• facebook
  • whatsapp
  • telegram

ఒకేసారి యూజీ+పీజీ

ఇంటర్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో యూజీ, పీజీ రెండు కోర్సులూ కలిపి చదువుకోవచ్చు. ఈ తరహా విద్యను ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రత్యేక సంస్థలు, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. భవిష్యత్తులో పీజీ కోర్సులు చదవాలనుకున్నవారు, పరిశోధనల దిశగా అడుగులేయాలని ఆశించేవారు, సబ్జెక్టుపై గట్టి పట్టు కోరుకునేవారు ఇంటిగ్రేటెడ్‌ బాట పట్టవచ్చు. ఈ విధానంలో కొన్ని కోర్సుల్లో చేరినవారికి ఏడాది సమయమూ ఆదా అవుతుంది! 


ఎలాంటి అవాంతరాలూ లేకుండా, అదనపు పరీక్షలు రాయకుండా.. యూజీ, పీజీ ఒకేసారి, ఒకే సంస్థలో చదువుకునే అవకాశం ఇంటిగ్రేటెడ్‌ విద్యతో పొందవచ్చు. చేరిన సబ్జెక్టులో ప్రాథమికాంశాల నుంచి పరిశోధన స్థాయి వరకు విస్తృత పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో అయితే పీజీ కోర్సుల్లో చేరడానికి యూజీ ఆఖరు సంవత్సరంలో ఉన్నప్పుడు సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరినవారికి ఈ అవసరం ఉండదు. ఈ తరహా కోర్సుల్లో చేరిన తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి లేకపోయినా, అప్పటిదాకా చదువుతోన్న సబ్జెక్టు నచ్చకపోయినా, యూజీ డిగ్రీతో బయటకు వచ్చేయవచ్చు. ఈ సౌకర్యం పలు సంస్థలు కల్పిస్తున్నాయి. కొన్ని కోర్సుల్లో మధ్యలో వైదొలిగే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల అన్ని వివరాలూ ముందే తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. 


ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ


మేనేజ్‌మెంట్‌ విద్యకు మన దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు మేటి సంస్థలు. వీటిలో కొన్ని సంస్థలు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సు అందిస్తున్నాయి. ఐఐఎం- ఇండోర్, రోహ్‌తహ్, రాంచీ, బుద్ధగయ, జమ్ముల్లో ఐపీఎం చదువుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అలాగే నల్సార్, ఐఐఎఫ్‌టీ (కాకినాడ), నిర్మా యూనివర్సిటీ, నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, జిందాల్‌ గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్, దేవీ అహల్య విశ్వవిద్యాలయ, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ...తదితర సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎంబీఏ కోర్సు అందిస్తున్నాయి. పలు డీమ్డ్‌ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న స్పెషలైజేషన్‌తో ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ పూర్తిచేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని సంస్థలు ఈ చదువులు అందిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్, నిర్మా యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లో ఐదేళ్ల వ్యవధితో బీటెక్‌ + ఎంబీఏ కోర్సులూ ఉన్నాయి.  


ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ


రాష్ట్ర జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలెన్నో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీ-మద్రాస్‌ ఎంఏ-డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎంఏ-ఇంగ్లిష్‌ స్టడీస్‌లను అందిస్తోంది. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ)తో కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. హైదరాబాద్, పాండిచ్చేరి, కొత్తగా ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సుల్లో చేరవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా విశ్వవిద్యాలయాలు కొన్ని సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు ప్రారంభించాయి.   

ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌

ఐఐటీలతోపాటు పలు విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ సంస్థలు ఐదేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సు అందిస్తున్నాయి. బీటెక్‌ అనంతరం ఎంటెక్‌తో పోలిస్తే ఏడాది సమయం ఆదా అవుతుంది. ఐఐటీ-జేఈఈ స్కోరుతో ప్రవేశం లభిస్తుంది. పాతతరం ఐఐటీలన్నింటిలోనూ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు ఉన్నాయి. రాష్ట్రస్థాయి సంస్థలూ వీటిని అందిస్తున్నాయి. పేరొందిన ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కనీసం రెండు లేదా మూడు ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు నడుపుతున్నాయి. ఈ విధానంలో వివిధ స్పెషలైజేషన్లతో కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యంతో డేటాసైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎనలిటిక్స్‌ కోర్సులు ఎక్కువగా లభిస్తున్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అందించే ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (సీఎస్‌) కోర్సులో జేఈఈ స్కోరుతో చేరవచ్చు. 


ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌

నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తిచేసుకునే అవకాశాన్ని కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాంతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, పేరొందిన ప్రైవేటు సంస్థలు ఈ తరహా కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో చేరినవారికి ఏడాది సమయం ఆదాతోపాటు, బోధనపై గట్టి పట్టు దక్కుతుంది. ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌ తర్వాత నేరుగా ఎమ్మెస్సీతోపాటు బీఎడ్‌ చదువుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఈ విధానంలో ఏడాది ఆదా అవుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఆర్‌ఐఈ మైసూరు ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరినవారు మధ్యలో వైదొలగడానికి అవకాశం ఉండదు. అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ, బెంగళూరు; తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, శస్త్ర యూనివర్సిటీ, జీడీ గొయాంకా, లవ్‌ లీ ప్రొఫెషనల్‌..తదితర సంస్థలు నాలుగేళ్ల బీఎస్సీ ఎడ్, బీఏ ఎడ్‌ కోర్సులు అందిస్తున్నాయి. 


ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ


ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులు ఐఐటీలతోపాటు పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్కోరుతో ప్రవేశం లభిస్తుంది. బీఎస్‌ ఎంఎస్‌ పేరుతో పలు సైన్స్‌ విభాగాల్లో ఐఐఎస్‌ఈఆర్‌లు కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌ మార్కుల మెరిట్‌/ జేఈఈ స్కోర్‌/ ఆప్టిట్యూడ్‌ టెస్టులో చూపిన ప్రతిభ/ కేవీపీవై తదితర విధానాల ద్వారా కోర్సులోకి తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ఏడు చోట్ల- తిరుపతి, తిరువనంతపురం, పుణె, మొహాలీ, భోపాల్, బరంపూర్, కోల్‌కత్తాల్లో ఈ సంస్థలు ఉన్నాయి. వీటిలో చేరిన విద్యార్థులు ప్రతి నెలా రూ.5000 స్టైపెండ్‌ అందుకోవచ్చు. నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (నెస్ట్‌)తో.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైసర్‌), సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ల్లో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌ కోర్సులు చదువుకోవచ్చు. ఈ సంస్థల్లో చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్‌ అందుతుంది. హైదరాబాద్, పాండిచ్చేరి, కొత్తగా ఏర్పడిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు ఉన్నాయి.  

ఇంటిగ్రేటెడ్‌ లా

ఇంటర్‌ తర్వాత నేరుగా న్యాయవిద్య కోర్సులు చదువుకోవచ్చు. డిగ్రీతో బీఎల్‌ను ఐదేళ్లకే పూర్తిచేసుకోవచ్చు. ఈ రెండూ విడిగా చదవడానికి ఆరేళ్లు పడుతుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రీయ సంస్థలు, పలు ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థులు బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సులతోపాటు బీఎల్‌ పూర్తిచేసుకోవచ్చు. జాతీయ సంస్థల్లోకి క్లాట్, రాష్ట్రస్థాయిలో చేరడానికి లాసెట్‌తో అవకాశం లభిస్తుంది. 

కొన్ని సంస్థలు అందిస్తోన్న ఇంటిగ్రేటెడ్‌ పీజీలు...

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం: 

ఎమ్మెస్సీ: మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్‌ సైన్సెస్, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ, హెల్త్‌ సైకాలజీ. 

ఎంఏ (హ్యుమానిటీస్‌): తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌. 

ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, ఆంత్రొపాలజీ.  

పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం: 

ఎమ్మెస్సీ: అప్లయిడ్‌ జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్, స్టాటిస్టిక్స్‌. 

ఎంఏ: హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, సోషల్‌ అండ్‌ ఎకనామిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లా (ఎస్‌ఈఏఎల్‌)  

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌): 

పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపసుల్లో ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయలాజికల్‌ సైన్సెస్, ఎకనామిక్స్‌ కోర్సులు అందిస్తున్నారు. బిట్‌శాట్‌తో ప్రవేశం లభిస్తుంది. పిలానీ క్యాంపస్‌లో ఎమ్మెస్సీ జనరల్‌ స్టడీస్‌ కోర్సు నడుపుతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో... 

ఉస్మానియా యూనివర్సిటీ: ఎంఏ ఎకనమిక్స్, ఎమ్మెస్సీ - కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ.

తెలంగాణ యూనివర్సిటీ: అప్లయిడ్‌ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఎంబీఏ.

పాలమూరు యూనివర్సిటీ: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ.

కాకతీయ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ: ఎంబీఏ, ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ.

ఆచార్య నాగార్జున: ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ.

యోగి వేమన యూనివర్సిటీ: ఎమ్మెస్సీ- బయోటెక్నాలజీ అండ్‌ బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్‌ సైన్సెస్‌.  

చేరిన సబ్జెక్టులో ప్రాథమికాంశాల నుంచి పరిశోధన స్థాయి వరకు విస్తృత పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో అయితే పీజీ కోర్సుల్లో చేరడానికి యూజీ ఆఖరు సంవత్సరంలో ఉన్నప్పుడు సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో చేరినవారికి ఈ అవసరం ఉండదు. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date: 15-09-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌