• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ ధీమానిచ్చే వ్య‌వ‌సాయ డిప్లొమా!

 

గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పాలిటెక్నిక్‌ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయం, పశుసంర్ధక, మత్స్యశాస్త్ర, ఉద్యాన విభాగాల్లో ఈ కోర్సులను రూపొందించారు. మత్స్యశాస్త్రం మినహా మిగతా వాటిలో ప్రైవేటు పాలిటెక్నిక్‌లు కూడా ఉన్నాయి.

 

వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన, మత్స్యశాస్త్రాల్లో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా శాస్త్రీయంగా ఆయా రంగాల్లో సూచనలు సలహాలు ఇచ్చేవారు కరవయ్యారు.ఉన్నత విద్యావంతులు, శాస్త్రవేత్తలు జిల్లా, మండల కేంద్రాలకే పరిమితమయ్యారు. వ్యవసాయం, ఉద్యాన, మత్స్య, పశుపోషణపై ఆసక్తి ఉన్న యువతకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ కోర్సులను రూపకల్పన చేశారు. వీటికి డిమాండ్‌ బాగా పెరిగింది. రైతులకు అండగా నిలిచే లక్ష్యంతో కరిక్యులమ్‌ తయారుచేసి తెలుగు మాధ్యమంలో బోధిస్తున్నారు.

 

పదోతరగతి, గ్రామీణ నేపథ్యం

ఒకటి నుంచి పదోతరగతి మధ్య కనీసం నాలుగు సంవత్సరాలైనా నగరపాలిక, పురపాలికేతర ప్రాంతాల్లో అంటే గ్రామాల్లో చదివిన వారు మాత్రమే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికెట్‌ కనీస విద్యార్హత. ఇంటర్‌ మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతున్న వారూ, పదోతరగతి కంపార్టుమెంట్‌లో ఉత్తీర్ణులైన వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులు, ఆపై అర్హతలు ఉన్నవారు కోర్సు దరఖాస్తుకు అనర్హులు. వయసు 15-22 సంవత్సరాలు. ఎలాంటి రాతపరీక్ష లేదు. పదోతరగతి మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. రాష్ట్రస్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు.

 

ఉద్యోగావకాశాలు

వ్యవసాయంలో డిప్లొమా పూర్తిచేసిన వారికి వ్యవసాయశాఖలో ఏఈవో, ఎంపీఈవోలతోపాటు ప్రైవేటు విత్తన, ఎరువుల సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పురుగుల మందులు, ఎరువులు విక్రయించే దుకాణ అనుమతులకు వ్యవసాయ డిప్లొమా తప్పనిసరి అనే నిబంధనను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసినవారికి పశుసంవర్ధకశాఖలో ఎంపీఈవోలుగా, పశువైద్య సహాయకులుగా ఉద్యోగాలు లభిస్తాయి. కోళ్ల పరిశ్రమ, దాణా తయారీ కర్మాగారాల్లోనూ ఉపాధి సాధించుకోవచ్చు. డెయిరీ ప్రాసెసింగ్‌ డిప్లొమా పూర్తి చేసినవారు ప్రైవేటు డెయిరీ కర్మాగారాల్లో నిపుణులుగా చేరవచ్చు. ఉద్యాన పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన వారికి ఉద్యానశాఖలో ఏహెచ్‌వో, ఎంపీఈవోలుగా, ప్రైవేటు విత్తన సంస్థలు, ప్రైవేటు నర్సరీల్లో కొలువులు దొరుకుతాయి.

 

ఉన్నత విద్య

రెండేళ్ల ఈ డిప్లొమా కోర్సును ఇంటర్‌తో సమానంగా పరిగణించరు. అయితే వీరికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిర్వహించే అగ్రిసెట్‌, హార్టీసెట్‌ ద్వారా నేరుగా బీఎస్సీ (వ్యవసాయం) బీఎస్సీ (ఉద్యానం) కోర్సుల్లో ప్రవేశించేందుకు అవకాశం ఉంది. ఆ సెట్లలో డిప్లొమా విద్యార్థులకు ఎంసెట్‌తో సంబంధం లేకుండా మొత్తం సీట్లలో 20 శాతం సీట్లు కేటాయించి భర్తీ చేస్తారు.

పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ ప్రాసెసింగ్‌ డిప్లొమా విద్యార్థులకు ఈ వెసులుబాటు లేదు. పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ ప్రాసెసింగ్‌ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులను బీవీఎస్సీ (పశుసంవర్ధకం), బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ), బీఎఫ్‌ఎస్సీ కోర్సులకు అనుమతించరు. మళ్లీ ఇంటర్మీడియట్‌ చదివి ఎంసెట్‌లో ర్యాంకులు సాధిస్తేనే వీరికి ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి.

 

తెలంగాణలో!

పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం: తెలంగాణ రాష్ట్రంలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, మామ్‌నూర్‌లో నాలుగు పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో 20 డిప్లొమా ఇన్‌ యానిమల్‌ హజ్‌బెండ్రి సీట్లు ఉన్నాయి. పశుసంవర్ధకశాఖలో ప్రైవేటు పాలిటెక్నిక్‌లు తెలంగాణలో లేవు.

వెబ్‌సైట్‌: http://tsvu.nic.in/

 

కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం: ఈ విశ్వవిద్యాలయం పరిధిలో రెండు ఉద్యాన పాలిటెక్నిక్‌లు దస్నాపూర్‌, రామగిరి ఖిల్లాల్లో ఉన్నాయి. వీటిలో ఒక్కోదానిలో 25 చొప్పున మొత్తం 50 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్‌ హార్టీకల్చర్‌ పేరుతో కోర్సు అందిస్తున్నారు.

వెబ్‌సైట్‌: http://skltshu.ac.in/

 

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం: ఈ యూనివర్సిటీ పరిధిలో 10 వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, ఒక విత్తన సాంకేతిక, ఒక వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 8 ప్రైవేటు పాలిటెక్నిక్‌లు, మూడు వ్యవసాయ ఇంజినీరింగ్‌, ఒక విత్తన సాంకేతిక పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. ఈ కళాశాలల పరిధిలో మొత్తం 1020 సీట్లు ఉన్నాయి. 

వెబ్‌సైట్‌: www.pjtsau.ac.in

 

ఆంధ్రప్రదేశ్‌లో

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ ప్రాసెసింగ్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా ఈ యూనివర్సిటీ పరిధిలో 10 పశుసంవర్ధక, ఒక మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. వీటిలో 20 మత్స్యశాస్త్రపు సీట్లతో పాటు మరో 210 పాలిటెక్నిక్‌ సీట్లు ఉన్నాయి. గత ఏడాది నుంచి ఈ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రైవేటు రంగంలో పాలిటెక్నిక్‌లను అనుమతించింది. ప్రైవేటులో 3 పశుసంవర్ధక, ఒక మత్స్య, ఒక డెయిరీ ప్రాసెసింగ్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయి. విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.svvu.edu.in నుంచి దరఖాస్తు విధానం, సీట్లు, కళాశాలలు ఉన్న ప్రాంతాల వివరాలు పొందవచ్చు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సీట్లనూ ఆన్‌లైన్‌ విధానంలోనే కేటాయిస్తారు.

 

డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం: పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో నాలుగు ఉద్యాన పాలిటెక్నిక్‌లు ఉన్నాయి.

 

వాటిలో సీట్లు 145.  ఉద్యాన విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ ‌www.drysrhu.edu.in నుంచి వివరాలు పొందవచ్చు. తెలుగు మాధ్యమంలో డిప్లొమా బోధన ఉంటుంది.

 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా లాం కేంద్రంగా పనిచేస్తోంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం విభాగాల్లో రెండేళ్ల డిప్లొమా కోర్సులను అందిస్తున్నారు.వీటిని తెలుగు మాధ్యమంలో బోధిస్తారు. మూడేళ్ల కాలపరిమితి ఉన్న వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో అందిస్తారు. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 15 వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, 53 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో విశ్వవిద్యాలయానికి సంబంధించి రెండు పాలిటెక్నిక్‌, ప్రైవేటులో పది పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయంలో విశ్వవిద్యాలయం కింద ఒక పాలిటెక్నిక్‌, ప్రైవేటు యాజమాన్యంలో మూడు ఉన్నాయి. వ్యవసాయ ఇంజినీరింగ్‌లో విశ్వవిద్యాలయం కింద రెండు, ప్రైవేటులో 15 ఉన్నాయి.  

మరిన్ని వివరాల కోసం ‌www.angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Posted Date: 30-06-2021


 

టెన్త్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌