• facebook
  • whatsapp
  • telegram

గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ 

ఏపీఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీసెట్‌ - 2022

ఉత్తమ కళాశాలలో చదువుకోవాలనే ఆకాంక్ష ఎంతోమంది విద్యార్థులకు ఉంటుంది. ప్రతిభ ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించవు. అలాంటి విద్యార్థుల కలలను నిజం చేసి భోజన, వసతులతో పాటు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి తోడ్పడేవే గురుకుల విద్యాలయాలు (రెసిడెన్షియల్‌ కాలేజీలు). ఆంధ్రప్రదేశ్‌లోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు, నాగార్జునసాగర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీసెట్‌-2022 ప్రకటన వెలువడింది.

ఆర్‌జేసీసెట్‌-2022 ప్రవేశ పరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాన్ని పొందవచ్చు.

అర్హతలు: 2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. అంతకుముందు సంవత్సరాల్లో చదివినవారు ప్రవేశానికి అర్హులు కారు. విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌కు చెంది, ఈ రాష్ట్రంలోనే చదివినవారై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లోని 13 పాత జిల్లా కేంద్రాల్లో ప్రవేశపరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది.

ఏయే కళాశాలలు: ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 7 జనరల్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలు, 3 మైనారీటీ కాలేజీలు- మొత్తం 10 కాలేజీల్లో ప్రవేశాలను పొందవచ్చు. జనరల్‌ కాలేజీల్లో బాలురకు 4, బాలికలకు 2, కోఎడ్యుకేషన్‌ కాలేజీ 1 ఉన్నాయి. మైనారీటీ కాలేజీల్లో రెండు కాలేజీలను బాలురకు, 1 కాలేజీని బాలికలకు కేటాయించారు. ఇంగ్లిష్‌ మీడియం మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

మైనారిటీ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశానికి ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తారు. సీట్లను మాత్రం ఏపీఆర్‌జేసీసెట్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా భర్తీచేస్తారు.  కాలేజీలో చేరే సమయంలో అడ్మిషన్‌ ఫీజు కింద రూ.1,000లను చెల్లించాలి. ఇదే మొత్తాన్ని రెండో ఏడాది కూడా చెల్లించాల్సి ఉంటుంది. 

రిజర్వేషన్లు: జనరల్‌ కాలేజీలో ఓసీకి 28 శాతం, ఎస్సీకి 15, ఎస్టీకి 06, బీసీఏకు 07, బీసీబీకి 10, బీసీసీ 01, బీసీడీ 07, బీసీఈ 04, ఈడబ్ల్యూఎస్‌ 10, సీఏపీ 03, స్పోర్ట్స్‌ 03, పీహెచ్‌సీ 03, ఆర్ఫన్‌ 03 శాతం సీట్లను రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు. 

కాలేజీలవారీగా సీట్ల వివరాలు: కోస్తాఆంధ్ర ప్రాంతంలో: ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజ్‌ (బాలికలకు) తాడిపూడి, విజయనగరంలో 130 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ-60, బైపీసీ-40, ఎంఈసీ-30 సీట్లు కేటాయించారు. కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజ్‌లో (కోఎడ్యుకేషన్‌) 177 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ-50, బైపీసీ-30, సీఈసీ-30, ఎంఈసీ-25, ఈఈటీ-21, సీజీటీ-21 కేటాయించారు. వీటిల్లో బాలురకు 89, బాలికలకు 88 సీట్లు ఉన్నాయి. ఈ కాలేజీలో ఒకేషనల్‌ కోర్సులతోపాటు అన్ని గ్రూపుల్లోనూ బాలురతోపాటుగా బాలికలు సమానంగా సీట్లు కేటాయించారు. పల్నాడుజిల్లాలోని వీపీసౌత్, ఎన్‌.నగర్‌ ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీ (బాలురు)లో 200 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ-68, బైపీసీ-51, సీఈసీ-39, ఎంఈసీ-42 సీట్లు ఉన్నాయి. తిరుపతి జిల్లాలోని వెంకటగిరి ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీ(బాలురు)లో 130 సీట్లు ఉన్నాయి. దీంట్లో ఎంపీసీ-60, బైపీసీ-40, ఎంఈసీ-30 సీట్లు ఉన్నాయి.

రాయలసీమ ప్రాంతంలో: కర్నూలు జిల్లా బనవాసి ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీలో (బాలికలు) మొత్తం 130 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ-60, బైపీసీ-40, ఎంఈసీ-30 ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలోని గ్యారాంపల్లిలోని ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీ (బాలురు)లో మొత్తం 130 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ-60, బైపీసీ-40, ఎంఈసీ-30 సీట్లు ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కొడింజెనహళ్లిలోని ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీలో (బాలురు) 135 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ-50, బైపీసీ-30, సీఈసీ-30, ఎంఈసీ-25 ఉన్నాయి. కృష్ణాజిల్లా నిమ్మకూరులోని ఏపీఆర్‌ జూనియర్‌ కాలేజీ (కోఎడ్యుకేషన్‌)లో ఈఈటీ-9, సీజీటీ-9 రాయలసీమ ప్రాంతానికి కేటాయించారు.  బాలురకు-9, బాలికలకు-9 చొప్పున దక్కుతాయి. పల్నాడుజిల్లా వీపీసౌత్, ఎన్‌నగర్‌లోని ఏపీఆర్‌జూనియర్‌ కాలేజీ (బాలురు)లో 30 సీట్లు రాయలసీమ ప్రాంతానికి కేటాయించారు. ఎంపీసీ-12, బైపీసీ-09, సీఈసీ-06, ఎంఈసీ-03 ఉన్నాయి. 

గురుకుల విద్యాలయాల్లో ప్రతి విద్యార్థి పట్లా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూనే, చదువులో వెనకబడినవారి విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. కాలేజీకి చెందిన ఒక్కో జూనియర్‌ లెక్చరర్‌ 20 మంది విద్యార్థుల సంరక్షణ బాధ్యతను తీసుకుంటారు. ఐఐటీ/నీట్‌/సీఏ-సీపీటీ పరీక్షలకు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ సదుపాయం ఉంటుంది. అవసరమైనప్పుడు డిజిటల్‌ క్లాసులూ నిర్వహిస్తారు. 

వ్యాయామాలతో రోజు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు తరగతులు మొదలవుతాయి. రాత్రి 10 గంటల వరకు విద్యాసంబంధ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆధునిక పరికరాలతో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, రీడింగ్‌ రూమ్‌లు, విశాలమైన ఆటస్థలాలు ఉంటాయి. విద్యతోపాటుగా క్రీడలకూ ప్రాధాన్యమిస్తారు. విద్యార్థిని అన్ని విధాలుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటుగా భోజన, వసతి సదుపాయాలనూ కల్పిస్తారు.

రెసిడెన్షియల్‌ డిగ్రీ 

గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల్లో 2022-23 విద్యా సంవత్సరంలో మొదటి ఏడాది ప్రవేశాలకు ఆర్‌డీసీసెట్‌-2022 రాయాల్సి ఉంటుంది. బాలురకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. 

అర్హతలు: 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతోన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు. అభ్యర్థులు మొదటి ప్రయత్నంలోనే ఇంటర్మీడియట్‌ పాసై ఉండాలి. 

అందుబాటులో ఉన్న కోర్సులు: 1. బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌)లో 40 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివినవారైనా అర్హులే. బీకామ్‌ (జనరల్‌)లో 40 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో హెచ్‌ఈసీ తప్ప ఏ గ్రూప్‌ చదివినవారైనా ఈ కోర్సులో చేరడానికి అర్హులే. బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్‌ అండ్‌ కెమిస్ట్రీ)లో 36 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో ఎంపీసీ చదివినవాళ్లు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌)లో 36 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ చదివినవారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. వివిధ కోర్సుల్లో మొత్తం 152 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

పరీక్ష ఫీజు: ఆన్‌లైన్‌ ద్వారా పరీక్ష ఫీజు రూ.250 చెల్లించాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. సమాచార బులిటెన్‌లో పూర్తి వివరాలు లభిస్తాయి. ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించిన తర్వాత ఐడీ నంబరు జారీచేస్తారు. ఆ నంబరు అందిన తర్వాత మాత్రమే అభ్యర్థులు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.  

ఆన్‌లైన్‌లో దరఖాస్తును నింపే సమయంలోనే చేరాల్సిన కోర్సును ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో ఎలాంటి మార్పులకూ అవకాశం ఉండదు. 

దరఖాస్తును పూర్తిచేసి సమర్పించే ముందు ప్రింట్‌ తీసుకుని భద్రపరుచుకోవాలి. దీంట్లోని ఐడీ నంబరు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. 

అభ్యర్థులు మే 31 నుంచి హాల్‌టికెట్స్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రింటెడ్‌ హాల్‌టికెట్స్‌ను జారీచేయరు/ పోస్ట్‌ ద్వారా పంపించరు. హాల్‌టికెట్, ఒరిజినల్‌ ఆధార్‌కార్డ్‌ లేకుండా అభ్యర్థులను పరీక్ష రాయడానికి అనుమతించరు.

ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్లు, ప్రత్యేక కేటగిరి, స్థానికత.. మొదలైన అంశాల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రభుత్వ రిజర్వేషన్‌ నియమ నిబంధనలకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.05.2022

ప్రవేశ పరీక్ష తేది: 05.06.2022

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్‌ఐ ప్రిలిమ్స్‌కు సన్నద్ధత ఇలా!

‣ కళ్లకు కట్టినట్టు.. కళతో కనికట్టు!

‣ పరిశోధనలకు పునాది

‣ సాంకేతికతపై పట్టు.. మార్కులు సాధించిపెట్టు!

‣ ఉన్నత సంస్థల్లో ఉపాధ్యాయ విద్య!

‣ పోటీ కోణంలో జీవశాస్త్రం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-05-2022


 

టెన్త్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌