• facebook
  • whatsapp
  • telegram

డిజైన్‌ ప్రపంచంలోకి... దూసుకువెళ్తారా?

దుస్తులు, వస్తువులు, యంత్రాలు, వాహనాలు, గ్యాడ్జెట్లు, యాక్సెసరీస్‌... ఇలా మనం ఉపయోగిస్తున్న ప్రతీదీ ఒక క్రమ పద్ధతిలో డిజైన్‌ చేసిందే. ప్రమాణాలకు అనుగుణంగా వస్తువులు, ఉపకరణాలను ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా డిజైనర్లు రూపొందిస్తారు. వస్తు వినియోగం పెరగడంతో డిజైనర్లకు గిరాకీ ఎక్కువైంది. సృజన ఉన్నవారు ఈ రంగంవైపు మొగ్గు చూపవచ్చు. జాతీయ స్థాయిలో ఇందుకోసం ప్రత్యేక విద్యాశిక్షణ సంస్థలు నెలకొల్పారు. ఇంటర్‌ తర్వాత వీటిని చదువుకోవచ్చు. డిజైన్‌ కోర్సులు, అందిస్తోన్న సంస్థలు, కెరియర్‌ అవకాశాల వివరాలు చూద్దాం..

డిజైన్‌ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ అనంతరం ఆ దిశగా అడుగులేయవచ్చు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వీటిని యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో అందిస్తున్నాయి. ప్రవేశానికి జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఐఐటీ బాంబే నిర్వహించే యూసీడ్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ ఆధ్వర్యంలో డాట్, నిఫ్ట్‌ సంస్థల గాట్‌ వీటిలో ముఖ్యమైనవి. ఈ ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కులతో ఇతర సంస్థల్లోనూ చదువుకోవచ్చు. ఆర్ట్స్, ఒకేషనల్, డిప్లొమా విద్యార్థులు సైతం డిజైన్‌ కోర్సుల్లో చేరవచ్చు. యూజీ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు.  

పరీక్షలివీ...

యూసీడ్‌: ఐఐటీ బాంబే నిర్వహించే అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌)తో ఐఐబీ-బాంబే, గువాహటి, హైదరాబాద్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌ల్లో ప్రవేశం లభిస్తుంది. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులతోపాటు రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా చదివినవారు సైతం ఈ పరీక్షను రాసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిస్‌) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. యూసీడ్‌ స్కోర్‌తో దేశవ్యాప్తంగా ఇతర సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి. 

డాట్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (నిడ్‌)లో బ్యాచిలర్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (డాట్‌) నిర్వహిస్తున్నారు. నిడ్‌ ప్రధాన క్యాంపస్‌ అహ్మదాబాద్‌లో ఉంది. ఇక్కడ బీడిజైన్‌ కోర్సు నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ (విజయవాడ), హర్యానా, మధ్యప్రదేశ్, అసోం క్యాంపస్‌ల్లో నాలుగేళ్ల వ్యవధితో గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రొగ్రామ్‌ ఇన్‌ డిజైన్‌ (జీడీపీడీ) కోర్సు అందిస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది. 

గాట్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)ల్లో ఫ్యాషన్‌ టెక్నాలజీతో పాటు డిజైన్‌ కోర్సులు అందిస్తున్నారు. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (గాట్‌) ద్వారా వీటిలో ప్రవేశం లభిస్తుంది. ఇంటర్, డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి.

స్పెషలైజేషన్లు...

డిజైన్‌ కోర్సుల్లో చాలా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని బ్యాచిలర్‌ స్థాయిలోనే చదువుకోవచ్చు. పలు సంస్థల్లో మొదటి ఏడాది సిలబస్‌ ఉమ్మడిగా ఉంటుంది. ప్రధమ సంవత్సరం కోర్సులో చూపిన ప్రతిభ, ఆసక్తికి అనుగుణంగా రెండో ఏడాది నుంచి నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్, ఎగ్జిబిషన్‌ డిజైన్, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్, గ్రాఫిక్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్, అపరల్‌ డిజైన్, రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్, డిజిటల్‌ గేమ్‌ డిజైన్, ఇన్ఫర్మేషన్‌ డిజైన్, ఇంటరాక్షన్‌ డిజైన్, లైఫ్‌స్టైల్‌ యాక్సెసరీస్‌ డిజైన్, న్యూ మీడియా డిజైన్, ఫొటోగ్రఫీ డిజైన్, స్ట్రాటజిక్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్, టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఆటోమొబైల్‌ డిజైన్, యూనివర్సల్‌ డిజైన్‌ కోర్సులను చాలా సంస్థలు యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో అందిస్తున్నాయి. పీజీ తర్వాత పీహెచ్‌డీ చేసినవారు డిజైన్‌ సంస్థల్లో బోధకులగా, పరిశ్రమల్లో పరిశోధకులుగా రాణించవచ్చు. 

మరికొన్ని సంస్థలు: శ్రేష్ఠ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ; పెర్ల్‌ అకాడెమీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, విట్‌ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, రాంచీ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, గాల్గోటియా యూనివర్సిటీ. 

ఇండస్ట్రియల్‌  

ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారు తయారీ సంస్థల్లో వస్తువు, ఉత్పత్తిని డిజైన్‌ చేస్తారు. ఫర్నిచర్, ఇంటీరియర్, ఇంజినీరింగ్‌ ప్రొడక్ట్స్‌ సిస్టమ్స్, కన్జూమర్‌ గూడ్స్, క్రాఫ్ట్‌ బేస్డ్‌ ప్రొడక్ట్స్, యాక్సెసరీస్, పర్సనల్‌ యూజర్‌ ప్రొడక్ట్స్, కిచెన్‌ టూల్స్‌ అండ్‌ అప్లయన్సెస్, కొత్త తరం ఎలక్ట్రానిక్స్, ఐటీ, తదితర సంస్థల్లో పనిచేయవచ్చు. ఈ విభాగంలో ప్రొడక్ట్‌ డిజైన్, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.

టెక్స్‌టైల్‌  

ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరాల్లో దుస్తులు ఒకటి. వాటితో తమ ప్రత్యేకత చాటుకోవాలని ఆశిస్తారు. వీరందరి అవసరాలను పరిగణనలోకి తీసుకుని టెక్స్‌టైల్‌ డిజైనర్లు దుస్తులు రూపొందిస్తారు. సౌకర్యవంతంగా ఉంటూనే, ఆకర్షణీయంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దుతారు. వీరికి టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలు, రిటైల్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. 

గ్రాఫిక్‌

ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారు గ్రాఫిక్‌ డిజైనర్లుగా, బ్రాండ్‌ ఐడెంటిటీ డెవలపర్లుగా, లోగో డిజైనర్లుగా, విజువల్‌ ఇమేజ్‌ డెవలపర్ల్లుగా, మల్టీమీడియా డెవలపర్లు, పబ్లికేషన్‌ డిజైనర్ల్లుగా పనిచేయవచ్చు. బహుళజాతి కంపెనీలు, అడ్వర్టైజింగ్, ఆన్‌లైన్‌ మీడియా, టీవీ, వినోద పరిశ్రమల్లో వీరికి ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌

వీరు అడ్వర్టైజింగ్, ఎక్స్‌పరిమెంటల్‌ యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, 2డి, 3డి యానిమేషన్, ప్రీ ప్రొడక్షన్, బుల్లితెర, వెండితెర, మార్కెటింగ్, ఈ- కంటెంట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల్లో పనిచేయవచ్చు.

కమ్యూనికేషన్‌  

యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్, ఎగ్జిబిషన్‌ డిజైన్, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్‌ డిజైన్‌ ఇందులో భాగం. వాణిజ్య ప్రకటనలు, ఆన్‌లైన్‌ మీడియా, వినోద పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయి.

యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌

వీటిని పూర్తి చేసినవారికి సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ మీడియా సంస్థల్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి.  

వీడియో ఫిల్మ్‌  

వీరు ఫిల్మ్, టెలివిజన్, అడ్వర్టైజింగ్‌ పరిశ్రమల్లో ప్రొడ్యూసర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల్లుగా పనిచేయవచ్చు. ప్రస్తుతం ఎక్కువమంది వీడియో ఫిల్మ్‌ డిజైనర్లు ఆన్‌లైన్‌ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నారు. సొంతంగానూ వీడియో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు. వివాహాలే కాకుండా పుట్టినరోజు, గృహప్రవేశాలు...ఇలా ప్రతి సందర్భంలోనూ వీడియో షూట్‌ తప్పనిసరిగా మారింది. కాబట్టి నైపుణ్యం ఉన్నవారు సొంతంగానే చేతినిండా పని పొందవచ్చు.

ఫ్యాషన్‌ 

ఈ కోర్సులు చదివినవారికి దుస్తులు తయారుచేసే కంపెనీల్లో మేటి అవకాశాలు లభిస్తాయి. సొంతంగా అవుట్‌లెట్‌ ఏర్పాటుచేసుకోవచ్చు. కొంత అనుభవంతో డిజైన్‌ కన్సల్టెంట్లు, స్టైలిస్ట్, కస్టమర్‌ డిజైనర్లు, ఫ్యాషన్‌ ఫోర్‌కాస్టర్లు, ఇలస్ట్రేటర్లు, అంత్రప్రెన్యూర్లు, అకడమీషియన్లు, ఫ్యాషన్‌ మర్చండైజర్లు, బయ్యర్ల్లుగా వీరు రాణించవచ్చు..

లెదర్‌ 

పాదరక్షలు, బెల్టులు, బ్యాగులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఈ విభాగాల్లో దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి సంస్థలెన్నో ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. వస్తు తయారీలో లెదర్‌ వినియోగం పెరుగుతోంది. వీరికి ఎక్కువగా అపరెల్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. నిడ్, నిఫ్ట్‌లతోపాటు ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఈ స్పెషలైజేషన్‌ అందుబాటులో ఉంది.

ప్రొడక్ట్‌ 

గృహాలు, పరిశ్రమలు, సంస్థల్లో ఉపయోగిస్తున్న వస్తువులన్నీ ప్రొడక్ట్‌ డిజైన్‌ విభాగంలోకి వస్తాయి. ప్రొడక్ట్‌ డిజైనర్లు పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలపై దృష్టి సారించి మరింత సులువుగా ఉపయోగించేలా, మన్నిక ఎక్కువగా ఉండేలా, నిర్వహణ భారం లేకుండా, తక్కువ పరిమాణంలో ఉండేలా, కొద్ది మొత్తంతోనే తయారయ్యేలా ఆ ఉత్పత్తిని రూపొందిస్తారు. వీరికి అన్ని రకాల వస్తు తయారీ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తాయి.  

డిజైన్‌ విభాగంలో ఏ స్పెషలైజేషన్‌ చదివినప్పటికీ అవకాశాల పరంగా ఢోకాలేదు. సృజన, డ్రాయింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు బాగా రాణించవచ్చు. కోర్సులు చేసినవారికి స్పెషలైజేషన్‌ ఆధారంగా ప్రతి కంపెనీలోనూ అవకాశాలు ఉంటాయి. మేటి సంస్థల్లో చదువుకున్నవారిని బహుళజాతి కంపెనీలు, దేశీయ సంస్థలు..ప్రాంగణ నియామకాల ద్వారా పెద్ద మొత్తంలో వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాయి. 
 

Posted Date: 11-11-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌