• facebook
  • whatsapp
  • telegram

Polytechnic: స్వరూపం మారిన సేద్య పాలిటెక్నిక్‌! 

ఇంటర్‌తో సమానంగా వ్యవసాయ, అనుబంధ రంగాల డిప్లొమా 

వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, పశు సంవర్థకం, మత్స్య, ఉద్యాన శాస్త్ర పాలిటెక్నిక్‌ల స్వరూపం కాలానుగుణంగా మారుతోంది. గ్రామీణ ప్రాంత యువత  స్వయం ఉపాధి పొందాలనే లక్ష్యంతో ఏర్పాటైనప్పటికీ వీటికి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా పట్టణ ప్రాంత విద్యార్థులకూ అవకాశం కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ డిప్లొమాను ఇంటర్‌తో సమానంగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించటం ఓ కీలక మలుపు!   

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో బోధనతో పాటు ప్రత్యక్ష అనుభవం ద్వారా శిక్షణ లభిస్తోంది. ఉద్యోగావకాశాలు పెరగటంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాలు అందిస్తున్న డిప్లొమాను ఇంటర్‌తో సమానంగా పరిగణిస్తూ ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గత ఏడాది వరకు ఈ విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగం లభించకపోతే తిరిగి ఇంటర్‌లో చేరి ఆపైన ఉన్నత విద్యను అభ్యసించవలసి వచ్చేది. 

రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ఏడాది నుంచి వ్యవసాయం, పశుసంవర్థకం, ఉద్యాన శాస్త్ర డిప్లొమా కోర్సులు పూర్తిచేస్తే నేరుగా డిగ్రీలో ప్రవేశానికి వీలు ఏర్పడింది. డిప్లొమా పూర్తి చేసినవారు ఎంసెట్‌ రాయడానికి మాత్రం అర్హులు కారు. అగ్రిసెట్, హార్టి సెట్‌ ద్వారా బీఎస్సీ (వ్యవసాయం), (ఉద్యానం) డిగ్రీల్లో ప్రవేశం పొందవచ్చు. 

పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు 

2020-21 విద్యా సంవత్సరానికి ముందువరకు డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కోరే విద్యార్థులు గ్రామీణ ప్రాంతం వారే అయివుండాలన్న నిబంధన ఉండేది. ఏపీలోని అభ్యర్థులు వారి పది సంవత్సరాల విద్యాభ్యాస కాలంలో కనీసం నాలుగు సంవత్సరాలైనా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తుండగా.. గత ఏడాది నుంచి పట్టణ ప్రాంతాల్లో చదివినవారికి అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించగా.. పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించి భర్తీ చేస్తున్నారు. పదో తరగతి, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ మధ్యలో ఆపేసిన, ఫెయిలయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, ఆపైన చదివినవారు అనర్హులు. 

శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం

తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్థక, మత్స్యశాస్త్ర విభాగాల్లో పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 10 పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, ఒక మత్య్సశాస్త్ర పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. పశువైద్య విశ్వవిద్యాలయం అనుబంధంగా రాష్ట్రంలో 12 ప్రైవేటు పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, ఎనిమిది ప్రైవేటు మత్స్య పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. ఈ ఏడాది ప్రైవేటు రంగంలో ఏర్పాటైన డెయిరీ టెక్నాలజీ విభాగపు పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు కల్పించలేదు. పశుసంవర్థక పాలిటెక్నిక్‌లలో 900 సీట్లు, మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌లలో 439 సీట్లు భర్తీ చేయనున్నారు.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం

పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పాలిటెక్నిక్‌లో రెండేళ్ల డిప్లొమాలో ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌లు ఉండగా అందులో 200 సీట్లు ఉన్నాయి. ఉద్యాన విశ్వవిద్యాలయం గుర్తింపుతో రాష్ట్రంలోని ఏడు ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్‌లలో ఉన్న 280 సీట్లను భర్తీ చేయనున్నారు. 

వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో..

గుంటూరు జిల్లా లాంఫారం కేంద్రంగా నిర్వహించే ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయంలో ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో 16 విశ్వవిద్యాలయ వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, 54 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్‌లు విశ్వవిద్యాలయానికి చెందినది ఒకటి ఉండగా..ప్రైవేటు పాలిటెక్నిక్‌లు 11 ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయంలో విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఒకటి, ప్రైవేటు రంగంలో మూడు పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. వ్యవసాయ ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌లు విశ్వవిద్యాలయం రెండు నిర్వహిస్తుండగా ప్రైవేటు రంగంలో 17 అందుబాటులో ఉన్నాయి. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్, సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల్లోని 4230 సీట్లను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు. 

ఉపాధి, ఉద్యోగావకాశాలు

వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన, మత్స్య రంగాల్లో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా శాస్త్రీయంగా ఆయా రంగాలలో సూచనలు సలహాలు ఇచ్చేవారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. గ్రామీణ ప్రాంతాలలో రైతుకు అందుబాటులో ఉండే వ్యవసాయ, పశుపోషణ, మత్స్య, ఉద్యాన నిపుణులను తీర్చిదిద్దేందుకు డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన పురుగుమందులు, ఎరువులు, ఉత్పత్తులు విక్రయించే దుకాణాలను నిర్వహించాలంటే డిప్ల్లొమా తప్పనిసరి చేసే అవకాశం ఉంది. 

వ్యవసాయంలో డిప్లొమా పూర్తి చేస్తే వ్యవసాయశాఖలో ఏఈవో, ఎంపీఈవో ఉద్యోగాలూ, గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ కార్యదర్శి కొలువులూ పొందవచ్చు. 

ప్రైవేటు విత్తన సంస్థలు, ఎరువుల కర్మాగారాల్లో అవకాశాలు అధికంగా ఉన్నాయి. 

పశుసంవర్థక పాలిటెక్నిక్‌ పూర్తి చేసినవారికి పశుసంవర్థకశాఖలో ఎంపీఈవో, వెటర్నరీ అసిస్టెంట్‌ ఉద్యోగాలతో పాటు గ్రామ సచివాలయాల్లో గ్రామ పశువైద్య అధికారి ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. 

కోళ్ల పరిశ్రమ, దాణా తయారీ కర్మాగారాలు, డెయిరీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. 

ఉద్యాన పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు ఏహెచ్‌వో, ఎంపీఈవో ప్రభుత్వ ఉద్యోగాలకు, గ్రామ సచివాలయాల్లోని గ్రామ ఉద్యాన అధికారి ఉద్యోగానికీ అర్హత లభిస్తుంది. 

ప్రైవేటు నర్సరీలు, విత్తన కర్మాగారాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. 

వ్యవసాయ, ఉద్యాన డిప్లొమాలు పూర్తి చేసిన అభ్యర్థులు ఆయా విశ్వవిద్యాలయాల్లో  నిర్వహించే అగ్రిసెట్, హార్టిసెట్‌ల ద్వారా నేరుగా బీఎస్సీ వ్యవసాయం, ఉద్యానం డిగ్రీలలో ప్రవేశాలు పొందే వెసులుబాటు కల్పించారు. పశుసంవర్థక, మత్స్యశాస్త్రంలో డిప్లొమాలు పొందిన వారికి బీవీఎస్సీ (పశుసంవర్థకం), బి.టెక్‌ (డెయిరీ టెక్నాలజీ), బీఎఎఫ్‌ఎస్సీ కోర్సుల్లో ప్రవేశించే అవకాశం ఉండదు.

సంయుక్త కౌన్సెలింగ్‌ 

పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్‌ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. డిప్లొమా కోర్సులో చేరబోయే విద్యార్థులకు 2021, ఆగస్టు 31 నాటికి 15 - 22 సంవత్సరాల వయసు ఉండాలని నిర్ణయించారు. 

శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని అన్ని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఈ ఏడాది సంయుక్త కౌన్సెలింగ్‌ నిర్వహణకు నిర్ణయించారు. మూడు విశ్వవిద్యాలయాల్లోని పాలిటెక్నిక్‌లలో ప్రవేశాల ప్రక్రియను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టనుంది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఈ నెల 13 నుంచి దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చారు. పూర్తి వివరాలు, అన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ కోసం https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ ఆగస్టు 23.   

తెలంగాణాలో పాలిటెక్నిక్‌ ప్రవేశాలు

తెలంగాణా రాష్ట్రంలోని ప్రొ. జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో 9 వ్యవసాయ, ఒక వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన 7 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, ఒక ప్రైవేటు సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్, 3 ప్రైవేటు వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌ ఉన్నాయి. ప్రొ.జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి 820 సీట్ల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 24వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి 26వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. పాలిసెట్‌-2021 ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.

డిప్లొమా విద్యకు ఆదరణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్‌లలో ప్రవేశాల బాధ్యత ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు డిప్లొమా పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువమంది రైతుభరోసా కేంద్రాల్లో ఉద్యోగులుగా మారారు. దీంతో డిప్లొమా కోర్సులకు ఆదరణ పెరిగింది. పట్టణ ప్రాంత విద్యార్థులకు అవకాశం లభించడం, ఇంటర్‌తో సమానం చేయడంతో డిప్లొమా ప్రవేశాల కోసం ఎక్కువ గిరాకీ ఏర్పడింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తవగానే ఎస్‌.ఎస్‌.సి. బోర్డు నుంచి విద్యార్థుల మార్కులను సేకరిస్తాం. కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాము.

 

- పసుపులేటి వేణుగోపాల్

న్యూస్‌టుడే, తిరుపతి 
 

Posted Date: 16-09-2021


 

టెన్త్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌