• facebook
  • whatsapp
  • telegram

ప్రాయోగిక శిక్షణలో జాగ్రత్తలు

సాధారణ విద్యార్థి ఒక పరిపూర్ణ వృత్తినిపుణుడుగా మారేందుకు తోడ్పడేదే ప్రాయోగిక శిక్షణ (ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌). దీని ప్రాముఖ్యాన్ని విద్యార్థులు తప్పనిసరిగా గ్రహించాలి. కామర్స్‌ రంగంలో ఈ శిక్షణ తీరుతెన్నులూ, మార్గదర్శక సూచనలను తెలుసుకుందాం!

మనదేశంలో వృత్తివిద్యా కోర్సు నుంచి అకడమిక్‌ కోర్సును వేరు చేసే ముఖ్యమైన తేడా ప్రాయోగిక శిక్షణ. కామర్స్‌ రంగంలోని సీఏ (చార్టర్డ్‌ అకౌంటెంట్‌), సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌), సీఎస్‌ (కంపనీ సెక్రటరీ)లో చదువుతోపాటు కచ్చితంగా ఈ శిక్షణ పూర్తిచేయాలి. ఇది ఈ మూడు వృత్తివిద్యా కోర్సులకూ వెన్నెముక లాంటిది. ఈ కోర్సుల్లో అకడమిక్‌ పరీక్షలే కాకుండా ప్రాయోగిక శిక్షణ కూడా భాగం కావడంతో కోర్సు పూర్తిచేసిన వెంటనే పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా దీటైన వృత్తివిద్యా నిపుణుడిగా మారడానికి అవకాశం ఉంటుంది.

* సీఏ విద్యార్థులకు 2 సంవత్సరాల ఆర్టికల్‌షిప్‌ పూర్తిచేసిన తరువాత సంవత్సరం పారిశ్రామిక శిక్షణ, ఐసీఏఐ గుర్తించిన సంస్థల్లో పనిచేసే అవకాశముంది.

* సీఎంఏ, సీఎస్‌ చదువుతున్న విద్యార్థులకు అప్పటికే సంస్థల్లో పనిచేసిన కార్పొరేట్‌ అనుభవం ఉంటే శిక్షణ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది.

* సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులు పూర్తయ్యేముందు కొన్ని సర్టిఫికేషన్‌ ప్రోగ్రాములు పూర్తిచేయాలి.

ఉపయోగాలు

* వృత్తివిద్యా కోర్సుల్లో అప్పటిదాకా అకడమిక్‌గా నేర్చుకున్న విషయాలు, కాన్సెప్టులు ఆచరణాత్మకంగా అర్థం చేసుకుని ఏవిధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవచ్చు.

* వృత్తివిద్యా కోర్సుల తుది అంచెలోని అంశాలు, సబ్జెక్టులను లోతుగా విశ్లేషించాలి. కాబట్టి, ప్రాయోగిక శిక్షణ... చివరి పరీక్షలను ఎదుర్కోవడంలో ఉపయోగపడతుంది.

* శిక్షణ చిన్న సంస్థల్లో చేస్తే విభిన్నమైన పనులు చేసే అవకాశం దొరుకుతుంది. తక్కువమంది సిబ్బంది ఉంటారు కాబట్టి వివిధ పనులు సొంతంగా చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల బాధ్యత పెరుగుతుంది.

* దీన్ని పెద్ద సంస్థల్లో చేస్తే వృత్తినైపుణ్యం, సమర్థ నిర్వహణ ఉండే వాతావరణంలో పనిచేసే అనుభవం వస్తుంది. పనులను విభాగాలుగా విభజిస్తారు కాబట్టి చేసే విభాగంలో పట్టు సాధిస్తారు. సాధారణంగా పెద్ద సంస్థలకు సమాజంలో, వ్యాపార వర్గాల్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది.

* శిక్షణ పొందే సంస్థల్లో సీనియర్‌ వృత్తి నిపుణులతో, ప్రభుత్వ ఆఫీసర్లు (ఆదాయపు పన్ను విభాగం, కంపనీ లా బోర్డ్‌ మొదలైన), తోటి సహచర విద్యార్థులు, క్లయింట్లతో కలిసి పనిచేసేటపుడు భావ వ్యక్తీకరణ, విషయంపై పట్టు, సాఫ్ట్‌స్కిల్స్‌, బృందంలో ఆలోచన వంటి లక్షణాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.

* ఈ ప్రాయోగిక శిక్షణను శ్రద్ధగా చేస్తే విద్యార్థులకు కెరియర్‌పై స్పష్టతా, అవగాహనా ఏర్పడతాయి.

విద్యార్థుల ఆలోచన సరళి

శిక్షణ సమయంలో విద్యార్థులు తమకు అప్పగించిన పనిని పూర్తి శ్రద్ధతో చేయాలి. ప్రతి ఒక్కరినీ బాగా గమనించి కొత్త విషయాలు నేర్చుకోవాలి. డ్రాఫ్టింగ్‌ నైపుణ్యాలు, సాంకేతికత, సాఫ్ట్‌స్కిల్స్‌ నేర్చుకోవడానికి చొరవ చూపాలి. వృత్తి నైపుణ్యం ఉన్న కార్యకలాపాల్లో అవగాహన పెంచుకోవాలి. క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యం పెంపొందించుకోవాలి. నిబద్ధతతో పనిచేయడం వృత్తిధర్మంగా భావించాలి. చివరగా తుది అంచె పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికలను రూపొందించుకోవాలి.

నేర్చుకోవాల్సినవి

శిక్షణ ఫలితంగా సీఏ, సీఎంఎస్‌, సీఎస్‌కు సంబంధించిన పనిని సంబంధిత విద్యార్థులు నేర్చుకునే అవకాశముంది. ఉదాహరణకు- ఇండియన్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌, ఆడిటింగ్‌ స్టాండర్డ్స్‌ దరఖాస్తు చేసే అవకాశం, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించడం, టాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయడం, వ్యాపార సంస్థలను, సంస్థలను ఆడిట్‌ చేయడం, సిస్టమ్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంచుకోవడం, కాస్ట్‌స్టడీస్‌, ధరలను నిర్ధారించడం, బ్యాంకు ప్రతిపాదనలు వేయడం, తయారీ రంగం ప్రొసీజర్లపై దృష్టిపెట్టడం, సంస్థల సెక్రటేరియల్‌ పని, కంపనీ యాక్ట్‌ ప్రొసీజర్లు నేర్చుకోవడం వంటివి.

శిక్షణ సమయంలో...

1. తుది అంచె పరీక్షలకూ, ప్రాయోగిక శిక్షణకూ సమాన ప్రాముఖ్యమివ్వాలి. శిక్షణ మొదలైన నెల నుంచే రోజుకు కనీసం 3 గంటల సమయం తుది అంచె చదువులపై దృష్టిపెట్టాలి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే- తుది అంచెలో ఉత్తీర్ణతతోనే పరిశ్రమలో రాణించడానికి అవకాశం లభిస్తుంది.

2. శిక్షణలో విధుల దృష్ట్యా వివిధ పట్టణాలకూ, క్లయింట్ల దగ్గరకూ ప్రయాణం చేయాల్సిన అవసరముంటుంది. అటువంటి సందర్భాల్లో చదువుకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడాలి.

3. అప్పగించిన ప్రతి పనీ తనది అనుకుని బాధ్యతగా చేసినపుడు వివిధ అంశాల్లోని మెలకువలనూ, లోటుపాట్లను అధిగమించటాన్నీ బాగా నేర్చుకోవచ్చు.

4. శిక్షణలో పనిచేసిన వివిధ అంశాలను పుస్తకాల్లోని అంశాలతో జోడించి ఎప్పటికపుడు చదువుకుంటే పరీక్షలు బాగా రాయడానికి వీలవుతుంది.

5. ఈ సమయంలో పరీక్షల కోసం కేటాయించిన అధ్యయన సెలవుల్లో సంబంధంల లేని ఎటువంటి ఇతర అంశాలకూ తావివ్వకుండా జాగ్రత్తపడాలి.

ఈ శిక్షణ మూలంగా విద్యార్థులు చదువుతోపాటే పరిశ్రమ అవసరాలు, వ్యాపార పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. మనసుపెట్టి శిక్షణను పూర్తిచేస్తే వారి కెరియర్‌ దశ-దిశ నిర్దేశించుకునే వేదిక అవుతుంది. కోర్సు పూర్తి అవగానే పరిశ్రమలో అడుగుపెట్టి తమ సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది.

Posted Date: 02-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌