• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ కోర్సుల్లోకి విఖ్యాత సంస్థ ఆహ్వానం!

డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ప్ర‌వేశాల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

ద‌ర‌ఖాస్తుల‌కు ఆగ‌స్టు 20 తుది గ‌డువు

 

 

అగ్రిక‌ల్చ‌ర్‌, అనుబంధ రంగ కోర్సుల‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. స్వ‌త‌హాగా మ‌నది వ్య‌వ‌సాయాధారిత దేశం కావ‌డం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ ప్రధానంగా దానిపైనే ఆధారపడి ఉంది. ఫ‌లితంగా ఉత్ప‌త్తులు, ప‌రిశోధ‌న‌లు, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు పెరుగుతున్నాయి. దాంతో ఉద్యోగావకాశాలకు కొదవ లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భార‌త ప్ర‌భుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌రల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్‌(బీఏఆర్ఏ), అగ్రిక‌ల్చ‌ర్ అండ్ ఫార్మ‌ర్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఇండియ‌న్‌కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్‌(ఐసీఏఆర్‌)ను స్థాపించాయి. ఇది స్వతంత్ర ప్రతిపత్తి (అటాన‌మ‌స్) ఉన్న సంస్థ‌ పలు రకాల కోర్సులను నిర్వహిస్తోంది.

 

దేశవ్యాప్తంగా మొత్తం 101 ఐసీఏఆర్ సంస్థలు, 71 అగ్రిక‌ల్చ‌రల్ విశ్వ‌విద్యాల‌యాలు ఉన్నాయి. వీటిలోని డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. ఆల్ ఇండియా ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్‌ (ఏఐఈఈఏ), ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేష‌న్‌(ఏఐసీఈ) ద్వారా ప్ర‌వేశాలు కల్పించ‌నుంది.

 

విభాగాలు.. అర్హ‌త‌

ఐసీఏఆర్‌- ఏఐఈఈఏ(యూజీ)లో ప్ర‌వేశాల‌కు ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణత సాధించాలి. వయసు ఆగ‌స్టు 31, 2021 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. డిగ్రీలో మొత్తం 11 విభాగాల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.  

ఐసీఏఆర్‌- ఏఐఈఈఏ(పీజీ)లో ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ సైన్సెస్‌, ఫిజికల్‌సైన్స్‌, ఎంటమాలజీ అండ్‌నెమటాలజీ, ఆగ్రోనమీ, సోషల్‌సైన్సెస్, స్టాటిస్టికల్‌ సైన్సెస్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ/ సిల్వీ కల్చర్‌ తదితర విభాగాలున్నాయి. వీటిల్లో చేరేందుకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత త‌ప్ప‌నిస‌రి.  

ఐసీఏఆర్‌ఏఐసీఈ - జేఆర్ఎఫ్‌/ఎస్ఆర్ఎఫ్‌(పీహెచ్‌డీ)లోనూ క్రాప్‌సైన్సెస్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, యానిమల్‌సైన్సెస్‌, ఫిషరీ సైన్స్‌, అగ్రికల్చర్‌స్టాటిస్టిక్స్‌ తదితర కోర్సులున్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

 

ఎంపిక ఇలా..

ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) నిర్వ‌హిస్తారు. అందులో వ‌చ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

 

దరఖాస్తు ఎలా?

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల‌కు ఆగ‌స్టు 20, 2021 తుది గ‌డువు. 

డిగ్రీ ద‌ర‌ఖాస్తుకు జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.770, ఓబీసీలు రూ.750, ఎస్సీ/ ఎస్టీలు రూ.375 చెల్లించాలి. 

పీజీ ద‌ర‌ఖాస్తుల‌కు జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.1120, ఓబీసీలు రూ.1100, ఎస్సీ/  ఎస్టీలు రూ.550 చెల్లించాలి.

పీహెచ్‌డీ ద‌ర‌ఖాస్తుల‌కు జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.1820, ఓబీసీలు రూ.1800, ఎస్సీ/ ఎస్టీలు రూ.900 చెల్లించాలి.

 

ప‌రీక్ష విధానం

మూడు విభాగాలకు విడివిడిగా ప‌రీక్ష ఉంటుంది. దీన్ని కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌ (సీబీటీ) ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. 

ఏఐఈఈఏ(యూజీ) ప‌రీక్ష‌ ఇంగ్లిష్‌, హిందీలో ఉంటుంది. స‌మ‌యం రెండున్న‌ర గంట‌లు కేటాయిస్తారు. మొత్తం 150 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు నాలుగు మార్కులు. 

ఏఐఈఈఏ(పీజీ) ప‌రీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌లో వ‌స్తుంది. స‌మయం రెండు గంట‌లు. మొత్తం 120 ప్ర‌శ్న‌లుంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు నాలుగు మార్కులు, త‌ప్పు స‌మాధానానికి ఒక మార్కు కోత ఉంటుంది. 

ఏఐసీఈ- జేఆర్ఎఫ్‌/ ఎస్ఆర్ఎఫ్‌(పీహెచ్‌డీ) ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌లో మాత్ర‌మే ఉంటుంది. స‌మ‌యం రెండు గంట‌లు. మొత్తం 120 ప్ర‌శ్న‌లుంటాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు నాలుగు మార్కులు. అన్ని పరీక్షల్లోనూ త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. 

డిగ్రీ ప‌రీక్ష‌ను దేశంలోని 178 కేంద్రాల్లో, పీజీ, పీహెచ్‌డీ ప‌రీక్ష‌ను 89 కేంద్రాల్లో నిర్వ‌హిస్తారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు

డిగ్రీ ప్ర‌వేశ ప‌రీక్ష ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం, చీరాల‌, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రంలో నిర్వ‌హిస్తారు. తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌/సికింద్రాబాద్‌/ రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌లో జ‌రుగుతుంది. 

పీజీ, పీహెచ్‌డీ ప‌రీక్షను ఏపీలోని తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌/ సికింద్రాబాద్‌/ రంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హిస్తారు.

 

ప‌రీక్ష తేదీలు

ఏఐఈఈఏ(యూజీ)-2021 ప‌రీక్ష‌సెప్టెంబరు 7, 8, 13 తేదీల్లో జ‌రుగుతుంది. ఇక‌  ఏఐఈఈఏ (పీజీ), ఏఐసీఈ (జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌పీహెచ్‌డీ)-2021 ప‌రీక్ష‌సెప్టెంబరు 17న నిర్వ‌హిస్తారు. 

 

వెబ్‌సైట్‌: https://icar.nta.nic.in/

Posted Date: 27-07-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌