• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్మీడియట్‌తో ఇవిగో ఉద్యోగాలు

చిన్న వయసులోనే ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం

పేరున్న ఉద్యోగాలకు పెద్ద వయసు, గొప్ప డిగ్రీలతో పనిలేదు. పదిహేడు సంవత్సరాలు నిండి, ఇంటర్‌ పూర్తయితే చాలు.. వైట్‌ కాలర్‌ కొలువులు సొంతం చేసుకుని, ఉద్యోగ జీవితంలో దూసుకుపోవచ్చు! వీటిలో ఏటా క్రమం తప్పకుండా వెలువడుతోన్న ప్రకటలెన్నో ఉన్నాయి. రక్షణ రంగంలో అయితే ఆరు నెలలకు ఒక ప్రకటన వస్తోంది. విద్యార్థులు ఆసక్తిని బట్టి కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు; రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, కోస్టు గార్డు మొదలైనవి ఎంచుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్‌ శాఖ... మొదలైన ఉద్యోగాల్లో చేరవచ్చు. అందువల్ల ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడే పూర్తి వివరాలు తెలుసుకుని, లక్ష్యానికి అనుగుణంగా సన్నద్ధత ఆరంభిస్తే కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగవేటలో విజయం సాధించవచ్చు.  తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.


తక్కువ విద్యార్హతతో ఎక్కువ ప్రయోజనాలు అందించే అకడమిక్‌ కోర్సు.. ఇంటర్మీడియట్‌. చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరి, ప్రతిభ చూపినవారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత హోదాలు అందుకోవచ్చు. ఇంటర్‌/ప్లస్‌ 2 విద్యార్హతతో ఎక్కువ ఉద్యోగాలు రక్షణ రంగంలోనే ఉన్నాయి. ఇందులోనూ ఎంపీసీతో మేటి అవకాశాలు పొందవచ్చు. పోస్టును బట్టి శిక్షణ అనంతరం నెలకు రూ.50 వేల నుంచి లక్షకు పైగా వేతనం అందించే ఉద్యోగాలు కేంద్ర దళాల్లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందేవారు సుమారు రూ.35వేలు, ఆపైన జీతం పొందవచ్చు. 


ఎక్కువ నియామక పరీక్షల్లో.. ఆప్టిట్యూడ్, ఆంగ్ల పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అందువల్ల ఈ విభాగాలపై ముందు నుంచీ దృష్టి సారించాలి. 


రక్షణ రంగంలో...


ప్రస్తుతం ఈ నియామకాలు అగ్నివీర్‌ పేరుతో చేపడుతున్నారు. అందులో ఎంపికై, నాలుగేళ్లు సేవలు అందించాలి. తర్వాత దశలో అవకాశం వచ్చినవారు శాశ్వత ఉద్యోగులుగా కొనసాగవచ్చు. 


ఎయిర్‌ ఫోర్స్‌: ఎయిర్‌ మెన్‌ విభాగంలో గ్రూప్‌ ఎక్స్, వై ట్రేడుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు.


గ్రూప్‌ ఎక్స్‌: ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తప్ప మిగిలిన పోస్టులకు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆంగ్లంలో 50 శాతం మార్కులు ఉండాలి.   


గ్రూప్‌ వై: మెడికల్‌ అసిస్టెంట్, మ్యుజీషియన్‌ కాకుండా మిగిలినవాటికి ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌లో 50 శాతం తప్పనిసరి. మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ కోసం బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి. 


అన్ని పోస్టులకు నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు అవసరం. వయసు 17 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. 


ప్రకటనలు: ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్‌ ఎక్స్‌ విభాగంలో ఎంపికైనవారికి ఫిట్టర్, గ్రూప్‌ వై విభాగంలో చేరినవారికి టెక్నీషియన్‌ ట్రేడులు కేటాయిస్తారు. నాన్‌ టెక్నికల్‌ ట్రేడుల్లో అకౌంట్‌ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్, ఎయిర్‌ ఫోర్స్‌ పోలీస్, సెక్యూరిటీ అసిస్టెంట్‌...తదితర ఉద్యోగాలు ఉంటాయి. శాశ్వత ఉద్యోగంలో అవకాశం వచ్చినవారికి గ్రూప్‌ ఎక్స్‌ ట్రేడుల్లో రూ.33,100, గ్రూప్‌ వై ట్రేడులకు రూ.26,900 మూల వేతనం అందిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. వీరు కెరీర్‌లో ఎయిర్‌ క్రాఫ్ట్స్‌మెన్‌ నుంచి మాస్టర్‌ వారంట్‌ ఆఫీసర్‌ వరకు చేరుకోవచ్చు. ప్రతిభావంతులు ఆఫీసర్‌ హోదా అందుకోవడానికీ అవకాశం ఉంది. 


ఆర్మీ: సోల్జర్‌ క్లర్క్, స్టోర్‌ కీపర్‌ పోస్టులకు మ్యాథ్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులు అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు తప్పనిసరి. 


సోల్జర్‌ టెక్‌: ఈ పోస్టులకు ఎంపీసీ గ్రూపులో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. 


సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బైపీసీలో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు ఉండాలి.


అన్ని పోస్టులకు వయసు 17 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. 


ప్రకటనలు: ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. ముందు పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభచూపినవారికి ఫిజికల్, మెడికల్‌ టెస్టులతో శిక్షణకు తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగిగా అవకాశం వచ్చినవారికి రూ.21,700 మూల వేతనంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. 


నేవీ: భారతీయ నావికా దళంలో ఆర్టిఫీషర్‌ అప్రెంటీస్, సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ పోస్టులకు ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ పూర్తికావాలి. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. వీరికి ఫిజికల్‌ మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వాటిలో నెగ్గితే శిక్షణకు తీసుకుంటారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి. శాశ్వత కొలువుకు ఎంపికైనవారికి రూ.21,700 మూల వేతనం అందుతుంది. దీనికి మిలటరీ సర్వీస్‌ పే రూ.5200 అందుతుంది. ఏఏకు ఎంపికైనవారికి రూ.6200 గ్రూప్‌ ఎక్స్‌ పే కింద అదనంగా చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. వీరు మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ హోదా వరకు చేరుకుంటారు. 


కోస్టు గార్డు: నేవిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో 50 శాతం మార్కులు ఉండాలి. 18 - 22 ఏళ్లలోపు వారు అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ, పీఈటీ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు ఉంటాయి. ఈ ప్రకటనలు ఏటా రెండుసార్లు వెలువడతాయి. ఎంపికైనవారికి రూ.21,700 మూల వేతనం అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అందుతాయి..వీరు ప్రధానాధికారి హోదాకు చేరుకోవచ్చు. 


ఎస్‌ఎస్‌సీతో..


సీహెచ్‌ఎస్‌ఎల్‌: కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా భర్తీ చేస్తుంది. ఈ విధానంలో ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఎ), పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులను నిర్వర్తించవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, స్కిల్‌ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ అర్హులే.


స్టెనోగ్రాఫర్‌: కేంద్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ సుమారు రెండేళ్లకు ఒకసారి ప్రకటనలు విడుదలచేస్తోంది. ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టెనో స్కిల్‌ టెస్టు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తించవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఇంటర్‌ తర్వాత స్టెనోగ్రఫీ నేర్చుకున్నవారు రాణించగలరు.


రైల్వే..


జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్, జూనియర్‌ టైమ్‌ కీపర్, ట్రైన్స్‌ క్లర్క్, కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. 18 నుంచి 30 ఏళ్లలోపువారు అర్హులు. ప్రకటనలు మూడేళ్లకు ఒకసారి ఆశించవచ్చు.. కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌ లెవెల్‌ 3 ఉద్యోగం. మిగిలినవన్నీ లెవెల్‌ 2 ఉద్యోగాలు. లెవెల్‌ 3కి 21,700; లెవెల్‌ 2 పోస్టులకు రూ.19,900 మూలవేతనం అందుతుంది. ఈ పోస్టులను రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షల్లో చూపిన ప్రతిభతో భర్తీ చేస్తారు. పోస్టు బట్టి టైప్‌ లేదా స్కిల్‌ టెస్టు ఉంటుంది. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు. 


రాష్ట్ర స్థాయిలో..


కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్‌మెన్‌: ఈ ఉద్యోగాలకు ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ అర్హులే. పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు 18 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జైలు వార్డర్, ఫైర్‌ మెన్‌ పోస్టులకు 32 ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. మూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు. ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. 


ఫారెస్ట్‌ సబ్‌ సర్వీస్‌లో.. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పరీక్షలో నెగ్గినవారు నిర్ణీత వ్యవధిలో, నిర్దేశించిన దూరం నడవాలి. ఇంటర్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంది. 


చదువు + కొలువు..


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఎ) పరీక్షను మహిళలతోపాటు ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ రాసుకోవచ్చు. ఎంపికైనవారికి బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులను ఉచితంగా చదివిస్తారు. శిక్షణ అనంతరం వీరిని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో లెవెల్‌ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. అలాగే ఆర్మీ 10+2 టెక్‌ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ-జేఈఈ స్కోర్, ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. వీరికి నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్‌ కోర్సు ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం లెవెల్‌ 10 హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ మూడు ప్రకటనలూ ఏడాదికి రెండుసార్లు చొప్పున వెలువడతాయి. రక్షణ రంగంలో సత్తా చాటాలనుకున్నవారు ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షలో విజయం సాధిస్తే అత్యున్నత హోదాను అందుకోవచ్చు. గరిష్ఠ వయసు పరిమితి ప్రకారం కనీసం 6 సార్లు పరీక్ష రాసుకునే అవకాశం వస్తుంది. అందువల్ల నిబద్ధతతో ప్రయత్నిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరీక్ష ఏదైనప్పటికీ పోటీ ప్రపంచంలో ముందు నుంచీ సన్నద్ధమైనవాళ్లే ఫలితాల్లో ముందుంటారు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏపీ పోలీస్‌ కొలువుకు సిద్ధ‌మేనా?

‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెర‌వాలంటే?

‣ కోడింగ్ రాక‌పోయినా ఐటీ ఉద్యోగం!

‣ స‌గం ప్ర‌శ్న‌లు స‌రిగా రాస్తే చాలు!

‣ ఎడ్యుకేష‌న్ లోన్‌ ఎలా తీసుకోవాలి?

‣ స‌మూహంలో స‌త్తా చూపించండి! 

‣ ఎన్‌సీఎల్‌  405 ఉద్యోగాలు!

‣ గెలుద్దాం గ్రూప్‌-4!

Posted Date: 10-12-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌