కువగా ఉన్నారు. అందువల్ల బీకామ్‌ చేస్తూ వీటిలో చేరితే ఆశించిన ఫలితాలు దక్కకపోయినా మూడేళ్ల తర్వాత కనీసం డిగ్రీ పట్టాను పొందవచ్ఛు ఎంకామ్‌ లేదా ఎంబీఏ వంటి కోర్సులతో ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్ఛు అకడమిక్స్‌ పరంగా ఎలాంటి నష్టమూ లేకుండా చూసుకోవచ్ఛు ప్రొఫెషనల్‌ కోర్సులను పూర్తిచేయలేకపోయినప్పటికీ వాటి సన్నద్ధత వృథా కాదు. ఆ పరిజ్ఞానం బీకామ్‌, ఎంకామ్‌, ఎంబీఏ (ఫైనాన్స్‌)ల్లో రాణించడానికీ ఉపయోగపడుతుంది. డొమైన్‌ ఉద్యోగాల్లో విజయానికీ ఆ ప్రిపరేషన్‌ సాయపడుతుంది.

 

 

యాక్చూరియల్‌ సైన్స్‌

ఒకవైపు బీకామ్‌ చదువుతూ యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సు పూర్తిచేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ) నిర్వహించే యాక్చురీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌)లో అర్హత సాధించాలి. అనంతరం దశలవారీ నిర్దేశిత పేపర్లు పూర్తిచేయాలి.అన్నింటినీ పూర్తిచేసుకున్నవారు నెలకు సుమారు రూ.5 లక్షలు ఆర్జించడం సాధ్యమే. ఏడాదికి రెండుసార్లు ఏసెట్‌ నిర్వహిస్తారు.

 

స్టాక్‌ బ్రోకింగ్‌

బీకామ్‌ విద్యార్థులు స్టాక్‌ బ్రోకింగ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులవైపూ దృష్టి సారించవచ్ఛు సెంట్రల్‌ డిపోజిటరీ, సెక్యూరిటీ మార్కెట్స్‌, డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఆప్షన్స్‌ ట్రేడింగ్‌, క్రెడిట్‌ రేటింగ్‌, ఫండమెంటల్‌ అనాలిసిస్‌, సెక్యూరిటీ అనాలిసిస్‌, పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లతోపాటు కొన్ని సంస్థలు ఈ సర్టిఫికేషన్‌ను అందిస్తున్నాయి.

 

 

ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌

ఇటీవలి కాలంలో ఈ విభాగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ద్వారా ఆర్థిక నేరాలను తెలుసుకోవడం, ఆర్థిక నేరగాళ్లను గుర్తించడం వీలవుతుంది. వివాదాల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీల్లో లొసుగులను వీరు బయటకు తీస్తారు. ఆర్థిక ఒప్పంద పత్రాలు, కంపెనీల పద్దుల ఖాతాల్లో ఏవైనా రహస్యంగా మార్పులు జరిగితే వాటిని పరిశీలించి బయటపెట్టేది వీళ్లే. ఇందులో ప్రవేశించాలంటే సర్టిఫైడ్‌ ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ ప్రొఫెషనల్‌ (సీఎఫ్‌ఏపీ) పరీక్ష రాసి సర్టిఫికేషన్‌ పొందాలి. దాన్ని ఇండియా ఫోరెన్సిక్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌-పుణె అందిస్తోంది. ప్రపంచంలో పలు దేశాలకు చెందిన సంస్థలు ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌లో సర్టిఫికేషన్‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌ మంచి కెరియర్‌గా ఎదుగుతోంది. ఆసక్తి ఉన్నవారు బీకామ్‌ లేదా బీకామ్‌ ఆనర్స్‌ చదువుతూ సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సుల్లో చేరడం మంచిది. రెగ్యులర్‌ విధానంలో అవకాశం లేకపోతే దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేయడం ప్రయోజనకరం.

 

కామర్స్‌ కాదనుకుంటే!

కామర్స్‌ కోర్సును ఇంటర్‌లో సీఈసీ, ఎంఈసీ గ్రూపులవారు చదువుతారు. వీళ్లు కామర్స్‌ వద్దనుకుంటే బీబీఏ, బీబీఎం, బీఏ, లా, డీఎడ్‌, ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, లైబ్రరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో చేరవచ్ఛు ఇంటర్‌ ఎంఈసీ గ్రూపు విద్యార్థులు మ్యాథ్స్‌తో తమ కెరియర్‌ కొనసాగించాలని భావిస్తే మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌; మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, యాక్చూరియల్‌ సైన్స్‌; మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామెట్రిక్స్‌ కాంబినేషన్లతో బీఎస్సీ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్ఛు ఈ సబ్జెక్టుల కాంబినేషన్‌తో డిగ్రీ కోర్సులు చదివినవారు బిజినెస్‌ అనలిటిక్స్‌, డేటా అనలిటిక్స్‌, డేటా సైన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన విభాగాల్లో రాణించడానికి వీలుంటుంది. బీకామ్‌ వద్దనుకుంటే హిస్టరీ, ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, జాగ్రఫీ, ఆంత్రపాలజీ, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ వంటి సబ్జెక్టుల్లో నచ్చిన కాంబినేషన్‌తో బీఏలో చేరవచ్ఛు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ (సీజీఎల్‌), రాష్ట్ర స్థాయుల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు (ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ) నిర్వహించే గ్రూప్‌-2 పరీక్షల్లో కొన్ని పోస్టులు బీకామ్‌ పట్టభద్రులకు ప్రత్యేకంగా ఉంటాయి.

Posted Date: 13-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌