• facebook
  • whatsapp
  • telegram

పది పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు

చిన్న వయసులోనే స్థిరపడేందుకు అవకాశం

సర్కారీ కొలువులకు పెద్ద చదువులు తప్పనిసరి కాదు. పదో తరగతి విద్యార్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోవచ్చు. చిన్న వయసులోనే  స్థిరపడాలనుకునేవారికోసం పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి. అలాగే వీటిలో చేరిన తర్వాత అనుభవం, అంతర్గత పరీక్షలు, ఉన్నత విద్య ద్వారా మెరుగైన స్థాయికి చేరుకోవడానికి మార్గాలూ ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ, కోస్టుగార్డు, రైల్వే, పోస్టల్, ఆర్‌బీఐ, ఆర్టీసీ... మొదలైనవాటిలో ప్రారంభస్థాయి ఉద్యోగాలకు పదితో పోటీ పడవచ్చు. ప్రతి నెలా రూ.30 వేలకు పైగా వేతనమూ అందుకోవచ్చు. ఆ వివరాలు చూద్దాం!

ఆర్థిక పరిస్థితులు సహకరించనివారు, ఉన్నత చదువులపై ఆసక్తి లేనివారు, తక్కువ వ్యవధిలోనే కెరియర్‌లో స్థిరపడాలని ఆశించేవారు పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. అయితే పది పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరడం సాధ్యం కాదు. ఎందుకంటే యూనిఫారం కొలువులకు కనీసం 17 ఏళ్లయినా ఉండాలి. అలాగే సివిల్‌ పోస్టులకు పద్దెనిమిదేళ్లు నిండాలి. అందువల్ల ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నవారు పదో తరగతి తర్వాత ఇంటర్, ఐటీఐ, డిప్లొమా...ఇలా ఏదో ఒక కోర్సులో చేరడమే మంచిది. ఒకవేళ రెగ్యులర్‌ విధానంలో చదవడానికి అవకాశం లేకపోతే ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ లేదా ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.   

ఎస్‌ఎస్‌సీ

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర పోలీస్‌ బలగాలతోపాటు ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో జనరల్‌ డ్యూటీ- కానిస్టేబుల్, రైఫిల్‌మెన్‌ పోస్టుల భర్తీకి దాదాపు ఏటా ప్రకటన విడుదలచేస్తోంది. ఒక్కో విడతలోనూ వేలల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఈ పరీక్షతోనే లభిస్తున్నాయి. ఇందులో ఎంపికైనవారు ఆసక్తి, మెరిట్‌ ప్రకారం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. 

ఈ పోస్టులకు వయసు 18-23 మధ్య ఉండాలి. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, మెడికల్‌ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి లెవెల్‌ 3 మూలవేతనం రూ.21,700 అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ... మొదలైనవి కలుపుకుని సుమారు రూ.35 వేలకు పైగా పొందవచ్చు. అర్హత, అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, ఆ పైస్థాయి హోదాలను సొంతం చేసుకోవచ్చు. 

అగ్నివీర్‌

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సుల్లో పదో తరగతి విద్యార్హతతో వివిధ పోస్టులున్నాయి. అయితే వీటిలో ఎందులో చేరాలన్నా ముందుగా అగ్నివీర్‌గా ఎంపికై నాలుగేళ్లు విధుల్లో కొనసాగాలి. ఆ తర్వాత వీరిలో 25 శాతం మందికే శాశ్వత ఉద్యోగంలోకి అవకాశం లభిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గానూ మొదటి సంవత్సరం రూ.30,000 రెండో ఏడాది రూ.33,000 మూడో ఏట రూ.36,500 నాలుగో సంవత్సరం రూ.40,000 వేతనం చెల్లిస్తారు. ప్రతి నెలా అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే 30,000 నుంచి రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీరుని చేతికి రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,500 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. ఇలా నాలుగో ఏడాదికి వచ్చే సరికి వీరునికి రూ.28,000, నిధిలోకి రూ.12,000 చేరతాయి. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి పోగవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జమ చేస్తుంది. అంటే రూ.10.04 లక్షలన్నమాట. దీనికి వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. 

ఆర్మీలో...

పోస్టులు.. అర్హతలు 

అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ: పదో తరగతిలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. గ్రేడ్‌ల్లో అయితే కనీసం సీ2 అవసరం. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం ఉండాలి.   

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌: పదో తరగతిలో ఉత్తీర్ణులైతే చాలు. ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు ఉండాలి. అలాగే ఈ ట్రేడ్స్‌మెన్‌లో కొన్ని పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోనూ అవకాశం ఉంది. 

వయసు: పై అన్ని పోస్టులకూ కనిష్ఠంగా 17 1/2 గరిష్ఠంగా 23 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, సరిపోయేంత ఛాతీ కొలతలు అవసరం.  

ఎంపిక విధానం: అన్ని పోస్టులకూ ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. అనంతరం ఫిజికల్‌ మెజర్‌మెంట్, మెడికల్‌ టెస్టులు ఉంటాయి. వీటన్నింటిలో అర్హత సాధించినవారికి ఉమ్మడి పరీక్ష నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.   

అగ్నివీర్‌ నుంచి శాశ్వత కమిషన్‌లో అవకాశం వచ్చినవారికి సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మన్‌ హోదాలు దక్కుతాయి. వీరు భవిష్యత్తులో సిపాయ్, నాయక్, హవల్దార్‌ వంటి ప్రమోషన్లు పొందవచ్చు. ఏ పోస్టుకి ఎంపికైనప్పటికీ రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. ఉంటాయి.

నేవీలో.. 

అగ్నివీర్‌గా సేవలందించిన తర్వాత నేవీలో షెఫ్, స్టివార్డ్, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలకు అవకాశం లభిస్తుంది. 17-23 ఏళ్లలోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత,  దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల్లో చేరే అవకాశం వచ్చినవారు రూ.21,700 మూలవేతనంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ.. అందుకోవచ్చు. భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ స్థాయి వరకు చేరుకుంటారు. 

మ్యుజీషియన్‌: నేవీ బ్యాండ్‌లో పనిచేయడానికి మ్యుజీషియన్లను ఎంపిక చేస్తారు. సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉండాలి. వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సంగీత ప్రావీణ్యం, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

స్పోర్ట్స్‌ కోటా ఎంట్రీ: ఏదైనా క్రీడ/ ఈవెంట్లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. 

మల్టీ టాస్కింగ్‌ స్టాప్‌

కేంద్రంలో వివిధ విభాగాలకు అవసరమైన మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టులను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18-25 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. కేంద్ర సంస్థల్లో రూ.30వేల వేతనంతో వీరు సేవలు అందించవచ్చు. 

ఎయిర్‌ ఫోర్స్‌లో...

అగ్నివీర్‌ వాయులో నాలుగేళ్ల సేవల అనంతరం ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ వై మ్యుజీషియన్‌ హోదాతో సేవలు అందించవచ్చు. ఈ ట్రేడ్‌ ఉద్యోగాలకు పదితోపాటు ఏదైనా సంగీత/ వాయిద్య పరికరంలో ప్రావీణ్యం ఉండాలి. రూ.21,700 మూలవేతనం, రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. 

కోస్ట్‌ గార్డ్‌లో...

ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ పోస్టులకు రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. పదోతరగతిలో 50 (ఎస్సీ, ఎస్టీ 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. 

ఆర్‌బీఐలో...  

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆఫీస్‌ అటెండెంట్‌ విభాగంలో ప్యూన్, దర్వాజ్, మజ్దూర్‌ పోస్టులకు వయసు 18-25 ఏళ్లలోపు ఉండాలి. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపికచేస్తారు. ఉద్యోగంలో చేరిన వారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షల ద్వారా అసిస్టెంట్‌ మొదలైన ఉద్యోగాలు లభిస్తాయి. 

రైల్వేలో..

పదో తరగతి విద్యార్హతతో రైల్వేలో పలు ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీటికోసం మహిళలూ, పురుషులూ పోటీ పడవచ్చు. గ్రేడ్‌-4 ట్రాక్‌ మెయింటైనర్‌తోపాటు వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వేతన శ్రేణి ప్రకారం వీటిని లెవెల్‌-1 (ప్రారంభస్థాయి) ఉద్యోగాలుగా పరిగణిస్తారు. ఎంపికైనవారికి రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. కరవు భత్యం, ఇంటిఅద్దె.. మొదలైనవాటితో సుమారు రూ.ముప్పై వేల వరకు మొదటి నెల నుంచే వేతనం అందుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) పోస్టులకూ పదో తరగతి విద్యార్హత సరిపోతుంది. 

ఆర్‌టీసీలో....

కండక్టర్‌: ఏపీఎస్‌ / టీఎస్‌ ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులను ఖాళీలు ఉన్నప్పుడు పదో తరగతి మార్కుల మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తారు. 

డ్రైవర్‌: పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ... మొదలైనవాటిలో డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఉద్యోగానికీ ఈ లైసెన్స్‌ ఉన్నవారు ప్రకటన వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టల్‌ శాఖలో...

పోస్టల్‌ శాఖలో పోస్టుమ్యాన్, మెయిల్‌ గార్డు ఉద్యోగాలకు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. వీటికి ఎంపికైనవారికి రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. రెండు మూడేళ్లకు ఒకసారి ప్రకటన ఆశించవచ్చు. 

గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) - బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. శాఖాపరమైన పరీక్షల ద్వారా వీరు పోస్టుమెన్, మెయిల్‌ గార్డు, క్లర్క్‌... మొదలైన పదోన్నతులు పొందవచ్చు.  

ఇవే కాకుండా.....

ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌... కేంద్రీయ ఆర్మ్‌డ్‌ దళాలు కానిస్టేబుల్‌ హోదాలో కుక్, వాషర్‌మన్, బార్బర్, వాటర్‌ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర పోస్టుల భర్తీకి విడిగా ప్రకటనలు వెలువరిస్తున్నాయి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షల ద్వారా ఎంపికచేస్తారు. 

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో లేబర్‌ పోస్టులు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్‌ పోస్టులకు పదితో పోటీ పడవచ్చు. 

రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 163 సెం.మీ., స్త్రీలు 150 సెం.మీ. ఎత్తు అవసరం.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య

‣ అర్థం చేసుకుంటూ చ‌దివితే..!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date: 18-07-2022


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌