• facebook
  • whatsapp
  • telegram

అందం.. పోషకం.. ఆరోగ్యం!

ఆహారం రుచి చూడకముందే అలంకరణ నోరూరించేస్తుంది. కాస్త గార్నిష్‌ చేసి అలా టేబుల్‌ మీద పెడితే లొట్టలేసుకుంటూ లాగించేయడానికి సిద్ధమైపోతారు. అందుకే ఏదైనా తినేదేగా అని ఎలాపడితే అలా తినేయకుండా కొద్దిగా అందంగా అమర్చుకొని తిని చూడండి.. కచ్చితంగా అందులో ఆనందం తెలుస్తుంది. దీన్ని అకడమిక్‌గా చెప్పుకోవాలంటే కలినరీ ఆర్ట్స్‌ అంటారు. ఈ కళలో అలంకరణకే కాదు పోషకాలకూ ప్రాధాన్యం ఉంటుంది. వంటలపై ఆసక్తి ఉన్నవాళ్లు న్యూట్రిషన్‌తో పాటు తమ క్రియేటివిటీని ప్రదర్శించాలనుకుంటే కలినరీ ఆర్ట్స్‌ కోర్సులు చేయవచ్చు. కొత్త రంగాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

కలినరీ ఆర్ట్స్‌... దీనినే టేబుల్‌ ఆర్ట్స్‌ అని కూడా అంటారు. ఇందులో తినే వంటకాన్ని అందంగా తయారుచేయడం ఒక ఎత్తయితే, పోషక విలువలను అందించడానికీ ప్రాధాన్యం ఉంది. రాతి యుగం నుంచి రోబోల తరం వరకు వంటల తీరు ఎన్ని రకాలుగా మారిందో అందరికీ తెలుసు. అందుకే అదో కళగా, కోర్సుగా రూపుదిద్దుకుంది. వివిధ రకాలుగా వంటలు చేస్తూ, వాటిలో పోషక విలువలు ఏ మేరకు ఉండాలి, ఎంత రుచిగా దానిని చేయొచ్చు అన్నదే కలినరీ ఆర్ట్స్‌. దీనిలో కేవలం డిగ్రీ పొందడమే కాదు, ఆరోగ్యకరమైన ఆహారం వండడాన్ని కూడా నేర్చుకోవచ్చు. దేశీయ రుచులే కాకుండా విదేశీ వంటలూ చేయవచ్చు.

   మన దేశంలో ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి. కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, పూసా, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, న్యూదిల్లీ వాటిలో కొన్ని. విదేశాల్లోనూ ఈ కోర్సులు చేయవచ్చు.

   ప్రస్తుతం బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆల్‌ ఇండియా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తిరుపతి, నోయిడా ప్రాంగణాల్లో ఉన్న ఈ కళాశాలల్లో ప్రస్తుతం ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు.

కోర్సులు - అర్హత

బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) : ఇంటర్మీడియట్‌ (10 + 2) ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నవారు పరీక్ష రాసేందుకు అర్హులే.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ, అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, సర్వీస్‌ సెక్టార్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) : కలినరీ ఆర్ట్స్‌/ హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

z వయసు 25 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా కామన్‌ ఎంట్రన్స్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫుడ్‌ ప్రొడక్షన్‌/ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీస్‌/ మేనేజ్‌మెంట్‌, అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌/ ఐక్యూ, హ్యూమన్‌ రిసోర్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మెరిట్‌తో కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతిలో పరీక్షను నిర్వహిస్తారు.

ఉద్యోగ అవకాశాలు

ఈ కోర్సులు పూర్తి చేస్తే న్యూట్రిషనిస్ట్‌, చెఫ్‌, కిచెన్‌ మేనేజర్‌, హాస్పిటాలిటీ సర్వీసెస్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఎయిర్‌వేస్‌, రైల్వేస్‌లో కేటరింగ్‌, ఇండియన్‌ నేవీలో కిచెన్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలు, టూరిజం రంగంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో చెఫ్‌లతో పాటు హాస్పిటాలిటీ విభాగాల్లో మంచి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. సొంతంగా బిజినెస్‌ కూడా చేయవచ్చు. ఇందుకు ప్రభుత్వం, బ్యాంకులు రుణాలు అందిస్తాయి. కలినరీ ఆర్ట్స్‌లో టీచింగ్‌ అవకాశాలు కూడా ఉన్నాయి.

వెబ్‌సైట్‌: http://www.thims.gov.in/

Posted Date: 27-02-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌