• facebook
  • whatsapp
  • telegram

అందుబాటులో ఉన్నత విద్యావకాశాలు

చదువుకోవాలనే ఆసక్తి ఉండీ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఏంచేయాలో పాలుపోదు. దీంతో చాలా మంది తమకు అందుబాటులో ఉన్న ఇంటర్, డిగ్రీ వంటి కోర్సుల వరకే చదివి సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు కష్టపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువు పూర్తిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను గమనించిన వర్సిటీలు విద్యార్థుల ఇంటివద్దకే విద్యావకాశాలను తీసుకువచ్చేందుకు దూర విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ విధానంలో తమ విద్యార్హతలను పెంచుకోవడానికి, ఉద్యోగాల్లో ఉన్నత ప్రమోషన్లకు అవసరమైన కోర్సులు చదవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దూర విద్యా విధానంలో లభిస్తున్న పలు రకాల కోర్సులు, వాటిని అందిస్తున్న వర్సిటీల గురించిన సమాచారాన్ని తెలుసుకుందాం.

దూర విద్యా విధానం మనదేశంలో 1962లో ప్రారంభమైంది. తొలిసారిగా ఢిల్లీ వర్సిటీ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ని ప్రారంభించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో దూర విద్యా కోర్సులను నిర్వహిస్తున్న ఏకైక వర్సిటీగా ఇగ్నో గుర్తింపు పొందింది. ఈ వర్సిటీ దేశవ్యాప్తంగా విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగాలు చేసుకునే వారికి బాగా చేరువైంది. దూర విద్యా విధానం వల్ల అభ్యర్థులకు అధిక ప్రయోజనాలు చేకూరుతున్న వాస్తవాన్ని గ్రహించిన ఇగ్నో గ్రామీణ ప్రాంతాల వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని భావించింది. దీనికి అనుగుణంగా గ్రామాల్లో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. ఇది కూడా మంచి ఫలితాలను ఇచ్చింది. అలాగే రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ఓపెన్ వర్సిటీలు, రెగ్యులర్ యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో డిగ్రీ, డిప్లొమా తదితర ప్రోగ్రాములను నిర్వహిస్తున్నాయి.


 

డీఈసీ గుర్తింపు తప్పనిసరి

దేశంలో దూర విద్యా విధానంలో లభించే కోర్సులకు న్యూఢిల్లీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ) గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. అలాగే కోర్సులు నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి ఉండాలి. దీనికి సంబంధించి యూజీసీ వెబ్‌సైట్‌లో గుర్తింపు వర్సిటీల జాబితాను పరిశీలించడం అవసరం. ఒకవేళ యూజీసీ గుర్తింపు ఉండికూడా డీఈసీ అనుమతి లేకపోతే ఆ సంస్థలు అందించే దూర విద్యా కోర్సుల సర్టిఫికెట్లకు గుర్తింపు ఉండదు. దీనివల్ల పడిన శ్రమ అంతా కూడా వృథా అవుతుంది. ఈ సర్టిఫికెట్లను ఉద్యోగ నియామకాల్లోగానీ, ఉన్నత విద్య కోసం పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు యూనివర్సిటీ వివరాలను, అది అందించే కోర్సులను ప్రవేశానికి ముందే పరిశీలించడం అవసరం.


 

ఇగ్నో

దూర విద్యా విధానంలో ఇగ్నో దేశవ్యాప్తంగా విలువైన కోర్సులను అందిస్తోంది. వీటిలో ఇంటర్ విద్యార్థులకు ప్రధానంగా డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


 

కొన్ని ప్రధాన డిగ్రీ ప్రోగ్రాములు:
బీఏ (జనరల్)
బీఏ ఇన్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్
బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్)
బీఎస్సీ (ఆనర్స్) (ఆప్టొమెట్రీ అండ్ ఆప్తాల్మిక్ టెక్నిక్స్.
బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
బీఎస్సీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, అనెస్తీషియా అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ).
బీకాం
బీకాం (మేజర్ సబ్జెక్టులు - అకౌంటెన్సీ, ఫైనాన్స్).
బీకాం (మేజర్ సబ్జెక్టులు - కార్పొరేట్ అఫైర్స్, అడ్మినిస్ట్రేషన్).
బీకాం (మేజర్ సబ్జెక్టులు - ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్).
బీబీఏ ఇన్ రిటెయిలింగ్ (డిప్లొమా ఇన్ రిటెయిలింగ్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ రిటెయిలింగ్, బీబీఏ ఇన్ రిటెయిలింగ్).
బీఎల్ఐఎస్‌సీ
బీసీఏ
బ్యాచ్‌లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్.
బ్యాచ్‌లర్ ఆఫ్ టూరిజం స్టడీస్.
బ్యాచ్‌లర్ ఆఫ్ సోషల్ వర్క్.
బీఏ ఇన్ 3డీ యానిమేషన్ అండ్ విజువల్ అఫెక్ట్స్.
బ్యాచ్‌లర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, ఫ్యాషన్ మర్చెండైజింగ్ (పెరల్ అకాడమీ సహకారంతో).
బ్యాచ్‌లర్ ఆఫ్ టెక్స్‌టైల్ డిజైన్ (పెరల్ అకాడమీ సహకారంతో).
బ్యాచ్‌లర్ ఆఫ్ అపెరల్ డిజైన్ అండ్ మర్చెండైజింగ్.
బ్యాచ్‌లర్ ఆఫ్ ఫ్యాషన్ కమ్యూనికేషన్.

 

డిప్లొమా కోర్సులు:

క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, ఉర్దూ, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, మీట్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, టూరిజం స్టడీస్, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, ఫైర్‌సేఫ్టీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఆక్వాకల్చర్, పారాలీగల్ ప్రాక్టీస్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ మొదలైనవి.
ఈ వర్సిటీ అధ్యయన కేంద్రాలు మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి.
ప్రవేశం: సంవత్సరంలో జులై, జనవరిల్లో అడ్మిషన్లకు ప్రకటనలు వెలువడుతుంటాయి. జులై సెషన్‌కు దరఖాస్తులను ఏప్రిల్ చివరిలోగా, జనవరి సెషన్‌కు అక్టోబరు లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.ignou.ac.in

తెలుగు రాష్ట్రాల్లో ... అంబేద్కర్ ఓపెన్‌ వర్సిటీ

తెలుగు రాష్ట్రాల్లో దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ తదితర కోర్సులను నిర్వహిస్తూ అత్యధిక ప్రజాదరణ పొందిన యూనివర్సిటీ - డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దీన్ని మొదట 'ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ' పేరుతో 'ఎడ్యుకేషన్ ఎట్‌యువర్ డోర్‌స్టెప్' నినాదంతో 1982లో ప్రారంభించారు. కాలక్రమంలో అనేక కొత్త కోర్సులను జతచేస్తూ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు కూడా ఈ వర్సిటీ చేరువవుతోంది. అలాగే దూర విద్యకు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన ఇతర యూనివర్సిటీలైన కాకతీయ, ఉస్మానియా, నాగార్జున శ్రీ వేంకటేశ్వర,పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మొదలైనవి కూడా దూర విద్యా విధానంలో కోర్సులను అందిస్తున్నాయి.

అంబేద్కర్ ఓపెన్‌ వర్సిటీ

కోర్సులు: ఇంటర్ అర్హతతో ప్రధానంగా డిగ్రీ కోర్సులను అందిస్తోంది.  

అవి... 1) బీఏ, 2) బీకాం 3) బీఎస్సీ

వీటితోపాటు డిగ్రీ అర్హతతో పీజీ ప్రోగ్రాములు, పీజీ డిప్లొమాలు, టీచర్‌గా సర్వీస్‌లో ఉన్న వారికి బీఈడీ, మొదలైన కోర్సులను అందిస్తోంది. ఈ వర్సిటీకి రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో అధ్యయన కేంద్రాలున్నాయి.

ప్రవేశం: విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రకటనలు వెలువడుతుంటాయి.

చిరునామా: Dr. B.R. Ambedkar Open University,

Prof. G. Ram Reddy Marg, Road No.46,

Jubilee Hills,

Hyderabad - 500033

వెబ్‌సైట్: www.braou.ac.in

ఉస్మానియా వర్సిటీ
హైదరాబాద్‌లో 1918లో ఏర్పడిన ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన వర్సిటీగా పేరొందింది. ఈ వర్సిటీ దూర విద్యా విధానంలో డిగ్రీ, పీజీ తదితర కోర్సులను నిర్వహిస్తోంది. ఇంటర్ అర్హతతో చేరదగిన కొన్ని ప్రధాన డిగ్రీ కోర్సులు..
బీఏ
బీఏ (లాంగ్వేజెస్)
బీకాం.
బీఏ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
మాడ్యులర్ సర్టిఫికెట్ కోర్సులు.
వీటితోపాటు డిగ్రీ ఆపైన అర్హతలున్న వారికి పీజీ, డిప్లొమా తదితర కోర్సులున్నాయి. ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెలువడతాయి.
వెబ్‌సైట్: www.oucde.ac.in

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
హైదరాబాద్‌లో ఉన్న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 1998 నుంచి దూర విద్యా విధానంలో డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులను అందిస్తోంది. ఇంటర్ అర్హత ఆధారంగా చేరదగిన కోర్సుల వివరాలు...
బీఏ
బీకాం
బీఎస్సీ
డిప్లొమా ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్
డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ఆరంభంలో వస్తుంటాయి.
వెబ్‌సైట్: www.manuu.ac.in

ఆంధ్రా యూనివర్సిటీ
దూర విద్యా విధానంలో డిగ్రీ తదితర కోర్సుల నిర్వహణలో వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంటర్ అర్హతతో పలు విభాగాల్లోఈ వర్సిటీ అందిస్తున్న కోర్సులు...
బీఏ, బీకాం తదితరాలు.
కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు: ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీస్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్.
ప్రవేశ ప్రకటనలు విద్యా సంవత్సరం ఆరంభంలో వస్తుంటాయి.
వెబ్‌సైట్: http://www.andhrauniversity.edu.in/

తెలుగు రాష్ట్రాల్లో దూర విద్యా విధానంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర ప్రోగ్రాములను ఇతర యూనివర్సిటీలు కూడా అందిస్తున్నాయి. అవి...
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు.
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
వెబ్‌సైట్: www.sdlceku.co.in
శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
వెబ్‌సైట్: www.skuniversity.org
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.
వెబ్‌సైట్: http://www.spmvv.ac.in/index.html
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (www.jntuh.ac.in ) మొదలైనవి.

సాంకేతికంగా ముందడుగు
దూర విద్య ద్వారా చదవడం అంటే యూనివర్సిటీలు పోస్టు ద్వారా స్టడీ మెటీరియల్ పంపడం, పరీక్షల సమయంలో ప్రాక్టికల్స్, క్లాసులు నిర్వహించడం...ఇదంతా సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ప్రక్రియ. రేడియో, టీవీ, కంప్యూటర్ తదితర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చినతర్వాత విద్యార్థులకు తగిన సలహాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయడం మొదలైంది. ఇప్పుడు శాటిలైట్ ద్వారా శిక్షణ ఇవ్వడం ఈ విధానంలో మరికొంత ముందడుగు. ఆధునిక సౌకర్యాలను యూనివర్సిటీలు స్టడీ సెంటర్లలో కల్పిస్తూ విద్యార్థులకు నిరంతరం తమ సేవలు అందుబాటులో ఉండేందుకు వర్సిటీలు కృషి చేస్తున్నాయి.

ఇతర రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల‌కు ఇరుగు పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిషా మొదలైన రాష్ట్రాలు కూడా దూర విద్యా విధానంలో సర్టిఫికెట్ కోర్సుల నుంచి పీజీ స్థాయి వరకూ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటిలో ప్రముఖ యూనివర్సిటీల వివరాలు:
అన్నామలై: www.annamalaiuniversity.ac.in
తమిళనాడు ఓపెన్ వర్సిటీ: www.tnou.ac.in
భారతీదాసన్ వర్సిటీ: www.bdu.ac.in
మద్రాస్ వర్సిటీ: www.unom.ac.in
కర్ణాటక ఓపెన్ వర్సిటీ: www.karnatakastateopenuniversity.co.in

మదర్ థెరిసా మహిళా యూనివర్సిటీ
కొడైకెనాల్‌లోని మదర్ థెరిసా ఉమెన్స్ యూనివర్సిటీ (డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) దూర విద్యా విధానంలో విలువైన కోర్సులను అందిస్తోంది. వీటికి కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
1) డిగ్రీ కోర్సులు: బీఏ (మ్యూజిక్), బీఏ (ఉమెన్ స్టడీస్), బీఎస్సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) మొదలైనవి. కనీస అర్హత ఇంటర్ ఉండాలి.
2) డిప్లొమాలు: సాఫ్ట్ స్కిల్స్, ఫ్యామిలీ లైఫ్ కౌన్సెలింగ్, కెరీర్ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సెలింగ్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంట్.
అర్హత: కనీసం ఇంటర్.
3) సర్టిఫికెట్ కోర్సులు: లోకల్ గవర్నెన్స్, ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మేనేజ్‌మెంట్, స్పోకన్ ఇంగ్లిష్ మొదలైనవి.
అర్హత: ఇంటర్
4) పీజీ కోర్సులు: ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ (ఉమెన్ స్టడీస్), ఎంఎస్సీ (గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్) మొదలైనవి.
అర్హత: డిగ్రీ ఉండాలి.
5) పీజీ డిప్లొమాలు: ఆర్కియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, క్లినికల్ సైకాలజీ.
అర్హత: డిగ్రీ.
పూర్తి వివరాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.motherteresawomenuniv.ac.in

Posted Date: 15-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌