• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్‌!

ఇంటర్మీడియట్‌ తర్వాత ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు

కళలపై ఆసక్తి, సృజన, ఊహలకు రూపమివ్వగలిగే ప్రతిభాశక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ తర్వాత లలిత కళల (ఫైన్‌ ఆర్ట్స్‌) కోర్సుల్లో రాణించవచ్చు. ఫొటోగ్రఫీ, స్కల్ప్‌చర్, యానిమేషన్, పెయింటింగ్, డిజైన్‌... ఇలా ఎన్నో కోర్సులు ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగంగా అందిస్తున్నారు. వీటికోసమే ప్రత్యేకంగా సంస్థలూ వెలిశాయి. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల వారూ ఈ కోర్సుల్లో చేరవచ్చు! 

శిల శిల్పంగా మారాలన్నా... ప్రకృతి అందాలు ఫొటో ఫ్రేముల్లో కనువిందు చేయాలన్నా... ఆకర్షణీయ ఆకృతులు రూపొందాలన్నా... ఊహలు వాస్తవికతకు దర్పణం పట్టాలన్నా... నిపుణుల సృజనే కీలకం. ఫైన్‌ ఆర్ట్స్‌పై పట్టున్నవారే ఈ పనులు నైపుణ్యంతో చేయగలరు. ఆసక్తి ఉన్న విద్యార్థులు యూజీలో భాగంగా ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరవచ్చు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) పేరుతో పలు సంస్థలు అందిస్తోన్న కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. పరిమిత సంస్థలు బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ పేరుతో మూడేళ్ల వ్యవధితోనూ కోర్సులు నడుపుతున్నాయి. పలు విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాన్ని నెలకొల్పి తమ ప్రాంగణాల్లోనే ఈ యూజీ కోర్సులు అందిస్తున్నాయి. అనంతరం పీజీ, పీహెచ్‌డీలను అక్కడే పూర్తి చేసుకోవచ్చు. 

పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. కొన్ని సంస్థలు ఇంటర్‌ మార్కుల మెరిట్‌తోనూ అవకాశమిస్తున్నాయి. యూజీ కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఉపాధి ప్రయత్నాలూ చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్‌ పొందడానికి ఉన్నత విద్యలో చేరి, నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఈ చదువులను జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని చోట్ల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. అయితే మేటి అవకాశాలు పొందడానికి కనీసం బ్యాచిలర్‌ స్థాయి చదువులైనా పూర్తిచేస్తే మంచిది. అనంతరం ఉద్యోగం, స్వయం ఉపాధి, ఫ్రీలాన్సింగ్‌ దిశగా అడుగులేయవచ్చు. 

బీఎఫ్‌ఏ...

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్‌చర్, ఫొటోగ్రఫీ... తదితర కోర్సులు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. ఈ చదువుల కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీని నెలకొల్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ కడపలో ప్రారంభమైంది. కొన్ని సంస్థలు పోటరీ అండ్‌ సిరామిక్స్, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులను ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగంగా యూజీ స్థాయిలో అందిస్తున్నాయి. ఈ తరహా చదువులపై ఆసక్తి ఉన్నవారు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, విశ్వభారతి, రవీంద్ర భారతి విశ్వవిద్యాలయాల్లో చేరవచ్చు. ఆయా సంస్థలను బట్టి ఫైన్‌ ఆర్ట్స్‌ లేదా విజువల్‌ ఆర్ట్స్‌ పేరుతో వీటిని నడుపుతున్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆధ్వర్యంలో... శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషినల్‌ స్కల్ప్‌చర్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ ప్రత్యేకంగా దేవతామూర్తుల విగ్రహాలు, బొమ్మల తయారీలో శిక్షణ అందిస్తుంది. ఇక్కడ శిక్షణ పొందినవారు దేవాలయాలకు కావాల్సిన ఆకృతులు రూపొందించగలరు. పదో తరగతి విద్యార్హతతో స్టోన్, ఉడ్, సిమెంట్, మెటల్‌ స్కల్ప్‌చర్‌ కోర్సులను డిప్లొమాలో భాగంగా ఈ సంస్థలో చదువుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. చదువు, వసతి, భోజనం ఉచితంగా అందిస్తారు. ఈ కోర్సులో చేరినవారి పేరుమీద రూ.లక్ష బ్యాంక్‌ డిపాజిట్‌ చేస్తారు.చదువు పూర్తయిన తర్వాత టీటీడీ నుంచి ఉపాధినీ ఆశించవచ్చు.    

ఉన్నత విద్య

బీఎఫ్‌ఏ పూర్తిచేసుకున్నవారు రెండేళ్ల వ్యవధితో ఎంఎఫ్‌ఏ కోర్సులు చదువుకోవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్, విజువల్‌ ఆర్ట్స్, పెయింటింగ్, ప్రింట్‌ మేకింగ్, స్కల్ప్‌చర్, ఆర్ట్‌ హిస్టరీ అండ్‌ విజువల్‌ స్టడీస్, అప్లయిడ్‌ ఆర్ట్స్, ప్లాస్టిక్‌ ఆర్ట్స్, పోటరీ అండ్‌ సిరామిక్స్, టెక్స్‌టైల్‌ డిజైన్‌.. తదితర కోర్సులు పీజీలో అందిస్తున్నారు. ఫైన్‌ ఆర్ట్స్‌లో యూజీ చదువులు అందిస్తోన్న సంస్థలన్నీ దాదాపు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను నడుపుతున్నాయి. కొన్ని సంస్థల్లో యూజీ లేనప్పటికీ పీజీ స్థాయిలో ఈ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు నడుపుతోంది. ఎంఎఫ్‌ఎ అనంతరం నేరుగా పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. బోధన రంగంలో సేవలందించాలని ఆశించేవారికి పీహెచ్‌డీ ఉపయోగపడుతుంది. 

ఉపాధి అవకాశాలు

ఒకప్పటికంటే ఇప్పుడు లలిత కళలకు ఆదరణ బాగా పెరుగుతోంది. కళలపై ప్రేమ ఉన్నంతవరకు వీటికి ఢోకాలేదనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న రకరకాల విగ్రహాలు, ఆకృతులు స్కల్ప్‌చర్‌ నిపుణులు రూపొందించినవే. వీటిని లోహం, మట్టి, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్, దారు (చెక్క)... మొదలైనవాటితో తయారుచేస్తారు. ఇప్పుడు పెద్ద ఎత్తున విగ్రహాలు తయారు చేస్తున్నారు. అందువల్ల స్కల్ప్‌చర్‌ కోర్సు పూర్తిచేసుకున్నవారు సులువుగానే స్థిరపడవచ్చు. వివిధ కళాకృతులు, చిత్రాలను అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్‌ నిపుణులు రూపొందిస్తారు. స్వయం ఉపాధికీ, ఏదైనా సంస్థలో పని చేసుకోవడానికీ ఈ కోర్సులు ఉపయోగపడతాయి. 

చదువుకున్న విభాగాన్ని బట్టి సాఫ్ట్‌వేర్, బహుళ జాతి సంస్థల్లోనూ వీరికి కొలువులు లభిస్తాయి. ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎల్రక్టానిక్‌ ఇండస్ట్రీ, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్, మల్టీ మీడియా, యానిమేషన్‌... తదితర సంస్థల్లో అవకాశాలు పొందవచ్చు. ఆర్ట్‌ గ్యాలరీల్లో వీరు తమ ప్రతిభను చాటవచ్చు. టెక్స్‌టైల్‌ కోర్సులు చదివినవారు వస్త్ర పరిశ్రమలో సేవలు అందించవచ్చు. ఫొటోగ్రఫీ చేసినవారికి అన్ని చోట్లా అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధి (వర్క్‌షాపు నడపడం) ద్వారా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. ఎండోమెంట్, ఆర్కియలాజికల్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తాయి. సృజనను అందరితోనూ పంచుకోవడం ఇప్పుడెంతో సులువైంది. నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా ఎంతోమందిని ఆకర్షించవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో పట్టున్నవారు సోషల్‌ మీడియానూ వేదికగా చేసుకుని రాణించవచ్చు.

సంస్థలు... కోర్సులు

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌: బీఎఫ్‌ఏలో పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్, స్కల్ప్‌చర్, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ కోర్సులు అందిస్తోంది. 

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ, కడప: బీఎఫ్‌ఎలో భాగంగా... ఆర్ట్‌ హిస్టరీ, ఫొటోగ్రఫీ, అప్లయిడ్‌ ఆర్ట్, యానిమేషన్, స్కల్ప్‌చర్, పెయింటింగ్‌ కోర్సులు నడుపుతోంది. (ఈ రెండు సంస్థలూ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి, ప్రవేశాలు కల్పిస్తున్నాయి)

ఉస్మానియా యూనివర్సిటీ: బీఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ అందిస్తోంది. పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సులను బీఎఫ్‌ఏలో భాగంగా ఐదేళ్ల వ్యవధితో పదో తరగతి అర్హతతో నడుపుతోంది. 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: స్కల్ప్‌చర్, పెయింటింగ్, ప్రింట్‌ మేకింగ్‌ కోర్సులను అందిస్తోంది. 

ఆంధ్రా యూనివర్సిటీ: నాలుగేళ్ల వ్యవధితో పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ కోర్సులు ఉన్నాయి.

కేఎల్‌ యూనివర్సిటీ: పెయింటింగ్, స్కల్ప్‌చర్, యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్, డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌లో బ్యాచిలర్‌ కోర్సులను ఈ సంస్థ నడుపుతోంది.. 

రవీంద్ర భారతి యూనివర్సిటీ: రవీంద్ర సంగీత్, వోకల్‌ మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ కోర్సులను బీఏలో మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇదే సంస్థలో విజువల్‌ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల వ్యవధితో పెయింటింగ్, స్కల్ప్‌చర్, గ్రాఫిక్స్‌ (ప్రింట్‌ మేకింగ్‌), అప్లయిడ్‌ ఆర్ట్, హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ కోర్సులను బీఎఫ్‌ఏలో చదువుకోవచ్చు.

బెనారస్‌ హిందూ యూనివర్సిటీ: పెయింటింగ్, టెక్స్‌టైల్‌ డిజైన్, ప్లాస్టిక్‌ ఆర్ట్స్, పోటరీ అండ్‌ సిరామిక్స్, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో యూజీలో అందిస్తోంది. ఇవే కోర్సులు పీజీలోనూ ఉన్నాయి.

విశ్వభారతి యూనివర్సిటీ: ఈ సంస్థ ఐదేళ్ల వ్యవధితో పదో తరగతి విద్యార్హతతో బీఎఫ్‌ఏలో పెయింటింగ్, మూరల్, స్కల్ప్‌చర్, గ్రాఫిక్‌ ఆర్ట్, డిజైన్‌ (టెక్స్‌టైల్‌/ సిరామిక్‌) కోర్సులు అందిస్తోంది. ఈ చదువుల్లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసుకున్నవారి కోసం రెండేళ్ల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. ఇంటర్‌ విద్యార్హతతో బీఎఫ్‌ఏలో భాగంగా ఈ సంస్థలో హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ కోర్సు చదువుకోవచ్చు.   

ఎంఐటీ ఏడీటీ యూనివర్సిటీ, పుణె: ఈ సంస్థ బీఎఫ్‌ఏలో అప్లయిడ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్‌చర్, సిరామిక్స్, మెటల్‌ వర్క్స్‌ కోర్సులను అందిస్తోంది. వీటిలో పెయింటింగ్‌ మూడేళ్లు, మిగిలినవి నాలుగేళ్ల వ్యవధి. ఈ కోర్సులను పీజీలోనూ చదువుకోవచ్చు. 

జామియా మిలియా ఇస్లామియా: ఈ కేంద్రీయ సంస్థ అప్లయిడ్‌ ఆర్ట్, ఆర్ట్‌ ఎడ్యుకేషన్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌ కోర్సులను యూజీ, పీజీ స్థాయుల్లో నడుపుతోంది. 

జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్ట్స్‌: నాలుగేళ్ల అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సు అందిస్తోంది. 

గోవా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌: అప్లయిడ్‌ ఆర్ట్, పెయింటింగ్‌ కోర్సులు ఉన్నాయి. 

‣ లక్నో, అలహాబాద్, పట్నా యూనివర్సిటీలు, సావిత్రీ భాయి ఫూలే పుణె యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువులను అందిస్తున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సంస్థలు అందించే ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశం సీయూసెట్‌తో పొందవచ్చు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీఓ కొలువుకు ఎస్‌బీఐ పిలుపు

‣ పారిశ్రామిక భద్రతా దళంలోకి స్వాగతం!

‣ డెవాప్స్‌ నిపుణుల‌కు డిమాండ్‌!

‣ కోస్టుగార్డు కొలువుల్లోకి ఆహ్వానం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

Posted Date: 28-09-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌