• facebook
  • whatsapp
  • telegram

కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

నయా కాంబినేషన్లతో వైవిధ్యంగా కోర్సులు

కోర్సులంటే ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్‌లే కావు. ఉన్నత స్థాయి అవకాశాలు పొందడానికి ఇవే ప్రామాణికం కాదు. సాధారణ డిగ్రీలతోనూ  అసాధారణ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. మన దేశంలో ఎక్కువమంది యువత సాధారణ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీల్లోనే చేరుతున్నారు. ఇప్పుడీ కోర్సులను కొత్త కాంబినేషన్లతో వైవిధ్యంగా అందిస్తున్నారు. 

మన దేశంలో ఎక్కువ మంది విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) స్థాయిలో చేరుతోన్న కోర్సుల్లో సాధారణ డిగ్రీలైన బీఏ, బీఎస్సీ, బీకాంలే వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా సుమారు 400 గ్రూప్‌ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ వ్యవధిలో, తక్కువ ఖర్చుతో పూర్తికావడం, కళాశాలలు దగ్గరగా ఉండటం, పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు ఉపయోగపడటం...తదితర కారణాలతో ఈ కోర్సులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం పలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తమ ప్రధాన ప్రాంగణాల్లో వైవిధ్య కాంబినేషన్లతో ఈ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. డిగ్రీతోపాటు సివిల్‌ సర్వీసెస్‌..తదితర పోటీ పరీక్షలు, సర్టిఫికేషన్‌ కోర్సులకు సమగ్ర శిక్షణనూ అందిస్తున్నాయి.  

మన దేశంలో బీఏ కోర్సుదే పైచేయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది విద్యార్థులు బీఎస్సీ (మ్యాథ్స్, సైన్స్‌) కోర్సుల్లో చేరడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ బీఏ కోర్సుల్లో చేరవచ్చు. బీకాంలోకి ఇంటర్‌లో కామర్స్‌/మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదివినవారికి అవకాశం ఉంటుంది. బీఎస్సీకి సైన్స్, మ్యాథ్స్‌ విద్యార్థులు అర్హులు. దాదాపు డిగ్రీ కళాశాలలన్నీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. పాపులర్‌ కాంబినేషన్లు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. 

ప్రస్తుత అవసరాల నేపథ్యంలో కొత్తగా ఎన్నో సబ్జెక్టులు డిగ్రీలో చేరాయి. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తికి అనుగుణంగా గ్రూపుతోపాటు సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవాలి. భవిష్యత్తులో పలు పీజీ కోర్సుల్లో చేరడానికి యూజీలో సంబంధిత సబ్జెక్టు చదివివుండటం తప్పనిసరి. అందుకు అనుగుణంగా సబ్జెక్టును యూజీలో ఎంచుకోవాలి. కొన్ని సంస్థలు ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీలు అందిస్తున్నాయి. కోర్సు వ్యవధి మూడేళ్లే. అయితే తక్కువ సంఖ్యలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నాలుగేళ్ల వ్యవధితో ఆనర్స్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చాయి. ఈ తరహా చదువుల్లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో అదనపు ప్రావీణ్యం పొందవచ్చు. ఏదైనా సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు, ఆ సబ్జెక్టులో ఉన్నత విద్యను ఆశిస్తున్నవాళ్లు ఆనర్స్‌ చదువులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌ మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఇంటర్‌ మార్కులు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో తీసుకుంటున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ సంస్థల్లోని యూజీ కోర్సుల్లోకి సీయూసెట్‌తో అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఇక్కడి విద్యార్థులు సైతం దేశంలోని మేటి సంస్థల్లో చదివే అవకాశం ఒకే పరీక్షతో పొందవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. తెలంగాణలో సుమారు వెయ్యి కళాశాలల్లో 200కు పైగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మాడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌ (ఓఏఎండీసీ)తో డిగ్రీ కోర్సుల్లోకి చేరవచ్చు. కళాశాలలు, కోర్సులు, సీట్లు, ఫీజుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు. ఇంటర్‌ మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లను కేటాయిస్తున్నారు.

బీఏ

ఈ కోర్సులో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులు పాపులర్‌ కాంబినేషన్‌గా గుర్తింపు పొందాయి. సివిల్స్, గ్రూప్‌-1,2 తదితర పోటీ పరీక్షల ఆశావహులూ, భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించేవారూ ఈ మూడు సబ్జెక్టులవైపు మొగ్గు చూపవచ్చు. టూరిజం, సైకాలజీ, సోషల్‌ వర్క్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రొపాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, విమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, పాపులేషన్‌ స్టడీస్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్, హాస్పిటాలిటీ...ఇలా ఎంచుకోవడానికి ఎన్నో సబ్జెక్టులు బీఏలో అందుబాటులో ఉన్నాయి. ఈస్తటిక్స్‌ అండ్‌ బ్యూటీ థెరపీ, డిజిటల్‌ మీడియా అండ్‌ డిజైన్‌ కోర్సులను బీఏలో భాగంగా కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.  

బీఎస్సీ

ఈ చదువుల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకప్పుడు ఎంతో పాపులర్‌. అయితే ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదువుకున్న విద్యార్థులకు.. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ టాప్‌ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూడు సబ్జెక్టులపై పట్టు సాధించినవాళ్లు భవిష్యత్తులో పలు కొత్త అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎల్రక్టానిక్స్, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ..ఇలా ఎన్నో సబ్జెక్టులను మ్యాథ్స్‌ విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఇప్పుడు బీఎస్సీలోనూ డేటా సైన్స్, డేటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, బిజినెస్‌ ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లర్నింగ్‌...వంటి వైవిధ్య కోర్సులు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, డీమ్డ్‌ సంస్థలు అందిస్తున్నాయి. ఇంటర్‌ మ్యాథ్స్‌ విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌ అందించే ఆన్‌లైన్‌ బీఎస్సీ కోర్సులోనూ చేరవచ్చు. బైపీసీ స్ట్రీమ్‌లో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మొదటి నుంచీ ఆదరణ పొందుతున్నాయి. వీరు మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, సీడ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తదితర సబ్జెక్టులనూ ఎంచుకోవచ్చు.  

బీకాం 

బీకాంలో కాంబినేషన్లు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కామర్స్‌ సబ్జెక్టు ప్రధానాంశంగా ఈ కోర్సు రూపొందింది. ఇందులో పలు స్పెషలైజేషన్లు ఉన్నాయి. బీకాం (రెగ్యులర్‌/ ఆనర్స్‌/ ట్యాక్సేషన్‌/ కంప్యూటర్స్‌/ ఈ-కామర్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌/ అడ్వర్టైజింగ్‌ అండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఫారిన్‌ ట్రేడ్‌/ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌) వీటిలో ఏదైనా కోర్సు ఎంచుకోవచ్చు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బీకాం జనరల్, ఆనర్స్‌లతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ, బీకాం ఆనర్స్‌ + సీఐఎంఏ కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నాయి. అసోషియేషన్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ)లో చేరినవారు 13 పేపర్లు పూర్తిచేయాలి. అయితే బీకాం ఆనర్స్‌ విద్యార్థులకు వీటిలో 6 పేపర్ల నుంచి మినహాయింపు లభిస్తుంది. బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ కోర్సు తెలుగు రాష్ట్రాల్లో కేఎల్‌యూ, గీతంతోపాటు మరికొన్ని సంస్థలు అందిస్తున్నాయి. విద్యార్థులు బీకాం చదువుతూ.. సీఎంఏ, సీఏ, సీఎస్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరవచ్చు.  

డిగ్రీ తర్వాత...

డిగ్రీ కోర్సుల్లో చేరినవారు వ్యక్తిగత ఆసక్తులను బట్టి భవిష్యత్తులో భిన్న మార్గాలను ఎంచుకోవచ్చు. సంబంధిత కోర్సులకు అనుబంధంగా ఉన్నత విద్యను కొనసాగించడం, మేనేజ్‌మెంట్‌ లేదా ప్రొఫెషనల్‌ కోర్సుల్లో(ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా...) చేరడం, కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో నిర్వహించే ఉద్యోగాలకు సన్నద్ధం కావడం..వీటిలో ముఖ్యమైనవి. ఎవరికివారు తమ కెరియర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినవారు భవిష్యత్తులో కోరుకున్న స్థానాన్ని అందుకోవచ్చు. 

స్వరూపం...

బీఏ, బీకాం, బీఎస్సీ ఎందులో చేరినా కోర్సు వ్యవధి మూడేళ్లే. పరీక్షలు సెమిస్టర్‌ విధానంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలన్నీ ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) అనుసరిస్తున్నాయి. రాష్ట్రాల పరిధిలోని డిగ్రీ కళాశాలల సిలబస్, విధివిధానాలు దాదాపు ఒకేలా ఉంటాయి. సెమిస్టర్‌ మధ్యలోనూ మిడ్‌ సెమ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్‌లోనూ సబ్జెక్టులవారీ క్రెడిట్‌లు ఉంటాయి.

ప్రాచుర్యం పొందిన కొన్ని కాంబినేషన్లు 

బైపీసీతో..

బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ 

మైక్రో బయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, మైక్రోబయాలజీ

ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ

కెమిస్ట్రీ, జువాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌

కెమిస్ట్రీ, బోటనీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌

ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ

ఎంపీసీతో.. 

మ్యాథ్స్, పిజిక్స్, కెమిస్ట్రీ

మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌

మ్యాథ్స్, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్‌

మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ 

మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌

మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ

మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ (ఈ కాంబినేషన్‌లో చేరడానికి ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఉంటే చాలు)

ఆర్ట్స్‌తో..

హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌

హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ

సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ

సైకాలజీ, మార్కెటింగ్, ఇంగ్లిష్‌ లిటరేచర్‌

మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఇంగ్లిష్‌ లిటరేచర్, పొలిటికల్‌ సైన్స్‌

హిస్టరీ, ఇంగ్లిష్‌ లిటరేచర్, పొలిటికల్‌ సైన్స్‌

ఎకనామిక్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌

హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌

ఇంగ్లిష్‌ లిటరేచర్, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌

సోషల్‌ వర్క్, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోటీలో దీటుగా నిల‌వాలంటే?

‣ ఏఈఈ కొలువుల‌కు ఎలా సిద్ధం కావాలి?

‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ

‣ ఎదురుగానే జవాబు అయినా ఎంతో కష్టం!

Posted Date: 12-09-2022